త్యాగయ్య రామభక్తి - బంటు రీతి కొలువు


హనుమంతుని బలము ఏమిటి? కేవలం రామభక్తి, ఆ ప్రభువుకు పూర్తి దాస్యము. ఆ నిరంతర రామ నామ కీర్తనా బలంతో హనుమంతుడు సముద్రాన్ని దాటాడు, లంకను గెలిచాడు, సంజీవనిని తెచ్చాడు. అంతటి మహత్తు గల రామ భక్తి, అటువంటి దాస్యము తనకు అనుగ్రహించ వలసిందిగా  త్యాగయ్య ఆ రాముని వేడుకునే కీర్తన బంటు రీతి.  ఈ కీర్తన సాహిత్యము, అర్థము, పరిశీలన.

సాహిత్యము:
బంటు రీతి కొలువీయవయ్య రామా ||బంటు||

తుంట వింటివాని మొదలైన మదా
దుల బట్టి నేల కూలజేయు నిజ ||బంటు||

రోమాంచమనే ఘన కంచుకము
రామ భక్తుడను ముద్ర బిళ్ళయు
రామనామమనే వరఖడ్గమీవి
రాజిల్లునయ్య త్యాగరజునికే ||బంటు||

భావము:
ఓ రామా! నీ కొలువులో నీ బంటుగా సేవించుకునే భాగ్యము కలిగించు స్వామీ!

మన్మథుడి ప్రభావము వలన కలిగే కామము, మరియు - లోభ, మోహ, మద, మాత్సర్యములనే నా శత్రువులను బట్టి నేల కూల్చు నిజమైన భక్తి వలన కలిగే శక్తిని నాకు ప్రసాదించు నీ బంటుగా నన్ను అనుగ్రహించుము.

నీపై కల భక్తితో కలిగే రోమాంచము (రోమములు నిక్కబొడుచుట) గొప్ప కవచమై, 'రామ భక్తుడు' అనే ముద్ర బిళ్ళ (చిహ్నము/చిరునామా) ధరించి, రామనామము అనే వరము ఖడ్గముగా ధరించి  నీ రామభక్తి సామ్రాజ్యమునందు రాజిల్లుదును. నాకు (త్యాగరాజునకు) అంటి బంటు వంటి కొలువు ఈయుము రామా!

పరిశీలన: 
సంపదలను, లౌకిక సుఖాలను వదులుకుని  పరదైవాన్ని పరమావధిగా సాధన చేయటానికి త్యాగరాజు భక్తి, కీర్తన మార్గాన్ని ఎంచుకున్నాడు. ఈ మార్గమేమి పూల బాట కాదు. విషయ వాంఛలను వదులుకొనుట మానవ జీవితానికి ఆధ్యాత్మిక మార్గములో అతి కష్టమైన పరీక్ష. తన విద్యకు మహారాజులు గుర్తింపు, సన్మానాలు, సత్కారాలు మొదలైనవి ఇంటికి వచ్చినా కూడా వాటిని తిరస్కరించి, పూట గడవటానికి కూడా ఇబ్బంది అయిన పరిస్థితుల్లో కూడా ఆయన రాముని పాదములను విడువలేదు. ఈ మనుజుల కాళ్ళ పట్టుకోలేదు, తన నైతిక విలువలకు పూర్తిగా కట్టుబడి ఆదర్శ ప్రాయుడైనాడు. అందుకే ఆయన కీర్తనలలో అంత భక్తి, అసామాన్య వర్ణన, సంపూర్ణ నిజ దాస్యము, శరణాగతి కనిపిస్తాయి. ఎందరు వాగ్గేయ కారులు వచ్చిన, త్యాగయ్య భక్తి, వినమ్రత, దాస్య చిత్తము ముందు దిగదుడుపే.

అటువంటి బంటు లాంటి కొలువు తనకు ఆ శాశ్వత రామ భక్తి సామ్రాజ్యములో ఇవ్వమని ఆ త్యాగబ్రహ్మం హంసనాద రాగంలో కృతి చేశారు. ఎంతోప్రాచుర్యం పొందిన ఈ కీర్తన రామభక్తిని చిహ్నముగా, రామనామమును ఒక మహత్కరమైన ఖడ్గముగా, ఆ భక్తిలో మునుగుట కలిగిన రోమాంచమును  ఒక గొప్ప కవచముగా వర్ణిస్తారు. అరిషడ్వర్గములు అనే శత్రువులను నాశనము చేయుటకు రామభక్తి సామ్రాజ్యానికి దాస్యమే ఏకైక సాధనము అని మనకు సందేశాన్ని ఇచ్చారు త్యాగయ్య.

రాగ లక్షణము: హంసనాదం అరవైయవ మేళ కర్త నీతిమతి జన్యము. ఆరోహణ: స రి(౨) మ(౨) ప ద(౩) ని(౩) స  అవరోహణ: స ని(౩) ద(౩) ప మ(౨) రి(౨) స . ని, రి దీనికి జీవ స్వరాలు. ఈ రాగం మధ్యమ కాల సంచారంలో అద్భుతంగా ఉంటుంది. పేరులో ఉన్న మృదుత్వము రాగ ఆలాపనలో కనిపిస్తుంది.

ఈ త్యాగరాజ స్వామి కీర్తన (ఆలాపన కూడా ఉంది) డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారి గళంలో వినండి (సహకార గాత్రం ఆయాన ప్రియ శిష్యులు శ్రీ డి.వి. మోహన కృష్ణ గారు).కొంత తెలుగు ఉచ్చారణలో లోపమున్నా, మహారాజపురం సంతానం గారు రాగాన్ని శ్రావ్యంగా ఆలాపించారు.