తిరుమలలో మూడు గoటలు
తిరుమలలో మొదటి గంట,
నైవేద్యం
సుప్రభాతసేవ, అభిషేకాలు, కొలువు, సహస్రనామార్చనల తర్వాత శయన మంటపాన్ని శుభ్రం చేసి బంగారు
వాకిలి తలుపులు మూస్తారు. తిరుమామణి మంటపంలో రెండుసార్లు గంటలు మోగిస్తారు. ఇలా
తిరుమామణి మంటపంలో గంటలు మోగగానే అర్చకులు స్వామివారికి తొలి నైవేద్యం
సమర్పిస్తున్నట్లు ప్రకటిస్తారు. జీయంగారు లేదా ఆయన సహాయకుడు వైష్ణవ సంప్రదాయంలోని
ప్రబంధ అధ్యాయాలను పఠిస్తారు. దీన్ని సట్టుమురా అంటారు. వేంకటేశ్వరుని ముందు
మెట్టుకు ఇవతలి నుండి నైవేద్యం పెడతారు. స్వామివారికి నైవేద్యంగా పులిహోర, దద్దోజనం, లడ్డూలు, వడలు, పొంగలి, చక్రపొంగలి, అప్పాలు, పోళీలు నివేదిస్తారు.
నైవేద్యం స్వామివారికే
కాకుండా విష్వక్సేనుడు, గరుడుడు, నిత్యాసురులకు కూడా నివేదిస్తారు. ఇలా గంటలు మోగించి,
నైవేద్యం సమర్పించడాన్ని వ్యవహారంలో మొదటి గంట
లేదా ఆలయ మొదటి గంట అంటారు.
తిరుమలలో రెండో గంట,
అర్చన
తిరుమలేశుని దేవాలయంలో
అష్టోత్తర శతనామార్చన తర్వాత రెండో గంట మోగిస్తారు. ఈ సంప్రదాయాన్ని రెండో గంట
లేదా అపరాహ్న పూజ ( Second Bell or Aparahna Pooja) అంటారు. ఇలా రెండో గంట మోగించినప్పుడు స్వామివారికి
రెండోసారి నైవేద్యం సమర్పిస్తారు. రెండోసారి జరిగే ఈ అర్చనలో ''వరాహపురాణం'' లోని శ్రీ
వేంకటేశ్వరుని నామావళిని జపిస్తారు. పోటు నుండి తెచ్చిన అన్నప్రసాదాలు, పిండివంటలు స్వామివారికి నైవేద్యంగా సమర్పిస్తారు. ఆనక
తాంబూలం సమర్పించి, కర్పూరహారతి ఇస్తారు.
తిరుమల వేంకటేశ్వర ఆలయంలో
రెండో గంట మోగినప్పుడు చేసే అష్టోత్తర నామార్చనను చూసేందుకు భక్తులను అనుమతించరు.
ఇది ఏకాంత సేవ. ప్రత్యేక సేవలకోసం టికెట్లు కొనుక్కున్న భక్తులు నివేదించిన ''చెరుపులు'' (పులిహోర, దద్దోజనం), ''పన్యారాలు''
(లడ్డూలు) మొదలైన నైవేద్యాలను తిరుమల
వేంకటేశ్వరునికి సమర్పిస్తారు. భక్తులు తెచ్చిన దాంట్లో నుండి కొంత మాత్రమే
వేంకటేశ్వరునికి సమర్పించి, తక్కిన పదార్ధాలను వారికి
తిరిగి ఇచ్చేస్తారు.
తిరుమలలో మూడో గంట
తిరుమల వేంకటేశ్వర ఆలయంలో
ఉదయం జరిపే తోమాలసేవ, రాత్రిపూట కూడా జరుపుతారు.
ఆ సేవ అనంతరం స్వామివారికి హారతి ఇచ్చి అష్టోత్తర శతనామార్చన చేస్తారు. శ్రీదేవి,
భూదేవి మూర్తులకు లక్ష్మీ నామార్చన జరుపుతారు. ఆ
సమయంలో మూడో గంట మోగిస్తారు. అప్పుడు నైవేద్యాన్ని సమర్పిస్తారు. అనంతరం
సర్వదర్శనం తిరిగి ప్రారంభమౌతుంది.