గంగావతరణం(6)
నీటి ప్రవాహానికి అడ్డువచ్చిన మహామహా వృక్షాలే నేలకొరుగుతాయి. భగీరథుని రథం జహ్ను మహర్షి ఆశ్రమం పక్క నుండి వెళ్ళింది. గంగ కూడా జహ్నుమహర్షి ఆశ్రమం పక్కనుండి వెళ్ళింది. గంగాప్రవాహంలో జహ్నుమహర్షి ఆశ్రమం కొట్టుకుపోయింది. ఆగ్రహించిన జహ్నుమహర్షి గంగను అరచేతిలోకి తీసుకుని త్రాగేశారు. ఎంతో తపస్సు చేయడం వలన మహర్షులకు అంత శక్తి ఉంటుంది. ఇంద్రుడు మొదలైన దేవతల కంటే శక్తిమంతులవుతారు.
గంగా ప్రవాహ శబ్దం ఒక్కసారి ఆగిపోవడంతో భగీరథుడు వెనక్కి తిరిగి చూసి అవాక్కయ్యాడు. వెంటనే జహ్నుమహర్షి ఆశ్రమానికి వచ్చేశారు. గంగలో స్నానం చేస్తున్న దేవతలందరూ ఒక్కసారిగా జరిగిన పరిణామానికి హడలిపోయి వారు కూడా మహర్షి ఆశ్రమానికి చేరుకున్నారు. ఎంతో తపస్సు చేసి, నా పితృదేవతల కోసం గంగను భూమికి తీసుకువస్తే మీరు త్రాగేశారు, వారికి ఉత్తమగతులు కలగాలంటే గంగనది వారి భస్మరాశుల మీద నుండి ప్రవహించాలి అని భగీరథుడు అన్నాడు. దేవతలు కూడా ఆయన ఎంతో తపస్సు చేసి గంగను భూమి తెచ్చారు, చెత్తడం నీటి ధర్మం, మీరు శాంతించి గంగను విడిచిపెట్టండి అన్నారు.
ఎవరైనా తమకు అపకారం చేస్తే, ఉత్తములకు అపకారం చేసినవారి యెడల కోపం ఒక క్షణం మాత్రమే ఉంటుంది. మధ్యములకు రెండు ఘడియల కాలం కోపం ఉంటుంది. అధములకు ఒక రోజంతా కోపం ఉంటుంది, కానీ పాపిష్టివాళ్ళకు మాత్రం మరణం వరకు కోపం ఉంటుంది. అని శాస్త్రం అంటొంది. మహానుభావుడు జహ్ను మహర్షి ఉత్తముడు కనుక ఆయన వెంటనే శాంతించి, భగీరథ నీ కోసం గంగను విడిచిపెట్టెస్తున్నాను అన్నాడు. గంగను తన కుడి చెవిలోనుండి విడిచిపెట్టాడు. జహ్ను మహర్షి చెవి నుండి పుట్టింది కనుక గంగకు జాహ్నవి అని పేరు.
మళ్ళీ భగీరథుడు రథం ఎక్కి ముందుకు కదిలాడు, గంగ ఆయన రథాన్ని అనుసరించింది. మళ్ళి గంగలోకి దిగి స్నానం చేసే వాళ్ళు స్నానాలు చేశారు. చివరకు భగీరథుడు తన రథాన్ని పాతాళ లోకంలో తన పితృదేవతల భస్మరాశులున్న ప్రాంతానికి తీసుకువెళ్ళాడు. గంగ ఆ 60,000 మంది బూడిదకుప్పల మీద నుండి ప్రవహించగానే వాళ్ళందరికి ముక్తి లభించి వాళ్ళ ఆత్మలు స్వర్గలోకాలకు వెళ్ళిపోయాయి.
వెంటనే బ్రహ్మ దేవుడు వచ్చి నీవు చేసిన తపస్సు వల్ల గంగ భూమికి వచ్చి, వారి భస్మరాశుల మీద నుండి ప్రవహించింది. ఈ భూమి మీద సముద్రములలో నీరు ఉన్నంతకాలం సగరులు స్వర్గలోకంలో ఉంటారని వరమిచ్చాడు.
