భగవత్ శక్తి కేంద్రీకృతమైన స్థానం - విగ్రహం

భగవంతునికి చేతనంలోంచి రావాలా, అచేతనంలోంచి రావాలా అని నియమం లేదు అని శ్రీమద్భాగవతాది గ్రంథాలు తెలియజేస్తున్నాయి. శ్రీమద్భాగవత దశమ స్కందంలో వత్సాపహార ఘట్టంలో ఒక లీలను ప్రదర్శించాడు స్వామి. జగత్ కారణమైన పరమాత్మ గోకులంలో పుట్టాడట అని కబురు తెలిసింది చతుర్ముఖ బ్రహ్మగారికి. నా అంతటివాడు వాలకడలి వెళ్తేనే స్వామి కనిపించలేదు, కుడి ఎడమ తేడా తెలియని గోకులంలోని వారికా పరమాత్మ కనిపించేది అని అనుకున్నాడు. ఆ పిల్లవాడి గురించి అందరూ చెబుతుంటే ఏదో ఇంద్రజాలం చేస్తున్నాడు వెళ్ళి బుద్ధి చెప్పాలి అని నిర్ణాయించుకున్నాడు.
ఒకనాడు కృష్ణుడు సద్దులు ఆరగించుదాం అని గోపబాలలందరికీ తమ తమ ఇల్లంల్లోంచి పదార్థాలు తెచ్చుకోమన్నాడు. మధ్యాహ్నం కాస్త అలసట పడేసరికి తాను మధ్య కూర్చున్నాడు, చుట్టూ గోపబాలలను అందరినీ కూర్చోబెట్టాడు. ఒక్కొక్కరి స్పర్శ కలిగిన పదార్థాలు కనుక వారి పదర్థాలని తాను తింటూ, తాను తెచ్చుకున్న పదార్థాలని వారికి రుచి చూపిస్తూ ఉన్నాడు. ఒక గోపబాలుడు తను తెచ్చుకున్నది గంజి నీళ్ళే, ఇదేం కృష్ణుడికి ఇద్దాం అని గబ గబా త్రాగేసాడు. ఇది గమనించిన కృష్ణుడు గబగబా త్రాగుతున్న ఆ గోపబాలుడి సెలవుల్లోంచి కారుతున్న గంజిని త్రాగటం ప్రారంభించాడు, ఆ గోపబాలుడు ప్రేమతో తెచ్చినది తనూ పొందాలి అనే భావంతో. ఇదే సమయానికి బ్రహ్మగారు వచ్చారు, ఈ ఎంగిలి అమంగళాలు చేసేవాడా జగత్ కారణం. తప్పకుండా బుద్ధి చెప్పాలి ఈ పిల్లవాడికి అని అనుకున్నాడు. వారి గోవులను గుహల్లో దాచేసాడు, వాటిని వెతుకుంటూ వచ్చిన గోప బాలురనీ దాచాడు. వీరందరినీ ఏం చేసావు అని ఊరి వాళ్ళు ఈ పిల్లవాణ్ణి తప్పక దండిస్తారు అని నవ్వుకుంటూ బ్రహ్మ లోకం బయలుదేరాడు. ఇది తెలిసి కృష్ణుడు ఆయన కంటే ముందు బ్రహ్మలోకం వెళ్ళి నాలాంటి రూపుతో ఒకడు వస్తాడు, బుద్ధి చెప్పి పంపండి అని చెప్పి వచ్చాడు. బ్రహ్మ గారు అక్కడికి వెళ్ళే సరికి వారు ఈయన బ్రహ్మ   వేశంలో వచ్చినవాడు అని బాగా దేహ శుద్ధి చేసి పంపారు. తనకు ఇలా జరిగిందేమిటి, వచ్చి ఆ పిల్లవాడు ఏమైనాడు చూద్దాం వాడికీ దేహశుద్ధి చేస్తే మనసు కుదుటపడుతుంది అని అనుకొని గోకులం వచ్చాడు. ఆయన తిరిగి గోకులం వచ్చే సరికి సంవత్సర కాలం పట్టింది. ఆయన దాచిన గోవులు, గోపబాలురూ అందరూ ఎక్కడికక్కడే కనిపించారు. అందరి రూపాలను కృష్ణుడే ధరించాడు, రూపాలే కాదు వారి వారి ప్రవృత్తులతో సహా, కనుక గోకులం అంతా ఆనందంతో నిండి ఉంది. తను దాచిన వారు బయటికి వచ్చారా అని వెళ్ళి చూస్తే గుహల్లో దాచిన వారు అట్లా నే ఉన్నారు. బ్రహ్మ గారు సృష్టి చేయగలడు కానీ ఒకే మాదిరిగా చేయలేడు. బయట ఉన్నది ఎవరు, ఇదేంటి అని మరొకసారి చూస్తే ప్రతి గోవులో, ప్రతి ఒక్కరిలో కృష్ణుడే కనిపించాడు. నీవు ధరించిన చిన్ని రూపాన్ని చూసి మోసపోయాను అని అన్నాడు.
