లలితా సహస్రం
లలితా సహస్రం ఒకవైపు
అమ్మవారి రూపాన్ని వర్ణిస్తున్నది. ఎన్నో మహిమల్ని, మంత్రాల్ని చెప్తూన్నది. ఇంకోవైపు ఆలోచించడానికి కావలసిన Material
అంతా లలితాసహస్రంలో వున్నది. ఎలా అంటే లలితా సహస్రం
దగ్గరపెట్టుకొని కొన్ని పుస్తకాలు తయారుచేయచ్చు. ఎలా అంటే లలితా సహస్రంలో
ఉపనిషత్తత్త్వము, అని పట్టుకుంటే బోలెడంత
వేదాంతం అందులోనుంచి మనకు వస్తున్నది.
ఎక్కడెక్కడ అంటే "సర్వాంతర్యామినీ సతీ;
సర్వోపనిషదుద్ఘుష్ఠా శాంత్యతీత కళాత్మికా;"
అన్ని ఉపనిషత్తులు నీ గురించే చాటాయమ్మా
అన్నారిక్కడ. "స్వాత్మానందల వీభూత బ్రహ్మాద్యానంద సంతతిః - తైత్తిరీయ
ఉపనిషత్తులో చెప్పిన ఆనంద మీమాంస అంతా ఒక్క నామంలో పెట్టారు. అఖండమైన ఆత్మానందం
ముందు బ్రహ్మలోకాది ఆనందాలు కూడా అల్పములే అని చెప్పారు అంటే అఖండమైన సచ్చిదానంద
స్వరూపమే అమ్మ.
అమ్మ అంటే ఒక దేవత, రాక్షసుడిని సంహరించినటువంటి రూపము, మ్రొక్కితే కాపాడుతుంది అనేటటువంటి సామాన్య భావం నుంచి
ఎటువంటి భావనలోకి వెళ్తున్నాము అంటే ఉపనిషత్ప్రతిపాద్యమైన పరతత్త్వమే. అందుకే ఒక్క
లలితమ్మ ఆరాధన మనల్ని ఆరాధన స్థాయినుంచి జ్ఞాన స్థాయికి తీసుకువెళుతుంది. ఆ కారణం
చేతనే ఉపనిషత్తత్త్వ ప్రతిష్ఠాత అయిన శంకర భగవత్పాదుల వారు ఈ విద్యను
అంగీకరించారు. అన్ని తంత్ర శాస్త్రములలోను ఈ విద్యనే శంకరులు ఎందుకు తీసుకున్నారు?
అంటే ఇది ఒక్కటే నిన్ను బ్రహ్మవిద్యకు
తీసుకువెళుతుంది అని. అందుకు "ఆత్మవిద్యా మహావిద్యా శ్రీవిద్యా కామసేవితా"
అసలు తత్త్వం వచ్చాక ఏముంటుంది? అసలు ఆవిడ అదే.
"నిర్మలా నిర్లేపా నిత్యా నిరాకారా నిరాకులా" - ఆ చెప్పేటప్పుడు భావాలు
ఆలోచిస్తుంటే మనస్సు ఒక తాదాత్మ్య స్థితికి వెళ్ళిపోతుంది. అందుకే ఉపనిషత్తత్త్వ
ప్రతిపాద్యమైన తత్త్వం అది.
"శృతి సీమంత సింధూరీకృత పాదాబ్జ ధూళికా; సకలాగమ సందోహ శుక్తిసంపుట మౌక్తికా; నిజాజ్ఞా రూపనిగమా " - మూడు చెప్పారిక్కడ. మొత్తం మన
శాస్త్రములన్నీ మూడే మూడు. నిగమము (వేదం); ఆగమము
(మంత్రశాస్త్రం); ఈ రెండిటినీ కలబోసి మన
జీవితంలో మలచి చూపించినవి మరో రెండున్నాయి. పురాణములు, స్మృతులు. ఎందుకంటే మన హిందువుల ధర్మ గ్రంథాలేమిటో మనకు
తెలియవు. చాలామంది అనుకుంటూంటారు అందరికీ ఒక పుస్తకం ఉంది కదా! మనకీ ఒక పుస్తకం
వుంటుందేమో అని. పుస్తకాల మీద ఆధారపడ్డ మతం కాదు మనది. ఋషుల పరంపరమీద ఆవిర్భవించిన
మతం మనది. ఎన్ని పుస్తకాలు Ban చేసినా హిందూధర్మం Ban
కాదు. అది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం.