లక్ష్మీ ఆవిర్భావం శ్రీ విష్ణు పురాణము

బ్రహ్మాదులు శ్రీహరిని శరణువేడుట

"ఆద్యుడవు పూర్వులకెల్లా పూర్వుడవు. యజ్ఞమూర్తివి, అవిశేషణుడవు. (అనగా - ఏ ఇతర విశేషణాల చేత పోల్చడానికి శక్యం గాని వాడవు.) బ్రహ్మను సృష్టించినవాడవు! మా పట్ల దయార్ద్ర దృక్కులను ప్రసరించి ప్రసన్నుడవై మాకు దర్శనమియవలసిందిగా కోరుతున్నాము..."

అని స్తుతించగా, శ్రీహరి వారికి ప్రత్యక్షమై, యవన్మందికీ శరణు ప్రసాదించాడు.

ప్రత్యక్షంగా వాసుదేవుని చూచిన ఆనందంలో తిరిగి వారంతా జనార్దనుని స్తోత్రం చేశారు.

శ్రీహరి కటాక్ష దృష్టితో వారిని చూసి "దేవతలారా! మీ తేజస్సులను మళ్లీ పూరించుకోవాలంటే నేను వివరించబోయేరితిగా ప్రవర్తించండి! ఇంద్రా! నువ్వు నాయకత్వం వహించిం దేవతల వైపు నుంచి ప్రతినిధిగా రాక్షసనేతలతో సంభాషించు! వారిని సముద్ర మథనానికి ఒప్పించు! నేను తోడుగా ఉంటాను. వాసుకిని తరిత్రాడుగా చేసి, మంధర పర్వతాన్ని కవ్వంగా చేసి, మీరు చేసే సముద్రమధనం వల్ల అమృతం పుడుతుంది. మీరు అది గ్రోలి అమరులు కాగలరు. (అంతవరకు దేవతలకు కూడ అమరత్వం లేదని అర్థం) నేను సముద్రమథనం వల్ల ఆయాసం మాత్రమే ఆ దేవద్వేషులకు మిగిలేలా చేస్తాను"...అని బోధపరచగా సురలు, అసురులతో సంధిచేసుకుని, అమృత సంపాదనకోసం క్షీరసాగరాన్ని మధించడం ప్రారంభించారు.

క్షీరసాగర మథనం

తాను ఆనతిచ్చినట్లుగానే శ్రీహరి తంత్రం నెరపి, వాసుకి (కవ్వపుత్రాడు) తలవైపున రాక్షసులు, తోకవైపున దేవతలు ఉండి మంధర పర్వతంతో సముద్రం చిలికేల ఏర్పాటుచేశాడు.

అయితే, ఈ రీతిగా చిలుకుతూన్నప్పుడు పాము నోట్లోంచి వెలువడే భీషణవిషజ్వాలల వేడిమికి రాక్షసులు తల్లడిల్లుతూ హాహాకారలు చేస్తూంటే, తోకవైపున ఉన్న దేవతలు అనాయాసంగా మథన కార్యక్రమం చేపట్టారు.

రానురాను వాసుకి ముఖంనుంచి వెలువడే నిశ్వాసాల వల్ల మూడువంతుల మంది రాక్షసులు నశించిపోగా, మిగిలినవారు తేజోహీనులయ్యారు. ఇంతలో మంధర పర్వతం యొక్క అడుగుభాగం బరువు కారణంగా సముద్రంలో దిగబడిపోతూండగా, అది గుర్తించిన శ్రీహరి తాను కూర్మం (తాబేలు) రూపం దాల్చి, ఆదుకున్నాడు. దేవతలకు మోదం కలిగించాడు.