మన ఇంట్లో భగవంతుడికి చిన్ని రూపం ఉంటుంది, ఇది భగవంతుడు ఎలా కాగలడు , ఏదో ఒక ఆధారం కోసం పెట్టుకున్నదే విగ్రహం అంటే అని సాధారణంగా భావిస్తుంటాం. దేవుడు కాదు అని విశ్వాసం. అంతటా అణువణువునా నిండి ఉన్న పరమాత్మ ఆ విగ్రహంలో ఎందుకు లేడు! చతుర్ముఖ బ్రహ్మగారికే భగవంతుడు చిన్ని రూపం దాల్చితే నమ్మకం కలగలేదు, మనం ఏం లెక్క. నేనే కొనుక్కున్నాను ఈ విగ్రహాన్ని, అది దేవుడెలా అవుతాడు అని అనిపిస్తుంది. అయితే ఆయన ఏరూపంలో, ఎక్కడున్నా ఆయన భగవంతుడే. ఆయన అంతటా ఉంటాడు కనుక మన కంటే విలక్షణంగా ఆయన ఎక్కడి నుండైనా రాగలడు. కరాటే చేసే వాళ్ళు చేతితో వస్తువులని విరగొట్టగలరు. చేతికి అంత శక్తి ఉంటుందా ? అంటే వారి శరీరంలోని శక్తిని ఒక్క భాగంలో కేంద్రీకరించి అలా చేయగల్గుతున్నారు. అట్లా మనిషి చేయగలిగేది భగవంతుడు చేయలేడా ? భగవంతుడి ఆకృతి ఏమి? ఆయన అంతటా వ్యాపించిన వాడు కనుకనే పేరు నారాయణుడు. నారాయణ తత్త్వం అంటే ఏమిటి గుర్తించగలమా మనం ఆయన సమయానికి కానీ, ప్రాంతానికి కానీ పరిమితుడు కాడు. అందుకే ఆయన పేరు "అనంత" అని. అంతం లేని యోగ్యతలు, అంతం లేని గుణములు, అంతం లేని శక్తి, జ్ఞాన, ఐశ్వర్య, వీర, తేజస్సులాంటి ఎన్నెన్నో గుణములు కలిగినవాడు. ఇన్నింటిలో ఉన్నవాడు దేన్నైనా ప్రక్కన పెడతాడా ? విశ్వంలో ఉన్న చిన్న అణువునైనా తనలోంచి జారనిచ్చేవాడు కాదు. దేన్నీ స్వతంత్రంగా తన నియంత్రణ లేకుండా వదలడు, కనుక ఆయనకి పేరు "అచ్యుత". చ్యుతి అంటే జారడం, ఏ వస్తువును జార నివ్వడు. మనంతట మనం జారుకుందాం అని ప్రయత్నం చేసి మనం ఎక్కడికి వెళ్ళినా ఆయన అక్కడ ఉంటాడు. వేదం చెప్పింది ఈ విషయాన్ని "అనేజదేకం మనసోజవీయః నైనదేవా ఆప్నువన్ పూర్వమర్షత్" ఆయన "పూర్వమర్షత్" అందరికంటే ముందే అక్కడ ఉండే వాడు. ఆయనతో పోటి పడి పరుగెత్తినా, "థద్దావతో అన్యానత్తేతి తిష్టత్" ఆయన ఇక్కడా ఉంటాడు, అన్నింటిని అతిక్రమించి నీవు వెళ్ళే సరికి అక్కడా ఉంటాడు. విశ్వం అంతా ఆయన దేహమే, మనం పరుగెత్తేది ఆయనలోనే ఆయణ్ణి వదిలి మనం ఎక్కడికి వెళ్ళగలం కనుక. విశ్వంలో భగవంతుడి శక్తికి ఇక్కడ అక్కడ అని నియమం లేదు, ఆయన ఎక్కడి నుండైనా రావచ్చు. ఆయన ఎక్కడైనా ఉంటాడు. కంటికి కనిపించేందుకు నేను అని మనం చూపించుకున్నట్లే, భగవంతుణ్ణి గుర్తించదగిన స్థానం మనం ఆరాధన చేసుకొనే అర్చామూర్తి. ఆయన ప్రకటనకి అనువైన స్థానం విగ్రహం. ఇంట్లో అయితే చిన్ని విగ్రహం, బయట ఆలయంలోని విగ్రహం. ఇంటిలో విగ్రహం ఇంటి దీపంలాంటిది, ఆలయంలో విగ్రహం వీది దీపంలాంటిది. అది నిరంతరం మన రక్షణకై అనువైనదిగా ఉంటుంది. మన కంటికి భౌతికమైనవే కనిపిస్తాయి కానీ ఆ తత్త్వాన్ని చెప్పగలిగే ఆచార్యులు ఉంటే అందులో దివ్యత్వాన్ని చూడగలం.