రసరమ్యం...రాఘవేంద్ర చరితం
శ్రీరాఘవేంద్రులు
జ్ఞాన సంపన్నుడు, సిద్ధ పురుషుడు. పిలిస్తే పలికే ప్రత్యక్ష దైవం.
మంత్రాలయంలోని బృందావన సన్నిధానంలో భక్తులు పొందే శాంతి సంతృప్త్తుల మాటలకందనివి.
అలజడి, అశాంతి, ఆందోళనలతో నిండిన నేటి కుహనా నాగరిక
సమాజానికి అటువంటి సత్పురుషుల సాహిత్యం, సాన్నిహిత్యం, సాన్నిధ్యం
ఎంతో అవసరం. అది నిరంతరం వెలిగే అఖండ జ్యోతి. ఈ చిన్న శ్లోకం శ్రీ రాఘవేంద్రుల
వ్యక్తిత్వాన్ని దైవత్వాన్ని శక్తిమత్త్వాన్ని సూచిస్తుంది.
ఆరాధ్యదైవం
మధ్వ
సాంప్రదాయంలో ఆధ్యాత్మికంగా అత్యున్నత స్థాయికి చెందిన యతివరేణ్యుడు శ్రీ రాఘవేంద్రస్వామి.
నిత్య సత్య చైతన్యమూర్తి. భౌతికంగా కనిపించకపోయనా తన దివ్య మహిమలతో, లీలలతో
ఆశ్రీత భక్తకోటికి దయామయుడుగా ఆపద్బాంధవుడుగా, రక్షకుడుగా
ఆరాధ్య దైవమైనాడు. శ్రీ రాఘవేంద్రస్వామి పీఠాధిపత్యం వహించిన తర్వాత అంతవరకు
సమతీంద్ర మఠంగా ఉన్నది రాయ మఠంగా మార్పుచెందింది. గత జన్మలలో దేవతాగణంలో
శంకువరుణుడనీ, తదుపరి భక్తప్రహ్లాదుడనీ, ఇటీవలి
కాలంలో వ్యాసరాయలనీ శ్రీ రాఘవేంద్రుని గురించి మధ్వ సంప్రదాయం విశ్వాసపూర్వకంగా
భావిస్తుంది. దానిని కర్నాటక హరిదాస సంప్రదాయం కూడా సమర్ధిస్తుంది.
మధ్వ
గురుపరంలో శ్రీరాఘవేంద్రులది విశిష్టస్థానం. జీవసమాధి చెంది మూడువందల ఏళ్లు
దాటినప్పటికీ ఆయన శక్తి ప్రభావం నిత్య నూతనంగా వర్ధిల్లుతున్నదనడానికి నిరంతరాయంగా
భక్తి ప్రపత్తులతో బృందావన దర్శనానికి వస్తున్న అపార జన సందోహమే సాక్ష్యం.
పేదరికంతో
మగ్గిన స్వామి
శ్రీ
రాఘవేంద్రస్వామి 1571లో కాంచీపురం సమీపంలోని భువనగిరిలో నిరుపేద
కుటుంబంలో పవిత్రవర్తనులైన తిమ్మన్నభట్టు, గోపికాంబ దంపతులకు జన్మించాడు.
తల్లిదండ్రులుపెట్టిన పేరు వెంకటనాధుడు. వీరి తాతగారు శ్రీకృష్ణ్ణదేవరాయల ఆస్థాన
వైణికుడిగా వుండేవారు. వెంకటనాథుడి బాల్యంలోనే తల్లిదండ్రులు గతించారు. బావగారైన
లక్ష్మీనారాయణ చేరదీశాడు. బావగారి పెంపకంలోనే వెంకటనాథుడు సర్వశాస్త్ర
పారంగతుడయ్యాడు. యుక్తవయసు రాగానే సరస్వతి అనే కన్యతో వివాహమైంది. ఓ పిల్లవాడు
కూడా పుట్టాడు. కాని వెంకటనాధునికి దరిద్రం దావాలనంలా చుట్టుముట్టింది.
ఆదుకునేవారెవరు లేరు. నిస్సహాయ స్థితిలో వెంకటనాధుడు భార్యాబిడ్డలతో కలిసి
కుంభకోణం చేరుకున్నాడు. అనూహ్యంగా అక్కడ తాత్కాలికంగా బసచేసిన సుధీంద్ర
తీర్థులవారి ఆశ్రయం లభించింది.
