పరిమితితోనే పరమానందం


ఆధునిక కాలమంతా ధనార్జనతోనే గడచిపోతూంది. సంపాదించిన ఆధనాన్ని కూడా సక్రమంగా ఖర్చు పెడుతున్నారా అంటే అదీ సందేహమే! మనం ఏవస్తువునూ అవసరానికి మించి కోరకూడదు. ఒక వస్తువును కొనేటప్పుడు, మనం బేరం చేసి ఎంత తక్కువ ధరలో కొనవచ్చో అంత తక్కువ ధరలో కొంటాం. కానీ ఆవస్తువు మనకు అవసరమో, కాదో ఆలోచిస్తున్నామా? వస్తు సముదాాన్ని వృథాచేసుకుంటూ పోవడంవల్ల మనకు సుఖం అధికమవుతుందని అనుకోవడం ఒక భ్రమ. జీవితం సుఖంగా గడవాలంటే కొన్ని ముఖ్యమైన వస్తువులుంటే చాలు. ఈవిషయం మనం గుర్తించగలిగితే మన ఆచారాలు, అనుష్ఠానాలు వదలుకొని దేశాంతరాలకు పోయి మరీ విస్తార ధనార్జన చేయవలసిన అవసరం ఏర్పడదు. ఆత్మవిచారానికీ, ఈశ్వర ధ్యానానికీ, పరోపకారానికీ మనకు కావలసినంత సమయం కావాలంటే, అవసరాలకు మించి వస్తువును సముపార్జించే లౌల్యాన్ని వదిలిపెట్టాలి.
మనం రెండు విధాలుగా కాలాన్ని వ్యయం చేస్తున్నాం. ఒకటి ధనార్జన కోసం, రెండవది ఆ ధనార్జనతో సంపాదించిన వస్తువుల రక్షణ కోసం! ఈరెండింటి నుంచి కాస్త మనస్సును మళ్ళించగలిగితే, ఆత్మ తుష్టికరములైన సాధనలు చేసి జీవితాన్ని శాంతంగానూ, సుఖంగానూ, ఆనందంగానూ, తృప్తిగానూ గడపవచ్చు.
ఈపొదుపు వస్తువుల విషయంలోనే కాదు సంభాషణల్లోనూ అలవరచుకోవాలి. పదిమాటల్లో చెప్పవలసిన విషయాన్ని ఒక్కమాటలో చెప్పగల సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలి. ఎప్పుడు మనకు ఈవిధైన వాచాసంయమనం కలుగుతుందో, అప్పుడు బుద్ధిలో తీక్ష్ణమూ, వాక్కులో ప్రకాశమూ మనం చూడగలం. మనవాక్కులు వ్యర్థం కాకూడదు. మౌనేన కలహం నాస్తి; మౌనం వల్ల కలహాలు పొడసూపే అవకాశమే ఉండదు కదా! మితభాషణ వలన మనశ్శాంతి, ఆత్మశ్రేయస్సూ వృద్ధిచెందుతాయి. కానీ ఈకాలంలో మనం చూస్తున్నదంతా వాగాడంబరమే! పొదుపు ఒక్క చేతల్లోనే కాకుండా మాటల్లో కూడా ఉండాలి. భాషణలో కూడా పరిమితిని పాటిస్తే ప్రశాంతంగా ఉండగలం.
దాతృత్వంతోనే లక్ష్మీకటాక్షం: నిజానికి అన్ని కోరికలూ సంకల్పం వల్లనే ఉద్భవిస్తున్నాయి. కొత్త, కొత్త సంకల్పాలు ఉదయించకుండా చూసుకుంటే కోరికలూ క్రమక్రమంగా క్షీణిస్తాయి. కోరికలు క్షీణించే కొద్దీ మన కార్యక్రమాలు, ధనార్జన, వస్తు సంపాదన తగ్గుతూ వస్తాయి. సంకల్పాలు క్షీణించాలంటే సద్వస్తువులపై దృష్టి నిలపాలి. అప్పుడు చిత్తవృత్తులు సమసిపోయి, ఏకాగ్రత సిద్ధిస్తుంది. ఏకాగ్రతకు అపరిగ్రహం అత్యవసరం. మనం సంపాదించే ధనమంతా స్వార్థం కోసమే కాక దానధర్మాలకు కూడా వెచ్చించాలి. మన సమాజంలోనే సత్కార్యాల కోసం దానధర్మాలు చేసే సుకృతులు ఎంతోమంది ఉన్నారు.

లోకంలో ఎంతోమంది దుఃఖితులూ, దరిద్రులూ ఉంటే, వారు కష్టపడుతూ ఉంటే, మనం వృథాగా ధనాన్ని ఖర్చుపెట్టడం పాపం. మన ధనంతో దీనుల దుఃఖాశ్రువులను తొలగించగలిగితే అంతకన్నా పుణ్యకార్యం వేరే ఉండదు. సంపద ఉండగానే సరిపోదు! దానిని సద్వినియోగం చేస్తున్నామా? పరోపకారానికి అది ఉపయోగపడుతుందా? దీనజనోద్ధరణము సహాయపడుతుందా? అని జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి. ఇలా సంపద సద్వినియోగమయ్యే కొద్దీ మనకు లక్ష్మీకటాక్షం కూడా సమృద్ధిగా లభిస్తుంది.