ఆకాశగంగ, పాపనాశము, చక్రతీర్థములు (తీర్థమహిమలు)
ఆకాశగంగ
ఇది శ్రీవారి
ఆలయానికి ఉత్తరదిశలో సుమారు 3 కిలోమీటర్ల
దూరంలో ఉంది. ఇక్కడే ఒక పుష్కరం పాటు అంజనాదేవి తపస్సుచేసి, ఆంజనేయుని గర్భాన ధరించిందని భావన. ప్రతినిత్యం
స్వామివారి అభిషేకానికి మూడు రజత పాత్రలనిండా ఆకాశతీర్థాన్ని తిరుమల నంబి
వంశస్తులు తేవడం సంప్రదాయం.
పూర్వము గోదావరీ
తీరములో నొక అగ్రహారము గలదు. ఆ యగ్రహారమున నొక బ్రాహ్మణుడుండెను. అతడు వేదములను
చదివినవాడు. గొప్పజ్ఞాని, సత్యవంతుడు.
అతిథి పూజలు భక్తితో చేసేవాడు. భూతదయ కలవాడు. నిరతాగ్నిహోత్రము గలవాడు, అతని పేరు కేశవబట్టు.
ఇట్లుండ ఒకనాడు ఆ
కేశవభట్టు గృహంబునకు మరొక బ్రాహ్మణుడు వచ్చెను. ఆ బ్రాహ్మణుడు కూడా చక్కగా వేదము
చదివినవాడు. ఆ రోజు కేశవభట్టు తండ్రి తద్దినము. కేశవభట్టు ఆ వచ్చిన బ్రాహ్మణునే
బ్రాహ్మణార్థమునకు నియమించి శ్రాద్ధము పూర్తిగావించెను. తరువాత కేశవభట్టునకు
శరీరమంతా వికృతాకారము అయి క్రమముగా ముఖము గాడిద రూపమువచ్చెను. ఆ బ్రాహ్మణుడు
దిగులుపడి సువర్ణముఖి నదీతీరము జేరి అచ్చట అగస్త్య మహాముని ఆశ్రమము చేరి అతనికి
నమస్కరించి తన బాధ మనవి చేసుకుని అదిపోవు మార్గము దెల్పుమని కోరెను.
అగస్త్యముని
యోగదృష్టిరో జూచి యిట్లనెను. "బ్రాహ్మణుడా! నీ కీ కర్మవచ్చుటకు కారణమేమనగా మీ
తండ్రి శ్రాద్దమునాడు సంతానములేని వానిని బ్రాహ్మణార్థముగా నియమించితివి గనుక నీకీ
గాడిద ముఖము కల్గినది. కనుక నీవు శ్రీవేంకటాచల క్షేత్రమునకు బోయి అందు పవిత్రమైన
ఆకాశగంగలో మునుగుము. నీకు గలిగిన యీవికృతరూపము నశించును" అని చెప్పెను.
కేశవభట్టు వేంకటాచలము జేరి ఆకాశగంగలో మునిగి తన యెప్పటిరూపమును పొందెను.
పాపనాశ తీర్థము
ఇది శ్రీవారి
ఆలయానికి ఉత్తరదిశలో 5 కిలోమీటర్ల
దూరంలో ఉంది. ఆశ్వీయుజమాసంలో శుక్లసప్తమి రోజున ఉత్తరాషాఢ నక్షత్రం ఉన్న
ఆదివారంనాడు ఇక్కడ నీట మునిగి, పవిత్రస్నానం
చేయటం పరమపావనమని బ్రహ్మపురాణం, నాలుగో అధ్యాయం
పేర్కొంటోంది.
