శల్యసారథ్యం

నకులసహదేవుల మేనమామ, పాండవ పక్షమున నిలిచి కౌరవసేనను చీల్చి చెండాడవలసిన మహాయోధుడు. కాని విధివైపరీత్యం వల్ల కౌరవసేనకు సైన్యాధ్యక్షుడిగా నిలిచి, పాండవసేనను దునుమాడవలసి రావడం దురదృష్టకరం. ముఖస్తుతి అంత ముప్పు తెచ్చిపెట్టింది. శల్య సారథ్యం, పార్థుసారథ్యానికి ఉన్న భేదం కొట్టొచ్చినట్లు మనకు కావ్యం పరిశీలిస్తే తెలుస్తుంది.

శల్యసారథ్యం గురించి తెలియనివాడంటూ తెలుగుదేశంలో ఉండడంటే ఎంతమాత్రం అతిశయోక్తి కాదు. అతిరథవీరులలో శల్యుడొకడు. ఇతడు మద్రదేశాధిపతి. నకులసహదేవులకు మేనమామ. అంచేత ఈయన పాండవపక్షాన మహాభారతయుద్ధంలో కౌరవులను చీల్చిచెండాడవలసిన యోధాగ్రేసరుడు.

దుర్యోధనుడు విరాటపర్వంలో కీచకవధానంతరం పాండవుల ఉనికి ప్రస్తావిస్తూ...
"సింహబలుడు, భీమసేనుండు, శల్యుండు, హలధరుడు సమానబలము వార, లొండరులను గెలుచునుత్సాహమును గల రుద్ధతులును బాహుయుద్ధపరులు" అంటాడు. కీచకుడు, భీమసేనుడు, శల్యుడు, బలరాముడు- నలుగురు సమానబలం కలవారు. ఒకరి నొకరు జయించుకొనవలెనని ఉత్సాహపడే గర్విష్టులు. మల్లయుద్ధ ప్రియులు. నలుగురి భుజబలాలతో సరితూగజాలే భుజబలం మరెక్కడా కనబడదు అని స్వయంగా గదాయుద్ధ, మల్లయుద్ధ నిపుణుడు దుర్యోధనుడు అన్నమాటలు.

పాండవుల అజ్ఞాతవాస పరిసమాప్తి తెలిసికొన్న శల్యుడు, పుత్రమిత్ర సమేతముగా నానాసేనాపతిసంకులంబుగా పాండవుల కడకు బయలుదేరాడు. అతని ముఖస్తుతి, మర్యాదకు ఉబ్బిపోవు స్వభావం తెలిసిన దుర్యోధనుడు, తాను చాటున నిలిచి ఆయన ప్రయాణించే మార్గమంతట చలువ పందిళ్లు వేయించినాడు. తీయని నీరు గల నడబావులు త్రవ్వించాడు. ఏనుగులు, గుర్రాలకు చావళ్లు, ఆస్థానమండపాలు ఏర్పాటు చేయడమే కాక, రుచికరపదార్థాలను సేనలకు అందివ్వడము, సకల మర్యాదలనూ అమాత్యుల ద్వారా జరిగేటట్లు ఏర్పరచి రహస్యంగా తను వెంట నడిచాడు. శల్యుడవి చూచి మార్గమధ్యముననే తన ఘనత కింతటి మర్యాదలు జరిగెనని ఉబ్బిపోయి, ఇవి జరిపించినది ధర్మజుడేయని భ్రమించి పరిజనంబు చూచి, "ఇట్లు చతురంబుగా మనకు వలయువాని సమకూర్చటానికి కారకులైన ధర్మరాజు మంత్రులెవరు? వారిని తీసుకొని రండి. వారు మా అనుగ్రహానికి పాత్రులు" అని పలుకగానే, దాగి ఉన్న దుర్యోధనుడు ఇదే అదనని నమ్రతతో బయల్పడగా, శల్యుడు గౌరవంతో గట్టిగా కౌగలించుకుని బంగారు పీఠం మీద కూర్చుండబెట్టి "నీకేమి కావాలో కొరుకొ"మ్మనగా దుర్యోధనుడు-

