శ్రీమన్నారాయణీయం - చతుర్థ స్కంధము, తాత్పర్యము


 

పదునారవ దశకము - నరనారాయణుల అవతారము 
దక్షో విరించతనయోఽథ మనోస్తనూజాం
లబ్ధ్వా ప్రసూతిమిహ షోడశ చాప కన్యాః |
ధర్మే త్రయోదశ దదౌ పితృషు స్వధాం చ
స్వాహాం హవిర్భుజి సతీం గిరిశే త్వదంశే || ౧౬-౧||

దక్షుడు మనువుయొక్క పుత్రిక యగు ప్రసూతిని వివాహమాడెను. వారికి పదహారుగురు పుత్రికలు కలిగారు. వారిలో పదమూడు మందిని ధర్మునకు ఇచ్చి వివాహము చేసెను. పితృ దేవతలకు స్వధా అను కూతురును, అగ్నిదేవునకు స్వాహా అను కూతురును ఇచ్చెను. ఇట్లేవిష్ణువు (నీ) అంశతో జన్మించిన శివునకు సతీదేవిని ఇచ్చి వివాహము చేసెను.

మూర్తిర్హి ధర్మగృహిణీ సుషువే భవంతం
నారాయణం నరసఖం మహితానుభావమ్ |
యజ్జన్మని ప్రముదితాః కృతతుర్యఘోషాః
పుష్పోత్కరాన్ప్రవవృషుర్నునువుః సురౌఘాః || ౧౬-౨||

దక్షప్రజాపతి పుత్రిక, దరమును భార్యయైన "మూర్తి"కి నీవు నారాయణుడు అనే పేరుతో గొప్ప మహిమలు కలవానిగా జన్మించినావు. అట్లే, నీ అంశతో నరుడు అనువాడు జన్మించగా నీరు అన్యోన్య స్నేహముతో పెరిగితిరి. ప్రభూ! నీవు జన్మించు ఆ శుభ సమయమున దేవతలు సంతోషమును పట్టలేక దుందుభి మొదలైన మంగళ వాద్యములను మ్రోగించుచు పుష్పవ్రుష్టిని కురిపించి, నిన్ను స్తుతించిరి.

దైత్యం సహస్రకవచం కవచైః పరీతం
సాహస్రవత్సరతపస్సమరాభిలవ్యైః |
పర్యాయనీర్మితతపస్సమరౌ భవంతౌ
శిష్టైకకంకటమముం న్యహతాం సలీలమ్ || ౧౬-౩||

ఆ కాలమున సహస్ర కవచుడను రాక్షసుడు ఉండెను. అతనికి వేయి కవచములుండెను. అవి ఒక్కొక్కటి వేయి సంవత్సరములు తపస్సు చేసి, వేయి సంవత్సరములు యుద్ధము చేసినందు వలననే ఛేదించుటకు వీలయ్యేవి. మంచి వారిని బాధించుచున్న ఆ రాక్షసుని నర నారాయణులు మీరు ఒకరి తరువాత ఒకరు వేయి సంవత్సరములు తపస్సు, వేయి సంవత్సరములు యుద్ధము చేయుచు అతని కవచములను ఛేదించిరి. అటు పిమ్మట అతని వధించితిరి.

అన్వాచరన్నుపదిశన్నపి మోక్షధర్మం
త్వం భ్రాతృమాన్ బదరికాశ్రమమధ్యవాత్సీః |
శక్రోఽథ తే శమతపోబలనిస్సహాత్మా
దివ్యాంగనాపరివృతం ప్రజిఘాయ మారమ్ || ౧౬-౪||

స్వామీ! నరనారాయణ అవతారముననున్న మీరు బదరికాశ్రమమున ఉండి మోక్ష ధర్మమైన నివృత్తి మార్గమును స్వయంగా పాటించుచు అక్కడ ఉన్న మహర్షులకు దానిని ఉపదేశించుచుంటిరి. అప్పుడు మీ శమము, తపోబలము చూచి ఇంద్రునకు భయము కలిగినది. అందువలన మీ తపస్సునకు విఘ్నము కలిగించ వలెనని అతడు దివ్యాంగనలతో మన్మథుని పంపెను.