లక్ష్మి ఉద్భవించుట

ఆ ప్రకారం అవిశ్రాంతంగా క్షీరసాగరాన్ని మథిస్తుంటే అందులోంచి సురభి (కామధేనువు), దేవతలకు హవిర్భాగం అందించే పావకునివాసం, పారిజాతం, అప్సరోభామినీ గణం, చంద్రుడు ఉదయించారు. చంద్రుడ్ని మహేశ్వరుడు ధరించాడు. విషం సర్పాలు గ్రహించాయి. శ్వేతవస్త్రధారిగా ధన్వంతరి అందులోంచి బయట కొచ్చాడు. దాంతో దేవదానవులు స్వస్థచిత్తులైనారు. ఆనందించినారు. ఆ ధన్వంతరి దేవవైద్యుడై విలసిల్లాడు. ధన్వంతరి ఆది వైద్యుడని, మహావిష్ణువు అవతారమని భాగవతపురాణ ప్రవచనం. చతుర్వేదాలలో ఆయుర్వేద భాగాన్ని బ్రహ్మ సూర్యభగవానుడికి ఉపదేశించగా, ధన్వంతరి ఆదిత్యుని నుంచి నేర్చుకున్నట్లు పురాణ కధనం. రెండు చేతుల్లో శంఖుచక్రాలు, పట్టుపీతారురధారుడై, ఒకచేతిలో అమృత కలశాన్ని మరొక చేతిలో జలౌకం ధరించిన ధన్వంతరి చతుర్భుజాలతో ఉద్భవించినట్లు బ్రహ్మవైవర్తన పురాణంలో పేర్కొనబడింది.

ఆ తరువాత....

నలుదిక్కులా వెలుగులను నింపుతూ, పద్మంలో కూర్చొని, చేతిలో పద్మాన్ని పట్టుకుని శ్రీదేవి ఆవిర్భవించింది. ఈ లక్ష్మి సంపదలన్నిటికీ ప్రతీక. ఈమె ఆవిర్భావం జరిగిన తర్వాతనే దేవతలకు సకలైశ్వర్యాలూ కలిగాయి.

ఆ ప్రకారంగా ఆవిర్భవించిన లక్ష్మీదేవిని మహర్షులు ఆనందంగా స్తుతించారు. విశ్వావసు తదితర ప్రముఖ గంధర్వులు ఆమె ఎదుట గానం చేయగా, అప్సర స్త్రీలు నర్తనం చేశారు. గంగాది నదులు పవిత్రజలాలతో వచ్చి ఆ మంగళదేవతను తమ పావనోదకం చేత తీర్థమాడించాయి. వాడని తామరపూలను సముద్రుడామెకు కానుకలుగా ఇచ్చాడు. విశ్వకర్మ స్వయంగా తయారుచేసిన విచిత్రా భరణాలు - దివ్యభూషణాలు ఆ దేవికి అలంకారార్థం సమర్పించాడు. ఆ సున్నాత, దివ్యాభరణభూషిత లోకమాత ఇందిర హరివక్షస్థలాన్ని అలంకరించింది. శ్రీహరిని క్రీగంట చూసిన లక్ష్మి , అక్కడే సంస్థితురాలై, తన దయార్ద్ర దృక్కులతో దేవతలపై చల్లని చూపులు ప్రసరించింది.

విష్ణువు మొదలైన దేవతలు ఈ ప్రకారం సముద్రంలోంచి బయటపడిన సంపదనంతా తలొకటీ పంచేసుకోవడం దానవులకు ఆగ్రహకారణమైంది. చాలామంది విష్ణువిముఖులైనారు. హరిని ద్వేషించసాగారు. హరినే ద్వేషించేవారికి సిరి దక్కనొల్లదు కదా! కొందరు లక్ష్మిచేత పరిత్యజించ బడ్డారు.

అటువంటి రాక్షసులలో విప్రచిత్తి మొదలైనవారు, అప్పటికే జనించి ధన్వంతరి చేతిలో అప్పుడే ఉంచబడిన అమృత కమండలాన్ని లాక్కున్నారు. శ్రీమహావిష్ణువు మాయచేత తక్షణమే స్త్రీరూపం ధరించి, తన లావణ్య వలపుసౌందర్యాదుల చేత రక్కసుల చిత్తాన్ని దారి మరల్చాడు.