గురుసాంగత్యం
సుధీంద్రుడు
కొత్త శిష్యుడైన వెంకట నాధుని ఎంతో ప్రేమగా ఆదరించాడు. శిష్యుని అసమాన్య
ప్రజ్ఞాపాటవాలకు ఆశ్చర్యపోయాడు. అతని మేథాశక్తిని, శాస్త్ర
జ్ఞాన ప్రావీణ్యాన్ని అభినందించకుండా ఉండలేకపోయాడు. జ్ఞాన వరిష్టుడైన వెంకటనాధుని
వినయ విధేయతలు చిత్తశుద్ధీ గురువైన సుధీంద్ర యతీంద్రులను బాగా
ఆకర్షించాయి.వయోభారంతో వున్న సుధీంద్రులు శిష్యుడైన వెంకటనాధుని ఒకరోజు చేరపిలిచి
వెంకట నాథా! నేను వృద్ధాప్యంలో ఉన్నాను. ఈ శరీరం నేడోరేపో అన్నట్టుగా ఉంది.
రామచంద్రమూర్తి ఆరాధన నిరంతరాయంగా కొనాగించేందుకు నా తర్వాత ఈ పీఠాధిపత్యం నీవు
వహించాలి అని తన మనసులోని కోరికను బయటపెట్టాడు. తకు భార్యాబిడ్డలున్నారని కుటుంబ
పోషణ చేసి వారిని సుఖపెట్టడం తన బాధ్యత అని తన అశక్తతను వెల్లడించాడు వెంకటనాథుడు.
గురువుగారి కోరికను తీర్చలేకపోతున్నందుకు వ్యాకులపడుతూ ఇంటికి చేరుకున్నాడు.
భార్యకేమీ చెప్పలేదు.
సరస్వతీ
కటాక్షం
ఆ
రాత్రి కలలో సరస్వతీదేవి ప్రత్యక్షమై నాయనా వెంకటనాథా! నీవు కారణ జన్ముడవు. నీ
అద్భుత మేధా సంపత్తితో సద్గురువువై దారి తప్పిన జనాలకు దారి చూపు! అంతేకాదు
వ్యతిరేక వర్గాల ఎదురు దాడులనుంచి మధ్వ సిద్ధాంతాన్ని మధ్వ సాంప్రదాయాన్ని
రక్షించగల సమర్ధుడవు నీవే. లే! ఆలోచించక నీ గురువు చెప్పినట్టు చెయ్యి అని
పలికింది. మేల్కొన్న వెంకటనాథుడు పరుగు పరుగున గురువు సన్నిధికి చేరుకున్నాడు.
సుధీంద్రులు
వెంకటనాథుని తంజావూరులోని తన ఆశ్రమానికి తీసుకునిపోయి శాస్త్రోక్తంగా సన్యాస
దీక్షనిచ్చి పీఠాధిపత్యం అప్పగించాడు. దీక్షానామం రాఘవేంద్రస్వామి. ఈ విషయం
తెలుసుకున్న వెంకటనాధుని భార్య సరస్వతి దుఃఖ భారంతో బావిలో దూకి ఆత్మహత్య
చేసుకుంది.
40 ఏళ్ల
పవిత్ర జీవనం
సన్యాస
దీక్ష తీసుకునేనాటికి రాఘవేంద్రుల వయసు 23 ఏళ్లు. తదుపరి 40 ఏళ్లు
అతి పవిత్ర జీవనం గడిపి నియమ నిష్టలతో నిత్య సైమిత్తికాలతో మూలరాముని ఆరాధించాడు.
ఈ 40 ఏళ్ల కాలంలో సాధించిన విజయాలు, జరిగిన
సంఘటనలు, మహిమలు వారి సోదరి కుమారుడు నారాయణాచార్
రాఘవేంద్ర విజయమ్ అన్న గ్రంథంలో నిబద్ధం చేశారు. ఆనాటి నవాబు ఒకరు రాఘవేంద్రులను
పరీక్షింపదలచి రెండు బుట్టలతో మాంసం పంపాడు. భక్తులు శిష్యులు ఆ బుట్టలు తెరిచి
చూడగా పళ్లు, పువ్వులు అందులో ఉన్నాయి. ఒకసారి మృతి చెందిన
బాలుడికి ప్రాణం పోశారు. నిరక్షరాస్యుడైన వెంకన్నను ఆదోనిలోని గవర్నరు వద్ద దివాను
స్థాయికి పెంచడం, సిద్ధి మస్సానెత్‌ఖాన్ మంత్రాలయం గ్రామాన్ని
రాఘవేంద్రులకు రాసి ఇవ్వడం (మద్రాస్ డిస్ట్రిక్ట్ గెజిటీర్ పునర్ముద్రణ 1916
చాప్టర్ 15 ఆదోని తాలూకా పేజీ 213) వంటివి
జరిగాయి. మద్రాసు గవర్నర్ ధామస్ మన్రోకు రాఘవేందస్వ్రామి చూపిన అద్భుతాలు
బళ్లారి జిల్లా గెజిటీర్‌లో చూడవచ్చు. రాఘవేంద్రుల యశశ్చంద్రికలు దశదిశలా పాకాయి.
