తారకాసుర వృత్తాంతం-శ్రీ శివ మహాపురాణము


"రాక్షసులకు తల్లి దితి. ఈమె కశ్యప ప్రజాపతి భార్య. ఆమె కుమారులే హిరణ్యాక్ష, హిరణ్య కశిపులు. వీరు శ్రీహరి అవతారాలైన వరాహ - నరసింహ రూపాలచే వధింపబడిన వైనం మీకు తెలిసిందే.

ఆ తదుపరి ఆమెకు శివదీక్షా మహిమవల్ల వజ్రాంగుడనే వాడు ఉదయించాడు. దైవభక్తి వల్ల ఇతడిలో సాత్త్విక గుణం అధికంగా ఉండగా, దురదృష్ట వశాన ఇతడికి భార్య అయిన వరాంగికి అంతులేని కామం - అధిక తామసం ఉండేవి.  
ఒకనాడు మహదానంద వేళ, భర్తను అమితంగా సుఖకేళి యందు సంతోషపరచి ఓ వరాన్ని భర్తనుంచి పొందిందా కాముకి. హరిని దుఃఖపెట్టగల, ముల్లోకాల్లోనూ ఎదురన్నదే లేని అమిత బలశాలి అయిన కొడుకును కనాలన్నదే ఆమె కోరిక.

బ్రహ్మకై తపస్సుచేసి వజ్రాంగుడామె కోరిక నెరవేర్చాడు. లోకాలన్నీ వాడు పట్టడంతోనే గడగడలాడి మరీ శోకించాయి. వాడే తారకుడు. తండ్రినిమించి మరీ బ్రహ్మ గురించి తపస్సు చేశాడు.

ఉగ్రమైన తపస్సుతో బ్రహ్మను మెప్పించి మెలికతో కూడిన వరాలెన్నో పొందాడు. మచ్చుకు కొన్ని చూడండి! అపారమైన -అనంతమైన శక్తి యుక్తులుండాలన్నాడు. విశ్వవిజేతను కావాలన్నాడు. శివుడి వల్ల గానీ, విష్ణువు వల్లగానీ చావకూడదన్నాడు. మళ్లీ అంతలోనే ఏం గుర్తొచ్చిందో ఏమో!

అసలు బ్రహ్మ సృష్టిలో దేనివల్ల చావు రాగూడదని కోరుకున్నాడు. ఇన్ని కోరినా అసలు సిసలు వరం... ఎక్కడో
తప్ప అసాధ్యమయ్యే వరం.. కోరడంలోనే ఉంది అసలు మెలిక. పరమ విరాగి, నిత్యతపస్వి, సతీ వియోగి అయిన పురుషుడికి ఎవరైనా కుమారుడుగా జన్మిస్తే, అతడి వల్ల మాత్రమే తనకు మరణం ఉండేలా వరం అనుగ్రహించేశాడు బ్రహ్మ. పెళ్లమేలేని వాడై - పైగా విరాగియై ఉండేవాడెక్కడైనా ఉంటాడా? భార్యవుంటే విరాగి ఎలా అవుతాడు? పైగా నిత్యతపస్వి. అంటే, భార్యవున్నా ఒకటే! లేకున్నా ఒకటే! ఇంత ఆలోచించిన తారకాసురుడు, ఆ వర గర్వంవల్ల తనకిక ఎదురులేదని భావించాకనే దేవతలను సాధించడం మొదలుపెట్టాడు. పైగా వాడు తన తాతవైన గాధలు చిన్నతనంలోనే తన నాయనమ్మ ద్వారా హత్తుకు పోయేలా చెప్పించుకు విని కసిపెంచుకున్నందువల్ల కూడా అలా తయారయ్యాడు.

ముందు వెనుకలు చూడకూండా బ్రహ్మ ఇచ్చిన వరాలతో, దేవతలకే శిరోవేదన కలిగించేవా డయ్యాడు. నాలుగు తలలున్నా, సమయానికి ఒక్క తలతో అయినా ఆలోచించకుండా వరాలిచ్చినందుకు బ్రహ్మకే తలపట్టుకోవాల్సిన స్థితి కల్పించాడు. అదీ సంగతి" అని తారకాసురుని వృత్తాంతం చెప్పాడు సూతుడు.

