శ్రీకృష్ణపరమాత్మ యొక్క లీలా

భాగ్యశాలినులైన గోపికలఅదృష్టమును వర్ణించుటకు మాటలుచాలవు. మనస్సు ఊహింపజాలదు, బుద్ధికి శక్తిచాలదు. శ్రీకృష్ణపరమాత్మ యొక్క లీలాశరీరము, ఆయన లీలలు ప్రాకృతములు గావు, దివ్యములు. అట్లే ఆస్వామిపై గోపికలకుగల ప్రేమయు అలౌకికమే. గోపికలలో పెక్కుమంది పూర్వజన్మలో తాముచేసిన తపస్సాధన ఫలితముగా తాము కోరుకొనిన విధముగ భగవంతుని సేవలు చేయుటకై ఈజన్మలో ఇట్లు అవతరించిరి. వారి ప్రేమలు సాటిలేనివి, వారి అనుబంధము విడదీయరానిది. గోపికల ఇండ్లలో వెన్నెలను దొంగలించుట, వారి వస్త్రములను అపహరించుట, వారితో రాసక్రీడలుసలుపుట మొదలగు లీలలను అన్నింటిని ప్రేమ స్వరూపుడైన భగవంతుడు వారిని ఆనందింపజేయడానికే ప్రదర్శించెను. గోపికలు కొందఱు పూర్వజన్మలో దేవకన్యలు, మఱికొందఱు వేదస్వరూపులు, ఇంకను కొందఱు తాపసులైన ఋషులు. అతడు వారికి ప్రాణతుల్యుడు.

గోపికల యొక్క మనస్సులు, తనువు, సంపదలు అన్నియును శ్రీకృష్ణునివే. వారి లౌకికజీవనము అంతయును శ్రీకృష్ణునిపరమైనదే. వారు గృహకృత్యములు ఏవి ఆచరించుచున్నను వారి మనస్సులు మాత్రము కృష్ణధ్యాసతోడనే నిండియుండును. వారు రాత్రియంతయు మేల్కొని, తెల్లవాఱెడి వరకు కృష్ణునే స్మరించుచుందురు. ప్రాతఃకాలమున పెరుగును చిలికి, వెన్నలనుదీసి, ఉట్లపైనుంచి, వారు ఆ స్వామికొరకు ఎదురుచూచుచుండెడివారు. శ్రీకృష్ణు నిదర్శనము అయ్యెడి వరకు వారికి ప్రతిక్షణము ఒక్కొక్క యుగముగా కనిపించుచుండెడిది. కృష్ణప్రభువు వారిని సంబరప పరుచుటకే వారి యిండ్లకు వెళ్లినాడు. వెన్నెలను దొంగలించి తినుచుండెడివాడు. వాస్తవముగా అది దొంగలించుటకానే కాదు. భక్తవత్సలుడైన భగవానుడు ఈ విధముగా పూజలను స్వీకరించి, వారిని ఆనందింపజేసెడివాడు.

గోపికలు శ్రీకృష్ణునికి ఊపిరి. వారు మనస్సులలో శ్రీకృష్ణుని తమపతిగా పొందవలెనని అభిలాషపడుచుందురు. వారు ఇసుకతో కాత్యాయనీదేవి ప్రతిమను జేసి, వివిధములగు ఉపచారములతో పూజించుచు ఇట్లు ప్రార్థించుచుచుండెడివారు. "మాతా! నందనందనుని మాకు పతిగాచేయుము. మేము నీకు ప్రణమిల్లెదము." చివరకు దేవి అనుగ్రహముతో వారిసాధన ఫలించెను. శరత్పూర్ణిమనాటి వెన్నెలరాత్రి యందు కృష్ణస్వామితో రాసక్రీడలు సలుపు అవకాశము వారికి లభించెను. ఆ లీలాకృష్ణుని పిల్లనగ్రోవి ప్రతిగోపికను పేరు పేరునను పిలుచుచుండెను. గోపికల మనస్సులు కృష్ణునియొద్దనే యుండినవి. అపుడు వారిశరీరములుగూడ ఆ మురళీనాదమువెంట పరుగెత్తినవి. ఆ మురళీస్వరము వినబడినంతనే వారు ఉన్నవారు ఉన్నట్లుగా పరుగులు పెట్టిరి. మురళీరవము ఆకర్షింపగా సుందరీమణులైన గోపికలు అందఱును గుముగూడిరి. మొదట జరిగిన కఠినమైన ప్రేమ పరీక్షలో వారు నెగ్గిరి. గోపికలు తమ ప్రేమధనముతో విశ్వాత్ముడైన కృష్ణుని కొనివేసిరి. వారు ఆ స్వామిని హృదయపూర్వకముగా ఆలింగనమొనర్చుకొని, ధన్యులైరి. రాసలీలలతో వారిమనోరథములు సిద్ధించెను.


హఠాత్తుగా శ్రీకృష్ణుడు ఒకనాడు మథురకు వెళ్లెను. తమప్రియతముని విరహకారణముగా గోపికల ప్రాణములు ఆయనవెంటనే యుండెను. బృందావనములో వారి చాయలు (శరీరములు) మాత్రము ఉండెను. కొన్ని దినముల పిదప ఉద్ధవుడు శ్రీకృష్ణుని సందేశమును దీసికొనివచ్చెను. కాని ఆయనయు శ్రీకృష్ణనియెడ గోపికల ప్రేమసాగరములో మునిగిపోయెను. వాస్తవముగా శ్రీకృష్ణుని యెడబాటు అనెడి లీల వారి ప్రేమకు పుష్టిని ఒసగుటకే జరిగినది. ఈ లీల జరుగకున్నచో 'భగవంతుడు ప్రేమకు అధీనుడు' అనెడిసత్యము వెల్లడియై యుండెడెది గాదు. కురుక్షేత్రయుద్ధ భూమియందు వారు శ్రీకృష్ణుని మఱల కలిసికొనిరి. తమ ప్రియతముని చూచినంతనే వారివిరహాగ్ని చల్లారెను. శ్రీకృష్ణ పరమాత్మ తన లీలావతారమును చాలించుసమయము ఆసన్నమాయెను. అప్పుడు ఆ గోలోకవిహారితో పాటూ గోపికలుగూడ అంతర్హితులైరి.