గంగావతరణం
శ్రీ రామాయణంలో బాలకాండలో శ్రీ రాముడు తాటక సంహారం చేశాక విశ్వమిత్రుడు, రామలక్ష్మణులు శొణా నది తీరం వెంబడి వెళ్తుండగా రాముడు గంగా ఎలా అవతరించిందో చెప్పమని మహర్షిని వేడుకున్నాడు. రాముడికి విశ్వమిత్ర మహర్షి గంగ ఎలా అవతరించిందో సంక్షిప్తంగా చెప్పినా, రాముడు సంతృప్తి చెందక మళ్ళీమళ్ళీ అడిగాడు. తనకు గంగావతరణ ఘట్టం సవివరంగా చెప్పమని ప్రార్ధించాడు శ్రీ రామచంద్రుడు. గంగా ఎలా అవతరించింది, గంగకు "త్రిపధగ" అనే పేరు ఎలా వచ్చిందో చెప్పమని విశ్వామిత్రుడి పాదాలు పట్టుకుని వేడుకోగా, రాముడి ఆతృతకు, తెలుసుకోవాలన్నా తపనకు చలించిపోయిన విశ్వామిత్ర మహర్షి గంగావతరణం గురించి చెప్పారు.
విశ్వమిత్ర మహర్షి దానిని రెండు భాగాలుగా రామాయణంలోని రెండు ప్రక్కప్రక్క సర్గలలో చెప్పారు. మొదటి భాగంలో స్కందోద్పత్తి(సుబ్రహ్మణ్య స్వామి జననం)లో కొంచం చెప్పారు.
హిమవంతుడు(హిమాలయ పర్వతరాజు)కు మేరువు అనే పర్వతం యొక్క కూమార్తే అయిన 'మనోరమ ' భార్య. వారికి ఇద్దరు కూతుర్లు. పెద్ద కూమార్తె గంగా, రెండవ కూమార్తె ఉమ(పార్వతి).
ఉమ పరమశివుడి గురించి ఘోరమైన తపస్సుచేసి ఆయన్ను వివాహం చేసుకుంది. దేవతకార్యముల కొరకు మాకు మీ పెద్ద కూతురు గంగా కావాలి అని దేవతలు అడుగగా, హిమవంతుడు అంగీకరించి పెద్ద కూమార్తె గంగను దేవతలతో దేవలోకానికి పంపించాడు. దేవతలే గంగను దేవలోకానికి తీసుకుని వేళ్ళారు. అందువల్ల దేవలోకంలో ప్రవహిస్తూండేది గంగ. ఆ సమయానికి భూమి మీద కాని, రసాతలంలో కాని గంగా ప్రవహించేది కాదు. అటువంటి సమయంలో ఒక విచిత్రమైన పరిస్థితి ఏర్పడింది.
ఆ సమయంలో ఆయోధ్య నగరాన్ని సగరుడనే ఒక మహారాజు పరిపాలిస్తూండేవాడు.ఆయన పేరు సగరుడు అంటే విషాన్ని తన శరీరంలో కలిగి ఉన్న వాడని అర్ధం. ఆయన తండ్రి అసితుడు. ఆయనకు ఇద్దరు భార్యలు. ఆయన తన భార్యలతో కలిసి హిమాలయ పర్వతాలలో భృగు ప్రశ్రమణము అనే పర్వతం వద్ద తపస్సు చేయడానికి వెళ్ళిన సమయంలో ఆయన భార్యలిద్దరూ గర్భవతులయ్యారు. రెండవ భార్యకు పిల్లలు కలుగకూడదనే ఆలోచనతో మొదటి భార్య విషాన్ని పెట్టింది. ఆ విషయం తెలుసుకున్న రెండవ భార్య భృగుమహర్షి వద్దకు వెళ్ళి తన కడుపులో పెరుగుతున్న పిండాన్ని కాపాడమని వేడుకుంది. భృగుమహర్షి మహ తపశ్శక్తి సంపన్నుడు, త్రికాలవేది కనుక ఆయన జరిగినది మొత్తం తన యోగ దృష్టితో గ్రహించాడు. పుట్టేవాడు గొప్పవాడవుతాడని ఆశీర్వదించి, తన శరీరంలో విషం కలిగి పుడతాడు కనుక సగరుడవుతాడని చెప్పాడు.
అటువంటి సగరుడికి ఇద్దరు భార్యలు. మొడటి భార్య పేరు కేశిని. ఆమె ధర్మం తెలిసినది, ధర్మాన్నే ఆచరించేటువంటి లక్షణం కలిగినది, పతివ్రత, మహాసాద్వి. రెండవ భార్య పేరు సుమతి. మంచి సౌందర్య రాశి.ఈమె గరుత్మంతుడి చెల్లెలు. మొదటి భార్యది అంతః సౌందర్యం, రెండవ భార్యది బాహ్య సౌందర్యం.
ఇద్దరు భార్యలు ఉన్నప్పటికి సగర చక్రవర్తికి సంతానం కలుగలేదు. కొంతకాలం పాటు సగర చక్రవత్రి, ఆయన భార్యలు సంతోషంతో కాలం గడిపినా, కాలక్రమంలో వారికి సంతానం లేదన్న భాధ మొదలైంది. వంశం నిలబదన్న దుఖం కలిగింది. ఆ కాలంలో ఏదినా సమస్య వస్తే వెంటనే పెద్దలైనవారు, ఋషులు, గురువుల వద్దకు వెళ్ళేవారు. అందువల్ల సగర చక్రవర్తి బృగు ప్రశ్రమణానికి వెళ్ళి నూరు సంవత్సరముల పాటు కఠోరమైన తపస్సు చేశాడు. ఆయన తపస్సుకు ప్రీతి చెందిన భృగుమహర్షి సగర చక్రవర్తి వద్దకు వచ్చి, నీవు గొప్ప కీర్తిమంతుడవు అవుతావు, నీ ఇద్దరు భార్యలలో ఒకరికి వంశకరుడు ( వంశాన్ని నిలబెట్టేవాడు/వంశ వృద్ధిని చేసేవాడు ) అయిన కూమారుడు జన్మిస్తాడు. మరొక భార్యకు మహా ఉత్సాహవంతులైన 60,000 మంది కూమారులు జన్మిస్తారు అని ఆశీర్వదించాడు భృగు మహర్షి.
ఎవరికి వంశకరుడు జన్మిస్తాడు, ఎవరికి 60,000 మంది కూమారులి జన్మిస్తారో చెప్పలేదు.రాణూలిద్దరికి కుతూహలం పెరిపోయింది. అది తట్టుకోలేక, ఎవరికి వంశకరుడు జన్మిస్తాడో, ఎవరికి 60,000 మంది జన్మిస్తారో తెలుసుకోవడానికి భృగు మహర్షి వద్దకు వెళ్ళారు.