ఆండాళ్‌ (గోదాదేవి)-ఆళ్వారుల (విష్ణుభక్తులు)


ఆండాళ్‌ తల్లి అపర జానకీ మాతను గుర్తుకు తెస్తుంది. జనక మహారాజు యజ్ఞ శాల నిమిత్తము భూమిని దున్నుచుండగా దొరికినది సీత. ఆండాళ్‌ తల్లి కూడా తులసి వనము నిమిత్తమై విష్ణుచిత్తుడు దున్నుచుండగా ఆ భూమిలో దొరికినది. ఇద్దరూ అయోనిజలే. సీతలేని రామాలయముండదు. గోదాదేవి లేని వైష్ణవాలయముండదు. సీతమ్మ శ్రీరాముని (శ్రీ మహావిష్ణువు)ను వివాహమాడింది. అట్లే ఆండాళ్‌ శ్రీరంగనాథుని (శ్రీ మహావిష్ణువు)ను వివాహమాడింది.

తమిళనాడులో శ్రీవిల్లి వుత్తూరులో నిరంతరము వటపత్రశాయికి మాలా కైంకర్యము చేయు శ్రీ విష్ణుచిత్తుడు(పేరి యాళ్వారు)తులసి వనమునకై భూమిని దున్నుచుండగా ఆండాళ్‌ శిశువు భూమిలో కనపడింది. ఆ పసికూనను చూసి పరమ సంతోషముతో విష్ణుచిత్తుడు ఆమెను ఇంటికి తీసుకుని వెళ్ళి పెంచమని భార్యకిచ్చాడు. ఆమె పసిబిడ్డకు గోదాదేవి అని నామకరణం చేసింది. ( గోదా -భూమి, గోదాదేవి - భూమిలో ఉద్భవించినది)

ఆ పసిపిల్ల దిన దిన ప్రవర్ధమానమగుచు అందరిని సంతోషపెట్టుచుండెడిది. చిన్నప్పటి నుంచి శ్రీమన్నారాయణనుని మీద అమితమైన భక్తిని చూపెడుతూ, ఇంకిత జ్ఞానము వచ్చు సరికి శ్రీమన్నారాయణుని తప్ప మనుజుల నెవ్వరిని వరించబోనని తన నిశ్చయము తెలిపినది.

తండ్రి విష్ణుచిత్తుడు ప్రతిరోజు శ్రీవిల్లి వుత్తూరులో వటపత్రశాయికి మాలాకైంకర్యము చేయుచుండట చూసి గోదాదేవి పరవశించెడిది. తండ్రి కట్టిన మాలలు తండ్రికి తెలియకుండా తన కొప్పుపై ధరించి నూతిలో తన సౌందర్యము చూచుకొనుచు తిరిగి ఆ మాలలను యధాస్థానమున నుంచెడిది. ఒక నాడు తండ్రి ఇది చూశాడు. అది తప్పని భావించాడు. నిర్మాల్యమైందని ఆనాడు వటపత్రశాయికి పూమాలలు సమర్పించలేదు. గోదాదేవిని సున్నితముగ మందలించాడు. అమ్మా! స్వామికి నిర్ణయింపబడిన పూలదండ నీవు ముందర ధరించుట అపచారమమ్మా! అని చెప్పాడు. గోదాదేవి తన కొప్పులో ముడిచిన పూలదండలు సమర్పించకుండుటకు విష్ణుచిత్తుని కలలో వటపత్రశాయి అగుపడి కారణమడిగాడు. విష్ణుచిత్తుడు తన తనయ యెనరించిన చిన్ని అపరాధమును వివరించి అందుచే మీకు మాలలను సమర్పించలేకపోయితిని. క్రొత్తవి తయారు చేయుటకు సమయము లేకపోయింది అని విన్నవించుకున్నాడు.

వటపత్రశాయి చిరునగవుతో విష్ణుచిత్తుని చూసి నీవు చింతించవలదు. సందేహించవలదు. గోదాదేవి తాను ముందు దాల్చిన మాలికయే మేము కోరదగినది. ఆమె కొప్పులో దాల్చని మాలికలు మాకు వద్దు. ఆమె విషయము మీకు తెలియదు. లక్ష్మీదేవియే ఈ లీలా విభూతి యందు భూలోకమున గోదాదేవిగా అవతరించింది అని చెప్పాడు.

గోదాదేవి యుక్త వయస్సు నొందగానే గోపికలు కృష్ణుని యందు చూపిన అనురక్తి ఆమెయందు పొడసూపింది. గోపికలు తమకముతో శ్రీకృష్ణుని కొరకు కాత్యాయన వ్రతమాచరించిరని వినగా ఆమెకు కూడా వటపత్రశాయి యందు అటువంటి అనురక్తి కలిగింది. కృష్ణుడున్న మధుర యమునలో జలక్రీడలాడుట ఇవన్నీ మనస్సులో ఊహించుకొని ధనుర్మాసములో తోడి బాలికలతో స్నానము చేసి వటపత్రశాయి దేవాలయము శ్రీకృష్ణుని గృహముగను, తోడి చెలులు గోపికలుగను, వటపత్రశాయి శ్రీకృష్ణునిగను, తాను ఒక గోపాంగనగ భావించి వటపత్రశాయికి ధూప, దీప , నైవేద్యములతో దినమున కొక్క పాశురమును ద్రావిడ భాషలో (తమిళములో)వ్రాసి వటపత్రుని సన్నిధిని పాడుచూ చెలులతో కాత్యాయనీ వ్రతము చేసింది. ఒక రోజున తన తండ్రిని 108 దివ్యతిరుపతలలోని మూర్తుల కళ్యాణగుణములను చెప్పవలసిందిగా కోరింది. పేరియాళ్వారు చక్కగా వివరించి చెప్పాడు.

