ఆళ్వారుల వైభవము
ఆళ్వారు అనగా లోతునెరిగిన
వాడు అని భావము.భగవద్భక్తి ప్రపత్తుల ఫలితమున బడసిన పరమానంద సముద్రము యొక్క లోతు
నెరింగినవాడు ఆళ్వారు. భక్తి సాగరతలం ముట్టిన మహితాత్ముడు అని అర్థం. భక్తి
పరవశంతో భగవంతుని అనంత దివ్య మంగళ విగ్రహమును వారి మనో నేత్రములతో తిలకించుచూ,
తన్మయ భావమున సంశ్లేష భావమున భగవంతునితో
సంభాషించుచూ, ఆనందసాగరమున మునిగి
తేలుచున్న తేజోమయులు. ఉభయ విభూతి నాయకుడైన శ్రీమన్నారాయణుని స్వరూప రూప గుణ
విభవైశ్వర్యాలను నాలుగు వేల తమిళ పాసురములతో కొనియాడిన మహనీయులు ఆళ్వార్లు.
"సర్వం
విష్ణుమయం-స్వార్థరాహిత్య భావమే ఆనంద మోక్షములకు ఉపాయము-విష్ణు సంశ్లేషము
పరమానందానుభవము" అను దివ్య సందేశములు యిచ్చినవారు ఆళ్వార్లు.
వేదములు సర్వులకు తెలియని
సంస్క్రుత భాష యందు ఉండటము, మరియు వేదములను అందరు
చదవరాదనియు, వైదిక మతాచారములు రాను రాను
కఠిన ముగను వుండి కొన్ని కులముల వారికి మాత్రము స్వలాభకరముగా ఉంటున్నందున, సర్వులకును అర్థమగు విధమున తమిళభాష యందు భగవద్భక్తి
కీర్తనలను గానము చేసినట్లయితే ప్రజలు భక్తి ప్రపత్తి యోగముల ను ఆలింగనము
కావింతురని ఆళ్వారులు భావించిరి. వారు సంస్క్రుత పాండిత్యము కలవారైనను, కారుణికులును, వివేక చతురులును
అగుటచేత వేదోపనిషత్తులు బ్రహ్మసూత్ర పురాణేతిహాసముల యొక్క సారమును భక్తికీర్తనలలో
గానము చేయసాగిరి.
వారి భక్తి స్వచ్చమైనది.
వారికి కుల భేదములు లేవు. సర్వమానవ సోదరభావమే వారి మతము. ఆచారములకు వారు
ప్రాధాన్యము యివ్వలేదు.మానవుడు శరణాగతి తత్వమున భక్తిప్రపత్తులతో దైవమును
ఆరాధించుటయే కాక భక్తి ప్రేమలను తోటి మానవులకు చూపి, సర్వము భగవత్సంసారము అను భావమున జీవితముల సుఖపరచుకొనుచు,
ఆనందమయులుగా దైవ స్పర్శతో ఉండవలయునని ఆళ్వారుల
దివ్య సందేశము.
భక్తి, ప్రపత్తి శరణాగతిభావములు లేనియెడల నైతిక జీవితము నిలువదని
తలంచినవారై, లోకకళ్యాణము కొరకై యీ భక్తి,
ప్రపత్తులే మానవులయందు స్వార్థరహిత భావమును,
నిరాడంబరత్వ్వమును, భూతదయను, అఖిల మానవ
సౌభ్రాత్రుత్వమును పెంపొందించగలవని భావించిరి.వర్ణ జాతి భాషా భేదములకు అతీతులై
లోకకళ్యాణార్తము స్వార్థరహిత జీవితము గడుపుచు యీర్ష అసూయ యెరుగకుండ సర్వం
విష్ణుమయమని తలంచి వైష్ణవశక్తి గుణగానముచేసిన మహాత్ములు ఆళ్వారులు.
ఆళ్వారులు పండ్రెండు మంది.
ద్వాదశాళ్వారులు అని ప్రబంధములయందు ప్రసిద్ధి. వీరిలొ అన్నికులముల వారు ఉన్నారు.
వీరిలొ ఒకరు స్త్రీ. ఒకరు పంచములు, ఒకరు క్షత్రియులు, కొందరు శూద్రులు, కొందరు బ్రహ్మణులు
మరియు కొందరు అయోనిజులు.
యీ ఆళ్వారుల దివ్య వైభవము
ప్రాభావితము చేసిన వారిలొ ముఖ్యులు "వైష్ణవ విశిష్టాద్వైత సిద్ధాంత
ప్రతిష్టాపకులును, ఉభయ వేదాంత ప్రవర్తకులును
అయిన ఆచార్యత్రయము(మునిత్రయము)అయిన శ్రీనాథముని, యామునాచార్యులు మరియు ఆచార్య రామానుజులు.
పన్నిద్దరాళ్వారుల
నామధేయములు మరియు వారి విష్ణుమూర్తి యొక్క అంశ
1.పొయిగై ఆళ్వారు. శ్రీ
మహావిష్ణువు యొక్క పాంచజన్యము అంశమున జన్మించినవారు.పాంచజన్యము విశ్వము లోని
శబ్దమునకు మరియు సారస్వతమునకు సాంకేతికము.
2.భుతాళ్వారు లేక
పూదత్తళ్వారు. కౌమోదకి అను స్వామి గద యొక్క అంశము. గద యుద్దమునకు సాంకేతికము.
విశ్వమునండు నిరంతరము రెందు శక్తుల మద్య పోరాటము జరుగుచునే ఉన్నది. యిందు భౌతిక
శక్తులకంటే నైతిక శక్తులకు ప్రాధాన్యము మెండు.. అనగా మంచి చెడుల మద్య పొరాటముగను,
మంచి చెడును వోడించు గాక అను భావము యిమిడి
వున్నది.
3.పేయాళ్వారు. విష్ణుమూర్తి
యొక్క నందకము అను ఖడ్గము అంశము.
మానవుడు దుర్మార్గమును తన
నైతిక ఖడ్గముతో చేదించుటకు అను భావము యిమిడి ఉన్నది.
4.తిరుమళిశై ఆళ్వారు.
విష్ణుమూర్తి యొక్క సుదర్శనచక్రము అంశము. సుదర్సనచక్రము కాలమునకు సంకేతికము.
విశ్వము అనంతము మరియు కాలము ఆదిమద్యాంత రహితము అనుభావములు రెండును యిందు
యిమిడివున్నవి.
5.కులశేఖరాళ్వారు.
విష్ణుమూర్తి యొక్క కౌస్తుభమణి అంశము. విశ్వములోని విలువలకు సంపదలకు కౌస్తుభము
సాంకేతికము.
6.తొండరడిప్పొడి ఆళ్వారు
(విప్రనారాయణుడు).విష్ణుమూర్తి ధరించునట్టియు, వాడిపోనట్టియు అగు వైజయంతి అను పుష్పమాల అంశము.
విశ్వమునందలి కల అనేక రమ్యమైన వ్రుక్ష ప్రక్రుతి సంపదలకు సాంకేతికము.
7. తిరుప్పణి ఆళ్వారు.
విష్ణుమూర్తి యొక్క శ్రీ వత్సలాంచనము అంశము. మహాసముద్రమునకు, దయాసముద్రమునకు సాంకేతికము. దయాగుణమె విశ్వమునకు, ప్రక్రుతికి, సంఘమునకు, వ్యక్తికి జీవము.
8.తిరుమంగై ఆళ్వారు.
విష్ణుమూర్తి యొక్క శార్జ్గము అను ధనుస్సు అంశము. ప్రపంచమున దుష్టశిక్షనకు ధనుస్సు
అవసరము.
9.పెరియాళ్వారు
(విష్ణుచిత్తుడు). విష్ణుమూర్తి యొక్క రథము అంశము. స్వామిరథము గంభీరతకును, దర్పముకును, ఆనందమునకును
ప్రొత్సాహమునకును సాంకేతికము. రథొత్సవము ఎంత గంభీరముగ నుండునో, మానవుడు తన గుణాలంకరణచే గంభీరుడై, ఉన్నతుదై, తోటివారికి అండగా, దండనగా, ప్రోత్సాహిగా మెలగవలయునని
భావము.
10.ఆండాళ్ (గోదా దేవి). భూదేవి
అవతారము. భూదేవి పంచభూతములలొ నొకరు.
11.నమ్మళ్వారు. విష్ణుమూర్తి
సేనాని విష్వక్సేనుని అంశము. నాయకునికి సాంకేతికము. విష్ణుమూర్తి స్థితి పోషకుడు
గావున అట్టి స్థితిపోషణకు నాయకత్వమను విశిష్ట గుణము అవసరము.
12.మధురకవి ఆళ్వారు.
గరుత్మంతుని అంశము. శక్తికి గమనమునకు మరియు వేగమునకు సాంకేతికము.
యీవిధముగా
పన్నిద్దరాళ్వార్ల అంశములు చేరి విశ్వమే అగుచున్నది. అందువలన వారిని
విష్ణ్వాంశములని ప్రబంధములలొ వర్ణించియున్నారు.