తిరుప్పావై - 30 పాశురం

వంగ క్కడల్ కడైంద మాదవనై క్కేశవనై
తింగళ్ తిరుముగత్తు శేయిరైయార్ శెన్ఱిఱైంజి
అంగ ప్పఱై కొండవాత్తై అణి పుదువై
ప్పైంగమల త్తణ్ తెరియల్ పట్టర్బిరాన్ కోదై శొన్న
శంగ త్తమిర్ మాలై ముప్పదుం తప్పామే
ఇంగిప్పరిశురైప్పర్ ఈరిరండు మాల్ వరైత్తోళ్
శెంగణ్ తిరుముగత్తు చ్చెల్వ త్తిరుమాలాల్
ఎంగుం తిరువగుళ్ పెత్తిన్భుఱువర్ ఎంబావాయ్

తిరుప్పావై ముప్పైవ రోజు సంక్రాంతి. సంక్రాంతి మన దక్షిన దేశం వారికి ముఖ్యమైన పండగ. మన వాళ్ళంతా ఆనందంతో ఉత్సాహంతో ఒక పెద్ద పండగ చేసుకుంటారు. ప్రకృతిలో వసంత ఋతువు ఆహ్లాదాన్ని ఇచ్చినా, ఈ కాలం మనకు పంటలతో ఒక నిండు తనాన్ని కల్గించే కాలంగా మనం అనుభవిస్తుంటాం. నెలరోజులు ధనుర్మాస వ్రతం ఆచరించిన గోదాదేవి, తనను ఒక గోపికగా భావించి శ్రీరంగంలో వేంచేసి ఉన్న శ్రీరంగనాథుణ్ణి వివాహమాడాలని అనుకుంది. తత్ ఫలితంగా శ్రీవెల్లిపుత్తూర్ నుండి గోదాదేవిని రప్పించుకొని శ్రీరంగనాథుడు విగ్రహస్వరూపంతోనే వివాహమాడాడు. గోదాదేవి వ్రతం ఆచరించి రంగనాథుణ్ణి పోందిన రోజుని భోగి అంటారు. రంగనాథుణ్ణి భోగరంగడు అని అంటారు. భగవంతుణ్ణి వివాహమాడి వైభోగ్యాన్ని పొందింది కనుక ఆ రోజుకి భోగి అని పేరు. భోగి దాటిన మరునాడే సంక్రాంతి. తరువాత రోజు కనుమ. ఈ మూడు రోజులు కలిపితే ఒక అందమైన పండగ.

దక్షినాయీనం పూర్తయ్యి ఉత్తయాయీణం వస్తుంది. దక్షినాయీణం దేవతలు రాత్రి, ఉత్తరాయణం పగలు. రాత్రి మనం విశ్రాంతి తీసుకొని పగలు లోకంలో ప్రవర్తిస్తుంటాం. మనలో ఎలాగైతే పగలు ప్రవృత్తి ఇక రాత్రి నివృత్తి అయ్యినట్లుగనే దేవతలకు  ఉత్తయాయీణం ప్రవృత్తి ఇక దక్షినాయీణం నివృత్తి.  దేవతలు మేల్గాంచి ఉన్నప్పుడు మనుష్యులలో దైవీ శక్తులు మేలుకొని ఉంటాయి, దక్షినాయీనంలో అసురీ ప్రవృత్తులు మేలుకొని ఉంటాయి. రోజులో బ్రహ్మ ముహూర్తం ఎట్లా అయితే తెల తెల వారే సమయంలో ఉంటుందో, ధనుర్మాస కాలం సత్వగుణాన్ని పెంచేదిలా ఉంటుంది, ఇప్పుడు చేసిన ఆచరణ ఏడాది కాలం మనల్ని మంచి మార్గంలో నడిచేట్టు చేస్తుంది. ఈ భావనతోనే మనం ధనుర్మాస వ్రతం ఆచరిస్తాం. తిరుప్పావై ఒక్కో పాశురాన్ని తెలుసుకొని ఆ జ్ఞానంతో బాగుపడేట్టు మనల్ని తయారుచేసుకుంటాం, తద్వార చుట్టూ ఉండే లోకాన్ని ఎట్లా చూడాలి, మన చుట్టు ఉండే సమాజంతో ఎట్లా ప్రవర్తించాలి అనేది తెలుస్తుంది. మనలో చక్కని సంస్కారం ఏర్పడుతుంది.  మంచి మార్గంలో అడుగు పెట్టడం అన్నమాట, క్రాంతి అంటే అడుగు పెట్టడం, సం అంటే మంచిగా అని అర్థం. ఈ రకంగా మంచిగా బ్రతకటానికి తీసుకున్న నిర్ణయం కాబట్టి అది "సంక్రాంతి" అయ్యింది.

