గీత
"మోక్షకారణ సామగ్ర్యాం
భక్తిరేవ గరీయసీ,
స్వస్వరూపానుసంధానం
భక్తిరిత్యభిధీయతే"
అని ఆదిశంకర భగవత్పాదులు వివేక చూడామణి గ్రంథంలో అన్నారు.
అద్వైత ప్రకరణ గ్రంథమైన వివేక చూడామణికి ఎంతో ప్రత్యేకత ఉంది. శ్రీశంకర
భగవత్పాదులు వేదాంత సారమైన ఉపనిషత్తులు, భగవద్గీత, బ్రహ్మసూత్రాలకు భాష్యాలు వ్రాసి వాటిని సులభంగా అర్థం
చేసుకోవడానికి ప్రకరణ గ్రంథాల్ని కూడా వ్రాశారు. జ్ఞానమార్గం ద్వారా మోక్షం
పొందవచ్చన్నది ఆయన కనుగొన్న సత్యం. సాధన, సంపత్తి కావాలి.
వివేక, వైరాగ్యాలు కావాలి. ఇహపహ
సుఖాలు కోరకుండా ఉండాలి, మనస్సునూ, ఇంద్రియాలనూ నియంత్రించాలి. ఇంద్రియ వస్తువులు మనముందు
ఉన్నప్పటికీ వాటిని వద్దనుకుని తన హృదయంలో ఉన్న ఆత్మపై ధ్యానం చేయాలి. తీవ్రమైన
ముముక్షుత్వం కావాలి. అంటే ముక్తిని తప్ప మరేదీ కోరకూడదు. సాధకునికి అఖండ ఆనందం
తద్వారా లభిస్తుందని వారిబోధ.
శ్రీ శంకర భగవత్పాదులు అపర
శంకరులు. ఎన్నోభక్తి స్తోత్రాల్నీ వారు రచించారు. వివేక చూడామణిలో మొదటి శ్లోకాలు
చదివినట్లయితే మనకు తెలిసేది వివేక వైరాగ్యాదులు చాలా ముఖ్యమని! వారి భాష్యాల్లో
జ్ఞానసంపాదనకు ప్రాముఖ్యం ఇచ్చారు. అంటే, భక్తిని ఆయన
ఎప్పుడూ నిరసించలేదు. తనలోనే ఉన్న ఆత్మను ఎల్లప్పుడూ ఎరుకతో జ్ఞాపకం ఉంచుకోవాలి
అంటున్నారు. శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పినట్లు
"ఈశ్వరః సర్వభూతానామ్
హృద్దేశేర్జున తిష్ఠతి" - సర్వజీవరాశుల్లో భగవంతుడు వారి వారి హృదయాల్లో
విరాజిల్లుతున్నాడు.
"అహమాత్మా గుడాకేశ
సర్వభూటాశయస్థితః" - నేను ఆత్మగా అందరి హృదయాల్లో ఉన్నాను. ఓ అర్జునా! ’సర్వస్యాహం హృది సన్నివిష్ఠః’ - నేను, సర్వజీవరాశుల హృదయాల్లో
నివసిస్తున్నాను.
భక్తి అనేది ముక్తికి
సోపానం. అదేవిధంగా జ్ఞానమార్గం ద్వారా మోక్షం లభిస్తుంది. ’జ్ఞానాదేవతు కైవల్యం. ప్రజ్ఞానం బ్రహ్మ’ అని వేదాలు ఘోషిస్తున్నాయి. శ్రీరామకృష్ణ పరమహంస వైరాగ్య
పరిపూర్ణులైన సర్వసంగ పరిత్యాగులకు జ్ఞానమార్గం, గృహస్థ భక్తులకు భక్తిమార్గం బోధించారు. మార్గాలేవైనా గమ్యం
ఒక్కటే అని గుర్తించి, నమ్మిన మార్గంలో సాధన చేయాలి.