గీత జయంతి
హిందువులే కాక ప్రపంచమంతా
కూడా భగవద్గీతతోనే మనల్ని గుర్తిస్తోంది. భగవద్గీతకి, హైందవ సంస్కృతికి అంతటి అవినాభావ సంబంధమేర్పడి, హిందువుల మతగ్రంథమే భవగద్గీత అని ఇతరులు అనుకునేటట్లుగా
ప్రభావం చూపగల గొప్పగ్రంధం భగవద్గీత. భారతదేశంలో చాలా గీతలున్నాయి. - హంసగీత,
అనుగీత, కపిలగీత, ఉద్ధవగీత, రుద్రగీత మొదలైనవి. ఇవి కాక
ప్రతి పురాణంలోనూ గీతున్నాయి అవి ఒకవైపు శివగీత, దేవీగీత, గణేశగీత వగైరా. భగవద్గీత
కృష్ణగీత. భగవంతుడు పలికిన మాట బ్రహ్మవిద్య. అందుకు ఎన్ని గీతలున్నా
దేనిప్రాధాన్యం దానిదే. సర్వగీతల సమన్వయం భగవద్గీత. అప్పటిదాకా ఉన్న విద్యలను
అన్నింటినీ సమన్వయపరచి చూపించారు శ్రీకృష్ణపరామత్మ. అందువల్లనే భగవద్గీత పరిపూర్ణ
గ్రంధమై సర్వవిద్యల సారమై, ఇదే భారతీయుల గ్రంథం
అనిపించుకునేలా చేసింది. అందుకే దీనినే ప్రమాణంగా స్వీకరించటంలో ఏమీ ప్రతిబంధకం
లేదు.
మానవకోటిని సన్మార్గమునందు
నడిపించుటకు సహాయపడు మహాగ్రంథములలో ’శ్రీమద్భగవద్గీత’
సర్వోత్కృష్టమైనది. ఇది భగవానుని దివ్యవాణి.
సమస్త వేదముల సారము. "సర్వశాస్త్రమయీ గీతా" అని మహాభారతమున
పేర్కొనబడినది.
గీతా సుగీతా కర్తవ్యా,
కిమన్యైః శాస్త్ర సంగ్రహైః
యా స్వయం పద్మనాభస్య
ముఖపద్మాత్ వినిఃస్మృతా!!
సాక్షాత్తూ శ్రీకృష్ణుని
ముఖపద్మం నుండి వెలువడినది భగవద్గీత. దీనిని ఎల్లవేళలా చక్కగా కీర్తించాలి. అపుడిక
ఏశాస్త్రములతో పనిలేదు. సర్వశాస్త్రాలూ గీతలో ఉన్నాయి.
గీతా గంగాచ గాయత్రీ
గోవిందేతి హృది స్థితే!
చతుర్గకార సంయుక్తే
పునర్జన్మ న విద్యతే!!
గీత, గంగ, గాయత్రి గోవింద అనే నాలుగు
గకారాలు హృదయంలో నిలిస్తే వానికి పునర్జన్మ ఉండదు. గీత గంగకంటెను పవిత్రమైనది.
గంగాస్నానము ఆచరించిన వాడు తాను మాత్రమే తరించును. కానీ గీత అను గంగయందు మునకలు
వేయువాడు తాను స్వయముగా తరించుటయేగాక ఇతరులను కూడ తరింపజేయగలడు. దీని శ్రవణ,
కీర్తన, పఠన, పాఠన, మనన, ధారణాదులు మిక్కిలి మహిమాన్వితములు, కర్తవ్యములు. భారతమనే సముద్రం మధించి గీత అనే అమృతం తీసి,
కృష్ణుడు అర్జునుని ముఖంలో హోమం చేశాడు.
మార్గశిర శుద్ధ ఏకాదశి గీతాజయంతి.