లక్ష్మీదేవి నివసించడానికి ఇష్టపడే ప్రదేశాలు




1. ఏనుగు యొక్క కుంభస్థలం,
2. గోపృష్ఠం,
3. తామరపువ్వు,
4. బిల్వదళం,
5. స్త్రీయొక్క సీమంతము ( నుదుటి భాగము )


ఈ ఐదు కూడా లక్ష్మీదేవికి ప్రబల నివాస స్థానములు. అందుకే ఏనుగు ముఖమును ( గజముఖుని ), గో పృష్ఠమును పూజించడం వలన, పద్మములతోను బిల్వదళములతోను ఈశ్వరుని సేవించడం వలన, సీమంతమందు కుంకుమతో అలంకరింపబడిన స్త్రీల ముఖమును దర్శించడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. అనేక సంపదలను పొందగలము.
లక్ష్మీ సర్వ సంపదలకీ అధిష్ఠాతృ దేవత. ఇంద్రియ నిగ్రహం, శాంతం, సుశీలత్వం వంటి సుగుణాలకు ఆధారమైన సర్వ మంగళ రూపం లక్ష్మీదేవిది. లోభం, మోహం, రోషం, మదం, అహంకారం వంటి గుణాలేమి లేని చల్లని చల్లని తల్లి ఆమె. సర్వ సస్యాలు ఆమె రూపాలే.

వైకుంఠంలో మహాలక్ష్మి, స్వర్గంలో స్వర్గలక్ష్మి, రాజ్యంలో రాజ్యలక్ష్మి, గృహాలలో గృహలక్ష్మి అంటూ సర్వ ప్రాణులలో, ద్రవ్యాలలో మనోహరమైన శోభ లక్ష్మీ రూపమే. లక్ష్మీదేవి అన్నిచోట్ల ఉండే దయారూపిణి.

అలాంటి లక్ష్మీదేవిని పూజించే లక్ష్మీప్రద మాసమైన శ్రావణమాసం వచ్చేస్తోంది. జ్యోతిష్య శాస్త్రరీత్యా శ్రావణమాసం ఆధ్యాత్మికంగా లక్ష్మీప్రదమైన మాసం. ఈ మాసం లక్ష్మీదేవిని ఆరాధించేవారి సకల సంపదలు చేకూరుతాయి. ఇంకా వరలక్ష్మీవ్రతం ఆచరించే వారికి కోరిన కోరికలు నెరవేరడంతో పాటు శుభ ఫలితాలను ఆ లక్ష్మీమాత అనుగ్రహిస్తుంది.


సోమ, శుక్రవారం.. లక్ష్మేదేవికి ఇష్టమైన రోజులు. ఆ రోజుల్లో పొద్దున, సాయంత్రం దీపారాధన చేయడం దీర్ఘసుమంగళీ ప్రాప్తంతో పాటు అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తుంది. అలాగే శ్రావణ అష్టమి, నవమి, ఏకాదశి, త్రయోదశి, చతుర్దశి, అమావాస్య, పూర్ణిమ వంటి తిథులు లక్ష్మీపూజకు శ్రేష్టమైనవి.