శ్రీ కృష్ణ జన్మాష్టమి
వసుదేవసుతం
దేవం కంసచాణూర మర్థనం |
దేవకీ
పరమానందం కృష్ణం వందే జగద్గురుం ||
యదా యదా హి ధర్మస్య
గ్లానిర్భవతి భారత |
అభ్యుత్థానమధర్మస్య
తదాత్మానం సృజామ్యహం ||గీ.4-7
కృష్ణ
జన్మాష్టమి, శ్రీ మహావిష్ణువు బ్రహ్మాండాన్ని
ఉద్ధరించడానికి హిందూ ఇతిహాసాలలో ఎనిమిదవ
అవతారము శ్రీకృష్ణుడు జన్మదినము. కృష్ణ జన్మాష్టమిని కృష్ణాష్టమి
అని లేదా జన్మాష్టమి లేదా
గోకులాష్టమి లేదా అష్టమి రోహిణి
అని కూడా పిలుస్తారు. శ్రీకృష్ణుడు
దేవకి వసుదేవులకు ఎనిమిదో గర్భంగా శ్రావణమాసము కృష్ణ పక్షం అష్టమి
తిధి రోజు కంసుడు చెరసాలలో
జన్మించాడు. చాంద్రమాన పంచాగం ప్రకారం శ్రావణ బహుళ అష్టమి తిథి.
ఇదే రోజు రోహిణి నక్షత్రము
కొద్ది సేపు చంద్రాయుక్తమై ఉంటుంది.
కృష్ణాష్టమి
పండుగ విధానం
కృష్ణాష్టమి
నాడు భక్తులు పగలంతా ఉపవాసం ఉండి, సాయంకాలం శ్రీకృష్ణుని
పూజిస్తారు. శ్రావణ మాసంలో లభించే పళ్ళు, శొంఠి, బెల్లం కలిపిన వెన్న, పెరుగు, మీగడ స్వామికి నైవేద్యం
పెడతారు. ఊయలలు కట్టి అందులో
శ్రీకృష్ణ విగ్రహాల్ని పడుకోబెట్టి ఊపుతూ రకరకాల పాటలు,
కీర్తనలు పాడతారు. పుర వీధుల్లో ఎత్తుగా
ఉట్లు కట్టి పోటీపడి వాటిని
కొడతారు. అందుకే ఈ పండుగని 'ఉట్ల
పండుగ' లేదా 'ఉట్ల తిరునాళ్ళు'
అని పిలుస్తారు. భక్తిశ్రద్ధలతో శ్రీకృష్ణ జయంతి వ్రతంగా ఆచరిస్తే
గోదానం చేసిన ఫలితం, కురుక్షేత్రంలో
సువర్ణదానం చేసిన ఫలం దక్కుతుందని
బ్రహ్మాండ పురాణం చెప్పింది. కలియుగంలో కల్మషాల్ని హరించి, పుణ్యాల్ని ప్రసాదించే పర్వదినం ఇదని కూడా వివరించింది.
తిరుమల
శ్రీవారి ఆస్థానం
తిరుమల
ఆలయలో శ్రీనివాసుని ప్రక్కనే రజతమూరి శ్రీకృష్ణుని విగ్రహం పూజలందుకుంటూ ఉంటుంది. 11వ శతాబ్దానికి పూర్వమే
కృష్ణమూర్తి విగ్రహం ఉన్నట్లు శాసనాధారాలు చెబుతున్నాయి. కృష్ణాష్టమి సందర్భంగా సాయంత్రం సమయంలో శ్రీవారు ప్రత్యేకంగా కొలువుదీరుతారు. ఈ కొలువును 'గోకులాష్టమీ
ఆస్థానం' అని వ్యవహరిస్తారు. సర్వాలంకార
భూషితుడైన స్వామి సర్వభూపాల వాహనంలో ఆస్థానానికి విచ్చేస్తారు. పౌరాణికులు భాగవత పురాణంలోని శ్రీకృష్ణావతార
ఘట్టాన్ని చదివి వినిపిస్తారు. మరునాడు
నాలుగు మాడ వీధుల్లో శిక్యోత్సవం
(ఉట్ల పండుగ) కోలాహలంగా జరుగుతుంది. ఇది కృష్ణుడి బాల్యక్రీడకు
సంబంధించిన వేడుక. శాసనాల ఆధారంగా ఈ ఉత్సవం చాలా
ప్రాచీనమైనదిగా క్రీ.శ.1545 సంవత్సరంలో
తాళ్ళపాక వారే ఉట్ల ఉత్సవాన్ని
ప్రత్యేకంగా ఏర్పాటు చేసినట్లు తెలుస్తుంది.
