తీర్థవిధులు
తీర్థములకు, క్షేత్రములకు వెళ్ళినవారు అచటస్నానము, దానము, జపము మొదలైనవి చేయవలెను. అట్లు చేయనిచో రోగములు, దారిద్ర్యము, మూగతనములకు లోనయ్యెదరు. భారతదేశమునందు మరణించిన వారు తమ పుణ్యఫలముచేత బ్రహ్మలోకమునకు వెళ్ళెదరు. పుణ్యము క్షీణించగనే మరల మానవయోనియందు జన్మించెదరు. పుణ్యక్షేత్రములందు పాపకర్మలు చేసినచో నరకమింకను ధృఢమగును. కనుక పుణ్యక్షేత్రములలో నివసించు సమయమున సూక్ష్మాతి సూక్ష్మమైన ఏకొద్ది పాపమును కూడ చేయరాదు.

సదాచారము, ఉత్తమమైన వృత్తి, సద్భావనలతో మనస్సునందు దయాభావము కలిగి తీర్థములందు నివసించవలెను. పుణ్యక్షేత్రములందు చేసిన పుణ్యము కొంచెమైనను అనేక విధములైన వృద్ధిని ప్రసాదించును. అచట చేసిన స్వల్పపాపము కూడా పెద్దదిగా పరిణమించును. తీర్థవాసములందు చేసిన పుణ్యముశారీరక, వాచిక, మానసిక, సకల పాపములు నశింపజేయును. తీర్థములందు చేసిన మానసిక పాపము వజ్రలేపమగును. అది అనేక కల్పముల వరకు వెంటాడుచునే ఉండును. అట్టి పాపము కేవలము ధ్యానము చేతనే నశించును. వాచిక పాపము జపము చేతను, శారీరక పాపము శరీరమును శుష్కింపజేయు కఠినతపస్సు చేత, స్నానం, భస్మలేపం వలన నశించును. ధనార్జనకై చేసిన పాపము ఆ ధనమును దానంచేయుటవలన నశించును.