యక్షేశ్వరుడు

పరమేశ్వరుడు భోళాశంకరుడే కాక సర్వనర్వాపహారిగా కూడా తన శక్తిని నిరూపించిన అవతారం యక్షేశ్వరావతారం. 

ఈ కథలో ముందు ఈశ్వరుడు చంద్రుడిని ఎప్పుడు శిరస్సున ధరించి చంద్రశేఖరుడయ్యాడు? రాహుకేతువులలో కేతువు శివుడి మెడలో ఉన్న హారంలోకి ఎప్పుడు చేరాడు? అసలు యక్షుడుగా ఈశ్వరుడు ఎందుకు అవతరించాల్సి వచ్చింది? అనే అంశాలకు సంబంధించిన వివరణ కనిపిస్తుంది. 

ఈ కథ శివపురురాణంలో శతరుద్రసంహితలో చోటుచేసుకుంది. అమృతం కోసం దేవదానవులిద్దరూ సాగరమధనంలో ఉన్నప్పుడు ఆ మహాసాగరం నుంచి ఎన్నెన్నో మహత్తర వస్తువులతో పాటుగా కాలాగ్ని లాంటి విషం కూడా ఉద్భవించింది. దాన్ని చూసి దేవదానవులంతా భయకంపితులై పోతున్నప్పుడు పరమేశ్వరుడు వారందరికీ అభయమిచ్చి తన భక్తవత్సల గుణంతో ఆ మహాఘోరమైన విషాన్ని మింగి తన కంఠస్థలంలో ధరించాడు. ఆ విషప్రభావంతో తెల్లటి ఈశ్వరదేహంలో నీలవర్ణ ఛాయతో పరమేశ్వరుడి కంఠం భాసిల్లసాగింది. 

అలా శివానుగ్రహంతో ఆ విషం బాధనుంచి దేవతలు, రాక్షసులు అంతా విముక్తి పొందారు. మళ్ళీ వారంతా కలిసి సముద్ర మధనానికి పూనుకున్నారు. ఇలా సముద్రాన్ని మధిస్తుండగా కొద్ది సమయానికి అందరూ ఎదురుచూస్తున్న అమృతం ఉద్భవించింది. ఆ అమృతాన్ని విష్ణుమూర్తి కృపచేత దేవతలు ఆరగించగలిగారు. అయితే తమకన్యాయం జరిగిందంటూ రాక్షసులంతా దేవతలమీదకు దండెత్తిన సమయంలో రాహువు చంద్రుడిని సంహరించటానికి ముందుకురికాడు. చంద్రుడు రాహువు పీడ నుంచి తప్పించుకోవటానికి పరమేశ్వరుని సన్నిధికి వెళ్ళి ఆయనను శరణు వేడాడు. శరణన్న వారిని ఎటుంంటి పరిస్థితిలోనూ రక్షించే సత్‌సంకల్పం ఉన్న పరమేశ్వరుడు చంద్రుడికి అభయమిచ్చి ఆ చంద్రుడిని తన శిరస్సున దాల్చాడు. 

పరమేశ్వరుడి శిరస్సు మీద చంద్రుడు ఉన్నాడని తెలుసుకొని రాహువు చంద్రుడిని వెంబడిస్తూ శివుడి దగ్గరకు వచ్చి వినయంతో నమస్కరించి నిలుచున్నాడు. రాహువు మనసులోని ఆంతర్యాన్ని గ్రహించిన ఈశ్వరుడు చంద్రుడికి రక్షణ కల్పించటంలో తన నిర్ణయాన్ని కొంచెం కూడా మార్చుకోకుండా రాహువుకు కూడా మేలు జరిగేలా మాత్రమే తన యుక్తిని ప్రదర్శించాడు. 

