దేవీ భాగవత శ్రవణ/పఠన ఫల౦


 పూర్వం ఋతవాక్కు అని ఒక మహర్షి ఉండేవాడు. అతనికి ధర్మపత్ని వల్ల ఒక కుమారుడు జన్మించాడు. రేవతీ నక్షత్ర గండాంతకాలంలో జన్మించడం వల్ల కొడుకు పుట్టినప్పటి నుంచి వారు వ్యాధి పీడితులయ్యారు.
కుపుత్రేణాన్వయో నష్టో జన్మ నష్టం కుభార్యయా!
కుభోజనేన దివసః కుమిత్రేణ సుఖం కుతః!!
కుపుత్రుడి వల్ల వంశం, కుభార్య వల్ల జీవిత౦, కుభోజనం వల్ల దివసం, కుమిత్రుడివల్ల సుఖం - నశిస్తాయని అన్నారు పెద్దలు.

వారు పుత్రుని గురించి ఇలా దుఃఖిస్తున్న సమయంలోఅక్కడికి గర్గ మహర్షి వచ్చారు. ఈ కుపుత్రుడు మాకు ఎలా జన్మించాడు? శాంతి ఏమిటి? అని అడిగాడు ఋతవాక్కు. అప్పుడు గర్గుడు ఇలా అన్నాడు - రేవతీ నక్షత్ర గండాంతకాలంలో జన్మించడం వల్ల దుశ్శీలుడు అయ్యాడు. అదే మీ ఆదివ్యాధులకు కారణం ఈ దుఖం ఉపశామించాలంటే దుర్గాదేవిని ఉపాసించండి అని చెప్పి సెలవు తీసుకున్నాడు. దుర్గను ఉపాసించడం వల్ల కుపుత్రుడు సుపుత్రుడుగా మారి అందరి ప్రశంసలు అందుకున్నాడు. రేవతీ నక్షత్రం మీద కోపంతో నేలకు రాలిపోమ్మని ఋతవాక్కు శపించాడు. వెంటనే రేవతీ నక్షత్రం కుముదాద్రి మీద పడింది. అప్పటి నుంచీ ఆ పర్వతం రైవతాద్రి అయ్యింది. ఆనక్షత్ర తేజస్సునుంచి కన్యకామణి ఆవిర్భవించింది. దీనిని ప్రముచుడు అనే మహర్షి చూసి రేవతి అని నామకరణం చేసి పెంచుకున్నాడు. ఆమెకు యుక్త వయస్సు వచ్చిన తరువాత వరాన్వేషణ ప్రారంభించాడు. అగ్నిదేవుణ్ణి స్తుతించాడు. దానికి ఆయన ఇలా అన్నాడు - దుర్దముడనే రాజు మీ అమ్మాయికి తగిన వరుడు. దైవవశాత్తు అదే సమయానికి దుర్దముడు వేటకోసం అడవికి వచ్చి ఆశ్రమానికి వచ్చాడు. రాజలక్షణాలతో వినయ విధేయతలతో విరాజిల్లుతున్న దుర్దముణ్ణి చూసి ఆప్యాయంగా ఆహ్వానించి కుశల ప్రశ్నలు వేస్తూ నీ భార్య క్షేమం గురించి అడగను ఎందుకంటే ఆఅమ్మాయి ఇక్కడే ఉంది కనుక అని అన్నాడు.

అప్పడు దుర్దముడు అంతా కుశలమే. నా భార్య ఇక్కడే ఉంది అంటున్నారు ఎవరావిడ? అని అడిగాడు. రేవతి గురించి చెప్పాడు ప్రముచుడు.. తన వివాహ విషయం తెలుసుకున్న రేవతి తనకు రేవతీ నక్షత్రంలోనే వివాహం జరిపించమని కోరింది. ఆమె కోరికపై ప్రముచుడు తన తపశ్శక్తితో నక్షత్రవీధిలో మరో రేవతిని సృష్టించి అదే ముహూర్తంలో వారిరువురికీ వివాహం జరిపించాడు. ఏమి కావాలో కోరుకొమ్మని అల్లుణ్ణి అడిగాడు. అప్పుడు దుర్దముడు నేను స్వయంభూ మనువంశంలో జన్మించాను. కనుక నాకు మన్వంతరానికి అధిపతి అయ్యే తనయుడు కలిగేట్లు వరం ఇయ్యి అని అభ్యర్ధించాడు. అయితే దుర్దమా! దేవీభాగవతం విను. నీకు అలాంటి పుత్రుడు జన్మిస్తాడు అన్నాడు ప్రముచుడు. రేవతిని తీసుకొని రాజధానికి చేరుకొని ధర్మబద్ధంగా పరిపాలన సాగించాడు.


కొంతకాలానికి ఒకనాడు లోమశమహర్షి రాజధానికి వచ్చాడు. రాజు ఎదురువెళ్ళి అతిథిమర్యాదలు జరిపి దేవీభాగవతం వినాలనే కోరికను మహర్షికి తెలియజేశాడు. లోమశుడు సంతసించి అభీష్ట సిద్ధి కలుగుతుంది అని ఆశీర్వది౦చి ఒక శుభముహూర్తాన పురాణ శ్రవణం చేయించాడు. రేవతీ సహితుడై దుర్దముడు భక్తి శ్రద్ధలతో ఆలకించాడు. రేవతి గర్భం ధరించి లోక కళ్యాణ కారకుడైన పుత్రుణ్ణి ప్రసవించింది. రైవతుడు అని నామకరణం చేసి ఉపనయనాది సంస్కారములు జరిపించి గురుకులంలో వేద శాస్త్రాలు అధ్యయనం చేయించాడు. ధనుర్విద్యా పారంగతుడు అయ్యాడు రైవతుడు. బ్రహ్మదేవుడు రైవతుని యోగ్యతలు గుర్తించి మన్వంతరాధిపతిని చేశాడు.ఈ పురాణాన్ని వినడ౦ వల్ల కలిగే పుణ్యఫల౦ అన౦తమన్నాడు సూతుడు. దేవీ అ౦శలేని పదార్థ౦ లేదు. ప్రాణి లేదు..అటువంటి చండికను నవరాత్ర దీక్షతో ఆర్చిస్తే మహాపాతకాలను౦చి కూడా విముక్తి లభిస్తు౦ది. సుఖ స౦తోషాలు వర్ధిల్లుతాయి.