కామో వసంతమలయానిలబంధుశాలీ
కాంతాకటాక్షవిశిఖైర్వికసద్విలాసైః |
విధ్యన్ముహుర్ముహురకంపముదీక్ష్య చ త్వాం
భీతస్త్వయాథ జగదే మృదుహాసభాజా || ౧౬-౫||

అప్పుడు వసంతుడు, మలయానిలము వంటి స్నేహితులతో కలసి మన్మథుడు మిక్కిలి విలాసము కల అప్సరస స్త్రీల యొక్క కతాక్షములచే మీ తపస్సును భంగ పరచుటకు ప్రయత్నించెను. అయినా, మీరు స్థిరముగా ఉండుట చూచి మన్మథునకు భయము వేసినది. అప్పుడు మీరు చిరునవ్వుతో ఇట్లు పలికితిరి.

భీత్యాలమంగజవసంతసురాంగనా వో
మన్మానసంత్విహ జుషుధ్వమితి బ్రువాణః |
త్వం విస్మయేన పరితః స్తువతామథైషాం
ప్రాదర్శయః స్వపరిచారకకాతరాక్షీః || ౧౬-౬||

"మన్మథా! వసంతుడా! అప్సరసలారా! మీరు భయ పడవద్దు. నేనిచ్చే అతిథి సత్కారములు స్వీకరించండి" అని అనగా వారు ఆశ్చర్యముతో స్తుతించుచుండిరి. అట్టి మన్మథుడు మొదలైన వారికి మిమ్ము సేవిన్చుచున్న పరిచారికలను మీరు చూపించితిరి.

సమ్మోహనాయ మిలితా మదనాదయస్తే
త్వద్దాసికాపరిమళైః కిల మోహమాపుః |
దత్తాం త్వయా చ జగృహుస్త్రపయైవ సర్వ-
స్వర్వాసిగర్వశమనీం పునరుర్వశీం తామ్ || ౧౬-౭||

మన్మథుడు మొదలైన వారు నీ దాసీ జనము యొక్క సౌందర్యమును చూసి మోహ పరవశులైరి. స్వర్గములో అందరి సుందరీమణుల గర్వమును పోగొట్టు సౌందర్యము కల ఊర్వశిని కానుకగా వారికి ఒసగగా మన్మథుడు మొదలైన వారు ఊర్వశిని చూసి సిగ్గుపడి ఆమెను స్వీకరించిరి.

దృష్ట్వోర్వశీం త్వం కథాం చ నిశమ్య శక్రః
పర్యాకులోఽజని భవన్మహిమావమర్శాత్ |
ఏవం ప్రశాంతరమణీయతరాఽవతారత్
త్వత్తోఽధికో వరద కృష్ణతనుస్త్వమేవ || ౧౬-౮||

మన్మథుడు మొదలైన వారు ఊర్వశిని దేవేంద్రునకు అర్పించి, మీ మహిమను తెలుపగా, తాను చేసిన తప్పుకు అతడు చాలా విచారించెను. వరములనిచ్చు స్వామీ! సౌమ్యము, సుందరమైన ఈ నర నారాయణ అవతారము కంటే మిగుల కృష్ణ స్వరూపము నీదే.

దక్షస్తు ధాతురతిలాలనయా రజోఽంధో
నాత్యాదృతస్త్వయి చ కష్టమశాంతిరాసీత్ |
యేన వ్యరుంధ స భవత్తనుమేవ శర్వం
యజ్ఞో చ వైరపిశునే స్వసుతాం వ్యమానీత్ || ౧౬-౯||

బ్రహ్మ తన పుత్రుడైన దక్షుని మిక్కిలి ప్రేమతో లాలించినందు వలన అతడు గర్వాంధుడయ్యెను. అందువలన అతడు బ్రహ్మ దేవుని మరియు మిమ్ములను గౌరవించకుండెను. దక్షుడు మీ అంశారూపియైన శంకరుని ద్వేషించ సాగెను. అతనితో గల వైరముతో తన యాగమున తన కూతురైన సతీదేవిని కూడా అవమాన పరచెను.

కృద్ధేశమర్దితమఖః స తు కృత్తశీర్షో
దేవప్రసాదితహరాదథ లబ్ధజీవః |
త్వత్పూరితక్రతువరః పునరాప శాంతిం
స త్వం ప్రశాంతికర పాహి మరుత్పురేశ || ౧౬-౧౦||

అందువలన శంకరుడు కోపించి దక్షుని యాగమును ధ్వంసించెను. అతని శిరస్సును కూడా ఖండించెను. అప్పుడు దేవతలు శంకరుని వేడుకొనగా దక్షుడు బ్రతికెను. ఆ యజ్ఞము సంపూర్ణము అయినందు వలన దక్షుడు శాంతించెను.  ఇట్లు శాంతిని కలిగించు గురువాయురప్పా! నీవే నన్ను రక్షించవలెను.