ఈ గంగ దేవలోకంలో మందాకిని అని పేరుతోనూ,భూలోకానికి నువ్వు కష్టపడి తీసుకువచ్చావు కనుక భాగీరథి అని పిలువబడుతుంది, పాతాళంలో భోగవతిగాను ప్రసిద్ధికెక్కుతుందని బ్రహ్మదేవుడు భగీరథునితో పలికాడు. దీన్ని ఉద్యేశించే గంగకు త్రిపధగ అనే పేరు వచ్చింది. త్రిపధగ అంటే మూడులోకాల్లో ప్రవహించేదని అర్దం.
శివుడు గంగను విడిచిపెట్టినప్పుడు గంగ 7 పాయలుగా విడిపోయింది. అందులో మూడుపాయలు తూర్పు దిక్కుకు వెళ్ళిపోయాయి. వాటికి లాధిని, నళిని, పాధిని అని పేర్లు. మూదు పాయలు పశ్చిమదిక్కుకు వెళ్ళిపోయాయి. సుచక్షువు, సీత, సింధువు అని ఆ 3 పిలువబడుతున్నాయి. మిగిలిన పాయ భగీరథుని వెనుకాల వెళ్ళింది. అదే భాగీరథి. రామాయణంలో చాలా తక్కువ సంఘటనలకు మాత్రమే ఫలశృతి చెప్పారు వాల్మీకి మహర్షి.
ఫలశ్రుతి
ఈ గంగావతరణాన్ని ఎవరు వింటారో, చదువుతారో, చెప్తారో, పరమశివుడి తలమీద గంగపడుతున్నట్టుగా ఉన్న చిత్రానికి ఎవరు నమస్కరిస్తారో, గంగావతరణాన్ని మనసులో ధ్యానం చేస్తారో, ఇది ఇలా జరిగిందా? అన్న సందేహం లేకుండా మొత్తం కధను మనసులో ఊహించుకుంటారో, అటువంటి వారికి ఇంతకముందున్న పాపరాశి దగ్ధమవుతుందని, సమస్త దేవతల యొక్క అనుగ్రహం కలుగుతుందని, విశేషంగా శివుని అనుగ్రహం కలుగుతుందని, కోరుకున్న కోరికలే తీరుతాయని, వారికి సర్వవిధ శ్రేయస్సు కలుగుతుందని ఈ గంగావతరణ ఘట్టానికి వాల్మీకి మహర్షి ఫలశృతి చెప్పారు.
ఇటువంటి పరమపవిత్రమైన గంగావతరణాన్ని సోమవారం నాడు పూర్తిచేయడం మరింత పుణ్యప్రదమైనది.
రామాయణం మనకిస్తున్న సందేశం ఏమిటి?
ఎన్నో వేల సంవత్సరాలు తపస్సు చేశాడు భగీరథుడు. తన కోసం కాదు, తన పితృదేవతలను ఉద్దరించడానికి. మనం రామాయణానికి వారసులం, మనం మన తల్లిదండ్రులను నిరంతరం, ముఖ్యంగా పెద్దవయసులో చూసుకోవాలి, వారికి ఆ సమయంలో కావలసినవి ప్రేమలే. వారిని వృద్ధాశ్రమాల్లో పడేయడం, సూటిపోటి మాటలనడం, భారంగా భావించడం లాంటివి చేయకూడదు. కాలక్రమంలో వారు మరణిస్తే వారికి చేసే శ్రాద్ధకర్మ తప్పకుండా ప్రతి సంవత్సరం చేయాలి. అలాగైన మనం వారి జ్ఞాపకాలతో ఒక్క రోజైనా గడుపుతాం. మన తల్లిదండ్రులు, తాతముత్తాతల గురించి ఆ రోజైన మన పిల్లలకు తెలుస్తుంది.
పర్యావరణాన్ని, ప్రకృతిని, భూమాతను కాపాడుకోవాలి. సాక్షాత్ బ్రహ్మదేవుడే ఈ గంగావతరణంలో చెప్పిన మాటలు గుర్తుపెట్టుకుని భూమాతను భూతాపం నుండి రక్షించాలి. నదులు పవిత్రమైనవి. మనకు తల్లితో సమానం. అందుకే వాటిని కలుషితం చేయకూడదు. హిందూ ధర్మాన్నే ఆచరించండి. " స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః ", హిందువుగా జీవించండి. హిందువుగానే మరణించండి.
ఇందులో అతికొద్ది భాగంతప్ప మిగితాది మొత్తం పూజ్య గురువులు బ్రహ్మ శ్రీ చాగంటి కోటేశ్వర రావు గారి గంగావతరణం ప్రవచనం విని వ్రాసినదే.