యుధిష్ఠిరుడు

యుధిష్ఠిరుడంటే యుద్ధంలో (యుధి) వెనక్కు మళ్లకుండా స్థిరంగా నిలిచి ఉండేవాడని (స్థిరః) అర్థం. ఇతన్నే ధర్మరాజని అంటూ ఉంటాం. ధర్మంతో విరాజిల్లేవాడని మాటకు అర్థం. ధర్మమంటే ధరించేదీ, పట్టి ఉంచేదీ, పోషించేదీ అని అర్థం. సృష్టి తాలూకు స్థిరమైన నియమాల రూపంలో భగవం తుడి ఇచ్ఛాశక్తి పట్టి ఉంచుతోంది గనకనే విశ్వాసానికి అస్తిత్వం వచ్చింది. అంచేత భగవంతుడే వాస్తవమైన ధర్మం. భగవంతుడు లేదే ఏదీ నిలవ లేదు. ప్రతి మనిషీ తాను భగవచ్ఛక్తితో పోషితమవు తున్నానని అనుభవపూర్వకంగా తెలుసు కోవడమే అన్నిటినీ మించిన గొప్ప ధర్మం.

ధర్మంతో విరాజిల్లడానికి జీవితమనే యుద్ధంలో ఎన్నెన్ని కష్టాల తుపానులు వచ్చినా వెనుదిరగకుండా ప్రశాంతంగా ఉండటానికి పోరాడుతూ ఉండాలి. ధర్మరాజు ఆకాశమంత ఉండే శాంత గుణానికి ప్రతినిధి. భాగవతంలో (1-9-15) భీష్ముడి చేత వ్యాసమహర్షి, మన అందరి కళ్లనూ తెరిపించే ఒక మాట అనిపించాడు: ‘యత్ర ధర్మసుతో రాజా గదాపాణిర్వృకోదరః! కృష్ణో స్త్రీ గాండివం చాపం సుహృత్కృష్ణస్తతో విపత్!

 సాక్షాత్తూ ధర్ముడి కొడుకే రాజు; గద చేతబట్టిన భయంకరుడైన భీమసేనుడే అతని పక్క నిలిచి ఉన్నాడు; దివ్యాస్త్రాలు దిట్టంగా వేయగలిగే అర్జునుడు నిత్యమూ అతన్ని కాపాడుతున్నాడు; అర్జునుడి విల్లేమో అందరి గుండెలనూ అవిసి పోయేలాగ చేసే గాండీవం; స్నేహితు డంటారా సాక్షాత్తూ దేవదేవుడైన శ్రీకృష్ణుడు. అటువంటి గొప్ప స్థితుల్లో ఉన్న పాండవులందరూ ఘోరమైన విపత్తులను అనుభవించవలసి వచ్చింది. దీన్ని మనం ఏవిధంగా అర్థం చేసుకో గలం? అర్థం చేసుకొందామని ప్రయత్నిం చిన పెద్ద పెద్ద మేధావులే తలలు పట్టుకొని కూలబడ్డారు. అన్నిటికీ కారణం మునపటి కర్మల ఫలితాలే. జన్మలో వాటి దాఖలాలేమీ అవుపించకపోయేసరికి దేవుణ్ని తప్పుబట్టడానికి ఒంటికాలి మీద లేచి కోపంతో ఊగిపోతూ ఉంటాం మనమందరమూను.

 ధర్మరాజంతటి తెలివిగలవాడూ ధర్మ మూర్తీ మరొకడు లేడని అందరూ తలలూపి మరీ ఒప్పుకొంటారు. లక్క ఇంట్లో ఎదురవబోయే ఘోరమైన ప్రమాదం గురించి విదురుడు గూఢమైన భాషలో చెబుతూంటే అర్థం చేసుకొన్న తెలివి ఇతని సొత్తు. అతనే లేకపోతే వాళ్లందరూ అపమృత్యువు పాలైపోయే వాళ్లు. కానీ ఇంతటి తెలివిగలవాడూ జూదం ఆడవలసిన అగత్యమేమొచ్చింది అని అందరికీ అనుమానం వస్తుంది. అయితే, దీనికో బలమైన కారణం నిక్కచ్చిగా ఉంది. తండ్రిగారు స్వర్గంలో కలకాలమూ ఉండాలంటే తనను రాజసూయయాగం చేయమని నారదుడి చేత కబురుపెట్టాడు. మహాయాగం చేయడమంటే మొదట ఇతర రాజులందరి తోనూ కయ్యాన్ని పెట్టుకోవాలి; వాళ్లను గెలవాలి. గెలవడం వాళ్లకు అతి కంటగింపుగా ఉంటుంది. అలాగా చాలా మందితో వైరం వచ్చి కూర్చొంటుంది.