పదునేడవ దశకము - ధృవ చరితము

ఉత్తానపాదనృపతేర్మనునందనస్య
జాయా బభూవ సురుచిర్నితరామభీష్టా |
అన్యా సునీతిరితి భర్తురనాదృతా సా
త్వామేవ నిత్యమగతిః శరణం గతాఽభూత్ || ౧౭-౧||

మనువునకు ఉత్తానపాదుడనే పుత్రుడు ఉండెను. అతనికి సునీతి, సురుచియను భార్యలు. వారిలో చిన్న భార్య యైన సురుచిపై మహారాజుకు అమితమైన ప్రేమ. పెద్ద భార్యను అతడు నిరాదరించ సాగెను. అప్పుడు నిస్సహాయురాలైన ఆమె నిన్నే శరణు పొంది ప్రతిదినము ఆరాధించసాగినది.

అంకే పితుః సురుచిపుత్రకముత్తమం తం
దృష్ట్వా ధ్రువః కిల సునీతిసుతోఽధిరోక్ష్యన్ |
ఆచిక్షిపే కిల శిశుః సుతరాం సురుచ్యా
దుస్సంత్యజా ఖలు భవద్విముఖైరసూయా || ౧౭-౨||

ఒకనాడు సురుచి పుత్రుడైన ఉత్తముడు తండ్రియైన ఉత్తానపాదుని ఒడిలో కూర్చుని ఆడుకొనుచుండెను. అప్పుడు సునీతి కొడుకైన ధ్రువుడు కూడా తండ్రి ఒడిలో కూర్చొన బోయెను. దానిని చూచి సురుచి బాలుడైన ధ్రువుని అధిక్షేపించుచు అతనిని నివారించెను. స్వామీ! నీపై భక్తిలేని వారికి అసూయ ఉండుట సహజము కదా!.

త్వన్మోహితే పితరి పశ్యతి దారవశ్యే
దూరం దురుక్తినిహతః స గతో నిజాంబామ్ |
సాఽపి స్వకర్మగతిసంతరణాయ పుంసాం
త్వత్పాదమేవ శరణం శిశవే శశంస || ౧౭-౩||

ప్రభూ! తండ్రియైన ఉత్తానపాదుడు నీ మాయవల్ల మోహమున పడి చిన్న భార్యయైన సురుచికి ఆధీనుడుగా ఉండెను. అట్టి తన తండ్రి చూస్తుండగానే పినతల్లియైన సురుచి కఠినమైన మాటలు పలుకగా బాలుడైన  ధ్రువుని మనస్సు బాధపడినది. అందువలన అతడు బాధపడుచు తన తల్లి దగ్గరకు పోయెను. ఆమె అప్పుడు కర్మగతిని తప్పించుటకు కారణమైన నీ పాదములనే శరణు పొందుమని అతనికి  బోధించినది.

ఆకర్ణ్య సోఽపి భవదర్చనిశ్చితాత్మా
మానీ నిరేత్య నగరాత్కిల పంచవర్షః |
సందృష్టనారదనివేదితమంత్రమార్గః
త్వామారరాధ తపసా మధుకాననాంతే || ౧౭-౪||

ఆ బాలుడు తల్లిమాటలు విని నీ పాదారవిందములను సేవించవలెను అని నిశ్చయించుకొనెను. ఐదు సంవత్సరముల వయసు గల ఆ బాలుడు పట్టణము వదిలి పెట్టి పోవుచున్నంత నారద మహర్షి కనిపించి భగవంతుని సేవించుటకై ద్వాదశాక్షర మంత్రమును, ధ్యానించు పద్ధతిని బోధించెను. ధ్రువుడు అదే విధముగా మధువనమునకు పోయి కఠినమైన తపస్సుతో నిన్ను ఆరాధించ సాగెను.

తాతే విషణ్ణహృదయే నగరీం గతేన
శ్రీనారదేన పరిసాంత్వితచిత్తవృత్తౌ |
బాలస్త్వదర్పితమనాః క్రమవర్ధితేన
నిన్యే కఠోరతపసా కిల పంచ మాసాన్ || ౧౭-౫||

ధ్రువుడు దూరమగుట వలన ఉత్తానపాదుడు చాలా వ్యథ చెందెను. అప్పుడు నారదుడు వచ్చి ధ్రువునకు కలుగబోవు యోగమును చెప్పి అతని మనస్సును శాంతపరచెను. ఇక ధ్రువుడు పరమాత్మవైన నీ యందు మనస్సు నిలిపి తపస్సును క్రమక్రమముగా పెంచి ఐదు మాసములు గడిపెను.

