చిదంబర దీక్షితుల చరితము ( చిదంబరవాసుల ఘనత)-నాయనార్ల (శివభక్తులు) చరిత్రలు

'తిరుత్తొండత్తోహై' లో ప్రారంభించిన పెరియపురాణము, మొదట చిదంబర దీక్షిత బృందమును ప్రస్తుతించినది. చిదంబరనాథుడే మొదటి దీక్షితులు గావున, మొదటి రెండు పద్యములలో వారినే కీర్తించింది. పదిపద్యములలోని తక్కిన ఎనిమిది పద్యములలో వారి భక్తులను గురించి చెప్పిరి. ఈ సందర్భములో క్రింది విషయములను ప్రత్యేకముగా గురైరిగించిరి.

1. శ్రీ ఉమాపతి శివాచారియర్‌ తమ 'కోవెల పురాణమున' కు ప్రస్తావనగా నటరాజస్వామిని కీర్తించిన రెండు గీతములలో, పెరియ పురాణములోని పై రెండు పద్యములలో ప్రాధ్యాన్యమును పూర్తిగా వివరించిరి. దీని ప్రకారము మొదటి పద్యము నటరాజస్వామి 'ఊననటనము'(అసమగ్రనాట్యము) నకు సంబంధించినది. జీవుల లోపముల నిర్మూలనమున కుద్దేశించినది. పంచవిధ దైవిక కర్మలు మిణుగురు రూపములో నున్న చైతన్యమును శుద్ధి పరిచి అఖండముగ చేయును. పరమేశ్వరుడు తన 'తిరోధాన' (దాగుడుమూతలు) శక్తితో జీవులను, వారి వారి కర్మానుసారముగా, వారికి ముక్తి కర్హత ఉన్నంత వరకు, సుఖదుఃఖములతో కుడిన జన్మపరంపరల ననుభవింపజేయును. ఈ విధముగ నాట్యము సాధారణ మందిరమయిన కనక సభలో జరుగును.

సూచన: సభ (అంబలం) అనగా జీవులను విచారించు న్యానస్థానమని అర్థము. చిదంబరములో ఐదు సభలు కలవు. నటరాజస్వామి, వారి పత్ని శివకామి నివసించు 'చిత్సభ'. దీనికి దక్షిణపార్శ్వమున నున్నది రహస్యము. చిత్సభకు ముందు స్వామి స్నాన ప్రక్షాళనములు (తిరుమంజనము) గావించు 'కనకసభ'. ఉత్సవమూర్తుల నుంచునది 'దేవసభ'. ఊర్ధ్వతాండవమూర్తి ఆలయమునకు దక్షినమున నున్నది 'నృత్యసభ'(తేరంబలం). అయిదవది వెయ్యి స్తంభముల - 'రాజసభ'.

2. పరమేశ్వరుని కనేక స్థితులు గలవు, - ఆదిలో సృష్టిచేయునపుడు బ్రహ్మ; తరువాత లోక సంరక్షణలో విష్ణుమూర్తి; తక్కిన స్థితులు, ప్రళయ కాలమున రుద్రుడు, తిరోధానమున మహేశ్వరుడు, అనుగ్రహించునప్పుడు సదాశివుడు.

3. మనస్సునకు గాని మరే ఇతర శక్తుల వలనను గ్రాహ్యము గాని అనంతుడగు పరమాత్మ, జివుల నుద్ధరించుటకు కార్య రూపములో సాక్షాత్కరించును. వారు భక్తులకు శివజ్ఞానము నొసంగు శుద్ధ జ్ఞానము; భక్తుల అంతరాత్మ అయ్యెదరు. తానుసృష్టించిన విషయములతో సమ్మిళుతుడై, తాను మాత్రము అద్వితీయుడుగా నుండును. అయినను వారు ఇహమున స్త్రీ పురుషులందు వేరు వేరు తత్త్వములై యుందురు. పాలించుటకు దేవుడు, చైతన్యవంతము జేయుటకు శక్తి (దేవత). ఆయన జ్ఞాన ప్రదాత.

