ఆదిత్య హృదయం ఎలా ఎక్కడ పుట్టింది ?
కార్య సాధనకు, శత్రుంజయమునకు, సర్వ రోగ నివారణకు
కొన్ని యుగాలుగా పఠించబడుతున్న మహిమాన్విత స్తోత్రం ఆదిత్య హృదయం. ఈ స్తోత్రం
వాల్మీకి రామాయణం యుద్ధ కాండలో 107 వ సర్గలో అగస్త్యుని నోట
రామునికి చెప్పబడింది. రామావతారంలో ఆయన మానవునిగా జన్మ ఎత్తి, ఆ జీవితాన్ని గడుపుతూ, అందులో ఉండే బాధలను అనుభవిస్తూ, అధిగమిస్తూ, ధర్మ పరిపాలన చేస్తూ -
వీటిలో భాగంగో ఎందరో మహర్షుల ద్వారా ఉపదేశములు, ఆశేర్వాదములు, సమస్యా పరిష్కరణలు
పొందాడు. తానెప్పుడూ దైవ స్వరూపమని చెప్పలేదు, ఆ మహిమలు ప్రదర్శించ లేదు. అందుకనే, రామాయణంలోని ప్రతి అంశము మనకు ఒక దిశానిర్దేశము చేసే
సందేశము కలిగి యుంటాయి.
అటువంటి ఉపదేశాలలో
శ్రేష్ఠమైనది యోగవాశిష్ఠం. రాముడు వశిష్ఠుని అడిగిన ప్రశ్నలకు ఆ మహర్షి ఇచ్చిన
సమాధానాలు యోగముగా ప్రశస్తి చెందింది. పరబ్రహ్మమే తానైన శ్రీహరి అవతారుడైన
రామునికి యోగవాశిష్ఠం ఏల? రాముడంటే సచ్చిదానంద పరబ్రహ్మ తత్త్వము, ఇంద్రియాలకు అందని శుద్ధ చైతన్య స్వరూపమని స్వయంగా సీతాదేవి
చెప్పింది. అయినా, రామాయణంలో విశ్వామిత్రుడు,
భరద్వాజుడు, జాబాలి, గౌతముడు, వశిష్ఠుడు, శతానందుడు, అత్రి మొదలైన మహర్షుల నోట రామునికి ధర్మాన్ని, దైవ బలాన్ని వినిపించారు వాల్మీకి మహర్షి. ఇవి కేవలం మానవ
జాతి మనుగడ కోసం, విజ్ఞానం కోసం. ఇటువంటి
సంభాషణలు సామాన్య మానవునిలో కలిగే మానసిక మార్పులు, ప్రతిక్రియలు మొదలైన బాహ్యానికి సంబంధించిన విషయాలను ఎలా
ఎదుర్కోవాలి, అధిగమించాలి అనే వాటి కోసం.
అందుకనే రామాయణం మనకు జీవన శైలిని, ధర్మాన్ని, గమ్యాన్ని, చివరకు మోక్ష మార్గాన్ని
చూపించే మహాకావ్యం.
ఆదిత్య హృదయానికి వేదిక రామ
రావణ యుద్ధ ఘట్టము. రావణుడు మహా శక్తి బల మంత్ర సంపన్నుడు. కేవలం స్త్రీలోలత్వమనే
దుర్గుణము వీటన్నిటినీ మాయలా కప్పివేసి పెడదారి పట్టిస్తుంది. మరి రాముడో?
రామో విగ్రహవాన్ ధర్మః . ధర్మానికి మూర్తి రాముడు. ఇంతటి యోధులు యుద్ధంలో ఒకరికొకరు ఎదురుగా నిలిచి పోరు సల్పితే? ఇక్కడ యుద్ధం ధర్మం అధర్మం మధ్య. ఈ పరిస్థితి మనకు ప్రతిరోజూ మన మనసులో, కుటుంబంలో, సమాజంలో ఎదురవుతూనే ఉంటుంది. మరి అటువంటి క్లిష్టమైన సమయంలో మనం ఏ విధంగా స్పందిస్తాము? చింత, క్రోధము లేదా పరాక్రమము మొదలైన మార్పులను మనం బాహ్యంగా ప్రదర్శిస్తాము. అదే మానవ స్పందనను రాముడు ఒక రోజు యుద్ధము ముగిసిన పిమ్మట ప్రదర్శిస్తాడు. కొంత అలసట, ప్రత్యర్ధిని ఎలా ఓడించాలన్న చింత రామునిలో చూసి అగస్త్యుడు ఈ ఆదిత్య హృదయాన్ని ఆయనకు చెప్పినట్టు వాల్మీకి ఉవాచ.

జగద్గురువు ఆది శంకరుల వారు
మన దేశంలో ఆ సమయంలో ఉన్న ఐదు ప్రధాన దేవతారాధనలు, వాటిని అనుకరించే వివిధ ఉపమతాలవారిని ఒకే తాటిపైకి
తీసుకురావటానికి పంచాయతన విధానాన్ని రూపకల్పన చేశారు. విష్ణు, శివ, శక్తి, సౌర, గణపతి - ఈ ఐదు దేవతారాధనలను
ప్రతి ఆరాధనా ప్రదేశంలో జరిగేల ఏర్పాటు చేశారు. దీని అంతరార్థం ఏమిటి? ఈ దేవతలు వారి వారి ప్రత్యేకమైన శక్తులు కలిగినా అందరు ఒకటే
- భిన్నత్వంలో ఏకత్వము - అదే సచ్చిదానంద పరబ్రహ్మము. కాబట్టి, ఆ యుద్ధ సమయంలో నిత్య ప్రకాశకుడు అయిన సూర్య భగవానుని
స్తుతించమని అగస్త్య ముఖంగా రామునికి చెప్పబడినది. ఈ కాల-విశ్వ చక్రమనే మాయలో ఉన్న
పగలు రాత్రి వలన మనకు సూర్యుని ఉదయం, అస్తమయము
కనిపించినా, ఈ భూమండలము దాటితే, ఆయన ఎల్లప్పుడూ ఉన్నవాడే కదా? అదే విధంగా మనలోని అరిషడ్వర్గములను దాటి, దేహమును తాత్కాలికమని, ఆత్మ నిత్యమని చూడగలిగితే
మనమే సచ్చిదానందం, పరబ్రహ్మము. అటువంటి
స్థితిని చేరటానికి ఈ ఆదిత్య హృదయము మనకున్న ఒక సాధనము.