తావత్తపోబలనిరుచ్ఛ్వసితే దిగంతే
దేవార్థితస్త్వముదయత్కరుణార్ద్రచేతాః |
త్వద్రూపచిద్రసనిలీనమతేః పురస్తా-
దావిర్బభూవిథ విభో గరుడాధిరూఢః || ౧౭-౬||

ధ్రువుని తపస్సుకు లోకములు తల్లడిల్లి పోయెను. అప్పుడు దేవతలందరూ నిను ప్రార్థించగా మిక్కిలి దయతో గరుత్మంతుని అధిరోహించి నీ స్వరూపమను చిదానంద రసమున నిమగ్నుడై యున్న ధ్రువునకు దర్శనమొసగితివి.

త్వద్దర్శనప్రమదభారతరంగితం తం
దృగ్భ్యాం నిమగ్నమివ రూపరసాయనే తే |
తుష్టూషమాణమవగమ్య కపోలదేశే
సంస్పృష్టవానసి దరేణ తథాఽఽదరేణ || ౧౭-౭||

ధ్రువునకు నీ దివ్యరూప దర్శనము కలుగగానే అతని మనస్సు ఆనందములో మునిగిపోయింది. కన్నులు సంతోష బాష్పములతో నిండి పోయినవి. ఆ విధముగా యున్న ధ్రువుడు నిన్ను స్తుతిన్చదలచినను అతనికి తగిన శక్తిలేనందు వలన నీవు ప్రేమతో నీ శంఖముతో అతని కపోలములపై స్ప్రుశించితివి.

తావద్విబోధవిమలం ప్రణువంతమేన-
మాభాషథాస్త్వమవగమ్య తదీయభావమ్ |
రాజ్యం చిరం సమనుభూయ భజస్వ భూయః
సర్వోత్తరం ధ్రువ పదం వినివృత్తిహీనమ్ || ౧౭-౮||

ప్రభూ! నీ శంఖము వేదమయము. అట్టి శంఖ స్పర్శ వలన ధ్రువునకు నిర్మలమైన జ్ఞానము కలిగినది. పరమాత్మవైన నిన్ను స్తుతించు శక్తి కూడా ప్రాప్తించినది. అందువలన ధ్రువుడు నిన్ను స్తుతి చేయుచున్నప్పుడు అతని భావమును ఎరిగి అతనితో 'ధృవా! నీవు చాలా కాలము రాజ్యమును ఏలిన తరువాత పునరావృత్తి రహితమై అత్యున్నతమైన ధ్రువ స్థానమున ఉందువు" అని పలికితివి.

ఇత్యూచిషి త్వయి గతే నృపనందనోఽసౌ-
ఆనందితాఖిలజనో నగరీముపేతః |
రేమే చిరం భవదనుగ్రహపూర్ణకామః
తాతే గతే చ వనమాదృతరాజ్యభారః || ౧౭-౯||

స్వామీ! ఈ విధముగా నీవు ధ్రువుని అనుగ్రహించి నీ లోకమును చేరుకొంటివి. ఈ విషయము తెలిసిన జనము సంతోషముతో ధ్రువుని అభినందించసాగిరి.ధ్రువుడు పట్టణము చేరిన తరువాత కొంత కాలమునకు అతని తండ్రియైన ఉత్తానపాదుడు అడవికి పోయెను. ధ్రువుడు నీ అనుగ్రహము వలన కోరికలు తీరి చాలా కాలము రాజ్యమేలెను.

యక్షేణ దేవ నిహతే పునరుత్తమేఽస్మిన్
యక్షైః స యుద్ధనిరతో విరతో మనూక్త్యా |
శాంత్యా ప్రసన్నహృదయాద్ధనదాదుపేతాత్
త్వద్భక్తిమేవ సుదృఢామవృణోన్మహాత్మా || ౧౭-౧౦||

పరమేశ్వరా! ఉత్తముని ఒక యక్షుడు చంపినందు వలన ధ్రువుడు యక్షులపై యుద్ధము ప్రకటించెను. కాని మనువు వచ్చి చెప్పినందు వలన అతడు యక్షులతో యుద్దమును మానివేసెను. అందువలన యక్షరాజైన కుబేరుడు సంతోషించి వరమీయబోగా నీ యందు దృఢమైన భక్తి మాత్రమే కావలెనని ధ్రువుడు వరమును కోరెను.