4. పరమాత్ముని తుది లేక మూలస్థితి, వేద అవగాహన కతీతము. వారి 'ఆనందనటనము' ను దర్శించువారికి, వారు కరుణామూర్తులై ఆనందమును ప్రసాదింతును. ఉపనిషత్తులలో చెప్పెడి ఐదు ఆకాశములలో తుదిది యగు పరమాకాశములో వారి నృత్యము స్పష్ట చిత్రితము.

నటనలో పైకి ఎత్తిన స్వామి పాదము (కుంచిత పాదము) ముక్తి ప్రదము. కావుననే అది ముఖ్యముగా పూజనీయము. రెండవ స్థితి పాదము నీచ ప్రవృత్తుల నణగద్రొక్కును. (ముయాలహ)

శివభక్త దీక్షితులు చిదంబరంలో ప్రారంభములో మూడు వేలమంది యుండిరి. వారు కైలాసములోని శివగణములకు సములుగా పరిగణితులు. వారు శివుని కుంచిత పాదమును పూజించి, 'శివభోగ', 'శివయోగ' స్థితుల ననుభవించిరి. వారు శాస్త్రోక్తముగా షొడశోపచారములతో పూజలు మొదలగు వానిలోను, అంతరంగిక ధ్యానములోను నిమగ్నులై యుండిరి.

వారు బాహ్యముగ మూడు అగ్నిహోత్రములను ('ఆహవనీయ', 'దక్షిణ', 'గార్హపత్య') చేయుచు, అంతర్గతముగా 'శివపుణ్య' హోమము జేయుచుండిరి. వారు సత్యరోచకములగు వేద వేదాంగములందు పండితులం. శివభక్త దీక్షితులుగా వారి ఖ్యాతి అసమానము.

వారు 'నేను', 'నాది' అను అజ్ఞానమును రూపుమాపుటకు అనాదిగా వచ్చుచున్న ఆగమము నందు పేర్కొనిన కర్మలను, యోగములను ఆచరించుచు, పాపియైన 'కలిని' దూరముగా నుంచిరి. 'పరాశక్తి', 'విభూతి', 'శివానందానుభూతి' యొక్క అనుగ్రహమును వారు మహాభాగ్యముగా నెంచిరి. వారు జ్ఞాన, ధ్యాన, జప, సత్యమను నాలుగు యజ్ఞములందు విఖ్యాతులు. వారెప్పుడును మూల సత్యమునే గ్రహించిరి. వారు నిష్కళంకులైనందు వలన, ముఖ్యముగా వారు వివేకమునకు, సహనమునకు, సంతుష్టికి లోకమున కీర్తించబడిరి. వారి 'శివ' తత్త్వము వలన, వారి మనస్సులందు గర్వము మొదలగునవి లేకుండెను. ఆ మూడు వేల మంది దీక్షితులు ఇహమందే పరాత్పరుని కృపాపాత్రులైరి. వారికిక పొందవలసిన దేమియు లేదు! వారు దైవము నుండి వేర్పరుపరానివారు.

"ఈ పుణ్యాత్ముల కీర్తిని వర్ణించ నిజముగ ఎవరికైనను సాధ్యమా?" అని శేక్కిళారు ఆశ్చర్యపడెను. నంబియారూరుని (సుందరుడు) స్తోత్రము తియ్యని తమిళము యొక్క ఫలితము. నిజముగా అది శివుని భౌతిక శరీరము! దాని నెవరైనను భక్తి శ్రద్ధలతో సులభముగా ననుసరించవచ్చును.


"విశాల విశ్వములో సదా మారుమ్రోగు కీర్తిమంతులు, చిదంబర దీక్షితులకు అనేక అభినందనములు. తమ భక్తులు స్తుతించు కనకసభలోని శివతాండవమునకు సహస్ర అభివాదములు" అని శేక్కిళారు భావన.