జటాయువు,సంపాతి - స్వామి కార్యం

 
గృధ్రాధిప గతి దాయక రాం!!
స్వామి కార్యం అనేసరికి ప్రతి ప్రాణి తన శక్తి మేర కృషి సల్పిన గాథలను అద్భుతంగా వర్ణించిన మహా కావ్యము శ్రీమద్రామాయణము. ఉడుత వారధి కోసం, సంపాతి లంకకు మార్గం కోసం, అతని సోదరుడు జటాయువు సీతమ్మ ఆనవాల కోసం, వానరసైన్యం రావణుని వధించి ధర్మస్థాపన కోసం....ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో జీవరాశులు ప్రభువుకు తోడ్పాటుగా నిలిచారు. అందులో ఒక ఉదాత్తమైన ప్రాణి జటాయువు. దశరథుని మిత్రుడైన జటాయువు ఒక గ్రద్ద. వృద్ధాప్యంతో శరీరం సహకరించక పోయినా సీతను అపహరించుకుపోతున్న రావణుని ఎదిరించి కొనప్రాణమున్నంత వరకు పోరాడిన వీరుడు. సీతమ్మను వెదుకుతూ వచ్చిన రామలక్ష్మణులకు అమ్మ జాడ తెలిపి రామకార్య సాఫల్యానికి తోడ్పడిన గొప్ప జీవి. జటాయువు, సంపాతి ఇద్దరు అన్నదమ్ములు.

సీతా రామలక్ష్మణులు అరణ్యవాసంలో ఉన్నప్పుడు మొట్టమొదటి సారి పంచవటి సమీపంలో జటాయువు రాముని కలుస్తాడు. తాను దశరథుని మిత్రుడని తెలిపి సృష్టిలో జంతు జాతి విధంగా ఆవిర్భవించిందో విపులంగా తెలుపుతాడు. కర్దమ ప్రజాపతినుండి గరుత్మంతుడు (శ్రీమహావిష్ణువు యొక్క వాహనము), అరుణుడు (సూర్యుని రథసారథి) గ్రద్ద సంతతిగా ఎలా జన్మించారో వివరిస్తాడు. అదే వారసత్వానికి తాను, సంపాతి చెందినట్లు తెలుపుతాడు. అరుణుని సంతతే జటాయువు, సంపాతి. దశరథుని స్నేహానికి గౌరవంగా భీకరమైన దండకారణ్యములో సీత రక్షణకు తాను రామునికి తోడుగా ఉండగలనని పలుకుతాడు.

సీతాపహరణం తరువాత రావణుని చేతిలో రెక్కలు తెగి, రక్తసిక్తమై అసువులు బాయటానికి సిద్ధంగా ఉన్న జటాయువును చూసి రాముడు జటాయువే సీతను చంపి ఉంటాడని అనుమానించి అతనిని చంపబోతాడు. అప్పుడు జటాయువు తనకు రావణునికి మధ్య జరిగిన యుద్ధాన్ని వివరించి సీత జాడ తెలుపుతాడు. రావణుని చరిత్రను, అతని శక్తి పరాక్రమాలను, విధంగా సీతను అపహరించింది వివరించి రాముని చేతిలో ప్రాణాలు వదులుతాడు. తన కోసం ప్రాణాలను పణంగా పెట్టి పోరాడిన వీరుని కొరకు రాముడు దుఃఖించి, అతనికి స్వయంగా ఉత్తరక్రియలు జరుపుతాడు. విధంగా జటాయువు ఉత్తమలోకాలను పొందుతాడు

                                                                 గృధ్రాధిప సంసేవిత రాం!!!
దక్షిణభాగాన చివరకు చేరుకున్న వానరమూకకు రావణుని మరియు లంక జాడను తెలిపిన వాడు సంపాతి.

సీతమ్మకోసం వెదకి వెదకి అలసిన వానరులు ప్రాయోపవేశానికి సిద్ధులై తమ మాటల మధ్యలో జటాయువు ప్రస్తావన తీసుకువస్తారు. అప్పుడు వారి మాటలను విన్న సంపాతి వింధ్యమహాపర్వతపు గుహనుండి బయటకు వచ్చి " వానరులారా! నేను రెక్కలు విరిగిన పక్షిని, శక్తి హీనుడను. నాకు చేతనైనంత  శ్రీరాముని కార్యానికై మాట సాయం చేయగలను. ప్రాణశక్తి క్షీణించినను శ్రీరాముని కార్యమునకు తోడ్పడుటయే నా ప్రథమ కర్తవ్యము.

చక్కని రూప సంపద కలిగి, వివిధ ఆభరణములు ధరించియున్న ఒక స్త్రీని దుర్మార్గుడైన రాక్షసుడు అపహరించుకొని పోవుచుండగా నేను చూసాను. స్త్రీ రామా! రామా! లక్ష్మణా! అని విలపిస్తుండెను. ఆమె తన ఆభరణములన్నీ తీసువేయుచుండెను. పదే పదే శ్రీరాముని నామము స్మరించుచున్నందున ఆమె సీతయే అని నేను అనుకొనుచున్నాను,

రాక్షసుడు లంకాధిపతియైన రావణుడు. ఇక్కడికి వంద యోజనముల దూరములో సముద్రము నడుమ ద్వీపములో విశ్వకర్మ లంకానగరమును నిర్మించెను. నగరము చాలా రమ్యమైనది. సీతాదేవి లంకానగరమున రావణుని అంతఃపురమున బంధింపబడియున్నదిదీనురాలైన సీతామాతను రాక్షస స్త్రీలు కాపలాకాస్తున్నారు. సముద్రము మీద నూరు యోజనముల దూరము ప్రయాణించిన పిమ్మట దాని దక్షిణ తీరమున గల లంకలో రావణుని చూడగలరు. కావున వానర వీరులారా! వెంటనే మీ పరాక్రమము చూపి సముద్రమును లంఘించుటకు త్వరపడండి. మీరు అక్కడ అవశ్యము సీతాదేవిని దర్శించి క్షేమముగా తిరిగి రాగలరు. నా దివ్యదృష్టితో చూసి పలుకుతున్న మాటలివి.

నేను, జటాయువు గరుత్మంతుని వంశము వారమే. కనుక ఇక్కడినుండే రావణుని, సీతను స్పష్టముగా చూచుచున్నాను. వానరులారా! మేము మా ఆహారబలము చేతను, సహజమైన దివ్య శక్తివలనను శతయోజనములే గాక అంతకన్నా దూరము కూడా అనుక్షణము చూడగలము. నా తమ్ముని చంపిన రావణుని పగ తీర్చుకోవాలి. మీరే కార్యానికి సమర్థులు" అని పలికి సీతమ్మ జాడ తెలుపుతాడు సంపాతి. విధంగా పక్షి సోదరులైన జటాయువు-సంపాతి రామకార్యానికి ఎంతో ఉపకరిస్తారు.

రామకార్యానికి వానరులు, పక్షి సోదరులు...ఇలా ఎన్నో రకాల జంతు సమూహం తోడ్పడి తమ జన్మకు సార్థకతను తెచ్చుకొని రాముని అనుగ్రహంతో మోక్షాన్ని పొందాయి. అంతటి మహత్తరమైనది రామకార్యము. మానవునిగా జన్మించి, తనతో పాటు జన్మించి తనతో నడచిన ప్రతి ప్రాణినీ అనుగ్రహించిన ధర్మమూర్తి రామచంద్రుడు.


శ్రీరామ జయరామ జయ జయ రామ!