యుధిష్ఠిరుని ధర్మబుద్ధి

చిరంజీవి అయిన మార్కండేయ మహర్షి వద్ద పుణ్యకథలు వినిన తరువాత ధర్మాత్ములైన పాండవులు పరమసాధ్వి అయిన ద్రౌపదీదేవి పురోహితుడైన ధౌమ్యుల వారు ద్వైతవనానికి చేరారు. అక్కడ ఉండగా ఒక రోజు ఒకానొక భూసురోత్తముడు పఱుగులిడుతూ వచ్చి “ఓ ధర్మనందనా! యజ్ఞార్థము నేను అరణి (నిప్పు పుట్టించెడు కొయ్య) అరణ్యమునుండి కొనివచ్చి వాటిని ఒక తరుశాఖ మీద పెట్టి మిగిలిన ఏర్పాట్లు చేయుచుండగా ఒక జింక ఎక్కడి నుంచో పఱుగు పఱుగున వచ్చి ఆ వృక్షము ప్రక్కగా వెళ్ళినంత దాని కొమ్ములకు నా అరణి చిక్కుకుంది. అలా నా అరణి తీసుకుని ఆ జింక మళ్ళీ అడవిలోకి పారిపోయింది. నా నిత్యకర్మకు అంతరాయం కలుగ కుండా నా అరిణి తెచ్చి కాపాడు” అని వేడుకున్నాడు.

ఆర్తరక్షణే ప్రథమ కర్తవ్యం అని భావించే ధర్మజుడు వెంటనే తన విల్లందుకుని తన తమ్ములతో పాటు ఆ జింక వెళ్ళిన వైపున పఱుగు తీశాడు. అద్భుత వేగంతో పోతున్న ఆ జింక ఎంత ప్రయత్నించినా వారికి చిక్కలేదు. అలా ఎంతో దూరం ఆ జింక వెనకాల పఱుగెట్టారు పాండవులు. తీవ్రమైన అలసట దప్పిక వారిని బాధించాయి అయినా కర్తవ్య పాలనార్థం జింకను వెంబడిస్తూనేవున్నారు. చివరికి వారు దట్టమైన కాఱడవి లోపలికి చేరుకున్నారు. అక్కడ ఆ జింక కనుమఱుగైపోయింది. మానవ ప్రయత్నం విఫలంకాగా ఎంతో శ్రమతో ఆయాసపడుతున్న పాండవులు ఒక పెద్ద మఱ్ఱిచెట్టు క్రింద విశ్రాంతి తీసుకున్నారు. అప్పుడు నకులుడు ధర్మరాజుతో ఇలా అన్నాడు “నిరంతరము సత్యమార్గమును అనుసరించుచూ ధర్మముతప్పకుండా చెరించే మనకు ఈ దుర్గతి ఎందుకు పట్టినదో? ఒక జింకను పట్టి ఆ బ్రాహ్మణుని అరణి తిరిగి ఇవ్వలేక పోతున్నామే. హతవిధి”! అది విని ప్రాజ్ఞుడైన యుధిష్ఠిరుడు ఇలా బదులిచ్చాడు

“నాయనా! సుఖము దుఃఖము మనము పూర్వం చేసిన కర్మ బట్టే ఉంటాయి. సత్కర్మలకు సత్ఫలము దుష్కర్మలకు దుఃఖము తప్పదు. చేసిన కర్మ చెడని పదార్థం. కర్మ వశముగా కాక ఏదీ జరుగదు”. భీమసేడు ఆ సత్యవాక్కులు విని “అయితే పరసతి పరమపతివ్రత పైగా ఏకవస్త్ర (రజస్వల) గా ఉన్న పాంచాలీ దేవిని కురుసభకు జుట్టుపట్టుకుని ఈడ్చుకువచ్చిన అతిదురాత్ముడైన దుశ్శాశనుని అక్కడే వధించకుండా ఊరక ఉన్నందుకే మనకి ఈ దుర్గతి పట్టి ఉండ వచ్చు” అని అన్నాడు. అది విని శ్రీ కృష్ణ ప్రియ సఖుడైన అర్జునుడిలా అన్నాడు “ధర్మాధర్మ విచక్షణ లేకుండా ఇష్టంవచ్చినట్టు కురువృద్ధుల ముందర నోటికివచ్చినట్టు మాట్లాడిన ఆ కర్ణుని నోరుమూయించక ఓర్చుకున్నందుకే మనకీ దుఃఖములు”. అప్పుడు సహదేవుడు “దుష్టశీలుడైన దుర్యోధనుడు అధర్మ జ్యూదం ఆడి మనలను మోసగించినపుడే దుష్టశిక్షణ చేయనందులకే మనకీ దుర్గతి పట్టినది” అని అన్నాడు (జ్యూదంలో పందెం కాసేవాడే ఆడాలన్నది నియమం. అలా కాకుండా తను ధనంవొడ్డి శకునిచే ఆడించి గెలుచుట అధర్మం అని సహదేవుని ఆంతర్యం).