అంతే భవత్పురుషనీతవిమానయాతో
మాత్రా సమం ధ్రువపదే ముదితోఽయమాస్తే |
ఏవం స్వభృత్యజనపాలనలోలధీస్త్వం
వాతాలయాధిప నిరుంధి మమామయౌఘాన్ || ౧౭-౧౧||

ధ్రువుడు చాలా కాలము రాజ్యమును పాలించిన తరువాత నీయొక్క సేవకులు అతనిని ద్రువపదమునకు తీసికొని పోవుటకు విమానములో వచ్చిరి. అప్పుడా ధ్రువుడు తల్లితో కలిసి ద్రువపదమునకు పోయెను. ఈ విధముగా తన భక్తులను పరిపాలించు గురువాయుపుర పతీ! నాకున్న సమస్త రోగములను కృపతో దూరము చేయుము.

పదునెనిమిదవ దశకము - పృథు చరితము 
జాతస్య ధ్రువకుల ఏవ తుంగకీర్తే-
రంగస్య వ్యజని సుతః స వేననామా |
తద్దోషవ్యథితమతిః స రాజవర్య-
స్త్వత్పాదే విహితమనా వనం గతోఽభూత్ || ౧౮-౧||

ధ్రువుని వంశమున అంగుడను మహారాజు జన్మించెను. అతడు చక్కగా రాజ్య పరిపాలనము చేసినందు వలన గొప్పకీర్తి పొందెను. ఆయనకు వేనుడను పుత్రుడు కలిగెను. దుర్మార్గుడైన తన పుత్రుడు చేయుచున్న అక్రమములను చూచి సహించలేక బాధపడుచు అంగ మహారాజు నిన్ను ధ్యానించుటకై  అడవికి పోయెను.

పాపోఽపి క్షితితలపాలనాయ వేనః
పౌరాద్యైరుపనిహితః కఠోరవీర్యః |
సర్వేభ్యో నిజబలమేవ సంప్రశంసన్
భూచక్రే తవ యజనాన్యయం న్యరౌత్సీత్ || ౧౮-౨||

వేనుడు మిక్కిలి దుర్మార్గుడు. అయినా, అతడు మిక్కిలి బలము కలవాడు అని పుర ప్రముఖులు అతనిని రాజ్యపాలనము చేయుటకు సమ్మతించి రాజ సింహాసనము కట్టబెట్టిరి. అందువలన వేనుడు ఎల్లప్పుడూ తన బలమును పొగడుకొనుచు భూమండలమున ఎవ్వరుకూడా యజ్ఞ యాగాదులు చేయరాదని శాసించెను.

సంప్రాప్తే హితకథనాయ తాపసౌఘే
మత్తోఽన్యో భువనపతిర్న కశ్చనేతి |
త్వన్నిందావచనపరో మునీశ్వరైస్తైః
శాపాగ్నౌ శలభదశామనాయి వేనః || ౧౮-౩||

అతనికి హితవు చెప్పుటకు మహర్షులు కలసి వచ్చిరి. కానీ, మూర్ఖుడైన రాజు 'నన్ను మించిన లోకాధిపతి ఎవరున్నారు' అని జగన్నాథుడవైన నిన్ను నిందింప సాగెను. నీ నిందను సహించ లేని మునీశ్వరులు కోపముతో శాపమీయగా ఆ శాపాగ్నికి వేనుడు శలభము వలె దగ్ధ మయ్యెను.

తన్నాశాత్ఖలజనభీరుకైర్మునీంద్రై-
స్తన్మాత్రా చిరపరిరక్షితే తదంగే |
త్యక్తాఘే పరిమథితాదథోరుదండాత్
దోర్దండే పరిమథితే త్వమావిరాసీః || ౧౮-౪||

వేనుడి మరణము వలన రాజు లేని ఆ దేశమున దుర్మార్గులు విచ్చలవిడిగా ప్రవర్తించుచుండగా మునులు భీతిల్లితిరి. వేనుని మృత శరీరమును ఆతని తల్లి ప్రేమాతిశయముతో రక్షంచ సాగెను. అప్పుడు మహర్షులు తిరిగి వచ్చి అతని ఊరువులను మథించగా అతని పాపము అంతా నశించెను. పిమ్మట అతని బాహువ్ను మథించగా దాని నుండి పరమాత్మవైన నీవు ఆవిర్భవించితివి.