తన(మాయా) మోహినీ రూపాన్ని వాళ్లంతా కళ్లతో పానంచేస్తూండగా, అతి చాకచక్యంగా అమృత కమండలాన్ని దేవతలపరం చేసి ఆ మాయారూపం క్రమంగా ఉపసంహరించుకున్నాడు శ్రీహరి. ఈలోగా దేవతలు అమృతం గ్రోలడం పూర్తయింది. అమరులైన దేవతల వల్ల రాక్షస సేన అపారంగా నిర్జించబడింది.

చావగా మిగిలిన దానవులు పాతాళానికి పారిపోయి తలదాచుకోగా, స్వర్గం తిరిగి దేవతల పరమైంది. అంతవరకూ దేవతలకు...ముఖ్యంగా సూర్య, అగ్ని, వాయు, వరుణులకు రక్కసుల వల్ల కలిగిన క్షోభ అంతరించింది.

సూర్యుడు తన దిజ్మండలాన్ని ప్రభలతో నింపి, తన దారిలోన తాను ఎప్పటిలాగే సంచరించగా, వాయువు ఆహ్లాదంగా వీచి అందరికీ ఆనందం కలిగించాడు. అగ్నిదేవుడు సర్వభూతహితకరంగా, ఆయా రూపాలలో (జఠర, ఆహవ, విహితాగ్నులుగా) ప్రజ్వరిల్లాడు. ఇంద్రుడు పూర్వంవలె లక్ష్మీకళనిండిన స్వర్గలోకానికి అధిపతిగా సింహాసనాన్ని అధిష్టించాడు. అ సమయంలో ఇంద్రుడు లక్ష్మీదేవిని సంస్తుతించాడు.

"ఓ సర్వలోక జననీ! క్షీరవాహినీ తనయా! వికసితపద్మాలను పోలిన కన్నులున్నతల్లీ! విష్ణువు ఉరమందు స్థిరంగా ఉన్నతల్లీ! నీకివే నా నమస్సులు. పద్మం ధరించి, పద్మాల్లాంటి కళ్లున్న, పద్మాన్ని పోలిన ముఖం కలిగి, పద్మనాభుని ఇల్లాలివైన నీకు నా ప్రణామాలు.

అమ్మా! నీవు సిద్ధివి. స్వధవు. స్వాహాదేవివి. సుధవు. లోకపావనివి. సంధ్య, రాత్రి, భూతి, ప్రభ, మేధ, శ్రద్ధ, వాగ్దేవివి. యజ్ఞవిద్య - మహావిద్య - గుహ్యవిద్యవునీవే!

ఓ శోభన దేవతా! నీవు తేరి చూడ అశక్యమైన దానివి! కాంతిమతివి. ఆత్మవిద్యవు. ముక్తిఫలదాయినివి. సౌమ్యాసౌమ్య రూపాలు కలిగిన దానివి. యోగిధ్యేయమైన దానివి. నీచే పూనిన అలుకవల్ల ఈ త్రిభువనాలు ఉన్నా, లేనట్లయిపోయినవి గదా! తిరిగి నీ వల్లనే కటాక్షించబడి పెంపు వహించాయి. నీ దృష్టి సాకల్యంగా సోకవవలెగాని...ఎవరికైనా దేనికైనా కొదువ ఉంటుందా? విద్య, ధనం, ఆరోగ్య, ఐశ్వర్యం, సుఖం, శత్రునాశనం...ఏదయినా నీవు చల్లగా చూస్తే దుర్లభం కాదు.