బృందావనిలో
జీవ సమాధి
పీఠాధిపత్యం
వహించి నలభై ఏళ్లు పూర్తి కావస్తున్న సందర్భంలో శిష్యుడైన వెంకన్నను పిలిచి
విషయమంతా సేకరించి తుంగభద్రా తీరాన మంత్రాలయంలో తాను జీవ సమాధి కావడానికి అందమైన
బృందావనం నిర్మించమని కోరాడు. చెప్పిన ప్రకారం వెంకన్న చక్కని బృందావన మందిరాన్ని
నిర్మించాడు. శ్రీ రాఘవేందస్వ్రామి నిత్య నైమిత్తికాలు పూర్తి చేసుకుని శుచియై
చేతిలో వీణను పట్టుకుని సమాధిలో ప్రవేశించాడు. శ్వాసని నిలిపివేసి మనోలయం చేశాడు. 1200
సాలిగ్రామాలతో బృందావన సమాధిని మూసివేశారు. సమాధి గతుడైన తర్వాత ఆయన చూపిన మహమలు,
చేసిన అద్భుతాలు కోకొల్లలు. 700 సంవత్సరా
లు సూక్ష్మరూపంలో బృందావనంలో ఉండి తన భక్తులను అనుగ్రహిస్తానని ఆయన చేసిన ప్రకటన
సత్యాతి సత్యం.
ఆయన
ప్రియశిష్యుడు అప్పణాచార్యులు తుంగభద్ర ఆవలి తీరాన వుండేవాడు. గురువు సమాధి
ప్రవేశం చేస్తున్నాడని తెలిసి నదిని దాటి పరుగున బృందావనానికి చేరుకున్నాడు. అప్పటికే
అంతా ముగిసింది. అప్పణాచార్యులు కన్నీటి పర్యంతం అయ్యాడు. అప్పణాచార్యులు కవి.
తాను వస్తూ దారిలో అల్లుకుంటూ వచ్చిన శ్లోకంలో ఏడక్షరాలు ముగింపులో కొరవడ్డాయి.
వ్యధ చెందుతున్న శిష్యుడిని తృప్తిపరిచేందుకు ఆ ఏడక్షరాలు సమాధిలోంచి వెలువడ్డాయి.
ఆ శ్లోకమేనేటికీ బృందావనంలో ప్రార్ధనలో పఠిస్తారు.
అసమాన
శేముషీదురంధరుడైన రాఘవేంద్రునికి టిప్పణాచార్య చక్రవర్తిగా బిరుదు లభించింది.
వ్యాకరణ శాస్త్రంలో ఆయన ప్రజ్ఞా పాటవాలకు మెచ్చి మహా భాష్యకార బిరుదంతో
సన్మానించారు. ఆయన స్వతంత్ర రచనల్లో జైమిని పూర్వ మీమాంస సూత్రాలకు రాసిన భాష్యం
భట్ట సంగ్రహం భారతీయ తత్వశాస్త్రానికి అపురూపమైన కానుక.శ్రీమధ్వాచార్యుల వివిధ
భాష్యాలకు సులభ గ్రాహ్యంగా వ్యాఖ్యానాలు రచించి మధ్వ సిద్ధాంత ఔన్నత్యాన్ని
ప్రతిపాదించాడు. ఐతరేయోపనిషత్తు మినహా తొమ్మిది ప్రధాన ఉపనిషత్తులకు వ్యాఖ్యానాలు
రచించారు. వ్యాసతీర్థల చంద్రికకు ప్రకాశిక పేరుతో చేసిన పరిమళ వ్యాఖ్యానంతో
పరిమళాచార్యుడుగా వాసికెక్కాడు.