 రాజసూయయాగం చేయడమంటే గొప్ప వినాశానికి శ్రీకారం చుట్టడమేనని నారదుడు అంటించిపోయాడు. రాజసూయంలో శ్రీకృష్ణుడికి అగ్రపూజ చేయడమే తడవు శిశుపాలుడు శ్రీకృష్ణుణ్ని తిట్టిన తిట్టు తిట్టకుండా అదేపనిగా తిడుతూ అతని చక్రానికి బలి అయ్యాడు. దీనితో రాజ సూయం వల్ల వచ్చే ఉత్పాతాలన్నీ తీరి పోయాయని అనుకొంటూ సందేహాన్ని తీర్చుకొందామని వ్యాసమహర్షిని అడిగాడు. ‘అబ్బే, ఉత్పాతాల మహా ఫలం పదమూడేళ్ల దాకా ఉంటుంది. క్షత్రియులందరూ కట్టకట్టుకొని దుంప నాశనమైపోతారు. నిన్నొక్కణ్నే నిమిత్తంగా చేసుకొని మొత్తం రాజసముదాయమంతా యుద్ధాగ్నిలో సమిధలై కాలి బూడిదై పోతారు. మహావినాశనానికి మూల కారణం దుర్యోధనుడి అపరాధమూ భీమార్జునుల అతిబలమూ అవుతుందిఅని జూదాల తరవాత రాబోయే మహా యుద్ధాన్నీ దాని పర్యవసానాన్నీ కూడా ముందుంచి ఆయన వెళ్లిపోయాడు.

 అప్పుడు యుధిష్ఠిరుడు తమ్ముళ్ల ఎదురు గుండా అన్న మాటలూ, చేసిన ప్రతిజ్ఞా, అతను జూదమాడటానికి అసలైన కారణాన్ని విప్పిచెబుతాయి: ‘వ్యాస పితామహుడు చెప్పిన మాటలు విన్నారుగా! నేను మహావినాశనానికి హేతువునవు తానంటే నాకు చావే మేలనిపిస్తోంది. రోజునుంచీ పదమూడేళ్ల పాటు నేను బతికుండి ఏం లాభం? అంచేత ఒక ప్రతిజ్ఞ చేస్తాను మీముందు: ‘ ప్రవక్ష్యామి పరుషం భ్రాతృనన్యాంశ్చ పార్థివాన్! స్థితో నిదేశే జ్ఞాతీనాం యోక్ష్యే తత్ సముదాహరన్!’ (సభాపర్వం 46-27): నా అన్నదమ్ములతో గానీ ఇతర రాజులతో గానీ నేను కఠినంగా మాట్లా డను.

జ్ఞాతులు ఏవిధంగా నడవమంటే విధంగానే నడుస్తాను. భేదిస్తేనే గదా కలహమొచ్చేది. ఈవిధంగా యుద్ధాన్ని దూరంగా ఉంచుతూ అందరికీ ప్రియాన్నే చేస్తూ లోకనిందను పొందకుండా ఉంటాను’. ప్రతిజ్ఞే, యుధిష్ఠిరుడు జూదం వల్ల వచ్చే మంచీ చెడుల్ని తెలుసుండీ కూడా దుర్యోధనుడడగ్గానే ఆడటానికి ఒప్పుకోడానికీ, అతని బదులు మోసగాడైన శకుని ఆడడానిక్కూడా ఒప్పుకోవడానికీ, ఏయే పందేలు ఒడ్డమని సూచిస్తూ ఉంటే ఆయా పందేలను ఒడ్డడానికి అన్నిటికీ ముఖ్యమైన కారణం.