నీవు నాకు మంత్రివయి, పూని నా సైన్యాన్ని నడుపింపుమని భక్తిశ్రద్ధలతో ప్రణమిల్లాడు. శల్యుడు చేసేది లేక, "పాండవులు, మీరు ఒక్కటే కాబట్టి ముందుగా నన్ను సాదరంగా చూడటానికి వచ్చిన నిన్ను ప్రీతితో చేరతాను" అని సత్యవచనుడయ్యాడు. నీవు హస్తినాపురం వెళ్లుమని చెప్పి, తాను పాండవులను కలసివస్తానని చెప్పాడు. ఇచ్చిన వరం మాట మరువవద్దని జ్ఞాపకం చేశాడు దుర్యోధనుడు. సందేహపడవద్దని శల్యుడు భరోసా ఇచ్చాడు. శల్యుడు చేయదలచుకొన్నదొకటి, చేసిన దింకొకటి. దుర్యోధనుని మర్యాద అతని కంత మత్తెక్కించినది.

శల్యుడు, ధర్మనందనుని నివాసమున కేగాడు. ఆయన సమస్త బంధుగణంతో ఎదురేగి ప్రణమిల్లాడు. బంగారు గద్దియపై కూర్చుండబెట్టగానే, శల్యుడు, స్వాగతసత్కారములకు పొంగిపోయాడు. ధర్మజుని కౌగిలించుకుని కుశల ప్రశ్నానంతరం మార్గమధ్యమున తాను దుర్యోధనున కిచ్చిన మాటలను చెప్పాడు. ధర్మరాజు వెంటనే మంచిపని చేశారని ప్రస్తుతిస్తూ మామను ఒక్కవరం అనుగ్రహించమని వేడుకున్నాడు.

"అర్జునునకు కృష్ణుడు రథసారథ్యం చేయనున్నాడు. ప్రతివీరుడైన కర్ణునకు సారథ్యం చేయటానికి మీరు తప్ప అక్కడ ఇంకొకడు లేడు. యుద్ధ సమయంలో మీరు అనాదరించి పలికి, కర్ణుడి మనస్సుకు కలత పుట్టించి అర్జునుడిని రక్షించాలి. ఇది అకార్యమని సందేహించక నా ప్రార్థనపై విధంగానైనా సరే, దీన్ని చేయాలి" అని ప్రాధేయపడిన ధర్మజుని కోర్కెకు శల్యుడు సమ్మతించాడు.

ధర్మజుని దూరదృష్టి, రాజనీతిజ్ఞత ఇక్కడ ప్రశంసార్హం. దుర్యోధనుడి ఎత్తుకు పై ఎత్తు వేసి ధర్మరాజు అతడిని చిత్తు చేశాడు. తన కోరిక అకృత్యమని తెలిసినా రాజకీయాలలో సమర్థనీయం. కోరిక వలన శల్యుడు తన పక్షంలో ఉన్న దానికంటే పరపక్షంలో ఉండటమే ధర్మరాజుకు అధికతరమైన మేలు చేకూర్చింది.

