శ్రావణమాసం వేదాధ్యయన కాలం.
ఈ కాలం లోనే వేదపురుషుడు "శ్రీకృష్ణుడు" ఆవిర్భవించాడు.
క్రిష్ణావిర్భావమే ఒక పరమార్ధంతో కూడినది. విశుధ్ధచిత్తంతో కూడిన సత్త్వగుణం,నిష్కామ గుణాల కలయిక వల్ల రసోత్పత్తి ఏర్పడుతుంది. దీనిని
"ఆనందగ్రంది" అంటారు. శ్రీకృష్ణుని తండ్రి వసుదేవుడు సత్త్వ గుణంతో కూడి
విశుధ్ధ చిత్తం కలవాడు. తల్లి దేవకి నిష్కామ బుద్ధి కలది. ఇటువంటి దంపతుల
ఆనందగ్రంది (రసస్వరూపుడు) కృష్ణుడు. ఆ విధంగా జన్మించిన గోవిందుడు ఆ మాతాపితరులకే
కాక సకల ప్రాణికోటికి ఆనందామృతము పంచి సచ్చిదానంద స్వరూపుడయ్యాడు. భగవంతుడు
భక్తికి లొంగుతాడు. యశోద భక్తికి లొంగి తాడుతో రోలుకు బంధీ అయ్యాడు. భక్తులు తమ
గుండెల్లో బంధిస్తామన్నా ఆయన ఆనందంగా ఒప్పుకుంటాడు. అట్టి సచ్చిదానంద స్వరూపుడైన
కృష్ణుడిలోనే అన్ని లోకాలు ఉన్నాయి. ఆయన కాలిమువ్వలు పాతాళం,రసాతలం,ఆయన మోకాళ్ళ ప్రదేశం
మహాతలలోకం. ఆయన హృదయం సురలోకం. ఆయన నాభి అనంతాకాశం. ఆయన శిరస్సు సత్యలోకం.
శ్రీకృష్ణుడు చల్లదనం ఇచ్చే సూర్యుడని పరమ భక్తాగ్రేసరుడు వేదాంతదేశికులు అన్నారు.
సూర్యుడికి గ్రహణం రావచ్చు. శ్రీకృష్ణుడనే సూర్యుడికి మాత్రం ఏనాటికి గ్రహణం రాదు.
ఆయన అవతార అమృత కిరణాలు భూమిని ఎన్ని యుగాలైనా తేజోమయం చేస్తూనే ఉంటాయి.