అనంతరం...

మునులందరి కోరికపై మళ్లీ గిరిజా శంకరుల గాథ నెత్తుకున్నాడు సూతుడు. "....కనుక, తారకుడు కోరిన రీతిన అన్ని విధాలా సరిపోగలిగిన వాడు... శివవీర్యసంజాతు డొక్కడే గనుక దేవతలకు అంత ఆతృత, ఆదుర్దా!

దేవతల ఆశీస్సులు దండిగా అందుకున్న మదనుడు "సర్వ ప్రపంచాన్నీ సమ్మోహపరచగల నేను, సాక్షాత్ శర్వుడినే చలింపచేస్తేనే కదా! నా సత్తా లోకానికి వెల్లడయ్యేది" అనే పట్టుదలతో కూడా, శివుడు తపమాచరిస్తున్న తావుకు చేరువైనాడు.

ఇంకేమున్నదీ....అకాలంలో వసంతఋతు సూచన లారంభమైనాయి. కాలం కాని కాలంలో వసంతాగమనం తపోదీక్షాపరులకు ప్రతికూలవర్తి. అశోకాది వృక్షాలు పూచాయి, మామిళ్లు విరగకాచాయి. తుమ్మెదల ఝుంకారం - కీర శుక పికాల కలకలారావం అధికమైంది.

ఈ మధుమాసపు అలజడీ - మదనుడి సందడీ దేవలోకం నుండి హిమాలయ విహారాలకొచ్చిన కిన్నెర కింపురుష గంధర్వాదులకు మదనకేళికి సమాయత్తపరిచేలా ఉండగా, మహేశ్వరుని మనస్సును అణుమాత్రము సంచలింప చేయకుండెను.

పరోక్షమున కాకుండ, ప్రత్యక్షమున తన ప్రతాపాన్ని చూపించాలనుకున్నాడు. అతడి ప్రయత్నానికి సహకరిస్తోందా అన్నట్లు పార్వతి కూడా, శివ పరిచర్యార్ధం ఆ సమీపంలోనే సంచరిస్తున్నది. మదనుడికి మంచి పట్టు దొరికినట్లయింది.

తరుణాబ్జముఖి - పర్వతరాజపుత్రి, చంద్రశేఖరుని సమీపించి అంజలి ఘటించి నిలిచింది. సరిగ్గా అదే సమయంలో శివుడు ధ్యాన నిష్ఠలోంచి కళ్లు తెరిచి తన ఎదుటనున్న పార్వతిని హసన్ముఖుడై చూశాడు.

అదే అదనుగా భావించిన మదనుడు 'హర్హణ' మనే శరాన్ని ప్రయోగించాడు - క్షణం కూడా ఆలస్యం చేయకూండా. వెంట వెంటనే 'సమ్మోహ'నాస్త్రం సంధించాడు.

ఇంకేమున్నదీ?.. ఆ లతాంతాయుధ ప్రభావంవల్ల - చంద్రోదయవేళ సముద్రం ఉప్పొంగిన రీతిన నిమేషకాలం ఈశ్వరుని చిత్తం చలించింది. కాని...

అంతలోనే శివుడు అప్రమత్తుడైనాడు. తనకు కలిగిన వికారానికి కారణం తెలియడం కోసం చుట్టూ చూశాడు. శివుడు తననే వెతుకుతున్నాడని అర్ధం అయింది మదనుడికి. తప్పించుకొని పారిపోయేలోగానే గిరీశుని దృష్టికి దొరికిపోయాడు. తక్షణం, తీక్షణమైన తన మూడో కంటిని తెరిచాడు - త్రిలోచనుడు. ఆయన మూడో కన్ను అసలే అగ్నికీలలకు ఆలవాలం కదా! ఓ మహోగ్రజ్వాల వెలువడింది. నిటలాక్షుడి నయనంలోంచి. అంతే! మన్మథుడు భగ్గున మండిపోయాడు. తిరిగి చూస్తే ఇంకే ముందక్కడ? బూడిదకుప్ప తప్ప.

