విష్ణుమాయ
ప్రపంచ స్థితిగతులనే
మార్చివేసి తనకు అనుకూలంగా ఓ ఆటవస్తువుగా కూడా విశ్వాన్నంతటినీ తన మాయతో మార్చగల
శక్తి జగన్నాటక సూత్రధారి అయిన శ్రీ మహావిష్ణువుకు ఉందని వివరించే కథ ఇది.
వరాహపురాణంలో భూదేవికి శ్రీమహావిష్ణువు తన మాయావిలాసాన్ని వివరిస్తూ సోమశర్మ అనే
ఒక మునికి సంబంధించిన కథను కూడా చెప్పాడు. సకల చరాచర జగత్తు అంతా తన మాయేనని
వివరించి చెప్పిన తర్వాత శ్రీమహావిష్ణువు తన మాయకు ఉదాహరణగా ఈ కథను చూపటం ఓ
విశేషం. పూర్వం సోమశర్మ అనే ఒక ముని ఉండేవాడు. ఆయన ఇహలోక పరమైన సుఖాలన్నింటినీ
విడిచి కేవలం శ్రీ మహావిష్ణువు ధ్యానంలోనే కాలం గడుపుతుండేవాడు. ఆ తర్వాత
కొద్దికాలానికి విష్ణువును గురించి తీవ్రంగా తపస్సు చేశాడు. ఆ తపస్సుకు మెచ్చిన
శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమై సోమశర్మను ఏమైనా వరాలు కోరుకోమన్నాడు. అంతేగాక
అతులిత ఐశ్వర్యం, భోగభాగ్యాలు ఇవేవి
కావాలన్నా క్షణాలలో ప్రసాదిస్తానని కూడా శ్రీ మహావిష్ణువు చెప్పాడు. అయితే సోమశర్మ
తనకు అటువంటి విలువైన వరాలేవీ అక్కరలేదని భోగభాగ్యాలమీద తనకు మనసు కూడా లేదని
అన్నాడు. అయితే తనకు చిరకాలంగా ఓకోరిక ఉందని అందరూ వైష్ణవమాయ అని చెప్పుకోవడం తాను
నిరంతరం చూస్తూనే ఉంటానని అందువల్ల అసలామాయ అంటే ఏమిటో తనకు తెలుసుకోవాలని కోరికగా
ఉందని సోమశర్మ విష్ణువుతో అన్నాడు. అయితే శ్రీ మహావిష్ణువు తన మాయను అందరూ
అనుభవించటమే తప్ప దాన్ని ముందుగా తెలుసుకోవడం సాధ్యపడదని కనుక మరింత ఏవైనా కోరికలు
కోరుకోమని అన్నాడు. అయితే సోమశర్మ అందుకు నిరాకరించి తన తపస్సుకు మెచ్చినట్లయితే
తనకు వైష్ణవమాయను చూపించమని పట్టుపట్టాడు. తన భక్తుడి కోరికను శ్రీ మహావిష్ణువు
కాదనలేక అలాగేనని, తన మాయను తెలుసుకోవడానికి
అక్కడకి సమీపంలో ఉన్న గంగానదికి వెళ్ళి స్నానం చేసిరమ్మనమని అప్పుడు తన మాయేంటో
తెలుసుకోవచ్చని చెప్పాడు. విష్ణువు తన కోరికను తీర్చుతున్నందుకు ఎంతగానో సంతోషించి