శ్రీకృష్ణ
అని శ్రీకృష్ణభగవానుడు! ఓ అర్జునా! ధర్మమునకు
హాని కలిగినప్పుడు అధర్మము పెచ్చుపెరిగినప్పుడును నన్ను నేను సృజించుకొందును.
అనగా సాకార రూపముతో లోకమున
నేను అవతరింతును, అని చెప్పియున్నాడు. ఈ
భారతావనిలో శ్రీకృష్ణుడు అంటే తెలియని వారుండరు.
ఆయనే ఈ నవభారత నిర్మాణానికి
సూత్రధారుడు. శ్రీకృష్ణుని భగవంతుని అవతారంగా, మానవ రూపంలో, జన్మించిన
దేవునిగా ఆరాధించామేగాని మానవుడిగా పుట్టిన ఆ దేవదేవుని మానవునిగాక;
వారి లీలలను మానవ మనుగడతో సరిపోల్చుకుంటూ
అర్థం చేసుకోవడం కూడా అంతే ముఖ్యంగా
తెలుసుకోవాలి.
అలా భగవానుడు సామాన్య జనులమధ్య సామాన్య మానవుడి రూపంలో జన్మించి నివురుగప్పిన నిప్పులా దినదినాభివృద్ధి చెందుతూ ధర్మానికి ఆటంకం కలిగించే శక్తులను
తనలో ఉన్న మధ్యాహ్న సూర్యకాంతితో
ఒక మండించే శక్తిలా, ఆ దుష్టశక్తులను నశింపచేస్తూ
సామాన్య జనులకు ఊరట కలిగిస్తూ మానవులందరు
తిరిగి ఎలాకలిసి మెలిసి జీవించాలో జ్నానాబోధను చేస్తూ ముందుకు సాగిపోతుంటారు.
అట్టి
"శ్రీకృష్ణావతార జన్మదినం" మనకు చాలా పవిత్రమైన
పుణ్యదినంగా ఒకసారి జ్నప్తికి తెచ్చుకుంటూ, వారి జన్మవృత్తాంత విశేషాలను,
పరమ భాగవతోత్తములు అందించినవి ఏమిటో...ఒక్కసారి సమీక్షించుకుందాం !
శ్రీముఖనామ
సంవత్సర దక్షిణాయన వర్షఋతువు శ్రావణ బహుళ అష్టమి రోహిణి
నక్షత్రం నాల్గవపాదం బుధవారం నాడు అర్థరాత్రి యదువంశంలో
దేవకీదేవి, వసుదేవుల పుత్రునిగా "శ్రీకృష్ణుడు" జన్మించాడు. అంటే! (క్రీస్తు పూర్వం 3228 సం||)
జయతు
జయతు దేవో దేవకీ నందనోయం
జయతు
జయతు కృష్ణో వృష్టి వంశ ప్రదీపః
జయతు
జయతు మేఘశ్యామలః కోమలాంగో
జయతు
జయతు పృధ్వీభారనాశో ముకుందః |
తా||
ఓ దేవకీనందనా! ఓ వృష్టివంశ మంగళ
దీపమా! సుకుమార శరీరుడా! మేఘశ్యామ! భూభారనాశక ముకుంద! నీకు సర్వదా జయమగుగాక!
ఆ బాలకృష్ణుడు దినదిన ప్రవర్థమాన మగుచూ తన లీలావినోదాదులచే
బాల్యమునుండే, అడుగడుగునా భక్తులకు జ్నానోపదేశం చేస్తూ వచ్చినాడు. ఈ బాలకృష్ణుడు ఇంటింటా
తన స్నేహితులతో వెన్నముద్దలు దొంగలిస్తూ వెన్నదొంగగా ముద్రవేసుకున్నాడు. అలా వెన్నముద్దల దొంగతనంలో
కూడా మానవులకు అందని దేవరహస్యం ఉందిట.
వెన్న జ్నానానికి సంకేతంగా చెప్తారు. పెరుగును మధించగా మధించగా కాని వెన్న లభ్యంకాదు
కదా! అట్టి తెల్లని వెన్నను
తాను తింటూ, ఆ అజ్నానమనే నల్లని
కుండను బద్దలుకొట్టి మానవులలో జ్నానజ్యోతిని వెలిగించడమే కృష్ణ సందేశంగా భావించాలి
అని చెప్తూ వుంటారు.
అలాగునే
మరోచిన్నారి చేష్టలో మరో సందేశాన్ని చెప్తారు.