ధర్మజుడు తన్ను పెద్ద చేసి నహుషోపాఖ్యానము చెప్పుమని అడుగుసరికి, శల్యుడుబ్బిపోయి కథ చెప్పి, నాలుకతో అంతకు ముందు సాయము చేయుదునని సుయోధనునకు మాట ఇచ్చాడో, ఇప్పుడు అదే నాలుకతో, "కౌరవనాథుడా నహుషు కైవడి నాశము బొందు వాసవీ శ్రీరమణుడై, జయము సేకొని, ధర్మజు డంబురాశి వేలారశనా సముజ్జ్వల విలాస మనోహరమేదినీ వధూసార సమగ్ర భోగముల నన్నుతి కెక్కెడు తాను తమ్ములున్"
దుర్యోధనుడు నహుషుడి వలె నశిస్తాడు. ధర్మరాజు ఇంద్రవైభవంతో విజయం సాధించి, తమ్ములతో సముద్రతీరమనే మొలనూలి సముజ్జ్వల విలాసం చేత, అందమైన భూమి అనే స్త్రీయొక్క సారవంతాలైన సర్వభోగాలూ పొంది పొగడ్తకెక్కుతాడు, అని అన్నాడు. సాదరసత్కారాల పిమ్మట ధర్మరాజు శల్యుని "యుద్ధంలో మీరు మమ్మల్ని దృష్టిలో పెట్టుకొని కర్ణుడిని నిరుత్సాహ పరుస్తూ మాట్లాడటం మరచిపోగూడదు" అని మళ్లీ జ్ఞాపకం చేశాడు.

శల్యసారథ్యము ప్రపంచదృష్టినాకర్షించు ఒక విశేషాంశము. ఇది ఆయనకొక విలాసవిద్య (హాబీ). విద్యలో శల్యశ్రీకృష్ణులు సిద్ధహస్తులు. ఒకరితో నొకరు లోలోపల పోటీ పడువారు.

భీష్ముడు దుర్యోధనునితో యుద్ధవీరుల సామర్థ్య నిర్ణయసమయంలో శల్యుడు అతిరథుడనీ, శ్రీకృష్ణుడిపై గల ఈర్ష్య వల్ల మేనల్లుళ్లయిన పాండవులను విడిచి నిన్ను చేరాడని పలికాడు.

శల్యశ్రీకృష్ణుల సారథ్య సామర్థ్య ప్రదర్శనకు మహాభారత సంగ్రామము మంచి అవకాశము. పాండవపక్షమున వీరోత్తముడు పార్థుడు. విశేషించి అతడు శ్రీకృష్ణున కాత్మీయుడు. అందుచేతనే ఆయన పార్థసారథి అయ్యాడు. ఇక శల్యుని సారథ్యమునకీ పక్షమున చోటులేదు. కౌరవపక్షమున కర్ణుడొక్కడే పార్థునికి ప్రతివీరుడు, సర్వసమర్థుడు. కాని కర్ణుడన్న శల్యునికి గిట్టదు. కారణం అతడు తన కంటే తక్కువవాడని శల్యుని భావన (సూతసుతుడు).

విషయం గ్రహించిన దుర్యోధనుడు సభాముఖమున శల్యుడి వద్దకు కర్ణుని గొనిపోయి, భక్తితో ప్రణమిల్లి, కర్ణునకు రథసారథ్యం వహించి తనకు జయం చేకూర్చుమని వేడుకొన్నాడు.

దీనికి శల్యుడు దుర్యోధనునితో, నన్ను అంత నికృష్టపు పని చేయమనటం నీకు తగదు అంతూ మూర్ధాభిషిక్తుడు, సుక్షత్రియుడైన తాను సూతపుత్రునకు రథచోదకుడను గాలేనని వర్ణధర్మా లెటువంటివో వివరించాడు.
(నేటి లౌకికదృష్టిలో ప్రభుత్వంలోని నాలుగవ తరగతి ఉద్యోగి క్రింద, రెండవ తరగతి ఉద్యోగిని పనిచేయమంటే ఒప్పుకోడు గదా).

కార్యసాధకుడైన దుర్యోధనుడు, శల్యుని మనస్సెరిగినవాడు, ఇంక ముఖస్తుతి ప్రారంభించాడు. మామా! నీవు గొప్ప శత్రువుల గుండెల్లో శల్యం (బాణం) వంటివాడవైనందువలన గదా నీకు శల్యుడనే పేరు వచ్చింది. రథికుడి కుండవలసిన లక్షణాలలో అర్జునుడి కంటే గొప్పవాడు కర్ణుడు. గుఱ్ఱాల మనస్సు తెలిసికొనటంలో కృష్ణుడి కంటే గొప్పవాడవు నీవు.