గంగలో స్నానం చేయటానికి బయలుదేరి వెళ్ళాడు. నది ఒడ్డున దండ, కమండలాలను, కాషాయ వస్త్రాలను విడిచి
నదిలోకి దిగి సోమశర్మ ఆనందంగా స్నానం చేయడం ప్రారంభించాడు. పూర్తి స్నానవిధుల
ప్రకారం నదిలో మునిగి ఓమారు పైకిలేవగానే సోమశర్మ వైష్ణవమాయ ప్రభావంతో ఒక ఆటవిక
స్త్రీ గర్భంలోకి చేరాడు. తాను మునై ఉండి, శ్రీ మహావిష్ణువు
భక్తుడై ఉండి అలా ఆటవిక స్త్రీ గర్భాన శిశువులాగా మారటం, గర్భక్లేశం ఇవన్నీ తలుచుకొని తనకెందుకు ఇలా కష్టాలు
కలుగుతున్నాయో కదా అనుకుంటుండగానే ఆ ఆటవిక స్త్రీ ప్రసవించడం, సోమశర్మ ఆడశిశువుగా నేలమీద పడటం జరిగాయి. ఆడశిశువుగా
జన్మించగానే అతడికి పూర్వజన్మ జ్ఞానం అంతా నశించిపోయింది. మెల్లమెల్లగా పెరిగి
పెద్దదవుతున్న ఆ శిశువు యుక్తవయస్సుకు చేరుకుంది. అప్పుడామె తల్లిదండ్రులు ఆమెకు
తగినట్లుగా మరొక ఆటవికుడికి ఇచ్చి వివాహం చేశారు. ఆటవిక జాతి లక్షణం ప్రకారం ఆ
యువతి భర్తతో కాపురం చేస్తూ ఆటవికులు చేసే కొన్ని కొన్ని హింసామార్గాలను
అవలంబిస్తూ కాలం గడపసాగింది. ఆ దంపతులకు ఏడుగురు బిడ్డలు కూడా కలిగారు. ఎంతో
ఆనందంగా కాలం గడుస్తుండగా ఒకరోజున ఆటవిక స్త్రీ, ఏడుగురు బిడ్డలకు తల్లిగా కూడా అయిన సోమశర్మకు మళ్ళీ
పూర్వజన్మ జ్ఞానం కలిగింది. తనలాంటి తపశ్శక్తి సంపన్నుడికి ఇంతటి అధోగతి ఎందుకు
కలిగిందా అని స్త్రీ రూపంలో ఉన్న సోమశర్మ బాధపడుతూనే ఇంటి నుంచి ఒక కుండను నెత్తిన
పెట్టుకొని నీటిని తేవటంకోసం గంగానదికి బయలుదేరింది. తనకు అలాంటి స్థితి విష్ణువు
ఎందుకు కలిగించాడా? అని బాధపడుతూ ఆమె ఆ బాధ
నుంచి ముందు ఉపశమనం పొందేందుకు కొద్దిసమయం గంగలో దిగాలనుకొని ముందుకువెళ్ళి నదిలో
పూర్తిగా స్నానం చేస్తుండగా మళ్ళీ వైష్ణవమాయ వల్ల ఆస్త్రీ రూపం పోయి సోమశర్మకు
అంతకుముందులాగానే తన సహజరూపం సంక్రమించింది. వెంటనే ఒడ్డుకు వచ్చి తాను గర్భస్థ
శిశువుగా మారే ముందు తన వస్త్రాలు ఉంచిన చోటుకు వెళ్ళి దండ, కమండలాలను, వస్త్రాలను స్వీకరించాడు.