గోపికలు కుండలలో ఇండ్లకు నీళ్లను యమునానదిలో నుండి తీసుకుని వెళుతూవుంటే,
రాళ్లను విసిరిచిల్లు పెట్టేవాడట. అలా ఆకుండ మానవశరీరము
అనుకుంటే ఆకుండలోని నీరు 'అహంకారం' ఆ
అహంకారం కారిపోతేనేగాని జీవికి ముక్తి లభించదని ఇలా వారి లీలలోని
అంతర్యాన్ని భాగవతోత్తములు వివరిస్తూ ఉంటారు.
ఇక చిన్న తనమునుండే అనేకమంది
రాక్షసులను సంహరిస్తూ దుష్టశిక్షణ శిష్టరక్షణ కావిస్తూ కురుపాండవ సంగ్రామములో అర్జునునకు రథసారధియై అర్జునిలో ఏర్పడిన అజ్నానందకారాన్ని తొలగించుటకు "విశ్వరూపాన్ని" చూపించి గీతను బోధించి, తద్వారా
మానవాళికి జ్నానామృతాన్ని ప్రసాదించాడు. ఇలా కృష్ణతత్త్వాన్ని కొనియాడి
చెప్పుటకు వేయితలలు కలిగిన ఆదిశేషునికే సాధ్యముకాదని చెప్పగా!ఇక మానవ మాత్రులము....మనమెంతో చెప్పండి? అట్టి శ్రీకృష్ణ భగవానుని
జ్నానబోధతో అందించిన 'గీతామృతం' మనకు ఆదర్శప్రాయం.
ఇంకా,
ప్రముఖ భాగవతోత్తములు మనకు అందించే సమాచారాన్ని
బట్టి యిప్పటికి సుమారు 30వ శతాబ్దమునకు పూర్వం
అంటే క్రీస్తు పూర్వం 3122లో ద్వారకా పట్టణమందు
కృష్ణభగవానుడు నిర్యాణము చెందినట్లు తెలియుచున్నది. నాటినుండే కలి ప్రవేశముతో "కలియుగం"
ఆరంభమైనదని చెప్తారు.
అట్టి
"గీతాచార్యుడు"
కృష్ణపరమాత్మ జన్మాష్టమినాడు సూర్యోదయమునకు పూర్వమే కాలకృత్యాలను తీర్చుకుని చల్లని నీటిలో "తులసీదళము" లను ఉంచి స్నానమాచరించిన
సమస్త పుణ్య తీర్థములలోను స్నానమాచరించిన
పుణ్యఫలాన్ని పొందుతారని, ఆరోజు సర్వులూ వారి
వారి గృహాలను ముత్యాల ముగ్గులతో, పచ్చని తోరణాలతో కృష్ణపాదాలను రంగవల్లికలతో తీర్చిదిద్ది ఆ కృష్ణ పరమాత్మను
ఆహ్వానం పలుకుతూ, ఊయలలో ఓ చిన్ని
కృష్ణుని ప్రతిమను వుంచి, రకరకాల పూలతో, గంథాక్షతలతో యధావిధిగా పూజించి, ధూపదీప నైవేద్యములతో ఆ స్వామిని ఆరాధించి
భక్తులకు తీర్థ ప్రసాదములు, దక్షిణ
తాంబూలములు సమర్పించుకొనుట ఎంతో మంచిదని చెప్పబడినది.
ఇంతేకాక చాలా చోట్ల కృష్ణపరమాత్మ
లీలల్లో ఒక లీలగా ఉట్టికుండ
కొట్టే కార్యక్రమం కూడా నిర్వహిస్తూ ఉంటారు.
కృష్ణ!
త్వదీయ పదపంకజ పంజర్తానం
అద్వైవమే
విశతు మానసరాజహంసః ||
ప్రాణ
ప్రయాణసమమే కఫవాత పిత్తై
కంఠావరోధనవిదే
స్మరణం కుతస్తౌ ||
ఓ కృష్ణా! మరణసమయాన నిన్ను స్మరించుచూ నీలో ఐక్యమవ్వాలని కోరిక
ఉన్నది కాని! ఆ వేళ
కఫవాత పైత్యములచే కంఠము మూతపడిపోయి నిన్ను
స్మరించగలనో! లేనో? అని తలచి
ఇప్పుడే నా 'మానస రాజవాస'
ను శతృఅబేధ్యమైన "నీపాద పద్మ వజ్రపంజర"
మందు ఉంచుతున్నాను తండ్రీ..!