అర్జునుడికి ప్రతివీరుడుగా మనం కర్ణుడిని తగినవాడిని చేశాము. మన నిర్ణయాన్ని కృష్ణుడు అర్జునుడికి సారథిగా ఉండి నిరుపయోగం చేస్తున్నాడు. దానికి తగిన ప్రతిక్రియ చేయాలంటే కృష్ణుడి ఎత్తులకు పైఎత్తులు పడాలంటే అందుకు సర్వసమర్థుడవు నీవొక్కడివే. ఇంత మహాకార్యం నీ వలననే జరగాలి కాని ఇతరుల వలన కాదు.

దీనికి శల్యుడు- "నను కృష్ణు కంటె అధికుండని యి మ్మనుజేంద్రకోటి యాకర్ణింపం గొనియాడితి విమలయశోఘనుడగు కర్ణునకు రథము నడిపెద నధిపా!" రాజా! ఇంతమంది రాజులు వింటూ వుండగా నీవు నన్ను కృష్ణుడి కంటే గొప్పవాడివి అని ప్రశంసించినావు. దాతృత్వం మొదలైన కారణాలతో మంచిపేరు గల కర్ణునకు నేను రథం తప్పక తోలుతాను అన్నాడు.

ఎవరి నెట్లా పడగొట్టాలో దుర్యోధనునకు బాగా తెలుసు. శల్యుడి మాటలలో లోకరీతి బాగా తెలుస్తుంది. ఒకడి రథం నేను తోలటమేమనుకున్నప్పుడు, కర్ణుడు సూతజుడుగా, రాథేయుడుగా కనిపించాడు. నీవు కృష్ణుని కంటే గొప్పవాడవనేసరికి అదే కర్ణుడు విమలయశోఘనుడయ్యాడు. ఎంత ఆశ్చర్యం!

కాని మానవహృదయము మీద పొగడ్త ప్రభావము తాత్కాలికమే. దుర్యోధనుని పొగడ్తకు పొంగి శల్యుడు కర్ణసారథ్యం స్వీకరించినను తన కంటే తక్కువవాడన్నదే అతని హృదయమున స్థిరముగ నిలిచిన అభిప్రాయము. నొగలెక్కి కూర్చున్న శల్యుని ఏదో గొప్పవాడవని పొగడుచు, కర్ణుడు తన పని చక్కబెట్టుకొనలేదు. శల్యుడెంత స్వాతిశయపరాయణుడో కర్ణుడంత కంటే నాలుగాకులెక్కువ చదివినవాడు. శల్యుడు నొగలెక్కినది మొదలు కర్ణుడు ఆత్మస్తుతి ప్రారంభించినాడు. శల్యుడు పరస్తుతి (అర్జున ప్రశంస) ప్రారంభించినాడు. కర్ణుడి ఆత్మస్తుతికీ, శల్యుని పరస్తుతికీ ఘర్షణ మొదలైంది. ఘర్షణయే శల్యసారథ్యమునకు నాంది. పార్థుని బాణముల కంటే శల్యుని మాటలు కర్ణుని హృదయమును క్రూరముగ గాయపరచినవి. శల్యసారథ్యమే కర్ణుని యుత్సాహమును క్రుంగదీసినది. నాగాస్త్రమును గురి తప్పించినది. ప్రత్యర్థియైన పార్థునకు మేలు చేసినది.

అర్జునుడు నన్నే కనుక జయించినట్లయితే అప్పుడు ఏమి జరుగుతుందని ప్రశ్నించిన కర్ణునితో, శల్యుడు నేను ఇద్దరినీ, అంటే కృష్ణార్జునులను చుట్టుముట్టి, పైకొని వారిని పదునైన అనేక బాణపరంపరల పాల్జేతునని చెప్పాడు.