పూర్వకాలమున
భద్రమతి అను బ్రాహ్మణుడుండెను. అతడు వేదము చదువుకొన్న వాడు అతనికి ఆరుగురు
భార్యలుండిరి. ఆభార్యలయందు అందరికీ సంతానము కలిగెను. ఇంటిలో యెక్కడ చూచిననూ యీ
పిల్లల గుంపులతోనే నిండిపోయెను. అతడు సాధారణమైన సంసారి అతనికి వచ్చు ఆదాయము
సంసారమునకు చాలకపోయెను. దరిద్రము మిక్కుటమయ్యెను. భార్యలూ, పిల్లలూ బాధించుచుండిరి. దరిద్రబాధతో మ్రగ్గి ఆ
బ్రాహ్మణుడు కృశించుచుండెను.
ఆ బ్రాహ్మణుని
భార్యలలో యశోవతియను కాంత భర్తవిచారము చూచి యిట్లనెను. "నాథా! అన్ని దానములలో
భూదానము చేయువారికి మహదైశ్వర్యములు లభించునందురు. "వేంకటాచలమున గల పాపనాశ
తీర్థములో స్నానమొనర్చి భూదానము చేసినవారికి సమస్తభోగములూ కలగును. యిహపరసుఖములు
గల్గును. సకల పాపములు హరించును" అని పూర్వము మా తండ్రికి నారదముని చెప్పగా
విన్నాను. మీరు అట్లు చేయవలసినది" అని చెప్పెను.
ఆ బ్రాహ్మణుడు
భార్యమాటలు విని వెంటనే సమీపముననున్న ఒక అగ్రహారమునకు బోయి ఒక గృహస్థువలన ఐదు
చేతులు కొలతగల భూమిని తానుదానము పొంది అక్కడనుండి వేంకటాచలము జేరి పాపనాశతీర్థమున
స్నానమాడి స్వామిని సేవించి తాను దానముగా సంపాదించిన అయిదుచేతులు పరిమితమైన భూమిని
వేరొక బ్రాహ్మణునకు దానము యిచ్చెను.
పాపనాశనమున చేసిన
భూదానమునకు భగవంతుడు ప్రత్యక్షమై సకలమైన భాగ్యములు ప్రసాదించెను.
చక్రతీర్థము
పద్మనాభుడు అను
ఒక భక్తుడు సంసార సౌఖ్యములు విడిచి వేంకటాచలమున ఒక తీర్థము వద్ద పర్ణశాల వేసుకుని
తపస్సు చేస్తున్నాడు. అతడు కొన్నాళ్ళు కందమూలములు తిన్నాడు. కొన్నాళ్ళు ఆకులు
తిన్నాడు. కొన్నాళ్ళు నీళ్ళుత్రాగి , కొన్నాళ్ళు కేవలం గాలినే పీల్చుకుని భక్తితో తపస్సు చేశాడు.
ఆతని భక్తికి
మెచ్చి శ్రీవేంకటేశ్వరుడు ప్రత్యక్షమైనాడు. ఆ భక్తుడు స్వామిని అనేక విధముల
ప్రార్థించగా స్వామి సంతోషించి, "నీకేమి కావలెనో కోరుకొను" మనెను. ఆ మాటవిని ఆ భక్తుడు "స్వామీ! నాకే
కోరికలూ లేవు. బ్రతికినన్నాళ్లు మిమ్ము గూర్చి తపస్సు చేయుచు ఉండునట్లు
అనుగ్రహింపు" మనెను. స్వామి అట్లే యనెను.
పద్మనాభుడు యిలా
తపస్సు చేయుచుండగా ఒకనాడొక రాక్షసుడు ఆకలిబాధతో భక్తుని మిరంగుటకు వచ్చెను.
పద్మనాభుడు భయపడ భగవంతుని ప్రార్థించి రక్షింపుమని కోరెను.
దయామయుడు,
భక్తరక్షకుడు, ఆశ్రితోద్ధారుడైన వేంకటేశ్వరుడు తన భక్తుని
మొరవిని వెంటనే చక్రమును పంపెను. ఆచక్రము వచ్చి రాక్షసుని కంఠము ద్రించి భక్తుని
రక్షించెను. ఆనాటి నుండి ఆ తీర్థమునకు "చక్రతీర్థము" అని పేరు కల్గెను.