మాఘపురాణం - 7వ అధ్యాయం

మృగ శృంగుడు యముని గూర్చి వ్రతమాచరించుట
ఆవిధంగా ఏనుగునకు శాపవిమోచనమైన తరువాత మరల మృగశృంగుడు కావేరీ నదిలో దిగి అకాల మృత్యువు వాతబడిన అ అముగ్గురు కన్యలను బ్రతికించు నిమిత్తం యమధర్మ రాజును గురించి తపస్సు చేయ నారంభించినాడు. నిశ్చల మనస్సుతో తదేక దీక్షతో యముని గూర్చి ధ్యానించుచుండగా మృగశృంగుని కఠోరదీక్షకు యముడు సంతసించి ప్రత్యక్షమయి – “మృగశృంగా నీ కఠోరదీక్షకు, పరోపకార పరాయణతకు నేనెంతయు సంతసించితిని. ణా గురించి ఇంత దీక్షతో ఎవ్వరూ తపమాచరించి ఉండలేదు. నీకేమి కావలయునో కోరుకొనుము. నీ యభీష్టం నెరవేర్చెదనుఅని యముడు పలికెను.

ఆ పలుకులు విని మృగశృంగుడు కన్నులు తెరచి చూడగా యముడు తన ఎదుట నిలబడియున్నాడు. వెంటనే చేతులు జోడించి మహానుభావా! ఎంతటి తపశ్శాలురకైనను దర్శనమివ్వని మీరు నాబోటి సామాన్యునికి మీ దర్శనమిచ్చుట నా పూర్వజన్మ సుకృతం తప్ప వేరుకాదు. అకాల మరణమునకు పాల్పడిన ఆ ముగ్గురు కన్యలను బ్రతికించి నన్ను సంతృప్తుని జేయుడుఅని ప్రార్థించెను.

మృగశృంగుని పరోపకార బుద్ధికీ, దయార్ద్ర హృదయమునకు యముడు సంతోషించి అతని కోరిక ప్రకారము ఆ ముగ్గురు కన్యలకు ప్రాణదానము చేయనేంచి మృగశృంగా! నీ భక్తికి మెచ్చితిని. నీ పరోపకార బుద్ధి నన్నాకర్షించింది. నీకు జయమగుగాకఅని యముడు దీవించగా – మహాపురుషా! మిమ్ము సంతోషపెట్టుట సామాన్యమైనది కాదు. మిమ్ము సోత్రము చేసిన వారికి, స్తోత్రము విన్నవారికి జరామరణములు కలుగవు. అట్టివారికి అన్ని విధముల శుభములు కలుగునటుల అనుగ్రహింపుము అని ప్రార్థించగా అటులనే నీ కోరిక సఫలమగుగాకయని యమధర్మరాజు దీవించి యద్రుశ్యుడయ్యెను.