చక్ర సౌందర్యం


మన శరీరం ఏడు చక్రాల సమాహారం. ఈ చక్రాలన్నీ అవయవాలను శుభ్రం చేసి.. మనల్ని నిత్య ఆరోగ్యవంతులుగా తయారుచేస్తాయి. 


మూలాధార చక్రం : శరీరంలోని వెన్నెముక కింది భాగంలో ఉంటుంది మూలాధార చక్రం. కళ్లు మూసుకుని ఆ ప్రదేశంలో ఒక చక్రం ఉన్నట్లు ఊహించుకోవాలి. దాని మీదే దృష్టిపెట్టి మూడు నిమిషాలు కూర్చుంటే సరిపోతుంది. ఈ సమయంలో సాధారణ శ్వాస తీసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల మల మూత్రాలు సాఫీగా సాగుతాయి.

స్వాధిష్టాన చక్రం : వెన్నెముక కింది భాగం - అంటే బొడ్డుకి కొంచెం కింది స్థానంలో ఉంటుందిఈ చక్రం. దీని మీద దృష్టి నిలపడం వల్ల మూత్రపిండాల పనితీరు మెరుగుపడుతుంది.

మణిపూరక చక్రం : వెన్నెముక దగ్గర బొడ్డుకి వెనుక భాగంలో ఉంటుంది ఈ చక్రం. ఈ భాగం మీద మనసును ఏకీకృతం చేస్తే జీర్ణశక్తి అభివృద్ధి చెందుతుంది. క్లోమగ్రంథి చక్కగా పనిచేస్తుంది. మధుమేహ సమస్యలను రాకుండా కాపాడటం దీని ముఖ్య లక్షణం.

అనాహత లేక హృదయ చక్రం : గుండెకు వెనుక భాగాన ఉండే ఈ చక్రం అత్యంత కీలకమైనది. దీని మీద దృష్టి పెట్టడం వల్ల గుండెకు వెళ్లే రక్తనాళాల్లో అడ్డంకులు ఏర్పడవు. రక్తం సాఫీగా సరఫరా అవుతుంది. రెగ్యులర్‌గా ఈ చక్రాన్ని యాక్టివేట్ చేయడం వల్ల హృద్రోగ సమస్యలు రావు. సున్నితమైన మనస్తత్వం అలవడుతుంది.

విశుద్ధి చక్రం : కంఠానికి వెనుక భాగంలోని ఈ చక్రం.. థైరాయిడ్ సమస్యల్ని రానివ్వదు. స్వరపేటిక సమస్యలు తగ్గుతాయి. గొంతు సంబంధిత జబ్బులు రావు.

ఆజ్ఞా చక్రం : రెండు కనుబొమల మధ్య భాగంలో ఉండే చక్రం ఇది. ఇప్పటి వరకు చెప్పుకున్న అయిదు చక్రాలు ఆరోగ్యానికి సంబంధించినవైతే ఈ రెండు చక్రాలు ఏకాగ్రత, జ్ఞాపకశక్తికి సంబంధించినవి. మిగతా అన్ని చక్రాలను ఆజ్ఞాపించే అధికారం దీని సొంతం.

సహస్తార చక్రం : శిరస్సు మధ్య భాగంలో ఉంటుందీ చక్రం. మనసును సమతుల్య పరుస్తుంది. భావోద్వేగాలను తగ్గిస్తుంది. జ్ఞాపకశక్తిని పెంచుతుంది.