ఆ వర్ణనలను వింటూంటే శ్రీరంగమున వేంచేసి యున్న శ్రీరంగనాయకుని మహాదైశ్వర్యవిభూతి సౌందర్యమునకు ముగ్ధురాలైంది. ఆయనను వివాహమాడ దలచింది. గోదాదేవికి శ్రీరంగనాథునికి వివాహ మెట్లు జరుగుతుందని విష్ణుచిత్తుడు వ్యాకులపడ్డాడు. వటపత్రశాయికి మొరపెట్టుకున్నాడు. వటపత్రశాయి నీకుమార్తెను శ్రీరంగనాథుని సన్నిధికి కొనిపొమ్ము అని ఆదేశించాడు. శ్రీరంగనాథుడు అరోజు రాత్రి విష్ణుచిత్తుని కలలో కనిపించి నేను నీ పుత్రికను వివాహమాడెదను. సిద్ధముగా నుండుము అని చెప్పాడు. మరుసటి దినమున శ్రీరంగనాథుని అజ్ఞమేరకు ఆయన భక్తులు, అర్చకులు మేళతాళములతో విష్ణుచిత్తుని వద్దకు వచ్చి గోదాదేవిని విష్ణుచిత్తుని శ్రీరంగనాథుని కోరికపై పల్లకిలో శ్రీరంగమునకు తీసుకొని వెళ్లిరి.

ఆ దినమున స్వామి ఆజ్ఞ చొప్పున శ్రీరంగనాథుని అర్చావిగ్రహమునకు గోదాదేవినిచ్చి వివాహము చేసిరి. గోదాదేవి స్వామిని సేవించుట అందరూ చూచుచుండగా శ్రీరంగనాథుని గర్భాలయములోనికి పోయి శ్రీరంగనాథునిలో లీనమైపోయింది.

శ్రీరంగనాథుడు విష్ణుచిత్తుని చూసి నీవు దిగులొందకు అని ఆయనకు గౌరవ పురస్కారముగా తిరుప్పరి పట్టము, తోమాల, శ్రీ శఠకోపము యిచ్చి ఇతర సత్కారములొనర్చి పంపాడు.

గోదాదేవికి ఆండాళ్‌ ( భక్తుల మేలుకొనునది), చూడి కొడుత్తామ్మాల్‌ (స్వామికి తాను ముడుచుకుని పూమాలలు ఇచ్చునది) అని పేర్లు వచ్చాయి.

గోదాదేవిని 12 మంది ఆళ్వారులలో చేర్చినారు. ధనుర్మాసంలో ఆమె ప్రతిరోజు రచించి పాడిన తిరుప్పావై పాశురములు జగత్‌ విఖ్యాతినంది అన్ని వైష్ణవదేవాలయాలలోను ధనుర్మాసమందు ప్రతియేటా అత్యంత భక్తితో ప్రజలందరు ముప్పది రోజులు పాశురములను పాడుచు లోకోత్తరముగ సేవలు చేయుచున్నారు. ఆమె తిరుప్పవై (30 పాశురములు), నాచ్చియారు తిరుమొళి (143 పాశురములు) జగత్‌ విఖ్యాతమై అందరి చేత నుతింపబడుచున్నవి. తిరుప్పావై దివ్య ప్రభందమే. 30 రోజులు పాడినవి మేలుపలుకుల మేలుకొలుపులు.

ఆండాళ్‌ గురించి ముచ్చటైన విషయం తిరువాలుపాటి రాఘవయ్యగారు ముచ్చటించారు. ఒక రోజున విష్ణుచిత్తుడు గోదాదేవి వెనకాల శ్రీవిల్లి వుత్తూరులోని శ్రీకృష్ణాలయమున ప్రవేశించారు. గోదాదేవి నిచ్చల చిత్తముతో శ్రీకృష్ణుని ధ్యానించింది. మీరు సర్వాంతర్యాములు. 108 దివ్య తిరుపతులలోను మీరే ఉన్నారు. ఇచ్చట మీరు శ్రీకృష్ణులు. శ్రీ రంగములో శ్రీరంగ నాయకులు. మీరే శ్రీరంగనాథులయిన నన్ను మీ దేవేరిగా పరిణయమాడండి. మీకు 100 కప్పుల చెక్కర పొంగలిని, 100 కప్పుల వెన్నెను సమర్పించుకొందును అని అన్నది.

శ్రీరామానుజుల వారు తమ సంచారములో శ్రీవిల్లి వుత్తూరులో శ్రీకృష్ణుని సందర్శించారు. కృష్ణునకు ఈ విధంగా విన్నవించారు. స్వామీ! జగత్పితా! మా సోదరి ఆండాళ్‌ (గోదాదేవి) తనను శ్రీరంగనాథుడు స్వీకరించిన మీకు 100 కప్పుల చెక్కెరపొంగలి, 100 కప్పుల వెన్నను సమర్పించుకొందును అని చెప్పింది. ఆమె మొక్కు తీరకుండా నుండగూడదు. నేను ఇప్పుడు మీకు ఆమె సోదరునిగా ఆమె మ్రొక్కును చెల్లించుచున్నానని 100 కప్పులు కాదు 100 కుండలు చెక్కెరపొంగలిని, 100 కుండలు వెన్నెను శ్రీవిల్లి వుత్తూరు వటపత్రశాయి శ్రీకృష్ణులకు సమర్పించి అందరి భక్తులకు ఆ ప్రసాదాన్ని పంచిపెట్టారు. ఆ దినము నుండి శ్రీరామానుజులు గోదాగ్రజలుగా ప్రసిద్ధి నొందారు.