ఆ మహావిషాదకర దృశ్యాన్ని చూసిన దేవ, మునులంతా హాహాకారం చేశారు. మన్మధుని రక్షించాలనే ఆత్రంతో వస్తున్నవారందరూ ఇంకా అంతదూరాన ఉండగానే, వారి కళ్ల ఎదుటే జరిగిపోయిందీ దారుణం!

హటాత్తుగా ఆవనిలో విరసిన ఆమని అంతర్ధానమైంది.

మన్మధపత్ని రతీదేవి కీవార్త క్షణాలమీద తెలిసింది. ఆమె శోకవిచలిత అయిమూర్చల్లింది. పరిచర్యలతో తిరిగిలేచి దీర్ఘశోకంలో మునిగింది. దేవతలంతా ఏకమై, తన పతిదేవుడిని బూడిదగా మిగిల్చారని పలురీతుల వాపోయింది. తన పతిలేని బ్రతుకిక వృధా అని తలచి, అగ్ని ప్రవేశానికి సిద్ధపడింది.

అంతలో ఆకాశవాణి రతీదేవి నుద్దేశించి ఇలా పలికింది.

"మన్మధసతీ! సాహసమువలదు. నీకు అతిస్వల్ప సమయములోనే శుభము జరుగనున్నది. ఏది కర్మరీత్యా జరుగనున్నదో, అది జరుగక మానదు. అంతేకాదు! నీ భర్తకు బ్రహ్మశాపము గలదు. నీ జననమునకు పూర్వమే జరిగిన, ఆ శాపగాథ నీకు తెలియకపోతే పోనిమ్ము!

గర్వాంధత చేత నీల కంఠునికే మదనతాపము పుట్టించు దుస్సాహసము నీ భర్తది. ఆ భస్మము జాగ్రత్తగా కొంగున మూట కట్టుకో! ఎప్పుడైతే పార్వతీ పశుపతుల కళ్యాణం జరుగుతుందో - ఆనాడు అంబికాదేవి కోరిక మేరకు, శివుడు కరుణాంతరంగుడై మన్మధుని తిరిగి బ్రతికించగలడు".

అశరీరవాణి చెప్పిన ఈ మాటలకి రతీదేవి కొంతూరట చెందింది. వారి కళ్యాణం ఎప్పుడా అని వేయి కళ్లతో ఎదురుచూడ సాగింది.

పార్వతీదేవికి వైనం అంతా తెలిసి, ఎంతో విచారించింది. తాను ఒక వంక భర్తకోసం తపిస్తూ వుంటే, అన్యాయంగా - తన కారణంగా తాను ఇంకోవనితను భర్తకు దూరం చేయడం జరిగిందేమిటీ...అని ఎంతో ఖేదపడింది.

ఎప్పుడైతే, మన్మధ దహనకాండ జరిగిందో, ఇక అక్కడ తాను ఉండజాలనంటూ శివుడు అంతర్హితుడయ్యాడు అక్కడనుంచి. పార్వతి పరి పరివిధాల పరితపించుచు, తన శివు నెందును కానరాక ఉంటుచుండగా, నందికేశ్వరుడు - తదితర మనీశ్వరులు ఆ పర్వతరాజపుత్రిని ఊరడించి, తిరిగి ఆమెను హిమవంతుని సన్నిధిన చేర్చి, జరిగిన సంగతంతా వివరించారు.

తన పుత్రికకు జరిగిన ఆశాభంగానికి హిమవంతుడు కూడా ఎంతో చింతించాడు. ఇంకొక ప్రక్క దుఃఖాగ్ని తప్తయైన తన కూతురును ఓదారుస్తూ "తల్లీ! ఇక మన ప్రాప్తమింతే! ఊరడిల్లు" మని చెప్పి ఒప్పించే ప్రయత్నాలు చేయసాగాడు. మేనకాదేవి భర్త ననుసరించింది.