టీచర్స్ డే
మన మొదటి ఉప రాష్ట్రపతి,
రెండో రాష్ట్రపతి అయిన సర్వేపల్లి రాధాకృష్ణన్ పుట్టిన రోజునే
ఇలా 'టీచర్స్ డే'గా చేసుకుంటామనీ తెలుసు. మరి ఆయన పుట్టిన రోజునే ఉపాధ్యాయుల దినోత్సవంగా ఎందుకు
చేసుకోవాలి? ఆయన గొప్పతనమేంటి?
చెన్నై దగ్గర తిరుత్తణి అనే
చిన్న వూరిలో 1888 సెప్టెంబర్ 5న పుట్టిన రాధాకృష్ణన్కు చదువంటే ప్రాణం. తిరుపతిలోని జర్మన్ మిషనరీ స్కూల్లో
మొదలైన విద్యాభ్యాసం ఆపై ఉపకార వేతనాలతోనే సాగింది. మద్రాసు క్రిస్టియన్
కళాశాలలో తత్వశాస్త్రంలో ఎమ్మే పూర్తి చేసిన రాధాకృష్ణన్, ఇరవై ఏళ్ల చిన్న వయసులోనే మద్రాస్ ప్రెసిడెన్సీ
కాలేజీలో బోధకుడిగా చేరారు. ఆయన వ్యక్తిత్వం, బోధన శైలి విద్యార్థులపై చెరగని ముద్ర వేసేవి. కళాశాల
గ్రంథాలయంలోని దేశ, విదేశీ తత్వ గ్రంథాలన్నీ చదువుతూ విలువైన
వ్యాసాలను, పరిశోధన పత్రాలను రాసేవారు. ఆయన 1918లో యూనివర్శిటీ ఆఫ్ మైసూర్లోను, 1921లో కోల్కతా యూనివర్శిటీలోను ప్రొఫెసర్ పదవులు నిర్వహించారు.
ఆయన రాసిన 'ఇండియన్ ఫిలాసఫీ' పుస్తకం ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందింది.
ప్రత్యేక ఆహ్వానంపై ఆక్స్ఫర్డ్ యూనివర్సీటీలో ప్రసంగాలు చేసిన ప్రతిభ ఆయనది.
బెనారస్ హిందూ యూనివర్సిటీ, ఆంధ్రా
యూనివర్శిటీల్లో వైస్ఛాన్స్లర్గా పనిచేసిన ఆయన యునెస్కో, సోవియట్ యూనియన్లకు రాయబారిగా వ్యవహరించారు. 'యూనివర్సిటీ ఎడ్యుకేషన్ కమిషన్'లో సభ్యుడిగా మన దేశ విద్యా వ్యవస్థ మెరుగుదలకు ఎన్నో విలువైన సూచనలు
చేశారు. 1952లో మన మొదటి ఉపరాష్ట్రపతిగా,
1962లో మన రెండో రాష్ట్రపతిగా పదవిని చేపట్టారు.
భారత ప్రభుత్వం ఆయనను 1954లో భారతరత్నతో గౌరవించింది. ఏ పదవిలో ఉన్నా నిరాడంబరంగా
ఉండేవారు. రాష్ట్రపతిగా తన కొచ్చే జీతం పది వేల రూపాయల్లో కేవలం 2,500 తప్ప గతాదంతా ప్రధాని సహాయ నిధికి
విరాళంగా ఇచ్చేవారు. రాష్ట్రపతిగా ఉన్నప్పుడు ఆయన పుట్టిన రోజును వేడుకగా
నిర్వహిస్తామని అభిమానులు కోరితే, ఆ రోజును ఉపాధ్యాయుల దినోత్సవంగా గుర్తించాలంటూ ఆయన
సూచించారు.