విఖ్యాతః పృథురితి తాపసోపదిష్టైః
సూతాద్యైః పరిణుతభావిభూరివీర్యః |
వేనార్త్యా కబలితసంపదం ధరిత్రీం-
ఆక్రాంతాం నిజధనుషా సమామకార్షీః || ౧౮-౫||

పృథు మహారాజు అను పేరుతో ప్రసిద్ధి పొందిన నీవు మహర్షులు చెప్పినట్లుగా విని రాజ్యపాలన చేయసాగిటివి. అందువలన ప్రజలు, వండి మాగధులు నిన్ను ఘనముగా కీర్తిన్చిరి. వేనుని దుర్మార్గములకు భయపడి సంపదలను తనలో దాచుకొనిన భూమిని నీవు ధనుస్సు ధరించి శాసించి సుసంపన్నము చేసితివి.

భూయస్తాం నిజకులముఖ్యవత్సయుక్తైః
దేవాద్యైః సముచితచారుభాజనేషు |
అన్నాదీన్యభిలషితాని యాని తాని
స్వచ్ఛందం సురభితనూమదూదుహస్త్వమ్ || ౧౮-౬||

అప్పుడు భూమి ఆవుగా మారెను. దేవతలు మొదలైన వారు తమ తమ వర్గములకు చెందిన వారిని దూడలు చేయగా, సముచితమైన పాత్రల యందు అన్నము మొదలైన కోరిన వస్తువులను నీవు ఆ భూగోవునుండి పితికితివి.

ఆత్మానం యహతి మఖైస్త్వయి త్రిధామ-
న్నారబ్ధే శతతమవాజిమేధయాగే |
స్పర్ధాళుః శతమఖ ఏత్య నీచవేషో
హృత్వాఽశ్వం తవ తనయాత్ పరాజితోఽభూత్ || ౧౮-౭||

త్రివిక్రముడగు శ్రీ మహావిష్ణో! పృథువు రూపమున నీవు యజ్ఞములు చేయుచు నీ స్వరూపమునే ఆరాధించుచుంటివి. ఈ విధముగా ఆశ్వమేధములు నూరు చేయ తలపెట్టితివి.నీవు నూరవ అశ్వమేధము చేయుచున్నప్పుడు దేవేంద్రుడు అసూయతో నీచ వేషమున వచ్చి యాగాశ్వమును దొంగిలించెను. అప్పుడు నీ పుత్రుడు దేవేంద్రుని జయించి అశ్వమును తీసికొని వచ్చెను.

దేవేంద్రం ముహురితి వాజినం హరంతం
వహ్నౌ తం మునవరమండలే జుహూషౌ |
రుంధానే కమలభవే క్రతోః సమాప్తౌ
సాక్షాత్త్వం మధురిపుమైక్షథాః స్వయం స్వమ్ || ౧౮-౮||

పృథు మహారాజు యొక్క పుత్రుడు దేవేంద్రుని జయించి యజ్ఞాశ్వమును తీసికొని రాగా దేవేంద్రుడు మరల ఆ యజ్ఞాశ్వమును దొంగిలించుటకై ప్రయత్నించెను. అప్పుడు ఆ యజ్ఞమున రుత్విక్కులుగా ఉన్న భ్రుగు మహర్షి మొదలైన వారు దేవేంద్రుని ఆహుతి చేయుటకు ప్రయత్నించిరి. ఆ సమయములో బ్రహ్మ దేవుడు స్వయముగా వచ్చి రుత్విక్కులను వారించి యజ్ఞమును పూర్తి చేయించెను. మధుసూదనా! అంతట ఆ మహారాజునకు నీవు దర్శన మొసగితివి.

తద్దత్తం వరముపలభ్య భక్తిమేకాం
గంగాంతే విహితపదః కదాపి దేవ |
సత్రస్థం మునినివహం హితాని శంస-
న్నైక్షిష్ఠాః సనకముఖాన్ మునీన్ పురస్తాత్ || ౧౮-౯||

స్వామీ! పృథు మహారాజు నేఎ ద్వారా అనన్య భక్తియను వరమును మాత్రము తీసికొని గంగాతీరమున నివసించు చుండెను. ఒకానొకప్పుడు అక్కడ దీర్ఘకాలిక సమావేశమున పాల్గోనుచున్న మునులకు నీవు ప్రవ్రుత్తి నివృత్తి రూపములైన హిత వచనములను ఉపదేశించితివి. అచట సనకాది మునులను చూచితివి.

