కార్తీక మాసంలో వనబోజనాలు
కార్తీక మాసంలో వనబోజనాలుకృత్రిక నక్షత్రంలో చంద్రుడు
పూజ్యుడై సంచరిండం వలన ఈ మాసానికి కార్తీక మాసం అని పేరు వచ్చిందని పురాణ గాధలు
చెబుతుంటాయి.
కార్తీక మాసంలో వనభోజనానికి విశేష ప్రాధాన్యం ఉంది. ఉసిరి
చెట్టు కింద సాలగ్రామాన్ని ఉంచి గంధం, అక్షతలు, పుష్పాలతో పూజించాలి. అనంతరం పండితులను పిలిచి సత్కరించి
అందరూ భోజం చేయాలి. వనభోజన కార్యక్రమాలను నిర్వహించే వారికి పాపాల నుంచి విముక్తి
కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి. కార్తీక సోమవారాల్లో వనభోజం చేయడం శుభప్రదం. కార్తీక
సోమవారాల్లో మాత్రమే గాకుండా కార్తీక మాసంలో ఏ రోజైన ఉసిరిక చెట్టుకింద భోజనం
చేయడం మంచిది. శివుడిని అర్చించి అనంతరం అన్నదానము నిర్వహించి, అతిథి సత్కారాల తర్వాత దీక్ష వహించిన వ్యక్తి భుజించవలెను.
ఈ నియమాలను పాటించడం వల్ల శివానుగ్రహం కలిగి సర్వపాపములు నశిస్తాయని నమ్మకం.
ధాత్రీ వృక్షం అంటే ఉసిరి చెట్టు అని అర్థం. కార్తీక మాసంలో
ప్రతిరోజూ కానీ, పౌర్ణమి రోజున కానీ ఉసిరి
చెట్టును పూజిస్తే సర్వశుభాలు కలుగుతాయి. కార్తీక మాసంలో ఉసిరి చెట్టులో లక్ష్మీ సమేతంగా
శ్రీమహావిష్ణువు నివాసముంటాడు. బ్రహ్మ ఆనందబాష్ప కణాలనుంచి ఉసిరిక ఉద్భవించిందంటారు.
ఉసిరికాయలతో నివేదన, ఉసిరి కాయలపై ఆవునేతితో దీపారాధన, ఉసిరి వనంలో అన్న సమారాధనలు చేయడం, సాలగ్రామాలను, దీపాలను దానం చేయడం
వల్ల అఖండ అష్టయిశ్వర్య ప్రాప్తి, అనంత పుణ్య ఫలప్రాప్తి
లభిస్తాయి.
ఉసిరిచెట్టు మూలంలో శ్రీహరి, స్కంధంలో రుద్రుడు, ఊర్ధ్వంలో బ్రహ్మ,
శాఖలలో సూర్యుడు, ఉపశాఖలలో దేవతలు ఆశ్రయించి ఉంటారు. కార్తీక పౌర్ణమి రోజున శ్రీమహావిష్ణువును పూజించి, చిత్రాన్నాలను నివేదించి, మధ్యాహ్నం బంధుమిత్రులతో కలసి ఉసిరి చెట్టు నీడలో వన భోజనం
చేస్తే సకల పాపాలు తొలగిపోయి విష్ణులోకం పొందుతారు.
కార్తీకమాసంలో వాతావరణ ప్రభావం వల్ల మనిషిలో ఉష్ణాంశము
తక్కువై, త్రిదోషాలు వికృతి
చెందుతాయి. తులసి వాసన, ఉసిరిక వాసన పీల్చుకోవడం
వల్ల ఆరోగ్యం చేకూరుతుందనే నమ్మకం వనభోజనాలు ఏర్పాటు చేయడానికి నాంది పలికిందని
పెద్దలు అంటారు.
కార్తీక పొర్ణమి నాడు చేసే సాలగ్రామ దానం, ఉసిరి కాయల దానం వల్ల కూడా పాపాలు నశిస్తాయి