దసరా - సరన్నవరాత్రులు ప్రాశస్త్యం

దశరాత్రులు అంటే పది రాత్రులు అని అర్ధం. ఈ దశ రాత్రులు అనే పదం రూపాంతరం చెంది దసరా అని వ్యవహరించబడుతోంది.
ఈ పండుగ శరత్కాలంలో వస్తుంది , కాబట్టి ' శరన్నవరాత్రులు' అని కూడా అంటారు. శరన్నవరాత్రులు అనగా తొమ్మిది రోజులు.
చివరి రోజూఅయిన ' దశమి ' తిధితో కలుపుకొని మొత్తం పది రోజులు కలిసి దసరా పండుగ అవుతుంది.
పవిత్రమైన ఈ పుణ్య దినము నాడు ( ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి నవమి + దశమి ) దాకా అమ్మవారిని ప్రత్యేకముగా పూజిస్తాము. కాబట్టి వీటిని "దేవి నవరాత్రులు" అని కూడా అంటారు.
ఈ నవరాత్రులలో అమ్మవారిని పూజిస్తే చాలా విశేషమైన ఫలితం మనకి లభిస్తుంది. 
ఈ విషయము ఈ క్రింద శ్లోకములో ఇలా చెప్పబడింది. 
దుర్లభం సర్వజంతునామ్
దేవిపూజా ఫలాధికా
దుర్గా ,లక్ష్మీ మహాదెవ్యహ:
పూజనీయ: ప్రయత్నత:
ఆశ్వయుజాస్మీ సమ్ప్రాప్త్యె
ప్రతిపచ్చుభవాసరే
తధారభ్య ప్రయత్నెన
నవరాత్రి పూజయెత్

అనగా అత్యంత పుణ్య ప్రదమైన ఈ శరన్నవరాత్రుల్లో దేవికి చేసే పూజా ఎంతో పుణ్యఫలాన్ని ఇస్తుంది.
ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి శుద్ధ నవమి దాకా దుర్గ,లక్ష్మీ , సరస్వతీ స్వరూపిణీ అయిన దేవి పూజ ను మోక్షం కోరెవారంతా చెయ్యాలని చెప్పటం జరుగుతోంది.
ఇలాగ తొమ్మిది రోజులు అమ్మవారిని పూజించలేని వారు , కనీసం ముఖ్యమైన నాలుగు రోజులు ఆ తల్లిని పూజిస్తే పూర్తి అనుగ్రహాన్ని పొందుతారు.
నవరాత్రుల్లో ముఖ్యమైన నాలుగు రోజులు.....

* మూలా నక్షత్రము : ఇది అమ్మవారి జన్మ నక్షత్రము, కాబట్టి ఆ రోజున తల్లిని మహా సరస్వతిగా భావించి ఆర్చించుకోవాలి.

* దుర్గాష్టమి : దుర్గమాసుర సంహారం చేసిన రోజు కాబట్టి దుర్గా దేవిగా తల్లిని అష్టమి తిధి నాడు పూజించాలి.

* మహర్నవమి : లోక కాంటకుడైన మహీషాసురుణ్ణి వధించిన జనని మహిషమర్దిని గా వెలసిన రోజు కావున నవమి తిధి నాడు దుర్గమ్మని మహిషాసురమర్దినీ దేవిగా అర్చిచించుకోవాలి.

ఇదే రోజు ఆయుధ పూజ కూడా చేసుకోవాలి.
ఇక చివరిది "విజయదశమి"

విజయ దశమి విశిష్టత : దేవి నవరాత్రుల్లో ఆఖరి రోజు దశమి అదే విజయదశమి.

ఆశ్వనశ్యసితే పక్షే దశమ్యాంతరకోదాయే
సకాలో విజయోనామ సర్వకామార్ధ సాధకః

అంటే, ఆశ్వయుజమాసంలో శుక్లపక్షంలో వచ్చే దశమి తిధి రోజు నక్షత్ర దర్శన కాలం (సాయంత్రం) ఏదైతే ఉందో, ఆ కాలానికి విజయము అని పేరు. మన కోర్కెలని తీర్చి అన్ని పనుల్లో విజయాన్ని ప్రసాదించే ఆ కాలం పేరు మీదుగానే దశమి తిధి కి "విజయ దశమి" అనే పేరు వచ్చిందని పండితులు అంటారు.
ఈ దశమి తిధికి విజయదశమి అనే పేరు రావటానికి మరొకకార్ణం కూడా ఉందని విజ్ఞలు చెప్తారు.

ఆదిశక్తి స్వరూపిణి అయిన దుర్గా దేవి చండీరూపములో నవమి తిధి రోజు మహిషాసురుణ్ణి వధించింది, కాబట్టి దాన్ని మహర్నవమిగాను,తచ్చిహ్నంగా విజయోత్సవం జరుపుకుంది. మరూనాటి దశమి రోజు కాబట్టి ఆ దశమి , విజయదశమి అని ప్రసిద్ధ పొందటం జరిగింది.

దశమ్యాంతునరైస్సమ్యక్పుజానీయపరాజితా
క్షేమార్ధం విజయార్ధంచకాలే విజయనామకే

ఈ విజయదశమి రోజు విజయకాలం లో అంటే సాయంకాలంలో , తమకి, తమ కుటుంబానికి క్షేమం కలగాలని , తమ పనుల్లో విజయం లభించాలని కోరుకునే వారంతా, 'అపరాజిత' దేవిని పూజించాలని పూరాణంలో చెప్పబడింది. దాని ప్రకారం ఉత్తరభారత దేశంలో విజయ దశమి నాడు అమ్మవార్నీ అపరాజిత దేవిగా కోలుస్తారు.

" అపరాజిత" అంటే పరాజయం లేనిది, నిత్యవిజయరూపిణీ అని అర్ధం.
ఈ విధముగా దశమికి విజయదశమి అనే పేరు వచ్చిందని పండితులంటారు.

ఇంకా చెప్పాలంటే , కల్పతరమ్ లో విష్ణుమూర్తి, త్రేతాయుగం లో శ్రీ రామ చంద్రుడు, ద్వాపరయుగం లో అర్జునుడు ఈ విజయదశమి నాడే విజయాల్ని సాధించారు.