మీనాక్షీస్తోత్రమ్
శ్రీవిద్యే శివవామభాగనిలయే
శ్రిరాజరాజార్చితే
శ్రీనాథాదిగురుస్వరూపవిభవే
చింతామణీపీఠికే|
శ్రీవాణీగిరిజానుతాఙ్ఘ్రికమలే
శ్రీశామ్భవి శ్రీశివే
మధ్యాహ్నే మలయధ్వజాధిపసుతే
మాం పాహి మీనామ్బికే||౧||
శ్రీవిద్యా స్వరూపిణివి,
శివుని ఎడమ భాగమునందు నివసించుదానవు, కుబేరునిచే పూజింపబడు దానవు, శ్రీనాధుని మొదలగు గురువుల ( విష్ణు- బ్రహ్మ- మహేశ్వరులు )
స్వరూపమైన దానవు, చింతామణీ పీఠమునందుండు
దానవు, లక్ష్మీ- సరస్వతీ-
పార్వతులచే నమస్కరించబడు పాదపద్మముల కలదానవు, శివుని భార్యవు, మంగళ స్వరూపిణివి,
మధ్యాహ్న సమయమునందు మలయద్వజ మహారాజుకు
కుమార్తెగా అవతరించిన దానవు అగు మీనాక్షీ| నన్ను కాపాడుము.
చక్రస్థేఽచపలే
చరాచరజగన్నాథే జగత్పూజితే
ఆర్తాలీవరదే నతాభయకరే
వక్షోజభారాన్వితే|
విద్యే వేదకలాపమౌళివిదితే
విద్యుల్లతావిగ్రహే
మాతః
పూర్ణసుధారసార్ద్రహృదయే మాం పాహి మీనామ్బికే||౨||
శ్రీచక్రమునందుండు దానవు,
స్థిరమైన దానవు, చరాచర ప్రపంచమును పాలించుదానవు, జగత్తులచే పూజింపబడు దానవు, దీనులకు వరము లిచ్చేడిదానవు, భక్తులకు అభయమొసంగు దానవు, స్తనభారము కల దానవు, విద్యాస్వరూపిణివి, వేదాంతముచేతెలియబడుదానవు,
మెరుపు వంటి శరీరము కల దానవు, తల్లివి, అమృతముతో అర్ద్రమైన హృదయము
కలదానవు అగు మీనాక్షీ| నన్ను కాపాడుము.
కోటీరాంగదరత్నకుణ్డలధరే
కోదణ్డబాణాఞ్చితే
కోకాకారకుచద్వయోపరిలసత్ప్రాలమ్బిహారాఞ్చితే|
శిఞ్జన్నూపురపాదసారసమణిశ్రీపాదుకాలఙ్కృతే
మద్దారిద్ర్యభుజఙ్గగారుడఖగే
మాం పాహీ మీనామ్బికే||౩||
కిరీటము- కంకణములు-
రత్నకుండలములు అలంకరించుకున్న దానవు, ధనుస్సు- బాణము
పట్టుకున్న దానవు, చక్రవాక పక్షుల వంటి రెండు
స్తనములపై ప్రకాశముగా వ్రేలాడుచున్న హారములు అలంకరించుకున్న దానవు, ఘల్లుమను గజ్జెలతోనూ, మణులతో శోభిల్లుపాదుకలతోనూ అలంకరించబడిన పాదము కల దానవు,
నా దారిద్ర్యమను సర్పమును సంహరించు
గరుడపక్షివంటి దానవు అగు మీనాక్షీ| నన్ను కాపాడుము.
బ్రహ్మేశాచ్యుతగీయమానచరితే
ప్రేతాసనాన్తస్థితే
పాశోదఙ్కుశ చాపబాణకలితే
బాలేన్దుచూడాఞ్చితే|
బాలే బాలకురఙ్గలోలనయనే
బాలార్కకోట్యుజ్జ్వలే
ముద్రారాధితదేవతే మునిసుతే
మాం పాహీ మీనామ్బికే||౪||
బ్రహ్మ- విష్ణు-
మహేశ్వరులచే స్తుతింపబడు దానవు, బ్రహ్మ- విష్ణు-
రుద్రఈశ్వర- సదాశివులను పంచప్రేతల ఆసనము నధిష్టించిన దానవు, పాశము- అంకుశము- ధనుస్సు- బాణము ధరించిన దానవు, తలపై బాల చంద్రుని అలంకరించుకున్న దానవు, బాలవు, లేడిపిల్లవంటి చంచలమైన
కన్నులు కల దానవు, కోట్లాది బాలసూర్యుల
వలేపకాశించుచున్న దానవు, ముద్రలచే ఆరాధించబడు దేవతవు,
మునులచే ప్రార్థింపబడుదానవు, అగు మీనాక్షీ| నన్ను కాపాడుము.