సూర్యుడు ఒక రాశి నుండి మరొక రాశికి మారే సమయం కూడా, ధనుఃరాశి నుండి మకర రాశికి మారుతాడు కనుక కొందరు ఈ రోజు శుభకార్యాలు చెయ్యరు. సంక్రమణం ఏర్పడ్డప్పుడు పితృదేవతలకు తృప్తి కలిగించటానికి నువ్వులు మొదలైన వాటితో తర్పణాదులు చేస్తుంటారు. అందుకే మరునాడు కనుమ పండుగ, తమ బంధువులను, అల్లుల్లను ఇంటికి రప్పించుకొని వివిద సత్కారాలు చేస్తారు. ఎందుకు చేస్తుంటారంటే తిరిగి గోదాదేవి ఆచరణయే కారణం. శ్రీరంగనాథుడు గోదాదేవిని వివాహమాడటంచే విష్ణుచిత్తులవారికి ఆల్లుడైయ్యాడు. శ్రీరంగంలో వివాహం జరిగి, కనుమ నాడు గోదాదేవితో కలిసి శ్రీవెల్లిపుత్తూర్ చేరి ఆరాధన అందుకున్నాడు.

ఇవన్నీ భావించి మన పూర్వులు మనకోక పండగను అందించారు. ఈ పండగలో గొబ్బిల్లను పూజిస్తారు, గొబ్బిల్లు వ్రతం ఆచరించిన గోపికల ప్రతీక. గోపికలు శ్రీకృష్ణుడిని కోరినవారు, వేరొకరు వారికి తెలియదు. శ్రీకృష్ణుడు ఏది చెబితే అది వారికి వేదం. ఆయన చెప్పినదాన్ని పాటించాలి అని కోరుకుంటారు. ప్రతి వ్యక్తి ఈ గోపీ ప్రవృత్తితో గోదాదేవి ఎలాగైతే భగవంతుణ్ణి పొందిందో, మనంకూడా భగవత్ ప్రవృత్తి కల్గి లోకంలో ప్రవర్తించాలని తెలియడానికి మన పెద్దలు మనకు ఈ అందమైన పండగను ఏర్పాటు చేసి ఇచ్చారు.

మనం ఆచరించే ప్రతి పండగకీ పై పై కి ఆనందాన్ని ఇచ్చేవిగా అనిపించినా, దాని వెనకాతల ఆధ్యాత్మిక సందేషం మన ప్రతీ పండగలో కనిపిస్తుంది.

ప్రతి పండగలో మూడు విషయాలు సూచిస్తారు. 
1. ఆధ్యాత్మిక ఉన్నతి
2. శారీరక ఆనందం
3. మన దోషాలు తొలగటం

మామూలుగా మనం వంట వండేప్పుడు కూరగాయలు తరిగేప్పుడో, అన్నం ఉడికించేప్పుడో మనకు తెలియకుండా కొన్ని సూక్ష్మ జీవులని సంహరిస్తుంటాం. అలా చేసినందుకు మనకు పంచ మహా పాతకాలు చుట్టుకుంటాయి అంటుంటారు. మనం అన్నం మాని నివృత్తి చేయలేం, అందుకే పంచ మహా యజ్ఞాలు చెయ్యాలని అంటారు.

అవి మనం దేవతలని ఆరాదించటం, మనకు శరీరం ఇచ్చినందుకు పితృ దేవతలను ఆరాదించటం, మన చుట్టూ ఉండే ప్రాణికోటితో భూతదయతో ప్రవర్తించటం, ధానధర్మాలు చెయ్యటం ఇలా మంచ మహా యజ్ఞాలు చెయ్యాలని అంటారు. ఇక ఒక రైతు పంట పండించేందుకు భూమి దున్నిన మొదలుకొని, క్రిమికీటాదులని సంహారం చేస్తాడు కాబట్టి రైతు తప్పని సరి పంచమహా యజ్ఞం చెయ్యాల్సి వస్తుంది. ఇండ్లముందు వివిద ధాన్యాలను చల్లటం, ఇలా తమ వృద్దిని చూపటంతో పాటు లోపల భూత దయ ఇమిడి ఉంది. పంట ఇంటికి తెచ్చేముందు ప్రకృతి దేవతలకు ఆరగింపు చేస్తారు.

వివిద ధానధర్మాలు చెతనైనంతవరకు చేస్తారు.  బసవన్నలకు సత్కరిస్తారు. రంగనాథుణ్ణి సత్కరించినట్లా అన్నట్లు తమ తమ అల్లుల్లను సత్కరిస్తారు. అలాంటి ఈ పండగ మనలోని దోషాలని తొలగించి పుష్టిని ఇవ్వుగాక.