ఇదే విధమైన ప్రశ్నను అర్జునుడు అడుగగా, కృష్ణుడు హాస దీప్తవదనారవిందుడై, సూర్యుడు గగనము నుండి క్రింద పడినా, భూమి బ్రద్దలైనా, మేరుపర్వతం ఒక ప్రక్కకు వొరిగిపోయినా, కర్ణుడి చేతిలో నీవు ఓడిపోవటం జరుగదు అంటాడు.

పై వాక్యాలలోని భావాలు లోకానికి శల్య శ్రీకృష్ణులు మానవజాతికి ఇచ్చే శాశ్వత సందేశాలు. తాను చేయు పని స్థాయికి తగనిదని తలపోయువానికి తనపై అధికారి కంటే తానెంతో గొప్పవాడినని బాధపడువానికి, ఆయువుపట్టు వంటి పని అప్పగించరాదు. అతడు మనఃపూర్వకంగా పని చేయలేడు. పైవాని విజయమును కోరలేడు. విశేషించి అతని పతనమే ఇతని అభిమతము. అతని స్థానమే ఇతని ఆకాంక్షితము. పార్థసారథ్యమును శ్రీకృష్ణుడు ఆత్మీయముగా వరించినాడు. కర్ణసారథ్యమును శల్యుడు పరిస్థితుల ప్రాబల్యమునకు, ప్రలోభముల ప్రభావమునకులోనై చేపట్టినాడు. శ్రీకృష్ణుడు విజయసారథియైనాడు. శల్యుడు మాత్రం కర్ణసారథిగానే నిలిచినాడు.

ధర్మజుని అంచనా ప్రకారం శల్యుడు సారథిగా నొగలెక్కిననాడే కర్ణుని మృత్యువు తప్పదనేది తేటతెల్లమైంది. రహస్యం దుర్యోధనునకు తెలియదు. కర్ణుడెంత గూఢవర్తనుడో, శల్యుడు కూడా అంత గూఢవర్తనుడయ్యాడు. ఇద్దరూ రథిక సారథులుగా కుదరటం విధినిర్ణయం.

శల్యుడెంత కుటిలసారథ్యం నెరపినను కడకు కర్ణుని పరాక్రమాతిశయము నతడు గుర్తింపకపోలేదు. కర్ణుడు హతుడైన తరువాత కంట తడిపెట్టిన కౌరవపతి కడకేగి శల్యుడు, ప్రభూ! మనం ఎన్నో యుద్ధాలు చూచాము కానీ క్రౌర్యంతో కర్ణార్జునుల యుద్ధం వంటిదానిని ఎన్నడూ చూడలేదు. దేవతలు కూడా యుద్ధాన్ని చూచి ఆశ్చర్యపోయారు. కర్ణుడి విక్రమానికి కృష్ణార్జునులే భయపడ్డారు. ఇది విధి విలాసం. దీనికి దుఃఖించి ప్రయోజనం లేదు. "విను చెప్పెద, నెంతయు భీతి నొంది రా హరియు నరుండు కర్ణు వడి, కంత విధాత్రుడు తప్పె వానికిన్" అంటాడు.

సర్వసైన్యాధ్యక్షుడుగ నుండి శక్తి సామర్థ్యములు గలవాడనని భావించుకొనుచు తక్కువ స్థితిలో సామాన్య వీరుడిగ 17 దినములు పోరి, ఒక్కసారిగా ప్రభువుచే సర్వసైన్యాధ్యక్షుడుగా అభిషిక్తుడైన శల్యుడు, యుద్ధభూమిలో సామాన్యుడుగా విజృంభించునా? కర్ణ పతనానంతరము కౌరవులచే అభిషిక్తుడై సమరభూమిలో సేనల నడిపించు శల్యుని విజృంభణమెంత మహోగ్రమోశ్రీకృష్ణుడు ఊహించినాడు. శల్యుని మనస్తత్వమును, పరిస్థితుల ప్రభావమును పాండవులకు తెలియజెప్పి, ధర్మజుని పాండవ పక్షసైన్యాధ్యక్షుడుగ నిలిపినాడు.