విజ్ఞానం సనకముఖోదితం దధానః
స్వాత్మానం స్వయమగమో వనాంతసేవీ |
తత్తాదృక్పృథువపురీశ సత్వరం మే
రోగౌఘం ప్రశమయ వాతగేహవాసిన్ || ౧౮-౧౦||

దేవా! పృథు మహారాజు రూపముననున్న నీవు సనకాది మునులు ఉపదేశించిన బ్రహ్మ జ్ఞానమును చక్కగా స్వీకరించితివి. పిమ్మట నీవు పుత్రులకు రాజ్యమును అప్పగించి వనములకు వెళ్లి తపస్సులో నిమగ్నుడవు అయితివి. తరువాత నీ స్వస్వరూపమును పొందితివి. అట్టి పవన పురాధీశా!  నా రోగములను దయతో రూపుమాపుము.

పందొమ్మిదవ శతకము - ప్రాచేతసుల కథ

పృథోస్తు నప్తా పృథుధర్మకర్మఠః ప్రాచీనబర్హిర్యువతౌ శతదృతౌ |
ప్రచేతసో నామ సుచేతసః సుతానజీజనత్త్వత్కరుణాంకురానివ || ౧౯-౧

ప్రభూ! పృథు మహారాజు యొక్క మునిమనుమడు ప్రాచీన బర్హి. అతడు గొప్పగా యజ్ఞ యాగాదులు నిర్వహించెను. అతని భార్య శతద్రుతి. ఆ దంపతులకు 'ప్రచేతసులు' అను కుమారులు కలిగిరి. వారందరూ జ్ఞాన సంపన్నులు. వారు నీ దయవలన అంకురించిన వారే.

పితుః సిసృక్షానిరతస్య శాసనాద్భవత్తపస్యాభిరతా దశాపి తే |
పయోనిధిం పశ్చిమమేత్య తత్తటే సరోవరం సందదృశుర్మనోహరమ్ || ౧౯-౨

స్వామీ! ఆ పదిమంది ప్రచేతసులును నిన్ను గూర్చి తపస్సు చేయుట యందే నిరతులు. ఐనను వంశాభివృద్ధికై ఆసక్తి చూపుతున్న తండ్రియోక్క ఆజ్ఞను అనుసరించి వారు తపస్సు ద్వారా నీ అనుగ్రహమును పొందుటకై పశ్చిమ సముద్ర తీరమునకు చేరిరి. అచట వారికి మనోహరమైన ఒక సరస్సు కనబడెను.


తదా భవత్తీర్థమిదం సమాగతో భవో భవత్సేవకదర్శనాదృతః |
ప్రకాశమాసాద్య పురః ప్రచేతసాముపాదిశద్భక్తతమస్తవస్తవమ్ || ౧౯-౩

ఒకనాడు నీ భక్తులందు మిక్కిలి ఉత్తముడైన శంకరుడు నీ భక్తులగు ప్రచేతసులను దర్శించుకొనవలెనను కోరికతో ఆ తీర్థమునకు వచ్చెను. ఆ శంకరుడు ప్రచేతసులకు కనిపించి మీ స్తోత్రమునొక దానిని వారికి ఉపదేశించెను.

స్తవం జపంతస్తమమీ జలాంతరే భవంతమాసేవిషతాయుతం సమాః |
భవత్సుఖాస్వాదరసాదమీష్వియాన్బభూవ కలో ధ్రువవన్న శీఘ్రతా || ౧౯-౪

ఆ ప్రాచేతసులందరూ శివుడు ఉపదేశించిన స్తవములను సరస్సులోనే అనేక వేల సంవత్సరములు జపించుచు నిన్ను ధ్యానింప సాగిరి. ఈ విధముగా ప్రచేతసులు బ్రహ్మానంద రసాస్వాదనము నందు మునిగి యుండిరి. ఉపాసనా ఫలితమును గురించి వారును ధ్రువుని వలె ఏ మాత్రమూ తొందర పడలేదు.

తపోభిరేషామతిమాత్రవర్ధిభిః స యజ్ఞహింసానిరతోఽపి పావితః |
పితాఽపి తేషాం గృహయాతనారదప్రదర్శితాత్మా భవదాత్మతాం యయౌ || ౧౯-౫

ప్రచేతసుల తండ్రియైన ప్రాచీనబర్హి అనేక యాగాములను చేసి ఆ యాగాములందు పశుహింస చేసినప్పతికిని తన పుత్రులు చేసిన గొప్ప తపస్సు వలన పవిత్రుడయ్యెను. ఆ ప్రాచీనబర్హి మహారాజు దగ్గరకు నారదుడు ఒకసారి వచ్చి ఆత్మ జ్ఞానమును బోధించెను. అందువలన ఆ మహారాజు సాయుజ్యమను ముక్తిని పొందెను.