ఈ రోజు పాశురం ఈ దివ్య ప్రభందాన్ని రాసిందెవరు అని తెలిపే పాశురం. ఇక ఫలశృతిని తెలుపుతుంది ఈ పాశురం. ఈ ముప్పై పాశురాలను రోజు చదవాలి, లేని పట్ల చివరి రెండు అయినా తప్పని సరి అనుసంధానం చేయాలి. ద్వాపరంలో గోపికలు ఈ వ్రతం ఆచరించి కృష్ణుణ్ణి పోందారు. కలియుగంలో గోదాదేవి ఈ వ్రతం ఆచరించి రంగనాథుణ్ణి చేరింది.

 "వంగ క్కడల్" అలలతో కూడిన ఆ పాలసముద్రాన్ని "కడైంద" చిలికినప్పుడు  "మాదవనై" ఆయన లక్ష్మీదేవిని పొందినవాడైయ్యాడు. ఆయనే "క్కేశవనై" కేశవుడు, అందమైన కేశపాశం కల వాడు.

దేవలోక ఐశ్వర్యాన్ని వెలికి తీయడానికి పాల సముద్రంలో మందర పర్వతాన్ని వాసుకీ అనే పాముతో దేవతలు అసురులు మైత్రితో చిలికారు. ఆనాడు స్వామి వారి మైత్రిని కాపాడటానికి ఎన్నో రూపాలు ధరించాడు. పర్వతం క్రిందకు పడి పోకుండా కూర్మంగా ఒక రూపం, పైన పర్వతం నిలిచి ఉండటానికి పైన ఒక రూపం, ఇటు  దేవతలకు అటు అసురలకు బలాన్నిచ్చేలా మరో రెండు రూపాలు ధరించాడు. కలిసి చేసే పనికి పరమాత్మ తనిదిగా భావించి చేస్తాడనే దానికి ఇది నిదర్శణం. అలా మనం కలిసి ఆచరించే తిరుప్పావైకి ఫలితం ఆయన తప్పక ఇస్తాడు. ఆలా చిలికినందుకు అమృతానికి అమృతమైన అమ్మవారిని పొంది ఆయన మాధవుడైనాడు. అసలు సాగర మధనం స్వామి జరిపింది అమ్మను తన వద్దకి చేర్చుకోవడానికే అని ఆండాళ్ అమ్మ "మాదవనై" అంటూ రహస్యం చెబుతుంది.

"శేయిరైయార్" భగవత్ కైంకర్య రూపమైన ఆభరణాలు కల "శెన్ఱిఱైంజి" ఆ గోపికలు "అంగ ప్పఱై కొండవాత్తై" చంద్రుడివలె ప్రకాశించే  "తింగళ్ తిరుముగత్తు"  ఆ శ్రీకృష్ణుడి దివ్య అనుగ్రహం పోందారు. "అణి పుదువై" భూమికి అలంకారమైన శ్రీవెల్లిపుత్తూర్ లో "ప్పైంగమల త్తణ్ తెరియల్" చల్లటి తులసి మాలను ధరించి ఉన్న "పట్టర్బిరాన్" విష్ణుచిత్తుల వారి కూతురైన "కోదై" గోదాదేవి "శొన్న" చెప్పిన "శంగ త్తమిర్ మాలై" తీపైన ఈ పాటల మాలయైన "ముప్పదుం తప్పామే" ముప్పై పాటలను, ఒక్కటీ వదలకుండా చెప్పాలి. తిరుప్పావై ఒక మాలిక కదా, మాలలో ఏ ఒక్క రత్నం లేకున్నా ఆ మాల అందం లేకుండా పోతుంది. మరియూ ఈ తిరుప్పావై భగవంతుణ్ణి చేరే క్రమమైన మెట్ల మాదిరివి, ప్రతి మెట్టూ అవసరం. "శెంగణ్ తిరుముగత్తు" వాత్సల్యమైన ఆ ముఖంతో "చ్చెల్వ త్తిరుమాలాల్" ఉభయ విభూది అనే ఐశ్వర్యం కల నాథుడు, "ఇంగిప్పరిశురైప్పర్" ఆయన చల్లని చూపులు తిరుప్పావై చదివే వారిపై ఉంటాయి. "ఈరిరండు మాల్ వరైత్తోళ్" రెండు హస్తాలతో ఉన్న ఆయన నాలుగు హస్తాలు చేసుకొని  నాలుగు పురుషార్థాలను ఇస్తాడు. "ఎంగుం తిరువగుళ్ పెత్త్" అన్ని చోట్లా దివ్య అనుగ్రహాన్ని పొంది "ఇన్బుఱువర్" ఆచరించిన వారు  ఆనందాన్ని అనుభవిస్తారు.

 శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్  స్వామివారి ప్రవచనం