లక్ష్మీ అనుగ్రహం ఎలా పొందాలో మీకు తెలుసా?

సర్వ సంపదలకూ అధినేత్రి లక్ష్మీదేవి. ఆమె కరుణ లేకపోతే ఎంతటి గొప్పవాడైనా దరిద్రుడిగా జీవించవలసిందే. ఆ చల్లని తల్లి అనుగ్రహం కలిగితే అక్షరం ముక్క రాని వాడు కూడా అష్టైశ్వర్యాలూ అనుభవిస్తాడు. ఆమె ఇష్టాయిష్టాలు తెలుసుకుని, అందుకు తగ్గట్లుగా నడుచుకుంటే ఆమె కృపతో అందరూ హాయిగా జీవించవచ్చు.
1.గుమ్మానికి పక్కనే చిందరవందరగా పాదరక్షలను విడవడం, గుమ్మాన్ని కాలితో తొక్కి లోపలకు రావడం లక్ష్మీదేవికి ఇష్టం ఉండదు. అందుకే పెద్దలు ఆ పనులు చేయనివ్వరు.
2.సూర్యోదయ, సూర్యాస్తమయాలలో నిద్రించే వారు, భుజించేవారు, పగటిపూట నిద్రించేవారు లక్ష్మీదేవి కృపకు నోచుకోరు.
3.శుచి, శుభ్రత, సహనం కలిగి, ధార్మికంగా, నైతికంగా జీవించేవారు లక్ష్మీదేవికి ఇష్టులు.
4.చిల్లర పైసలను, పువ్వులను నిర్లక్ష్యంగా పడేసేవారు, ముక్కోపులు, దురహంకారులు లక్ష్మీదేవి అనుగ్రహానికి దూరంగా ఉంటారు.
5.బద్దకస్తులు, అతిగా మాట్లాడేవారు, అమితంగా తినేవారు, గురువులనూ, పెద్దలనూ అవమానించేవారు, అపరిశుభ్రంగా ఉండేవారు, జూదరులు, అతినిద్రాలోలు ఇంటి ముంగిటికి కూడా లక్ష్మీదేవి కాలిడదు.
6.లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే ఆకుపచ్చని వస్త్రాలను ధరించి, ఆమెకు ఎర్రని వస్త్రాలను, పరిమళభరితమైన పూలను అలంకరించి, ధూపదీప నైవేద్యాలను సమర్పించి, పాలు, పాలతో చేసిన పదార్థాలను నివేదించడం శ్రేష్ఠం.
7.బంగారాన్ని నడుం కింది భాగంలో ధరిస్తే లక్ష్మీదేవిని కించపరచినట్లే. అందుకే కాళ్లపట్టాలు, మట్టెలూ వెండివి మాత్రమే ధరించాలి.
8.ఉసిరిపొడిని నీటిలో కలిపి తలస్నానం చేసి, శుచీశుభ్రతలతో దేవీభాగవతంలోని మహాలక్ష్మి క్షీరసాగరం నుండి ఆవిర్భవించిన భాగాన్ని అధ్యయనం చేయడం వల్ల పోయిన సంపదలన్నీ తిరిగి లభిస్తాయని శాస్త్రోక్తి.
9.లక్ష్మీదేవికి నివేదించే పిండివంటలను నూనెతో కాకుండా నేతితో తయారు చేస్తే శ్రేష్ఠం.
10. ఇంట్లో లక్ష్మీదేవి నిలబడి ఉన్న పటం కాకుండా పద్మంలో కూర్చున్న పటం ఉంచుకోవాలి.

11.  శ్రీలక్ష్మీ క్షమాగుణం, శాంత గుణం అనే ఆరెండు గుణాల్లో ఉంటుంది. ఈ రెండు గుణాలు ఉన్నవార్ని లక్ష్మీదేవి సదా అనుగ్రహిస్తుంది