ఈ సంవత్సరము ౩1st May, 2016 మంగళ వారము నాడు శ్రీ హనుమజ్జయంతి

హనుమంతుడు వైశాఖ బహుళదశమి, శనివారమునాడు, పూర్వాభాద్ర నక్షత్రమందు, వైధృతి యోగమున, మధ్యాహ్న సమయమునందు, కర్కాటక లగ్నాన, కౌండిన్య గోత్రమున జన్మించెను. స్వాతి నక్షత్రము హనుమంతునకు అధిష్టాన నక్షత్రము. 

హనుమంతుడు తిరుమల కొండపై పుట్టాడు. తల్లి అంజనాదేవి తపస్సు చేసి హనుమంతుని కనుట వలన అది అంజనాద్రి అయినది. పురాణాలలో ఇది పరిశోధించి నిరూపించబడినది. అక్కడే జాబాలి మహర్షి తపస్సు చేయగా స్వామి స్వయంభూమూర్తిగా వెలిశాడు. పాపనాశం వెళ్ళే మార్గంలో ఆకాశగంగకు ముందే జాబాలివద్ద బస్సు దిగి కొద్దిమాత్రపు నడకతో ఆ క్షేత్రము దర్శింపవచ్చు. 

సుందరకాండ పారాయణము 

శ్రీమద్వాల్మీకి రామాయణాంతర్గతమైన సుందరకాండ భక్తులపాలిట కల్పవృక్షమన్న అతిశయోక్తి కాదు. అనాదిగా నెట్టి యభీష్టముతో నయినా సుందరకాండ పారాయణ మొనర్చి కోర్కెలను నెరవేర్చుకొనుచున్నారు. పారాయణమునం దనేక విధానములు కలవు. కార్యసిద్ధి, దుష్టగ్రహ, పిశాచక బాధా నివారణ, బంధ విముక్తి, దుస్స్వప్ననాశ, శోకనాశ, రాజ్యలాభ, తాపత్రయ నివారణ, సంపత్సుఖాదుల నెన్నిటినో అనంతములగు ఫలితములను భక్తులు సుందరకాండ పారాయణమువలన పొందుచున్నారు. సుందరకాండ మొత్తమే కాక ప్రతిశ్లోకము కూడా ప్రత్యేక శక్తి కలిగి అనుగ్రహకారియై యున్నది. సుందరకాండయొక్క సర్వఫలితముల దెల్పుట అసాధ్యము. కాన మానములనుభవించు దుఃఖములు తొలగుటకు కొన్ని శాంతులు మాత్రము తెలుపబడుచున్నవి. పారాయణము స్వయముగా చేసికొనవచ్చును లేదా వేరొకరిచే చేయించుకొనవచ్చును. 

ఉన్మాదమునకు శాంతి 

ఉదయకాలమున మినుపపప్పును బాగుగా విసిరి నూక చేసి అన్నముగ వండి శ్రీస్వామివారికి నివేదన చేసి హనుమ ద్విషాదకరమగు సుందరకాండ 13వ సర్గను పారాయణ చేయవలెను. దానిచే మన స్థిమితము లేకపోవుట, దిగులు, పిచ్చి మున్నగు మానసిక వ్యాధులు తొలగును. 

దారిద్య్ర దోష శాంతి 
దారిద్య్ర విమోచనమునకై హనుమంతుడు సీతను చూచిన సుందరకాండ 15వ సర్గ పారాయణము చేయవలెను. 

తప్పిపోయినవారు చేరుటకు 

తప్పిపోయిన, విరోధమందిన వారు మరల కలియుటకు హనుమంతుడు రామ ముద్రికను సీతాదేవి కిచ్చిన 36వ సర్గను త్రికాలములందు పఠించి, పఠనమునకు ముందు, తరువాత కూడా పనస, లేదా మామిడి ఫలములను లేదా సమకూడిన ఫలములను నివేదించవలెను. 


అట్లే సంసారబంధ విముక్తికి నిత్యం 1వ సర్గ ఆరుమాసములు పారాయణ చేయాలి.

భూతప్రేతాది విముక్తికై 3వ సర్గ; 

బుద్ధిమాంద్యం తొలగటానికి 13వ సర్గ; 

సంపదలకు 15వ సర్గ; 

దుస్స్వప్న దోష శాంతికి 27వ సర్గ; 

సత్త్వగుణ వృద్ధికి 20, 21వ సర్గలు; 

ఎడబాసిన బంధువుల కలయికకు 33 నుండి 40వ సర్గ వరకు; 

ఆపదలు తొలగుటకు 36వ సర్గ; 

బ్రహ్మజ్ఞానం కొరకు 38వ సర్గ; 

శత్రుంజయం కొరకు 42 నుండి 47వ సర్గ వరకు;

ధర్మకార్య సాధన, గృహాభివృద్ది కొరకు 54వ సర్గ; 

అభీష్టసిద్ది కొరకు 41వ సర్గ; 

కన్యా వివాహానికి 9రోజులు క్రమంగా 5, 10, 5, 6, 7, 7, 12, 8, 8 పట్టాభిషేక సర్గలు చేస్తూ నివేదనగా నేతితో చక్కెరపొంగలి, పాయసం, అప్పాలు, నువ్వులు కలిపిన అన్నం, చక్కిలాలు, ధధ్యోదనం, లడ్లు, వివిధ ఫలాలు, పొంగలి, చక్కెర కలిపిన పాలు రోజుకొకటిగా నివేదించాలి. 


పుత్రసంతానానికి రోజూ పూర్తికాండ చొప్పున 21 రోజులు చేసి పట్టాభిషేకసర్గ చేయటంకాని, సప్తవర్గపారాయణ 68 దినాలలో పూర్తిచేయటం కానీ చెప్పబడింది. 

రాజబంధ విముక్తికై 34 సర్గలు చొప్పున 68 రోజులు, చివర పట్టాభిషేకసర్గ చేయాలి. 

మహాధన, గృహ, ధాన్యాది లాభములకు 25 సర్గల చొప్పున 68 దినాలు చేసి, చివర పట్టాభిషేకసర్గ చేయాలి. 2 రోజుల పారాయణలో మొదటి రోజు 48 సర్గలు, మిగిలినది మరియు పట్టాభిషేకసర్గ, రెండవరోజు చేసే పధ్దతి ఉన్నది. 3 రోజుల పారాయణలో మొదటిరోజు 27వ సర్గవరకు, రెండవరోజు 40వ సర్గవరకు, 3వ రోజు మిగిలినది మరియు పట్టాభిషేకసర్గ పూర్తిచేయాలి. 5దినాల పారాయణలో 15, 27, 38, 54, 68 వరకు సర్గలను క్రమంగా పూర్తి చేయాలి. 

ధన లాభానికై చేసే 8రోజుల పారాయణలో 7 రోజులు రోజుకి 9 సర్గల చొప్పున చేసి, 8వ రోజు మిగిలిన 5 సర్గలు మరియు పట్టాభిషేకసర్గ చేయాలి. ఇతర అత్యవసర విషయాలు పెద్దలద్వారా గ్రహించి ఆచరించి సత్ఫలితాలు పొందగలరు. 
(Source: శ్రీ హనుమద్విషయ సర్వస్వము)