ఇలా వేవిధాల మాటలాడు తున్న సోదరులను చూచి అజాతశత్రుడైన పాండవాగ్రజుడు
నకులునితో ఇలా అన్నాడు “నాయనా! నీ సోదరులందరూ తీవ్ర దాహముతో ప్రాణాలుకడపట్టుకు ఉన్నారు. ఈ వృక్షం ఎక్కి దగ్గరలో ఏదైనా జలధార ఉన్నదేమో చూడు”. వెంటనే నలుకుడు ఆ చెట్టెక్కి నలువైపులా చూశాడు. దగ్గరలోనే అతి మనోహరమైన తటాకమున్నదని చెప్పాడు. అప్పుడు ధర్మరాజు “నీవు వెళ్ళి నీరు త్రాగి దప్పిక తీర్చుకొని మాకు కూడా కొంత జలం పట్టుకు రా” అని నకులునితో అన్నాడు. నకులుడు వెళ్ళి తటాకములోని నీరు త్రాగబోతుండగా ఒక అశరీరవాణి ఇలా పలికింది “ఓ మాద్రీనందన! ఈ జలములు నా ఆధీనములో ఉన్నాయి. నీవు ఇవి త్రాగదలుచు కుంటే ముందు నా ప్రశ్నలకు సమాధానాలు చెప్పు”. దాహముతో తపిస్తున్న నకులుడు ఆ మాటలు పట్టించుకోకుండా నీళ్ళు త్రాగినాడు. మఱుక్షణం నిశ్చేష్టుడై పడిపోయాడు.

ఆ తరువాత సహదేవ అర్జున భీములు ఒక్కొక్కరుగా వచ్చి సాహసించి ఆ తటాకములో నుండీ నీరు త్రాగి మృతుల వలె ఆ తీరమువద్ద పడిపోయినారు. ఎంతకీ తిరిగి రాని సోదరులను వెతుకుతూ చివరికి ధర్మనందనుడు కూడా ఆ తటాకానికి చేరుకున్నాడు. యుధిష్ఠిరుడు తీరమువద్ద పడివున్న తన ప్రియ సోదరులను చూచి ఆశ్చర్యపోయాడు. వారికేమైనదో అని దుఃఖించాడు. అసమానశూరులు వీరాధివీరులైన ఆ నలుగురు ఏ కారణంబుగా ఈ స్థితిలో ఉన్నారో అని బాధపడ్డాడు. పుణ్యచరిత అయిన కుంతీ దేవికి ఈ విషయము తెలిసిన ఎంత దుఃఖించునో అని తలచినాడు. “భీష్మ విదురాది పెద్దలు అడిగితే ఏమి సమాధానము చెప్పాలి?” అని ఇట్లు పరిపరి విధముల వగచి దాహముతో ప్రాణాలుపోతున్న ఆ ధర్మజుడు తటాకములోని జలములు త్రాగుటకు ఉపక్రమించెను. మఱల ఆ అశరీరవాణి ఇట్లనియె “నీ సోదరులు సాహసించి ఈ నీరు త్రాగి మరణించిరి. నీవీనీరు త్రాగవలెనన్న నా ప్రశ్నలకు విమల బుద్ధితో సమాధానములు ఇవ్వవలెను”. 

“అయ్యా! నీవు శివుడవో అగ్నిదేవుడవో వాయుదేవుడవో ఇంద్రుడవో? ఇట్టి అజేయులకు ఈ స్థితిని ఇంకెవరు కల్పించగలరు? నాయందు దయ ఉంచి మీ నిజరూపంబు చూపి నా భయము తొలగించండి” అని వేడుకొనిన అతి ఘోరాకృతిలో ఉన్న యక్షుడు యుధిష్ఠిరుని ఎదుట నిల్చి నా ప్రశ్నలకు ఉత్తరములు ఈమని అడిగెను. సహజ వినయ సౌశీల్యుడైన ధర్మనందనుడు అతనికి ప్రణమిల్లి “దేవా మీ చిత్తము. కానీ నాబోటి వానికి మీ ప్రశ్నలకు జవాబులిచ్చుట సాధ్యమా? అయినా నాకు తెలిసినంతలో చెప్తాను” అని అన్నాడు.

