హనుమ సుగ్రీవుల స్నేహం


మనోజవం మారుత తుల్య వేగం జితేంద్రియం బుధిమతాం వరిష్టం |
వాతాత్మజం వానరయూథ ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి ||

ఏమని రాయాలి? ఎంతని రాయాలి? ఆ అమృతస్వరూపుడి గురించి ఎంత రాసినా తక్కువే! ఉడతా భక్తిగా, హనుమంతుడి స్నేహాలను గురించి రాయటానికి, ఆయనకు రామసుగ్రీవులతో ఉన్న అనుబంధాలను ఎంచుకున్నాను. ఈ టపాలో, సుగ్రీవ హనుమల స్నేహం గురించిన రెండు మూడు ముక్కలు.

శ్రీరామ సుగ్రీవుల స్నేహం గురించిన లేఖలో రాసినట్టు రాజ్యంలేని రాజుకు, హనుమంతుడు మంత్రి.వీరిద్దరి మధ్య ఉన్నది చిన్ననాటి స్నేహం. ఉత్తరకాండలో అగస్త్య మహర్షి, శ్రీరాముడి ప్రశ్నకు సమాధానంగా, హనుమ గురించి చెప్పినది 35, 36వ సర్గలలో ఉంది. వాయువునకు అగ్నితోవలె, హనుమంతునకు సుగ్రీవునితో బాల్యమునుండియు సఖ్యము గలదు.చిన్నప్పుడు ఆకతాయి చేష్టలతో ఋషులను విసిగిస్తుంటే, భృగువు మొదలైన మహర్షుల శాపం వల్ల, హనుమంతుడు తన బలాన్ని మరిచిపోతాడు. ఈ వృత్తాంతం సుగ్రీవుడికి కూడా తెలియదు. తెలిసుంటే, హనుమకు శాపవిముక్తి కలిగించి, వాలివలన తిప్పలు తప్పించుకొనుండేవాడు.

ఇక మళ్ళీ, కిష్కిందకాండకు వెళితే, వీరి స్నేహం గురించిన మరికొన్ని విశేషాలు దొరుకుతాయి. శ్రీరామ లక్ష్మణులను చూడగానే, నిజంగా కొతులు భయపడ్డప్పుడు ఎలా చేస్తాయో అలానే, హనుమ తప్ప అందరూ ఇక్కడి నుండి అక్కడికి, ఆ చెట్టుకొమ్మనుండి ఇక్కడికి దూకుతూ, రెమ్మలు విరుస్తూ భయపడుతుంటే, హనుమ తాపీగా ఓ వానరులారా! మిరందరును వాలివలన ప్రమాదము కలుగుననెడి ఈ పిచ్చిభయమును వీడుడుఅని వారిని కుదుటబరచడానికి ప్రయత్నిస్తాడు. ఎంతో సౌమ్యంగా చెప్పినా, పదునైన మాటలతో మందలిస్తాడు కూడా! ఓ ప్రభూ! వానరులకు రాజువయ్యును సామాన్యవానరునివలె నీవు చంచలత్వమునే ప్రకటించుచున్నావు. ఇది మిగుల ఆశ్చర్యకరము. భయకారణముగా బాగుగా ఆలోచింపవలసిన విషయమునందుగూడ నీ బుద్ధిని స్థిరముగా నిలుపుటలేదు. నీ బుద్ధిని, విజ్ఞానమును, ఇంగితమును ఉపయోగించి, ఇతరుల వ్యవహారమునుబట్టి, వారి స్వభావమును గుర్తించి, యుక్తమెఱిగి, ఆచరింపుము. బుద్ధికి పనిజెప్పని రాజు, ప్రజలను పరిపాలింపజాలడు.కాస్త కుదుటపడి, సుగ్రీవుడు హనుమనే వారిగురించి తెలుసుకురమ్మని, మారువేషంలో వెళ్ళమని పంపిస్తాడు.