కృపాబలేనైవ పురః ప్రచేతసాం ప్రకాశమాగాః పతగేంద్రవాహనః |
విరాజి చక్రాదివరాయుధాంశుభిః భుజాభిరష్టాభిరుదంచితద్యుతిః || ౧౯-౬

స్వామీ! నీవు నీ కృప వలననే ప్రచేతసులకు ప్రత్యక్షమైతివి. అప్పుడు నీ దివ్య స్వరూపమిట్లున్నది. నీవు పక్షీన్ద్రుడైన గరుడుని అధిరోహించి యున్నావు. శంఖము, చక్రము మొదలైన ఎనిమిది దివ్యాయుధములు ఎనిమిది భుజములందు ధరించితివి.

ప్రచేతసాం తావదయాచతామపిః త్వమేవ కారుణ్యభరాద్వారానదాః |
భవద్విచింతాఽపి శివాయదేహినాం భవత్వసౌ రుద్రనుతిశ్చ కామదా || ౧౯-౭

ఆ ప్రచేతసులు నిన్నెట్టి వరములు కొరకున్నను కరుణతో నీవే వారికి వరములనిచ్చితివి. స్వామీ! నీకు సేవ చేయక కేవలము ధ్యానించినను వారికి గొప్ప మేలు కలుగును. అట్లే శంకరుడు చెప్పిన రుద్రగీతికను స్తుతించిన వారికి కూడా కోరికలన్నీ తీరును.

అవాప్య కాంతాం తనయాం మహీరుహాం తయా రమధ్వం దశలక్షవత్సరీమ్ |
సుతోఽస్తు దక్షో నను తత్క్షణాచ్చ మాం ప్రయాస్యథేతి న్యగదో ముదైవ తాన్ || ౧౯-౮

"ప్రచేతసులారా! మీకు వృక్ష పుత్రికయైన 'మారిష' భార్య కాగలదు. ఆమెతో మీరు పది లక్షల సంవత్సరములు సుఖముగా ఉండ గలరు. మీకు దక్షుడను పుత్రుడు కలుగును. పుత్రజనమైన వెంటనే మీరు నా సాన్నిధ్యమును చేరుకుంటారు" -  అని సంతోషముతో వరములను ఇచ్చితివి.

తతశ్చ తే భూతలరోధినస్తరూన్కృధా దహంతో ద్రుహిణేన వారితాః |
ద్రుమైశ్చ దత్తాం తనయామవాప్య తాం త్వదుక్తకాలం సుఖినోఽభిరేమిరే || ౧౯-౯

ప్రచేతసులు నీ వలన దివ్యవరములను పొంది తపస్సు చాలించి సరస్సు నుండి బయటకు వచ్చిరి. అప్పుడు చెట్లు దట్టముగా పెరిగి మానవులు జంతువులూ తిరుగుటకు వీలులేకుండెను. అట్టి వృక్షములను చూచి ప్రచేతసులు కోపముతో తగుల బెట్ట సాగిరి. అప్పుడు బ్రహ్మ దేవుడు వారిని వారించెను. ఇట్లు తమకు మేలు చేసిన ప్రచేతసులకు వృక్షములు తాము పెంచిన మారిష అనే కన్యను ఇచ్చి వివాహము చేయగా వారు చాలా కాలము సుఖముగా నుండిరి.


అవాప్య దక్షం చ సుతం కృతాధ్వరాః ప్రచేతసో నారదలబ్ధయాధియా |
అవాపురానందపదం తథావిధస్త్వమీశ వాతాలయనాథ పాహిమామ్ || ౧౯-౧౦


వారికి దక్షుడను పుత్రుడు జన్మించెను. తరువాత వారు భగవంతుని గూర్చి అనేక యజ్ఞములు చేసిరి. అప్పుడు వారి దగ్గరకు నారద మహర్షి వచ్చి వారికి కూడా ఆధ్యాత్మిక జ్ఞానమును ఉపదేశించెను. ఆ జ్ఞానము వలన ప్రచేతసులందరూ పరమపదము పొందిరి. భక్తుల కోరికలను తీర్చు గురువాయురప్ప! శ్రీ కృష్ణా! నీ భక్తుడనైన నన్ను రక్షింపుము.