 జూదమాడటమంటే మాయకు లొంగి పోవడమే. అంతటి శాంతపరుడూ ధర్మ మూర్తీ ప్రజ్ఞావంతుడూ మాయక్కూడా లొంగిపోవడానికి ఒప్పుకొన్నాడంటే, తాను మహావినాశానిక్కారణం కావలసి వస్తోందని ఎంతటి దీనస్థితిని పొందేడో అర్థం చేసుకోవచ్చు. ఘోషయాత్రలో  ‘మా బాగా అయిందన్న ట్టుగా సంతోషాన్ని వెలిబుచ్చుతూన్న భీముణ్ని మందలిస్తూ తమను అవమానించడానికి వచ్చిన దుర్యోధన దుశ్శాసనాదుల్ని కాపాడేలాగ చేశాడు యుద్ధాన్ని ఏదోవిధంగా ఆపుదామని శతవిధాలా ప్రయత్నించిన శాంతిప్రియుడు. ద్వైతవనంలో వేటాడుతూన్న భీముణ్ని కొండచిలువ రూపంలో ఉన్న నహుషుడు పట్టుకొన్నాడు. అంతటి బలమున్నవాడికీ చిలవపట్టు నుంచి బయటపడటం చేతగాలేదు. నహుషుడడిగే ప్రశ్నలకూ జవాబు చెప్పగలిగే స్థితిలో కూడా లేడు అతను.

  అప్పుడు ధర్మరాజే నహుషుడి ప్రశ్నలకు సమాధానం చెప్పి, చావుకు గురి అయిన భీముణ్ని కాపాడాడు. భీమార్జు నులే అసలైన యోద్ధలని అనుకొంటూ ఉంటాం మనమందరమూను. వాళ్లిద్దరూ కూడా నకుల సహదేవులతో సహా అందరూ నీళ్లకోసం వెళ్లి, సరోవరం నుంచి వినిపిస్తూన్న యక్షుడి స్వరాన్ని పట్టించు కోకుండా అతిగర్వంతో నీళ్లను తాగి కిందపడి చచ్చిపోయారు. యుధిష్ఠిరుడి విజ్ఞానమే భీమార్జున నకుల సహదేవుల్నందర్నీ కాపాడి పునర్జన్మ నిచ్చింది.

పెద్దకొంగ రూపంలో ఉన్న యక్షుడి ప్రశ్నలకు జవాబులు చెప్పి, రూపంలో వాళ్ల అజ్ఞాతవాసం గడపటానికి ఆలోచనను చెప్పడానికి వచ్చిన యమధర్మరాజు ప్రసాదాన్ని పొందడానికి కారణం కూడా ఇతనే. యక్షుడు వేసిన చాలా ప్రశ్నల్లో ముఖ్యమైంది ఒకటి ఉంది: కులమూ ఆచారమూ చదువూ అనే వాటిలో దేనివల్ల బ్రాహ్మణత్వం సిద్ధిస్తుంది? అనే ప్రశ్నకు యుధిష్ఠిరుడు చెప్పిన సమాధానం మన అందరి కళ్లనూ తెరిపించే విధంగా ఉంటుంది: ‘బ్రాహ్మణత్వానికి కారణం కులమూ స్వాధ్యాయమూ ఇవేమీ కావు.

