శ్రీ కృష్ణుని జననం
సత్యసంకల్పుడైన పరమాత్మ
స్వాయంభువమనువు కోరికను తీర్చేందుకు, తొలి జన్మలో
పృశ్నిగర్భునిగా, రెండవ జన్మలో అదితి
కశ్యపులకు వామనునిగా, మూడవజన్మలో దేవకి
వసుదేవులకు గోవిందునిగా జన్మించాడు.
తండ్రి వసుదేవుదు జాతకర్మ
నిర్వహించలేని నిస్సహాయ స్థితి లో ఉన్నాడు, స్వామి జననము కారాగృహములో కాబట్టి !
పాడిరి గంధర్వోత్తము
లాడిరి రంభాది
కాంతలానందమునన్
గూడిరి సిద్ధులు, భయములు
వీడిరి చారణులు మొరసె
వేల్పుల భేరుల్!!!
అతి ప్రసన్నుడైన వెన్నుని
కన్న దేవకి, పున్నమినాడు షోడశ
కళాప్రపూర్ణుడైన చంద్రుని కన్న ప్రాగ్దిశవలె చెలువొందినదంటారు పోతన్నగారు. పదహారు
కళల పూర్ణావతారంగా శ్రీ మహావిష్ణువు భూమిపై అవతరించినది అర్ధరాత్రి వేళ.
దేవతలకు కూడా దొరకని ఆ పరమ
పురుషుడు గోపబాలురతో ఆడి పాడాడు. స్వయంగా అమృతాన్ని పంచిన మోహినీవేషుడు వ్రజవాడలో
వెన్న దొంగిలించాడు. ఆ కపటనాటక సూత్రధారి రాబోయే యుగసందికి సంకేతంగా తల్లి చేతి
తాళ్ళకు కట్టుబడ్డాడు. ఆ గోవిందుడు గోకులంలోని క్షీరాన్నే కాదు, జలాన్ని కూడా అమృతమయం చెయ్యాలని భావించాడు. అందుకే ప్రతి
పసిప్రాణిలోనూ వసివాడని కన్నయ్య పసితనాన్నిభావించగలిగితే అదే జన్మ సాఫల్యం. జీవన
మాధుర్యపు ఊటగా మారి ఆ దివ్య నర్తకుని చరణాలమీద అశ్రు అభిషేకం చేయదా!
లోకాలన్నిటినీ కడుపున దాచిన
విశ్వంభరుడు గోపాల బాలుడై యశోదానందుల కొడుకైనాడు
చతుర్భుజాలతో, శంఖు, చక్రాలతో శ్రీవత్సలాంచనాలతో
ఉద్భవించిన శ్రీ మహా విష్ణువు దేవకి వసుదేవులకు కన్నులపండుగ చేశాడు .
అటువంటి శ్రీ కృష్ణ పరమాత్మ
అవతరించిన శ్రావణ బహుళాష్టమి పర్వదినము రేపే.
అష్టమి తిధి విశిష్టత :
కృష్ణుడు భూమి పై పుట్టింది
మొదలు ఎనిమిది సంఖ్యతో ఆయన జీవితం ముడిపడింది.
దశవతారాలలో కృష్ణవతారం
ఎనిమదవది.
స్వామి జన్మించింది ఎనిమిదవ
నెలలోనే...అష్టమి తిధి నాడు.
కృష్ణసావర్ణ మన్వంతరం
ఎనిమదవిది.
శ్రీ ముఖ సంవత్సరం శ్రావణ
బహుళ అష్టమి రాత్రి వృషభ లగ్నము లో సంభవించిన సర్వోత్తమైన ముహుర్తంలో
శ్రీమన్నారాయణమూర్తి లీలాగ్రహితశరీరుదైన దేవకి గర్భాన అర్భకునిగా జన్మించాడు.
రోహిణి నక్షత్రముతో కలిసిన
అష్టమి తిధి రాత్రిని జయంతి అని అంటారు. విజయనామక విశిష్ట ముహుర్తములో
వ్యతీతమవుతున్న శుభసమయము అది.
శ్రవణా నక్షత్రయుక్త
పూర్ణిమ కలది శ్రావణ మాసం.
తరువాత బహుళ అష్టమి నాడు
స్వామి జననం.
కృష్ణ పక్షము స్వయముగా
కృష్ణ సంబంధమైనది.
అష్టమి తిధి పక్షము మధ్యలో,
పాడ్యమి నుండి అమావాస్య వరకు గల తిధుల సంధిలో
ఉంది.
యోగిజనులకు రాత్రి
ప్రియమైనది.
అందుకే యోగీశ్వరుడైన శ్రీ
కృష్ణ పరబ్రహ్మ అర్ధరాత్రి సమయములో ఆవిర్భవించాడు.
కృష్ణవతారములో నిశానాధుదైన
చంద్రుని వంశములో జన్మించడానికి నిర్ణయించుకున్నాడు శ్రీమన్నారాయణ మూర్తి. అది
వృషభ లగ్నము.
