శ్రీ హనుమజ్జయంతి - 2016

హనుమంతుడు వైశాఖ బహుళదశమి, శనివారమునాడు, పూర్వాభాద్ర నక్షత్రమందు, వైధృతి యోగమున, మధ్యాహ్న సమయమునందు, కర్కాటక లగ్నాన, కౌండిన్య గోత్రమున జన్మించెను. స్వాతి నక్షత్రము హనుమంతునకు అధిష్టాన నక్షత్రము.

హనుమంతుడు తిరుమల కొండపై పుట్టాడు. తల్లి అంజనాదేవి తపస్సు చేసి హనుమంతుని కనుట వలన అది అంజనాద్రి అయినది. పురాణాలలో ఇది పరిశోధించి నిరూపించబడినది. అక్కడే జాబాలి మహర్షి తపస్సు చేయగా స్వామి స్వయంభూమూర్తిగా వెలిశాడు. పాపనాశం వెళ్ళే మార్గంలో ఆకాశగంగకు ముందే జాబాలివద్ద బస్సు దిగి కొద్దిమాత్రపు నడకతో ఆ క్షేత్రము దర్శింపవచ్చు.

లోకానుగ్రహంతో, రాక్షస సంహారార్థము హనుమంతు డుదయించెను. కేసరి భార్యయగు అంజనాదేవికి ఫలరూపమున అగ్ని, వాయువుల సహాయమున అందిన శివతేజస్సువలన అతడు జన్మించెను. కావున హనుమంతుడు కేసరినందనుడు, ఆంజనేయుడు, అగ్నిపుత్రుడు, పవనసుతుడు, శంకర తనయుడు అని కీర్తింపబడుచున్నాడు.

హనుమన్మహిమను బ్రహ్మ కూడా వర్ణింపజాలడు. ఆంజనేయుడు భక్తసులభుడు, దయాళువు. హనుమంతుని పూజించిన సర్వదేవతలను పూజించినట్లే. హనుమంతుని తన ఇంట ఎవడు ప్రతినిత్యమూ భక్తితో పూజించునో వానియింట సంపదలు నిలుచును. దీర్ఘాయువు చేకూరును. సర్వత్ర విజయము చేకూరును. అతడే సర్వులకూ ఆదర్శమూర్తి.

బుద్ది, బలము, కీర్తి, ధైర్యము, నిర్భయత్వము, అరోగత, అజాడ్యము, వాక్పటుత్వము మున్నగు వన్నియు హనుమన్నామ స్మరణవలన చేకూరును. శుభాశుభములందన్నిట పవిత్రమగు హనుమన్నామమును భక్తి తత్పరులై పండ్రెండుమార్లు తలచిన కార్యసిద్థి యగునని పరాశరమహాముని తెల్పెను. ప్రయాణాది సర్వకాల ధ్యాన మదియే.

ఆ హనుమంతుని ఆశీర్వాదములు మన అందరి మీద సదా ఉండాలని ప్రార్థిస్తూ…