తల్లీ! మా ధనాగారం, ధాన్యాగారం, పశుశాల, ఆయుధాగారం, మా సకల సంపత్తులూ నీవే! మా దేహం, మా గృహం, మా ఇల్లాళ్లు, పుత్రికలు, మిత్రులు, పశుగణాలు, మా విభూషణాలు నీవు ఎన్నడూ విడవవద్దు. నీచేత విడువబడిన వారు శీల, సత్య, శౌచాది సద్గుణాల చేత కూడా నిర్లక్ష్యంచేయబడిన వారౌతారు. నీచే కటాక్షించబడినవారు గుణహీనులు కులహీనులు అయినా ధనం, ఐశ్వర్యం పొందగలవారౌతారు.

బ్రహ్మకు గూడ నీ గుణాలు వర్ణించనలవికాదు. విష్ణువల్లభా! నాకు ప్రసన్నురాలివై నన్ను నిరంతరం వదలక వుండు!" అని సంస్తుతించిన ఇంద్రునికి ఆ పద్మాక్షి ఎదుట కానవచ్చి "ఇదే నా వరద హస్తం!నీకేం కావాలో కోరుకో" అని పల్కగా "ఈ త్రిలోకాధిపత్యం నన్నెన్నడూ ఎడబాయకుండు గాక" అని కోరుకున్నాడు ఇంద్రుడు. అంతేగాక -

శ్లో|| స్తోత్రేణ యస్త్వథై తే సత్వాం స్తోష్యత్యబ్ధి సంభవే |

సత్యయానపరిత్యాజ్యో ద్వితీయో స్తు వరోమమ||

నాచేత స్తుతించబడిన ఈ శ్లోక పంచదశిని ఎవరు పఠిస్తారో వారిని కూడ నీవు విడవక కటాక్షించవలసిందిగా నాకు రెండోవరం ప్రసాదించు" అన్నాడు పురందరుడు.

దానికి శ్రీదేవి మందహాసంతో "ఇంద్రా! నీ స్తోత్రంచేత సంతుష్టురాలినై నీకీవరాలు ప్రసాదిస్తున్నాను". అని పలికి అంతర్హితురాలైంది.

ఆ విధంగా తిరిగి తన సామ్రాజ్య లక్ష్మిని పొందగలిగాడు ఇంద్రుడు. జగత్ప్రభువైన శ్రీహరికి సహాయకారిగా, ఈమె కూడా అవతరిస్తుంది. ఏ యుగంలో ఏ కాలంలోనూ పతిసేవవీడని మహాసాధ్వీమణి. కనుకనే విష్ణువునకు అనపాయిని. (విడిచి పెట్టక ఉండునది)

శ్రీహరి ఆదిత్యుడైనపుడు ఈమెయే పద్మ. పరశురాముడైనపుడు ఈమెయే భూదేవి. రామావతారంలో సీత. కృష్ణావతారంలో రుక్మిణి. దైవత్వవేళలో దివ్యస్వరూపిణి. మానుషరూపుడై హరి సంచరించవలసి రాగా, ఈమె మానుషిగా అవతరించగలదు.

అంటే- విష్ణువు అవతారానికి అనుగుణంగా తానూ దేహధారిణి అవుతుందని అర్థం!

ఈ లక్ష్మీజనన గాథ నెవరైతే వింటారో - చదువుతారో వారి ఇంట మూడు తరాల దాకా లక్ష్మీదేవి ఎడబాయక ఉంటుంది. ఈ శ్రీగాథ ఏఏ ఇళ్లలో పఠించబడుతుందో, ఆయా గృహాల్లో జగడాలకు కారణమైన ఆలక్ష్మి వాసం చేయలేదు.


ఈ ప్రకారం అన్నిరకాల విభూతులకు హేతువైన ఇంద్రకృత లక్ష్మీస్తుతి, ఏ నరుల వల్ల ఇహలోకాన పఠించబడుతుందో వారి ఇళ్లలో దరిద్ర దేవతలకు స్థానం ఉండదు.