శ్రావణమాసంలో రాత్రి
ఒంటిగంట తరువాత వృషభ లగ్నం వస్తుంది. దాదాపు అష్టమి చంద్రుడు ఉదయించే సమయం అదే!
దేవతల విశిష్ట గుణాలను
అభివర్ణిస్తు , సహస్రనామస్తోత్రాలను
మహర్షులు మానవ జాతికి అందించారు.
అయితే , ఒక్క విష్ణు సహస్రనామం మాత్రం శ్రీ కృష్ణుని ఎదుట ఉంచుకుని
చెప్పబడింది.
ఫ్రతి విశేషాణాన్ని స్వామి
ఆమోదిస్తునట్లు భావిస్తు, భీష్ముడు సహస్ర నామాలను
అభివర్ణించాడు.
ఈ చెప్పిన భీష్మపితామహుడు
అష్టమి వసువైన ప్రభాసుడు.
స్వామి మతౄగర్భం నుండి
ఎనిమదవ నెలలోనే ఆవిర్భవించాడని, అందుకే ఆయనను పద్మపత్రాలలో
ఉంచారని ఒక నమ్మకం ఉంది. వటపత్రశాయి ఈ అవతారములో అంబుజపత్రశాయి అయ్యాడు.
అసంపూర్ణమైన అష్టమ మాసములో
జన్మించినందు వలన పద్మపత్రాలలో ఉంచడం ఆనాటి వైద్యవిధానం.
శ్రీ కృష్ణుని జననం వెనుక
దాగి ఉన్న మరికొన్ని విశేషాలు :
శ్రీ మహా విష్ణు
ఆవిర్భావంతో భూమాత పులకించింది. ప్రకృతి ఆనందానికి తిరుగులేదు.
నిర్గుణ పరబ్రహ్మం ధర్మ
సమ్రక్షణార్ధం అవతరించిన శుభసమయములోనే యోగమాయ చెల్లెలుగా ఆవిర్భవించింది. అందుకే
ఆమె కృష్ణ సహోదరి . అన్న చెల్లెలకి అండగా ఉండాలని ,ఆడబిడ్డకు పుట్టింటి అండ ఎప్పటికి అవసరమే అని , ఈ సత్సంప్రదాయాన్ని మనకి నేర్పినవాడు శ్రీ కృష్ణుడు !
మేనత్త కుంతిని గౌరవించాడు. చెల్లెలు వరుసైన ద్రౌపదిని కాపాడాడు. ఇలాగ ఆయన లోక
కల్యాణము కోసము ఎన్నో చేశాడు.
భారతయుద్ధం ప్రారంభములో
విజయదాయినీ అయిన దుర్గను ధ్యానించమని కృష్ణుడు అర్జునునితో చెప్తాడు.
పండుగ జరుపుకునే విధానము :
రోజంతా ఉపవాసం ఉండి
సాయంకాలం వేళ ఇల్లంతా కడిగి, ముగ్గులు వేసి, కృష్ణ పాదముద్రలు చిత్రించి మామిడి తోరణాలు కట్టి కృష్ణుని
విగ్రహానికి అర్చన జరిపి, నవనీతాదులతో పిండి వంటలు
నివేదన చేసి ఆరాధించాలి.
"ఓ సర్వలోకేశ్వరా! సర్వ
పాపాలను సంహరించి, నరక సముద్రమందూ, దుఃఖ సముద్రమందూ పడియున్న నన్ను రక్షించు. నీకంటే రక్షకులు
లేరు. అనేక దీనుల్ని స్మరణ మాత్రం చేత రక్షించావు. నన్ను రక్షించు. కౌమార, యౌవన, వార్ధక్య అవస్థలలో చేసిన
పుణ్యమును వృద్ధి చేయుము" అని వేడుకోవాలి.
ఈరోజు ఉదయాన్నే స్నానాదులు
చేసి శ్రీకృష్ణుని షోడశోపచారాలతో అర్చించడం మహోత్క్రుష్టం. ఉదయమే కాక రాత్రి వేళ
కూడా స్వామిని అర్చిస్తారు. కృష్ణునికి ప్రీతిపాత్రమైన సాత్త్వికాహారం - పాలు,
పళ్ళు, వెన్న, మీగడ మొదలైన వాటితో నివేదన చేసి ఆరాధించాలి.
చాలామంది ముగ్గులతో కృష్ణ
పాదాలను ఇంటి ముందు చిత్రిస్తారు. స్వామికి ఆహ్వానంగా. బాలకృష్ణ రూపంనుండి అన్ని
కృష్ణ రూపాలూ ఆరాధనీయాలే. అందుకే కన్నయ్యా తవ చరణం మమ శరణం!!
పెను చీకటికి ఆవల ఏకాకృతితో
వెలుగు దివ్యజ్యోతి శ్రీ కృష్ణ పరమాత్మ !