ఈ ఘట్టాన్ని బట్టి, సుగ్రీవుడు పాపం ఎంత భయాందోళనలకు లోనైఉన్నాడో తెలుస్తుంది. వాలి సుగ్రీవుడిని చంపాలని ప్రయత్నించింది నిజమే కానీ, అదే పనిగా వెంట బడి సుగ్రీవుడిని చంపటమే తన జీవిత ధ్యేయంగా పెట్టుకున్నట్టు సుగ్రీవుడు భయపడిపోయున్నాడు. తన శక్తిసామర్థ్యాలను శాపవశాన మరిచినా, హనుమ బుద్ధి మాత్రం జాజ్వల్యమానంగా వెలుగుతుండడంతో, తను ఏ మాత్రం భయానికి లోనవకుండా, సుగ్రీవాదులకు నిలకడ కలిగించే ప్రయత్నం చేస్తాడు. మిత్రుడైనా, “ప్రభూ!అని సంబోధిస్తూ, కషాయం లాంటి హితబోధను తేనెలో కలిపి మందు పట్టినట్టు చెబుతాడు. సుగ్రీవుడు కూడా, తప్పుగా భావించకుండా, అందులోని నిజాన్ని గ్రహించి కుదుటపడతాడు. చక్కటి స్నేహం! శ్రీరామ లక్ష్మణులను కలిసి, తన ప్రభువైన సుగ్రీవుడితో స్నేహం చేయమని అభ్యర్థిస్తాడు.

రామలక్ష్మణులను మొదటిసారి హనుమ కలవటం
వాలి వధ అనంతరం, అగందుడు తన తండ్రికి అంతిమ సంస్కారాలు నిర్వహించిన తరువాత, మృదుమధురంగా, తన స్నేహితుడికి పట్టాభిషేకం తన హస్తాలతో చేయమని శ్రీరాముడిని విన్నవించుకుంటాడు. కానీ పట్టణప్రవేశం నిషిద్ధం కనుక, తను రాలేనని నచ్చచెబుతాడు శ్రీరాముడు.

రామలక్ష్మణులను మొదటిసారి హనుమ కలవటంపట్టాభిషేకం జరుగుతుంది, సుగ్రీవుడు ఆనందాలలో మైమరిచి తన ప్రతిజ్ఞను మరుస్తాడు. తగిన సమయం చూసి, తన రాజు, మిత్రుడు ఐన సుగ్రీవుడికి ఎంతో మృదువుగా గుర్తు చేస్తాడు. మహావీరా! శత్రుసూదనా! శ్రీరాముడు మనకు పరమమిత్రుడు. మనము ఆయనకార్యమును సాధించి పెట్టవలసియున్నది కనుక వెంటనే సీతాన్వేషణకు పూనుకొనవలెను. ఇప్పటికే కాలాతీతమైనది. రాముడు ప్రేరేపింపకముందే ఆయన కార్యమును ప్రారంభించినచో మనము కాలాతీతము చేసినట్లుగా పరిగణింపడు శ్రీరాముడు. కాని ప్రేరేపింపబడిన పిమ్మటనే, మన్ము కార్యోన్ముఖులమైనచో కాలవిలంబమునకు మనమే బాధ్యులమగుదుము.అని పరి పరి విధాల సుగ్రీవుడికి స్పృహ తెప్పించే ప్రయత్నాలు చేసి, తన మిత్రధర్మాన్ని చక్కగా నిలబెట్టుకుంటాడు.

ఇక సీతాన్వేషణలో నాలుగు దిక్కులా వానరులను పంపిస్తాడు సుగ్రీవుడు. దక్షిణదిశగా వెళుతున్న బృందంలో హనుమ ఉంటాడు. మిగతా ఏ బృందములోనివారితో మాట్లాడని విధంగా, సుగ్రీవుడు హనుమ గుణగణాలను పదే పదే మనఃపూర్తిగా కొనియాడుతాడు. ఆ సంభాషణ విని శ్రీరాముడికి అర్థమవుతుంది సీత జాడ హనుమే పట్టగలడని. అందుకే, ఎవరికీ ఇవ్వని విధంగా, హనుమకు సీతమ్మ గుర్తుపట్టడానికి తన ఉంగరాన్ని ఇస్తాడు.


ఇక యుద్ధకాండ గురించి చెప్పేదేముంది? ఒక మిత్రుడిగా, ఒక మంత్రిగా, హనుమ సుగ్రీవుడి చెప్పు చేతల్లో నడుస్తూ, సమయానికి తగిన సూచనలు చేస్తూ, తనేమిటో పదే పదే చెప్పకనే చాటి చెబుతాడు.