స్యమంతకమణి ప్రభావం మహాగ్రంథాలు- శ్రీ మహాభాగవతము


 
పాండవులు లక్కయింట కాలిపోయారన్న వార్త వినగానే, వారు క్షేమంగానే ఉన్నారని తనకు తెలిసినా, లీలామానుషంగా, అందరితోబాటూ కృష్ణుడు కనుల నీరు పెట్టాడు. ఆ తరువాత బలరాముడితో కురుదేశం వెళ్లి అక్కడ దుఃఖిస్తూన్న భీష్మ, ధృతరాష్ట్ర, గాంధారి, ద్రోణులతో, "అయ్యో" అని తన విచారం చెప్పి పరామర్శ చేసాడు. కృష్ణుడు లేడని చూసి అక్రూరుడు, కృతవర్మ, శతధన్వుడి దగ్గరకు వెళ్లి, " తన కూతురిని నీకిస్తానని చెప్పి చూడు యేం చేసాడో ఆ సత్రాజిత్తు? కృష్ణుడికిచ్చి పెళ్లి చేసాడు. దానికి ప్రతీకారంగా వాడిని వాడి తమ్ముడి దగ్గరకు యెందుకు పంపించేయరాదు?" అని వాడిని పురికొల్పారు. ఆ మూర్ఖుడైన శతధ్వనుడు వెళ్లి సత్రాజిత్తుని చంపి, స్యమంతకమణిని కాజేసాడు. తండ్రి చావుకి విచారిస్తూ, సత్యభామ వెళ్లి కృష్ణుడికి జరిగినదంతా చెప్పింది. హస్తినాపురి నుంచి ద్వారకకి తిరిగి వచ్చిన వెంటనే కృష్ణుడు శతధన్వుడి అంతం చూసి మణిని తీసుకుందామని నిశ్చయించాడు.

కృష్ణుని నిశ్చయం విన్న శతధన్వుడు వెళ్లి కృతవర్మను శరణు వేడాడు. "బాబోయ్ ! ఆ కృష్ణుడు, బలరాముడూ, అవతార పురుషులు. వారితో వైరమా? నా వల్లకాదు" అన్నాడతడు. అక్రూరుడి దగ్గరకు వెళ్తే, అక్కడ నుంచీ అదే జవాబు వచ్చింది. ఏం చేయాలో తోచక ఆ మణిని అక్రూరుడి దగ్గర వుంచి, గుర్ర మెక్కి పారిపోచున్నాడు. చాలా సేపు వెళ్లాకా ఆ గుర్రం మరి శక్తి లేక కింద వాలింది. అప్పుడు వాడు పరుగు మొదలుపెట్టాడు. కృష్ణుడు వాడిని తరిమి తరిమి తన చక్రాయుధంతో వాడి తల నరికి హతమార్చాడు. కాని వాడి దగ్గర మణి కనబడలేదు. "అరెరే, వ్యర్థంగా వాడిని చంపేసేనే" అని కృష్ణుడు బలరాముడితో తన విచారం చెప్పుకున్నాడు. అప్పుడు , "ఎవరి దగ్గరైనా దాచి ఉంటాడు. ఆ మనిషిని వెదకి పట్టుకో. నేనీలోపల మధుర వెళ్లి మన తండ్రిని కలుసుకుంటాను" అని బలరాముడు చెప్పాడు. మధురలో బలరాముడు కొన్ని సంవత్సరాల పాటూ తల్లితండ్రులను సంతోషపుచ్చడానికి ఉండిపోయాడు. అక్కడికి దుర్యోధనుడు వెళ్లి, బలరాముడి దగ్గర గదా యుద్ధం నేర్చుకున్నాడు. శతధన్వుడి వధ విన్నాక, వారే పురికొల్పిన వారు కనుక గడగడ వణుకుతూ, కృతవర్మా, అక్రూరుడూ ద్వారక నుంచి పారిపోయారు. వాళ్లు వెళ్లిపోయాకా ద్వారకలో జబ్బులు వచ్చి మనుషులు బాధపడ మొదలుపెట్టారు.

శ్రీ కృష్ణుడు ఉన్న ద్వారకలో అరిష్టాలు కలగడానికి ఓ కారణముంది. అది ద్వారకలో కొద్ది మంది పెద్దలకే తెలుసును. "పూర్వం కాశీ నగరంలో అనావృష్టి కలిగినప్పుడు శ్వఫల్కుడనే వాడు అక్కడికి వెల్లగానే వర్షాలు పడ్డాయి. అందుచేత కాశీరాజు తన కూతురిని ఆ శ్వఫల్కుడికి యిచ్చి పెళ్లి చేసాడు. అతని కొడుకైన అక్రూరుడు కూడా తండ్రి లాంటి ప్రభావం కలిగినవాడే. అందుకని అక్రూరుడు ద్వారక విడిచిపెట్టగానే అలా జరిగిందేమో" అన్నారా పెద్దలు.


కృష్ణుడు, "అక్రూరుడు లేకపోవడం వలన కాదు. ఇదంతా ఆ స్యమంతకమణి ప్రభావం. అదిప్పుడు యిక్కడ లేనందున యిలా అయింది" అన్నాడు కాని దూతలని పంపించి, అక్రూరుడిని పిలిపించాడు. అతడు రాగానే సత్కరించి, మంచిమాటలతో, "ఓ దానవతీ, నీకు స్యమంతకమణిని యిచ్చి శతధన్వుడు పరుగెత్తాడని నాకు తెలుసును. సత్రాజిత్తుకి కొడుకులు లేరు. మిగతావారు అతని ఆస్తిని కాజేసినా, స్యమంతక మణి వారికి దక్కదు. అందుకని ఆ మణి నీ దగ్గర ఉండటమే మంచిది. నీ దగ్గర ఉందని నే అంటే నా మాట మా అన్న నమ్మడు. అందుకని మా చుట్టాలుండగా, వారికి ఆ మణిని చూపించేకా నెవ్వే అట్టేపెట్టుకో" అని కృష్ణుడు ఆ మణిని చుట్టాలందరికీ చూపించి, దానిని తిరిగి అక్రూరుడికి అందిచ్చేడు.