శల్యునికి సమరభూమిలో కృష్ణార్జునులు గాని, భీమసాత్యకులు గాని ఎదురైయున్నచో బహుశః వారు తుత్తునియలయ్యెడువారు. అతని విజృంభణమట్టిది. వారన్న అతని కోపమంతటిది. కాని ధర్మజుడెదురైనాడు. దానితో శల్యుని విజృంభణము సగము చచ్చినది. ధర్మజుడన్న శల్యునికి తగని గౌరవము, అవ్యాజప్రేమ, అంతేగాదు, వారిద్దరి మధ్యా ఒక రహస్యపు ఒప్పందము గూడ జరిగినది. శల్యుడు తన నోటిమీదుగా కౌరవనాథుడా నహుషు కైవడి నాశము బొందునని, తమ్ములతో గలసి నీవు సర్వంసహాచక్రవర్తిసముడవై పరిపాలింపగలవని ధర్మజుని ఆశీర్వదించియున్నాడు. ఇప్పుడు ధర్మజునిపై ఎలా విజృంభింపగలడు? ఆయన మనస్సు వెనుకాడదా? అదే జరిగింది. ఒకసారి ధర్మజుని మూరి్ఛతుని గావించి, శక్తికి బలియైనాడు.

"భూమి మీద నిట్లు బోరగిలం బడి మద్రనాథు డొప్పె మానవేంద్ర, లేమ యురము నందు లీలమై వ్రాలిన ప్రాణనాథు బోల్ప బట్టు గాగ" ధృతరాష్ట్ర మహారాజా! ప్రకారంగా నేల మీద బోరగిలబడిన శల్యుడు యౌవనవతి అయిన మగువ వక్షస్థలం మీద విలాసంతో ఒరిగిన ప్రియునితో పోల్చటానికి తగినట్లుగా ప్రకాశించాడు అని సంజయుడు, తను చూచిన యుద్ధాన్ని ధృతరాషు్ట్రనికి  వర్ణించాడు.

శల్యుని పవిత్రమూర్తిత్వం, ధర్మస్వరూపం, వ్యక్తిత్వ సత్యం పద్యంలో మనకు తిక్కనగారు వివరించారు. రెండు ధర్మాలకు పరస్పర సంఘర్షణము, శల్యధర్మరాజుల యుద్ధంలోని అంతరార్థం. ధర్మరాజు చేతిలో మరణించడమే శల్యుని ఉత్తమత్యాగానికి నిదర్శనం. అతడు యుద్ధం చేసింది సగం దినం, మరి కొన్ని ఘడియలు మాత్రమే. పాండవులను సంహరించే ప్రతాపాన్ని ప్రదర్శించి మెఱపు వలె మెరసి ఆరిపోయాడు. ధర్మరాజు చేసిన ధర్మయుద్ధంలో చనిపోయిన శల్యుడు, శాస్త్రోక్తంగా సమర్పించిన హవిస్సులను స్వీకరించి చల్లారిన హోమాగ్ని వలె భాసించాడు.


లోకమున ముఖస్తుతులు, మర్యాదలు, మానవస్వభావముపై ఎంతటి ప్రభావము చూపగలవో, ముఖస్తుతులకు, మర్యాదలకు లొంగిపోవువారు, శక్తిసామర్థ్యములు గలిగి చిత్తశుద్ధి లేక ఉభయపక్షములకు మాట ఇచ్చి చావుతో పాటు చెడ్డ పేరెట్లు తెచ్చుకొందురో, శల్యుని పాత్రలో మహాభారతము ప్రదర్శించినది. పాండవధర్మపక్షాన నిలిచి పోరాడవలసిన మేనమామ అధర్మపక్షాన నిలిచి ఎంత అపకీర్తిని మూట గట్టుకొన్నాడో విజ్ఞులు గ్రహిస్తారనీ, దీనినే విధివైపరీత్యమని కవిత్రయభారతం దేశమానవాళికి ఇస్తున్న సందేశంగా మనం గ్రహించాలి.