చంద్రుడికి దివ్యస్థానాన్ని ఇచ్చినట్లే రాహువుకు కూడా మేలు కలిగేలా చేస్తానని, పూర్వం శ్రీమహావిష్ణువు నరికిన కేతువు శిరస్సును తన మెడలో అలంకారప్రాయంగా ధరిస్తానని రాహువుకు చెప్పాడు. రాహువు ఈశ్వర వచనాలకు ఎంతగానో ఆనందించి వెనుతిరిగి వెళ్ళిపోయాడు. ఇలా కేవలం ఒక్క పరమేశ్వర శక్తి, యుక్తులతోనే దేవతలంతా తమ మీదకు దండెత్తి వచ్చిన రాక్షసులందరినీ సంహరించగలిగారు. రాక్షస సంహార అనంతరం కొంతకాలానికి జరిగిన విషయాలన్నింటినీ పూర్తిగా మరిచిపోయిన విష్ణువు తదితర దేవతలు కేవలం వారివల్లనే రాక్షస సంహారం జరిగిందని గర్వపడసాగారు. 

ఆ గర్వంతో దేవతలంతా ఉన్న సమయంలో రాక్షస సంహారం నిజంగా ఎవరిశక్తితో జరిగింది అనే విషయాన్ని పరమేశ్వరుడు దేవతలందరికీ మళ్ళీ ఒకసారి నిరూపించాలనుకున్నాడు. వారి గర్వాన్ని అణచాలని శంకరుడు యక్షరూపాన్ని ధరించి దేవతలున్న ప్రదేశానికి వెళ్ళాడు. అక్కడకు వెళ్ళి విష్ణుమూర్తి తదితర దేవతలను రాక్షస సంహారం ఎవరు చేయగలిగారు? ఈ జగత్తులకంతటికీ శాంతిని ఎవరు ప్రసాదించగలిగారు? ఆ విషయాలకు సంబంధించిన విషయాలను చెప్పమని యక్షేశ్వరుడు అడిగాడు. 

అక్కడ ఉన్న దేవతలంతా కేవలం తామ తమ బలంతోనే రాక్షసులను నిర్జించగలిగామని గర్వంగా మరీమరీ చెప్పారు. వెంటనే వారందరికీ తగిన నగుణపాఠం చెప్పాలన్న లక్ష్యంతో యక్షేశ్వరుడు అక్కడ ఉన్న ఒక గడ్డిపరకను తీసుకొని దేవతల ముందుంచి సాలోచనగా పరమేశ్వరుడే రాక్షస సంహారి అని ఆయన చేసిన మేలును మరిచిపోవటమే కాక గర్వంగా ఉండటం కూడా దేవతలకు తగదని చెప్పి ఎవరైనా ముందుకు వచ్చి గడిపరకను తుంచమని అన్నాడు. 

దేవతలంతా తమతమ దగ్గర ఉన్న ఎన్నెన్నో గొప్ప గొప్ప శస్త్రాస్త్రాలను ప్రయోగించినా ఫలితం లేకపోయింది. గడ్డిపోచను కదల్చటం కూడా వారికెవరికీ చేతకాకపోయింది. వెంటనే దేవతలంతా ఆ వచ్చిన యక్షుడు ఎవరో కాదని తాము తమశక్తిని గురించి ప్రగల్భాలు పలుకుతుండగా తమ గర్వాన్ని అణచటానికి వచ్చిన సాక్షాత్తూ పరమేశ్వరుడేనని భావించి ఈశ్వరుడిని అనుగ్రహించమంటూ వేడుకొని తమకు జ్ఞానోదయం అయిందని ఇన్నాళ్ళూ తాము గర్వపడటం తమ అమాయకత్వమేనని ఈశ్వరుడికి విన్నవించుకున్నారు. 

శివుడు తన శక్తిని గుర్తించిన ఆ దేవతలందరివంకా చిరునవ్వుతో చిద్విలాసంగా చూస్తూ ఎలాంటివారికైనా ఏ పరిస్థితిలోనైనా గర్వం పనికిరాదని దేవతలందరికీ హితోపదేశం చేసి అంతర్ధానమయ్యాడు. ఇలా శివుడు చంద్రశేఖరుడిగా, యక్షేశ్వరుడిగా ఎలా మారిందీ శివపురాణంలోని ఈ కథ వివరిస్తోంది.