అప్పటికైనా తన రూపం వచ్చినందుకు ఆనందిస్తూ ఆటవిక స్త్రీగా ఉన్నప్పుడు తాను చేసిన
హింసాత్మక కార్యాలన్నింటినీ తలచుకొని ఆ పాపానికి చింతించసాగాడు. ఆ పాపం
పోగొట్టుకోవటానికి మళ్ళీ ఆ పరిసరాలలో ఒక ఆశ్రమాన్ని ఏర్పాటుచేసుకుని తపస్సు
చేసుకోవటం ప్రారంభించాడు. ఇంతలోసోమశర్మ స్త్రీగా ఉన్నప్పుడు భర్తగా లభించిన
ఆటవికుడు ఏడుగురు పిల్లలను వెంటపెట్టుకొని ఆమెను వెతుకుతూ అక్కడకి వచ్చాడు. అక్కడ
ఉన్న మరికొందరు మునులను చూసి నీటికోసం తన భార్య అటుగా వచ్చిందని అయితే ఆమె
ఎంతసేపటికి ఇల్లు చేరలేదని ఆమె ఆచూకీ ఎవరికైనా తెలుసేమోనని అడిగాడు. అయితే ఆ
మునులంతా తాము స్త్రీని ఆత్రం మాత్రం చూడలేదని, నది ఒడ్డున కుండ, వస్త్రాలు ఉన్నాయని
కొత్తగా అక్కడకు వచ్చిన ఆ మునికేమైనా తెలుసేమోనని అడిగి చూడమని చెప్పారు. అక్కడ
ఉన్న కుండ, వస్త్రాలు, తన భార్యవేనని గుర్తించిన ఆ ఆటవికుడు సోమశర్మ దగ్గరకు
వెళ్ళి తన బాధంతా చెప్పి తన భార్య గురించి తెలిసుంటే చెప్పమని వేడుకున్నాడు. అతడి
బాధ చూడలేక సోమశర్మ తానే ఆటవికుడి భార్యనని ముందు నమ్మకపోయినా ఆ తర్వాత ఆ
విషయాన్ని నమ్మిన ఆ ఆటవికుడు ఒక స్త్రీగా అదీ బోయ యువతిగా జన్మించాల్సినంత పాపం
మునివై ఉండి నీవెందుకు చేశావని సోమశర్మను అడిగాడు. అప్పుడు సోమశర్మ తన పూర్వకథను,
శ్రీ మహావిష్ణువుకు తనకు జరిగిన సంవాదాన్ని,
విష్ణువు వారిస్తున్నా మూర్ఖంగా మాయను
తెలుసుకోవడానికి తాను చేసిన ప్రయాత్నాన్ని అంతటినీ వివరించాడు. సోమశర్మ ఇలా
చెపుతుండగానే ఆ ఆటవికుడు అతడి వెంట వచ్చిన ఏడుగురు పిల్లలు, అంతకుముందు అక్కడ ఉన్న కుండ, వస్త్రాలు అన్నీ మాయమైపోయాయి. ఆశ్చర్యంలో మునిగిన సోమశర్మ
శ్రీ మహావిష్ణువును తలుచుకుంటూ పదేపదే నమస్కారాలు చేస్తుండగా విష్ణువు
ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు సోమశర్మ తాను భక్తుడై ఉండి అన్ని సంవత్సరాలపాటు అలా
ఎన్నెన్నో కష్టాలను అనుభవించటం ఏమిటని, ఇదంతా ఎందుకు
జరిగిందని విష్ణువును అడిగాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు చిద్విలాసంగా నవ్వుతూ
భగవంతుడు ఎప్పుడూ భక్తుడికి ఏంకావాలో అవి ఇవ్వటానికి ప్రయత్నం చేస్తుంటాడని
తానివ్వపోయిందికాక అనవసరంగా మాయాతత్వాన్ని గురించి తెలుసుకోవడం వల్లనే ఇదంతా
జరిగిందని శ్రీ మహావిష్ణువు అన్నాడు. అంతేగాక ఒకానొక సందర్భంలో భక్తులను తులనాడిన
పాపఫలితంగా కూడా సోమశర్మ కష్టాలను అనుభవించాల్సి వచ్చిందని చెప్పాడు. అయితే ఇదంతా
తన మాయావిలాసమని ఇన్ని సంవత్సరాలకాలం జరగలేదని కేవలం కొద్దిసమయం కిందట మాత్రమే
సోమశర్మ తనను మాయాతత్వాన్ని గురించి అడగటం జరిగిందని ఇన్ని సంవత్సరాల కాలం పాటు
ఇన్ని కష్టాలు అనుభవించినట్లుగా అనుపించటం కూడా తన వైష్ణవమాయేనని శ్రీమహావిష్ణువు
సోమశర్మకు వివరించి చెప్పి అతడికి వైకుంఠప్రాప్తి కల్పించాడు.