దక్షిణావర్తమైన శ్వేత శంఖాలు


ఎవరి ఇంట్లో అయితే దక్షిణావర్తమైన శ్వేత శంఖాలు రెండు నిత్యపూజలు అందుకుంటూ ఉంటాయో ఆఇంటి యజమాని సదా ఉచ్ఛస్థితిలో ఉంటాడు. ఏకార్యం చేట్టినా అందులో విజయం సాధిస్తాడు. అపజయాలు, దుర్దశలు ఆవ్యక్తి దరిదాపుల్లోకి కూడా రావని ప్రజల నమ్మిక. శాస్త్ర ప్రకారం శంఖం లక్ష్మీ స్వరూపం.
"మహాభషేకం సర్వత్ర శంఖేనైవ ప్రకల్పయేత్!
సర్వత్రైవ ప్రశస్తోబ్జః శివ సూర్యార్చనం వినా!!"(తిథి తత్త్వే బ్రాహ్మే)
సర్వదేవతా పూజల్లోనూ శంఖంతో మహభిషేకం చేయాలి. శంఖంతో శివ సూర్యులను మాత్రం అభిషేకించరాదు. శంఖ ద్వారా ఇచ్చే తీర్థాన్ని ఎలా స్వీకరించాలంటే
చతుర్గుణీ కృత వస్త్రే పాణిం నిధాయ తేనాదౌ శంఖతీర్థం శిరసి ధారయేత్!
శంఖ మధ్య స్థితం తోయం భ్రామితం కేశవోపరి! అంగ లగ్నం మనుష్యాణాం బ్రహ్మహత్యా యుతం దహేత్!! (నిత్య కర్మాష్టకే)
నాలుగు మడతలు పెట్టిన వస్త్రం మీద కుడి చేతిని ఉంచాలి. ముందుగా అందులోకి శంఖ తీర్థాన్ని తీసుకొని, శిరస్సున జల్లుకోవాలి. శంఖమధ్యమున ఉండేదీ, విష్ణు ప్రదక్షిణం చేసినదీ అయిన ఈశంఖం తీర్థం మానవుల శరీరాన్ని స్పృశించి, బ్రహ్మ హత్యల వల్ల కలిగే పాపాన్ని సైతం పోగొడుతుంది. శంఖాన్ని చెవిదగ్గర ఉంచుకొన్నప్పుడు మంద్రమైన శబ్దాలు వినిపిస్తే అది ఉత్తమమైన శంఖం.
ఎవరైతే తమ ఇంట్లో లక్ష్మీదేవి శాశ్వతంగా నివాసం ఉండాలనుకుంటారో, ఋణబాధలు, దరిద్రం లేకుండా సిరిసంపదలతో తులతూగాలనుకుంటారో అలాంటి వాళ్ళు దక్షిణావర్త శ్వేత శంఖాన్ని(కుడివైపు తెరుచుకొని ఉండే తెల్లటి శంఖాన్ని) పూజగదిలో పెట్టుకోవాలి. ఈవిషయాన్ని పులస్త్య సంహితలో మహర్షి పులస్త్యుడు, లక్ష్మీ సంహితలో బ్రహ్మర్షి విశ్వామిత్రుడు చెప్పారు. దక్షిణావర్తమైన తెల్లటి శంఖం ఉన్నప్పటికీ దాన్ని ఉపయోగించుకోనట్లయితే అంతకన్నా దురదృష్టం మరొకటి ఉండదని శంకరాచార్యులు పేర్కొన్నారు. ఆశంఖం మంచి పనులు చేయడానికి ప్రోత్సహిస్తుందని తెలిపారు.