 ఒక్క వృత్తమే. అంటే, వర్తనమే, ఆచరణమే కారణం. తెలిసినదాన్ని ఆచరణలోకి మార్చినవాడే పండితుడు. నాలుగు వేదాలూ వల్లించినా అతను దుశ్శీలుడైతే మాత్రం శూద్రుడి కన్నా తీసికట్టే అవుతాడు. ఎప్పుడూ ఇంద్రియాలను అదుపులో పెట్టుకొంటూ తన పరిమి తత్వాన్ని పరమేశ్వరుడి అనంతత్త్వమనే అగ్నిలో వేలుస్తూ ఉండే వాడే బ్రాహ్మణు డంటే’- కొడుకు చెప్పిన జవాబులకు మురిసిపోతూ కూడా అతన్ని పరీక్షించ డానికిఇప్పుడు ఒక్కణ్ని మాత్రమే బతికిస్తాను. ఎవర్ని బతికించమంటావు?’ అని యక్షుడి రూపంలోవున్న యమధర్మ రాజంటే, దానికి బదులుగా ధర్మరాజునకులుణ్నిఅని అన్నాడు. ‘భీమార్జునులనే మహాబల వంతుల్ని వదిలి నకులుణ్ని కోరుకొన్నా వేమిటి?’ అని యక్షుడు ఆశ్చర్యాన్ని కన బరిచినట్టు అన్నాడు. ‘నాకు కుంతీ మాద్రీ ఇద్దరూ ఒకటే. మా ఇద్దరు తల్లులూ సపుత్రులుగావాలి. ఇదే ధర్మం అని బదులు చెప్పిన ధర్మమూర్తి.

  గొప్ప జవాబుకి సంతోషించి, యక్షుడు నలు గుర్నీ బతికించాడు. ‘మీరు అజ్ఞాతవాసం చేసేటప్పుడు మీ మీ సొంత రూపాల్లో ఉన్నా కూడా మిమ్మల్ని మూడు లోకాల్లో ఎవ్వరూ పట్టలేరు. మీరు విరాట నగరంలో ఉండి సంవత్సరాన్ని గడపండిఅని వరమూ సలహా రంగరించి ఇచ్చి యముడు మాయమయ్యాడు.

 ధర్మరాజు యుద్ధాన్ని మాన్పించడానికి చాలా ప్రయత్నాలే చేశాడు. ఆఖరికి మా ఐదుగురికీ ఐదూళ్లిస్తే చాలని చెబుతూ సాక్షాత్తూ శ్రీకృష్ణుడ్నే రాయబారానికి పంపాడు. కానీ దుర్యోధనుడుసూది మొనమోపినంత చోటును కూడా ఇవ్వనని భీష్మించడంతో పోరు తప్పలేదు, ఆపుదామని శతవిధాలా ప్రయత్నించినా క్షత్రనాశనం తప్పలేదు. అధర్మాన్ని సమూ లంగా పెరికిపారెయ్యడానికి సర్వ నాశనానికి తాను నిమిత్తమైనా వెనుదీయ కుండా యుద్ధానికి సిద్ధం కావాలని పెద్దలు చెప్పిన మాటను శిరసా వహించాడు.


మాద్రి అన్నగారు శల్యుడు, దుర్యోధనుడి సత్కారాలకు మైమరచిపోయి అతనివైపు యుద్ధం చేయడానికి ఒప్పుకొన్నా, అతన్ని కర్ణుడి మనస్సును విరగ్గొట్టడానికి ఉపయో గించాడుమెత్తనిపులిలాంటి ధర్మరాజు. ఇదేశల్యసారథ్యమనే నానుడిగా స్థిర పడింది: తానున్నవైపు వాళ్ల మనస్సును పాడుచేస్తూ కీడు తలపెట్టే వాణ్ని శల్యసారథ్యం చేస్తున్నాడని అంటారు. శల్యసారథ్యానికి విత్తనం వేసినవాడు ధర్మరాజు. శ్రీకృష్ణుడి మాటను వింటూఅశ్వత్థామో హతఃఅని బిగ్గరగా అని, ‘హతః కుంజరఃఅని నెమ్మదిగా అని సత్యానికి మసిపూయడంతో ఇంతటి శాంతమూర్తీ నరకాన్ని చూడవలసి వచ్చింది. విదురుడితనిలో లీనమైన తరవాత మహాప్రస్థానం చేస్తూ తమ్ముళ్లూ భార్యా ఎవరు పడిపోయినా పట్టించు కోకుండా ముందుకు సాగిపోయాడు. తనతో వచ్చిన కుక్కను తనతోపాటు పుణ్యలోకానికి పంపమన్న ధర్మమూర్తి ఇతను. ఐదుతత్త్వాల్లో ఆకాశతత్త్వానికి ప్రతీక ఇతను.