ఇట్టి
పరమ పుణ్యదినమైన ఈ శ్రీకృష్ణ జన్మాష్టమినాడు
విశేషార్చనలు జరిపించుకుని కృష్ణభగవానుని ఆశీస్సులతో పునీతులమవుదాము.
జగన్నాటక
సూత్రధారిగా కీర్తి చెందిన శ్రీ కృష్ణ భగవానుడు
ఓ ఉత్తమ మంత్రాన్ని జపించి
తనకు కావలసిన వరాలను పొందినట్లు శివపురాణం చెబుతోంది.
పూర్వం
శ్రీ కృష్ణ భగవానుడు తనకు
కావలసిన కోరికలను సిద్ధింపజేసుకోవడం కోసం ముక్కంటిని తలచి
తపస్సు చేయాలనుకున్నాడు. వెంటనే హిమాలయ పర్వత ప్రాంతంలో ఉన్న
పరమశివభక్తుడైన ఉపమన్యు మహర్షి దగ్గరకు వెళ్ళి తన మనస్సులోని మాటను
చెప్పాడు.
అప్పుడు
ఆ మహర్షి అధర్వ వేద ఉపనిషత్తులోని
"నమశ్శివాయ" అనే పంచాక్షర మంత్రాన్ని
ఉపదేశించి, 16నెలల పాటు ఆ
మంత్రాన్ని జపిస్తూ తపస్సు చేయమన్నాడు.
ఇలా నమశ్శివాయ మంత్రముతో 16 నెలల పాటు తపస్సు
చేసి పార్వతీ పరమేశ్వరులను కృష్ణుడు ప్రత్యక్షం చేసుకున్నాడు. శ్రీ కృష్ణ తపస్సుకు
మెచ్చి పరమేశ్వరుడు ఏం వరాలు కావాలో?
కోరమంటాడు.
అప్పుడు
కృష్ణుడు తాను ఓ 8 వరాలను
కోరుకుంటానని చెప్పి వాటిని శివుడి ముందుంచాడు. అచంచలమైన గొప్పకీర్తి, స్థిరమైన శివసన్నిధి లభించాలి. నిత్యం శివధర్మంలో బుద్ధి నిలవాలి. నిత్యం తాను శివభక్తితో ఉండాలి.
శత్రువులంతా సంగ్రామంలో నశించాలి. ఎక్కడా శత్రువుల వల్ల తనకు అవమానం
కలుగకూడదు.
తనకు
తొలిగా జన్మించిన కుమారులకు ఒక్కొక్కరికి పదిమంది పుత్రులు కలగాలి. యోగులందరికీ తాను ప్రియుడు కావాలి.
ఈ వరాలను తనకిమ్మని కృష్ణుడు కోరగానే ముక్కంటి వాటినన్నింటిని అనుగ్రహిస్తాడు.
ఇదేవిధంగా
శ్రీ కృష్ణ పరమాత్మ చేసిన
తపస్సుకు పార్వతీదేవి సంతసించి కావలసినన్ని వరాలను కోరమని అడుగుతుంది. అప్పుడు కృష్ణుడు.. బ్రాహ్మణుల మీద ఎప్పటికీ ప్రజలకు
ద్వేషం కలగకూడదు. తన తల్లిదండ్రులు సర్వకాలాలలోను
సంతోషంగా ఉండాలి.
తానెక్కడ
ఉన్నా సర్వ ప్రాణుల మీద
తనకు అనురాగం కలగాలి. మంగళకరమైన బ్రాహ్మణ పూజను తాను సర్వదా
చేస్తుండాలి. తాను వంద యజ్ఞాలను
చేసి ఇంద్రుడు లాంటి దేవతలను సంతోష
పెట్టాలి.
తన గృహంలో ఎల్లప్పుడూ వేల సంఖ్యలో యతులకు,
అతిథులకు శ్రద్ధతో పవిత్రమైన భోజనాన్ని సమర్పించే అవకాశం కలగాలి. అలాగే తాను వేలసంఖ్యలో
భార్యలకు ప్రియమైన భర్త కావాలి. తనకు
వారంటే ఎప్పటికీ అనురాగం ఉండాలి.
వారి
తల్లిదండ్రులంతా లోకంలో సత్య వాక్యాలను పలుకుతూనే
ఉండాలి. అనే వరాలను కృష్ణుడు
శక్తిమాతను అడిగాడు. వాటిని శ్రీ కృష్ణుడికి వెంటనే
అనుగ్రహించి ఆ మరుక్షణంలోనే పార్వతీ
పరమేశ్వరులిద్దరు అంతర్ధానమయ్యారని శివపురాణం చెబుతోంది.
