తోటకాష్టకాష్టకం ఎలా ఎవరు చెప్పారు ?
ఆదిశంకరులకు ఎంతోమంది శిష్యులు ఉండేవారు. అందులో పద్మ పాదాచార్యులు, సురేశ్వరాచార్యులు, తోటకాచార్యులు, హస్తామలకాచార్యులు ప్రధాన శిష్యులు. ఈ నలుగురినీ శృంగేరి, ద్వారక, పూరి, బదరికాశ్రమం పీఠములలో అధిపతులుగా నియమించారు. వీరిలో తోటకాచార్యుల వారికి చిన్నతనంలో అందరికంటే తెలివితక్కువ. భగవత్పాదుల పూజకు కావలసిన సామగ్రి ఏర్పాటుచేసే పని వారిది. ఒకరోజు కార్య వ్యగ్రులై పాఠమునకు ఆలస్యంగా వచ్చారట. పుష్పావచయంలో ఉన్న ఆసక్తి వారికి చదువులో ఉండేది కాదు. ఎంత ఆలస్యమైనా తోటకాచార్యులు వచ్చేవరకు అచార్యపాదులు పాఠం మొదలుపెట్టేవారు కాదట. అలా కాచుకొని ఉండి చెప్పినా ఆయన మెదడుకు ఎక్కేది కాదట. ఇది చూసి ఇతర శిష్యులు తోటకాచార్యులను చులకనగా చూసేవారు. విషయ గ్రహణ శక్తి లేనివానికోసం ఆచార్యులవారు వేచి ఉండటం వారికి అంతగా రుచించేది కాదు. గురువు అంటే తిరస్కారం కాదు, ఒక ఔదాసీన్యం వాళ్ళలో అప్పుడప్పుడు ఈకారణంగా కనిపించేది.
సర్వజ్ఞులైన
శంకరులు దీనిని గ్రహించారు. ఒకరోజు బిల్వపత్రం కోస్తూ ఒళ్ళుమరచి నిలుచున్న తోటకాచార్యులలో తమ దివ్యశక్తిని నింపారు.
అంతటితో అమాంతంగా బుద్ధివైభవం, వాక్పటుత్వం, కావ్యరచనాశక్తీ తోటకాచార్యుల వారికి కలిగింది. ఇతర శిష్యులతో బాటు
ఆచార్యులవారు మందమతి అయిన శిష్యునికోసం వేచిఉన్నారు.
ఇంతలో ఆ మొద్దబ్బాయి నెత్తిన
పూలబుట్ట పెట్టుకుని ఆనందంతో నర్తనం చేస్తూ వచ్చాడట. గురువుగారిని చూడగానే ఆశువుగా, లయబద్ధమైన వృత్తంలో ఒక అష్టకం చదివాడట.
ఈస్తోత్రం విన్న ఇతర శిష్యులు
ఆశ్చర్యమగ్నులయ్యారు. వారినోట వెలువడిన శ్లోకాలకు తోటకాష్టకమని పేరు.