ఆ యక్షుని ప్రశ్నలకు ధర్మజుడు అద్భుతరీతలో ఉత్తరములను ఇచ్చినాడు. సంతృప్తుడైన యక్షుడు “మహాత్మా! నా ప్రశ్నలన్నిటికీ నీవు సదుత్తరములు ఇచ్చి నన్ను మెప్పించినావు. నీ తమ్ములలో ఒకని ప్రాణంబులిచ్చెద. కోరుకొనుము” అని వరమొసంగినాడు. శ్యామాంగుడైన నకులుని బ్రతికించ మని ధర్మరాజు కోరగా యక్షుడు ఆశ్చర్యముగా ఇలా ప్రశ్నించాడు 

“భీమార్జునులు అతిభీమబలులు. భీమసేనుడు అతని భుజబలముచే నిన్ను నీ సోదరులను అనేక మాఱ్లు మత్సరముచే చంపాలనుకొన్న దుర్యోధనుని కుయుక్తుల బాఱినుండి కాపాడినాడు. ఇక అర్జునునికి సాటి రాగల వీరుడు ఈ లోకంలో లేడు. ఆతడే మఱల నీ రాజ్యము నీకు అప్పించగలడు. వీరిలో ఒక్కరిని కోరక నకులుని ఎందులకు కోరినావు”? సమవర్తి అయిన యుధిష్ఠిరుడు ఇలా ధర్మ్యము మాట్లాడినాడు “కుంతీదేవి కుమారులైన ముగ్గురిలో నేను మిగిలినాను. అలాగే మాత యగు మాద్రీదేవి ఇద్దరు పుత్రులలో ఒకడైనా బ్రతకాలి కదా! అందుకే నకులుని బ్రతికించమని కోరినాను. ఇట్లు కాక అన్యుల బ్రతికించమని కోరి అధర్మము చేయలేను”. ధర్మజుని ధర్మబుద్ధికి మెచ్చి ఆ యక్షుడు “నీ తమ్ములందఱిని బ్రతికించెదను” అని కరుణించినాడు. వెంటనే ఆ నలుగురు లేచి కూర్చున్నారు. వారందరి దాహమూ తీరిపోయినది. ఆ యక్షుడి శక్తి చూచి ఆశ్చర్యపోయి “దేవా! నీవు సామాన్య యక్షుడవు కావు. ఇంద్రుడవో వరుణుడవో అగ్నివో వాయుదేవుడవో లేక ధర్మప్రభువైన నా తండ్రి యముడవో చెప్పుము” అని ప్రార్థింప ధర్ముడు కరుణించి తన నిజ స్వరూపము చూపి వారికి ఆనందము కలిగించినాడు.

“ఓ రాజా! నేను యమధర్మరాజును. సత్యము శౌచము దయ దానం తపం శమము దాంతి యశము జ్ఞానము యుక్తి నా మూర్తులు. నీ ధర్మబుద్ధి పరీక్షించుటకు వచ్చినాను. నీ ధర్మవర్తనమునకు మెచ్చినాను. ఏమి వరము కావలయునో కోరుకొనుము” అని కాలుడు అడిగినాడు. అప్పుడు పాండవాగ్రజుడు ఆ ధర్ముని స్తుతించి “అయ్యా! నా ఆశ్రమము వద్ద ఉండే విప్రోత్తముడి అరణి ఒక హరిణము ఎత్తుకుపోయింది. ఆ మహనీయుని నిత్యకర్మకు లోపము రాకుండా అతనికి ఆ అరణి ఇప్పించు స్వామి”! అని కోరినాడు. అంతట ఆ ధర్ముడు తానే మృగ రూపమున వచ్చెనని ధర్మరాజుకు ఎఱింగించి అతనికి విప్రుని అరణి ఇచ్చెను. “నాయనా! రానున్న అజ్ఞాతవాసములో మీకు కావలిసిన రూపములు నా అనుగ్రహం వల్ల కలుగుతాయి. ఇందువల్ల అసత్య దోషం కలుగకుండా మీరు అజ్ఞాతవాస కాలము పూర్తిచేయగలుగుతారు. నాయనా ధర్మరాజా! నీ కర్తవ్య దీక్షకు మెచ్చి ఇంకొక వరమిస్తాను కోరుకో” అని కాలుడన్నాడు. అప్పుడు ధర్మనందనుడు “స్వామీ! నీ అనుగ్రహము కన్న నాకు కావలసిన దేమున్నది. నా మనసులో అప్పుడూ క్రోధమోహాలు రాకుండా ఎల్లప్పుడూ ధర్మమార్గాన ఉండేటట్లు ఆశీర్వదించండి” అని కోరినాడు. అటులనే దీవించించి యముడు అదృశ్యమయ్యాక పాండవులు ఆశ్రమము చేరి భూసురునకు అరణి ఇచ్చి ఆనందముగ ఉండసాగిరి.

ఈ కథలోని నీతిని 

సజ్జనులు ఎన్నడూ ధర్మమార్గమును వీడరు. ధర్మరాజు నకులుని కోరి ధర్మవర్తనము ఎంత సూక్ష్మమైనదో మనకు వివరించినాడు. వరం కోరుకో మనినప్పుడు ధర్మజుడు తనకై ఏదీ కోరకుండా విప్రుని అరణి ఇప్పించమని కోరినాడు