"నమశ్శివాయ"
మంత్రంచే కృష్ణుడు సిద్ధింప చేసుకున్న వరాలలో కొన్ని మాత్రమే ఆయనకు సంబంధించినవి. మిగతా
వరాలను పరిశీలిస్తే సమాజ శ్రేయస్సును దృష్టిలో
ఉంచుకుని కోరుకున్నవే అవుతాయి.
అందుచేత
శ్రీ కృష్ణ భగవానుడు కొంతవరకు
తమ స్వార్థాన్ని ఆకాంక్షిస్తూ వరాలు కోరినా.. ఎంతో
కొంత సామాజిక శ్రేయస్సును కూడా అభిలాషించాలన్న ఓ
ఉత్తమ ప్రబోధం ఈ కథలో కనిపిస్తుంది.
కృష్ణావతార౦ పూర్ణావతారంలో
చిన్నతనం నుంచి నేనే భగవంతుడిని, ధర్మాన్ని బోధించడానికి ఈ
అవతారంలో వచ్చాను అని చెప్పాడు. భగవద్గీతలో మనం ఒకటి గమనించవచ్చు. అర్జున ఉవాచ,
సంజయ ఉవాచ, ధృతరాష్ట్ర ఉవాచ అని ఉండి కృష్ణ ఉవాచకు బదులుగా భగవానువాచ
అని ఉంటుంది. దీనిని బట్టి మహా విష్ణు పరిపూర్ణావతారంగా కృష్ణావతారాన్ని
చెప్పవచ్చు. నేటి రోజులలో కూడా శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామి వారిని
పరమాచార్య, పెరియవా, నడిచే దేవుడు, అని అంటారు తప్ప ఆ
పేరుతో చెప్పరు. అది మనం ఆ వ్యక్తికి ఇచ్చే గౌరవమును తెలియచేస్తుంది. వైష్ణవులు ఈ
కృష్ణాష్టమిని లక్ష్మితో కూడినదిగా జరుపుకుంటారు.
మధుర కారాగృహములో కృష్ణుడు
జన్మించాడు. ద్వారకలోని గోకులంలో నందుని ఇంట పెరిగి ద్వాదశ జ్యోతిర్లి౦గమైన
సోమనాధకు దగ్గరలోని ప్రతాప్ ఘర్ లో ముక్తిని పొందాడు. పూతన, శకటాసుర, వంటి రాక్షసులను సంహరించి,
పదునాలుగు భువనములను, తనను, ఆమెను తన నోట తల్లియైన
యశోదకు చూపి తన ఆధిపత్యాన్ని చాటుకున్నారు. బ్రహ్మదేవుడు గోవులను బంధించిన సమయంలో
ఆయా లేగ దూడల, గోప బాలుర ఆకారాలు తానే
ధరించి అన్నీ తానె అయి ఆ లీలా గోపాల బాలుడు తమ గోకులానికి తిరిగి బయలు దేరాడు. తన
విశ్వరూపాన్ని పలు సందర్భాలలో చూపినప్పటికీ, ప్రత్యేకించి అర్జునునకు కురుక్షేత్ర సంగ్రామంలో చూపి
భగవద్గీతను జగతికి అందించిన మహానుభావుడు శ్రీకృష్ణుడు.
అర్ధరాత్రి సమయంలో పుట్టడం
వల్ల మానవులలోని అజ్ఞానాన్ని, అష్టమి నవమి తిధులు మంచివి
కావు అనే అభిప్రాయాన్ని పోగొట్టడానికి అష్టమి తిథిన కృష్ణునిగా, నవమి తిధిన శ్రీరామ చంద్రునిగా జన్మించాడు. ఎంతోమంది
మహర్షులు, గొప్ప భక్తులు బాలకృష్ణుని
లీలలు చూసి ఆనందించారు. అటువంటి బాలకృష్ణుని పై మనకు కృష్ణ లీలా తరంగిణి, కృష్ణ కర్ణామృతం వంటి స్తోత్రములు ఉన్నాయి. తమిళంలో కూడా
పాపనాశం శివన్, సుబ్రహ్మణ్య భారతి ఉడుమలై
నారాయణ కవి మొదలైన వారు చాలా గీతాలను రచిచి పిన్నలనుండి పెద్దల వరకు మంత్ర
ముగ్ధులను చేశారు.అటువంటి కృష్ణుని ఈరోజు అందరూ ఆరాధించి ఆయురారోగ్య
ఐశ్వర్యాభివృద్ధిని పొందాలని కోరుకుంటున్నాము.