గన్ధర్వామరయక్షపన్నగనుతే
గంగాధరాలిఙ్గితే
గాయత్రీగరుడాసనే కమలజే
సుశ్యామలే సుస్థితే|
ఖాతీతే ఖలదారుపావకశిఖే
ఖద్యోతకోట్యుజ్జ్వలే
మన్త్రారాధితదేవతే మునిసుతే
మాం పాహీ మీనామ్బికే||౫||
గందర్వులు- దేవతలు-
యక్షులు- సర్పములచే స్తుతించబడుదానవు, శివునిచే ఆలింగనము
చేసుకొనబడినదానవు, నిన్ను స్తుతించినవారిని
రక్షించుదానవు, గరుడునిపై కూర్చున్న దానవు,
కమలము నందు పుట్టిన దానవు, నల్లని దానవు, స్థిరమైన దానవు,
ఆకాశమును అతిక్రమించిన దానవు, దుష్టులనే కొయ్యలను తగుల పెట్టు అగ్నిజ్వాలవు, కోట్లాది సూర్యుల వలే వెలుగొందుచున్న దానవు, మంత్రములచే ఆరాదింపబడు దేవతవు, అగు మీనాక్షీ| నన్ను కాపాడుము.
నాదే నారదతుంబురాద్యవినుతే
నాదాంతనాదాత్మికే
నిత్యే నీలలతాత్మికే
నిరుపమే నీవారశూకోపమే|
కాన్తే కామకలే కదమ్బనిలయే
కామేశ్వరాఙ్కస్థితే
మద్విద్యే మదభీష్టకల్పలతికే
మాం పాహీ మీనామ్బికే||౬||
నాదశ్వరూపిణివి, నారదుడు- తుంబురుడు మొదలైన వారిచే స్థుతించబడు దానవు,
నాదము చివరనుండు అనునాద స్వరూపిణివి, నిత్యమైన దానవు, నల్లని లత వంటి
శరీరము కల దానవు, సాటిలేని దానవు, ధాన్యపు గింజ పై నుండు మొనవలే సూక్ష్మమైన దానవు, మనోహరమైన దానవు, కామకళాస్వరూపిణివి,
కడిమి చెట్లవనము నందుండు దానవు, కామేశ్వరుని ఒడిలో కూర్చున్న దానవు, నా జ్ఞానస్వరూపిణివి, నాకోరికలు తీర్చు కల్పలతవు, అగు మీనాక్షీ| నన్ను కాపాడుము.
వీణానాదనిమీలితార్థనయనే
విస్రస్థచూలీభరే
తామ్బూలారుణపల్లవాధరయుతే
తాటఙ్కహారాన్వితే|
శ్యామే చన్ద్రకలావతంసకలితే
కస్తూరికాఫాలికే
పూర్ణే పూర్ణకలాభిరామవదనే
మాం పాహీ మీనామ్బికే||౭||
వీణానాదము వినుచు మూసిన
అరమోడ్పు కన్నులు కలదానవు, కోంచెముగా జారిన కొప్పు కల
దానవు, తాంబూలముచే ఎర్రనైన
చిగురుటాకుల వంటి పెదవి కల దానవు, కొమ్మలు- హారములు
అలంకరించుకున్నదానవు, నల్లని దానవు, చంద్ర కళను శిరోభూషణముగా అలంకరించుకున్న దానవు, నొసటి పై కస్తూరి తిలకమును ధరించిన దానవు, పరిపూర్ణురాలవు, పూర్ణచంద్రుని వలే
అందమైన ముఖము కలదానవు, అగు మీనాక్షీ| నన్ను కాపాడుము.
శబ్దబ్రహ్మమయీ చరాచరమయీ
జ్యోతిర్మయీ వాఙ్మయీ
నిత్యానన్దమయీ నిరంజనమయీ
తత్త్వంమయీ చిన్మయీ|
తత్త్వాతీతమయీ పరాత్పరమయీ
మాయామయీ శ్రీమయీ
సర్వైశ్వర్యమయీ సదాశివమయీ
మాం పాహీ మీనామ్బికే||౮||
శబ్ద బ్రహ్మ స్వరూపిణివి,
చరాచరజగత్స్వరూపిణివి, జ్యోతిర్మయివి, వాఙ్మయివి, నిత్యానందరూపిణివి, నిరంజన స్వరూపిణివి,
’తత్- త్వం’ శబ్దములకు అర్థమైన దానవు, జ్ఞానమూర్తివి, తత్త్వములకతీతమైన
దానవు, శ్రేష్ఠమైన వాని కంటే
శ్రేష్ఠమైన దానవు, మాయా స్వరూపిణివి, లక్ష్మీ స్వరూపిణివి, సర్వైశ్వర్యములతో పరిపూర్ణురాలవు, సదాశివ స్వరూపురాలవు, అగు మీనాక్షీ| నన్ను కాపాడుము.
జయ జయ శఙ్కర హర హర శఙ్కర
