ఆద్యాత్మిక సాధన మార్గం లో ఉన్నతమైనది,సులువైనది, ఎ విదముగా పొందగలిగినది నమస్తే,




చాలా గడ్డు ప్రశ్నే వేశారు! మొత్తం ఆధ్యాత్మిక జీవన లక్ష్యాలను, మార్గాలను గురించిన ప్రశ్నలను ఒక్క ప్రశ్నలొ ఇమడ్చారు. 

గురువుగారి మరియు ఇతర పెద్దల సాంగత్యం వలన, వారు చెప్పిన ఎన్నో విషయాలలోని నాకర్థమైన కొంతదాన్ని ఇక్కడ పొందుపరుస్తున్నాను.

అన్నిటికన్నా ఉత్తమమైన మానవ జన్మ పొందడము సామాన్యము కాదు, మానవ జన్మ దుర్లభమని మన శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. కాని మానవ జన్మ మన పూర్వ జన్మలలో చేసిన పాప పుణ్యఫలము, కాని అదే ఆ అన్ని జన్మలకీ ఫలము కాదు. ఇది ఎలా ఉంటుందంటే, మౌఖిక, పరీక్షలు, నెలవారి పరీక్షలు, త్రైమాసిక పరీక్షలు వగైరాలు దాటి చిట్ట చివరి పరీక్షకు అర్హత సంపాదించినట్టు, అన్ని జన్మలూ దాటి జీవుడు ఈ మానవ జన్మ పొందుతాడు. 

అసలు సమస్య అంతా ఇక్కడే! ఇక్కడిదాకా వచ్చాకే! అఙ్ఞానం వల్ల అసలు ఈ జన్మలోకి ఎందుకు వచ్చాడో మర్చిపోయి ఇతర విషయాలపై ఆసక్తి పెంచుకుంటాడు. అసలు పరీక్షగురించి (జన్మ ప్రయోజనాన్ని) మర్చిపోతాడు. దీంట్లో ఉత్తీర్ణుడు కాకపోతే మళ్ళీ అదే తరగతి మళ్ళీ మౌఖిక, పరీక్షలు, నెలవారి పరీక్షలు, త్రైమాసిక పరీక్షలు వగైరాలు అన్నీ మొదలు.

ఉత్తీర్ణతపొందడమంటే.. పండిపోవడం.. అదే ఇంకో జన్మ లేకుండా చేసుకోవడం.. అదే పునరావృత్తిరహిత శాశ్వత శివ సాయుజ్య స్థితి కి చేరుకోవడం. 

ఇదే ఆధ్యాత్మిక సాధనలో చిట్ట చివరి ప్రయోజనం. అది ఎలా అంటే, భక్తి చే ఙ్ఞానమును పొంది
వైరాగ్యముపెంపుచేసుకొని అసలువస్తువును తెలుసుకోవటమే పునరావృత్తిరహిత శాశ్వత శివ సాయుజ్య స్థితి. అసలు వస్తువైన ఆత్మ యొక్క యెరుక తెలుసుకొని ఆత్మానుభవమును పొంది అంతటా ఉన్నది ఆ ఆత్మయే అని ఆత్వ ద్వారా ఆ పరమాత్మలో లీనమైపోవడమే ఈ జన్మ ప్రయోజనం అదే ఉన్నతమైనది. అదికాక ఇంకొక ప్రయోజనం ఆధ్యాత్మిక సాధన మార్గంలో ఉన్నది అని నేను అనుక్కోవట్లేదు ( గురువుగారు కూడా ఎప్పుడు ఇదే చెపుతారు). 

అది సాధించే నేపధ్యంలో అనుషంగిక ప్రయోజనాలు ఏవైనా చేకూరవచ్చుగాక (ఉదా: ధనం, ఐశ్వర్యం, పేరు ప్రతిష్టలు, కుటుంబ వృద్ధి, పిల్లలు పెళ్ళిళ్ళు వంటివి, అంతకన్నా అష్టసిద్ధుల వంటివి పొందవచ్చునేమో), కాని వాటితో తన్మయత్వం చెందక చిట్టచివరి ప్రయోజనమైన
ఆత్మానుభవమును పొందటమే ఉన్నతమైన లక్ష్యం.

ఇదిపొందటానికి సులువైన మార్గం వైదికధర్మావలంబనమే, నీ ధర్మంలో నువ్వు ఉంటూ నీ కర్తవ్యాలని నెరవేర్చటమే సులువైనది. అందునా గృహస్థు సంసారంలో ఉంటూ తన ధర్మాన్ని తాను ఆచరించి భగవత్కైంకర్యం చేస్తూ ఉండాలి. భక్తితో కూడిన కర్మాచరణముచే ఙ్ఞానసముపార్జవైపు అడుగులిడి వైరాగ్యమును పెంపొందించుకుంటూ తుట్టతుద జీవిత లక్ష్యాన్ని చేరుకోవాలి.

ఇంకా విపులంగా చెప్పాలంటే, ఏది చేసినా భక్తితో భగవంతునికి సమర్పణ భావంతో మెలగటం. అలా చేయగా చేయగా ఒకనాడు ఆ భగవంతుడే చిట్ట చివరి లక్ష్యానికి చేరుకోవడానికి కావల్సిన సంబారములను చేకూర్చడానికి తానే ఒక మహానుభావుని రూపంలో కావలసిన ఉపదేశం చేస్తాడు ( ఉపదేశం అనేది, బోధ కావచ్చు, మరింకేదైనా కావచ్చు అది ఇలాగే ఉండాలని, ఒక పద్ధతిలోనే ఉండాలని చెప్పటం కష్టమే).

గురువుగారు లలితా సహస్ర వ్యాఖ్యానాంతర్గతంగా ఒక సుత్రాన్ని తెలిపారు. నీవు ఏదైనా పని చేసేటప్పుడు నీకు నువ్వు ఒక ప్రశ్న వేసుకో................. నీవు చేసే పనిని నీ గురువు ఇంకా భగవంతుడు ఆమోదిస్తారా అని వివేచన చేస్కో. దానిద్వారా నీ ప్రతి కర్మాచరణమును సంస్కరించుకో, అదే నిన్ను మెల్లి మెల్లిగా నువ్వు చేరుకోవలసిన స్థితికి తీసుకెళ్తుంది.

అడ్డ దార్లను, ఇతర మైన మార్గాలను పెద్దలు ఎవరూ ఇష్టపడరు, అవి మనకి సమాజానికి అంత శ్రేయస్కరంకూడా కావు. నేను విన్నవి చదివినవి నాకు అర్థం అయ్యినంతవరకూ ఇక్కడ వ్రాసాను, తప్పులు ఉంటే పెద్దలు దిద్దగలరు.