తిరుప్పావై - 11 పాశురం
కత్తుకఱవై క్కణఙ్గళ్
పలకఱందు
శెత్తార్ తిఱల్ అరియ చ్చెన్ఱు శెరుచ్చెయ్యుం
కుత్తం ఒన్ఱిల్లాద
కోవలర్-దం పొఱ్కొడియే
పుత్తరవల్ గుల్ పునమయిలే
పోదరాయ్
శుత్తత్తు త్తోరిమార్
ఎల్లారుం వందు నిన్-
ముత్తం పుగుందు ముగిల్
వణ్ణన్ పేర్-పాడ
శిత్తాదే పేశాదే
శెల్వప్పెణ్డాట్టి నీ-
ఎత్తుక్కుఱగుం పొరుళ్-ఏలోర్
ఎంబావాయ్
గోపికలు "యుగాయితం
నిమేషేన చక్షుసా ప్రాప్యుడాయితం శూణ్యాయతా జగత్ సర్వం గోవింద విరహేణమే" అని
భావిస్తారు. ఒక కంటి రెప్పపాటు గోవిందుని ఎడబాటును సహించేవారు కాదట. పరమ భక్తుల
స్థితి అలా ఉంటుంది. భక్తులెప్పుడు తమనొక నాయికగా భగవంతున్ని ఒక నాయకుడిగా
భావిస్తారు. భగవంతుని పై వారికుండే భక్తి, జ్ఞానం వారి
సౌందర్యం. ఒక స్త్రీ సౌందర్యానికి పురుషుడు వశమైనట్లే, భగవంతుడు కూడా ఒక భక్తుడిలో కొన్ని సౌందర్యాలు చూస్తాడు.
వారు ఏది చేసినా, చూసినా, విన్నా లౌకికమైన వాటియందు శ్రద్దలేకుండా వాటి వెనకాతల
కారణభూతుడైన భగవంతున్ని భావిస్తూ, అన్ని పనులూ భగవత్ సంబంధంగానే చేస్తారు . ఇలాంటి
సౌందర్యానికే భగవంతుడు వశమై ఉంటాడు.
ఇవాలటి గోపబాలికది దివ్యమైన
సౌందర్యం కలది. పురుషులను ఆకర్శించేది దేహ సౌందర్యం అయితే, పురుషోత్తముణ్ణి ఆకర్శించేది భక్తి సౌందర్యం. ఈవాలటి గోప
బాలికకు అలాంటి సౌందర్యం కలది. గొప్ప వంశానికి చెందినది. చాలా పాడి సంపద కల వంశంలో
పుట్టినది ఈ గోప బాలిక. భగవత్ సేవా సంపద
గొప్పగా కల్గినది కాబట్టి, ఈవిడని తీసుకొని వెళ్తే
శ్రీకృష్ణుడు వెంటనే ప్రసన్నుడవుతాడు అని మన ఆండాళ్ తల్లి ఈవాలటి గోప
బాలికను లేపుతుంది.
"కత్తుకఱవై" దూడలకు
పాలిచ్చే, దూడలవలె ఉండే, తక్కువ వయసుగా కనపడే
"క్కణఙ్గళ్" గుంపులు గుంపులుగా ఉన్న ఆవుల "పలకఱందు" పాలు పితకటంలో
నేర్పరులు. "శెత్తార్ తిఱల్ అరియ" శత్రువుల బలం నశించేట్టుగా "చ్చెన్ఱు
శెరుచ్చెయ్యుం" వాళ్ళ దగ్గరికి
వెళ్లి వాళ్ళ మదమును అణచగలిగేవారు, "కుత్తం ఒన్ఱిల్లాద
కోవలర్-దం" ఏపాపమూ అంటని వారు, ఎందుకంటే వీరు ఏమి
చేసినా శ్రీకృష్ణుడి కోసమే కదా చేసేది.
శ్రీకృష్ణుడి శత్రువులే వారి శత్రువులు. అలాంటి వంశానికి చెందిన "పొఱ్కొడియే" బంగారు తీగ, తీగ ఎదైనా ఒక ఆధారాన్ని పట్టుకుని ప్రాకుతుంది, ఈ గోపిక శ్రీకృష్ణుడినే ఆధారంగా చేసుకొని ప్రాకే బంగారు
తీగ.
శరీరంలో ఏదో ఒక అవయవం
అందంగా ఉంటె అది సౌందర్యం అంటారు, అదే సామూహికంగా పాదాది
కేశాన్తంగా ఉండిన సౌందర్యాన్ని లావణ్యం అంటారు.మరి ఆమె లావణ్యాన్ని ఆండాళ్ తల్లి
ఇలా వర్ణిస్తోంది. "పుత్తరవల్ గుల్ " తన పుట్టలో ఎలాంటి భయం
లేకుండా చుట్టుకొని పడగ లేపి ఉన్న ఒక
పాములాంటి అందం కల్గి ఉండి, "పునమయిలే" ఏభయంలేని తన
వనంలో పురివిప్పిన నెమలిలాంటి కేశ సౌందర్యం కలదానా.
"పోదరాయ్" రావమ్మా!!
నీవెంట మేము నడుస్తాం. "శుత్తత్తు త్తోరిమార్ ఎల్లారుం వందు" ఈ చుట్టూ
ఉండే చెలికత్తెలు అందరూ వచ్చి,
"నిన్-ముత్తం పుగుందు" నీ ముంగిట ప్రవేశించి, "ముగిల్ వణ్ణన్
పేర్-పాడ" నీలమేఘశ్యాముని పేరు
పాడుతున్నాం. నిన్ను నెమలితో పోల్చాం, నెమలి మేఘాన్ని
చూసి ఎలా పరుగెత్తుతూ వస్తుందో, నీలి మేఘశ్యామున్ని మెం
కీర్తిస్తుంటే నీవూ వస్తావని అనుకున్నాం. కానీ, "శిత్తాదే" ఉలుకు లేదు
"పేశాదే" పలుకు లేదు
"శెల్వప్పెణ్డాట్టి" ఓ సంపన్నురాలా! ఎమమ్మా ఐశ్వర్య మదమా "నీ ఎత్తుక్కుఱగుం పొరుళ్" లేకుంటె
ఎందుకు పడుకున్నావు అంటూ లోపలి గోపబాలిక
వంశాన్ని, సౌందర్యాన్ని కీర్తిస్తూ ఆ
గోపబాలికను లేపుతుంది ఆండాళ్ తల్లి.
శ్రీశ్రీశ్రీ త్రిదండి
చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్
స్వామివారి ప్రవచనం.