భోగి

తెలుగు వారి పండుగల్లో పెద్ద
జరుపుకొనే పండుగ సంక్రాంతి. సంక్రాంతి
వచ్చిందంటే చాలు పల్లె వాతావరణానికి
కొత్త కాంతి వచ్చినట్టే! పంటలు
చేతికి వచ్చే సమయం కాబట్టి,
ఎక్కడ చూసినా ఆనందం, సంతోషం
వెల్లివిరుస్తూ ఉంటాయి. పండుగ సంబరాలు
కనిపిస్తూ ఉంటాయి. మనకున్న చాలా
పండుగలను ఒకటి రెండు రోజులు
మాత్రమే జరుపు కొంటారు. అయితే
సంక్రాంతిని మాత్రం ముచ్చటగా మూడు
రోజులు జరుపు కొంటారు.
మొదటిరోజు
భోగి, రెండవరోజు సంక్రాంతి, మూడవరోజు కనుమ అని
తెలిసిందే! మరి తొలి రోజు
ఏం చేస్తారంటే..
మొదటిరోజైన
భోగి ప్రత్యేకత తెల్లవారుజామునే ఇంటిలోని వారంతా అభ్యంగన (వంటికి నువ్వుల నూనే రాసుకుని )తలంటు
స్నానం(కుంకుడు కాయలతో తలంటుకోవడం ) చేయటం, కొత్త బట్టలు
ధరించటం, గడపటం. ఉదయం పూట వేసే భోగిమంటలు
ఈ చలికాలంలో ఓ
వెచ్చటి అనుభూతి. ఈ భోగి
మంటలకు పది రోజుల ముందు
నుండే యువకులు దుంగలు, కట్టెలు
పోగు చేస్తారు.అందరూ
తమ ఇళ్లల్లోని పాత
వస్తువుల్ని, వాడని సామగ్రిని కూడా
అందులోనే వేస్తారు. ఇక అమ్మాయిలు అయితే
సంక్రాంతి నెల పట్టినప్పటి నుండి
ఆవు పేడతో గొబ్బెమ్మల్ని పెట్టడం
ఓ ముచ్చట. గొబ్బెమ్మలతో
పిడకలు చేస్తారు. ఆ పిడకల్ని
భోగి రోజు భోగి మంటల్లో
వేస్తారు. కొందరు వీటిని కట్టెల
పొయ్యిల్లో వేసి, పొంగలి వండుతారు. భోగి మంటలో నుండి వచ్చిన బూడిద /విభూతి ని నొసటికి , హృదయానికి రాసుకునేటప్పుడు కింద మంత్రాని చదువుకుంటూ రాసుకోవడం వలన రక్షణ జరుగుతుంది .
భోగి రోజు ఉదయాన్నే తలంట్లు
అయ్యాక తీపి పదార్థాల్ని తినడం
ఓ ఆచారం. ఇక,
ఆ రోజు సాయంత్రం
చిన్నారులకు భోగిపళ్ళు పోస్తారు. ఈ చలికాలంలో
రేగి పళ్లు కూడా విరివిగా
కాస్తాయి. దానికి తగ్గట్లుగానే చిన్నారులను
చిరాయుష్కులై ఉండమంటూ, ఈ భోగిపళ్ల
పేరంటం చేస్తారు. అలాగే ఈ కాలంలో
వచ్చే ఐదు రకాల కూరగాయల్ని
కలిపి కూరగా వండుతారు. దీన్ని
'కలగూర' అంటారు. అలాగే 'నువ్వులతో
పులగం, పొంగలి' ఈ రోజు
చేసే ప్రత్యేక వంటకం. అలాగే
ఈ రోజు సాయంత్రమే
ఆడపిల్లలు బొమ్మల కొలువు పెడతారు.
ఈ సందర్భంగా తోటి
స్నేహితుల్ని, ఇరుగు-పొరుగును పేరంటం
పిలవడం ఇప్పటికీ చాలాచోట్ల కనిపిస్తుంది. బొమ్మల కొలువు ఒక రోజు పెట్టి తీసివేయవచ్చు లేదా ఈ 6 రోజులు ఉంచి ఎతేయవాచు . బొమ్మలకు రోజుకో రకం ఫలహారం పెడతారు.