మహాశివరాత్రి
ప్రతి సంవత్సరము మాఘ
మాసమందు బహుళ చతుర్దశి రోజున మహాశివరాత్రి పర్వదినము జరుపుకొంటారు.
సృష్టి స్థితిలయకారుల్లో,
లయకారుడు పరమశివుడైన శంకరుని కల్యాణం! నిత్య శివ
రాత్రి, పక్షశివ రాత్రి, మాసశివరాత్రి, మహాశివ రాత్రి,
యోగ శివరాత్రి అని అయిదు విధాలు.
శివుణ్ని వేదాల్లో
ఓంకారరూపునిగా ఆరాధించారు. ప్రణవనాదమే ఓంకారం. చిన్నపిల్లలకు అక్షరాభాస్య సమయాన
ఓంకారాన్నే రాస్తారు. యోగులు ప్రణవ పంచాక్షరీని గురిగా చేసుకుని ఆత్మసాక్షాత్కారం
పొందుతారు. శివుడు కల్యాణమూర్తి. కాసిని నీళ్లకే కనికరించేస్తాడు. అందుకే ''ఓం పంచ వక్త్రాయ విద్మహే, మహావేదాయ ధీమహీ తన్నో రుద్ర: ప్రచోదయాత్*'' అని ఆదిశంకరులు కీర్తించారు. శివ నామం గంగా నదిలాంటిది. ఆయన
ధరించే విభూది యమునా నదిలాంటిది. రుద్రాక్ష సర్వపాపాలూ దహించే సరస్వతీ నది. ఇదే
త్రివేణీసంగమం! శివలింగానికి అడుగున బ్రహ్మ, మధ్య పీఠంలో విష్ణువు. లింగాగ్రంలో పరమేశ్వరుడూ వుంటారు.
కనుక ఆయన పూజ సర్వదేవతల పూజ.
మహాశివరాత్రి రోజున శ్రీ
పరమేశ్వరుడు లింగాకారుడుగా ప్రతి దేవాలయములో కనిపిస్తాడు. అట్టి శివునకు
అభిషేకములు, పూజలు ఆ రోజు జరిపినచో శివ
సన్నిధానమునకు చేరుదురని భక్తుల విశ్వాసము. ఈ రోజున భక్తులు ఉపవాసముండి, శివునికి పూజలు నిర్వహించి భక్తి పాటలు, భజనలతో రాత్రి నిదురించ కుండా జాగరణ చేయుదురు. శివరాత్రి
రోజున ఒక్క బిల్వపత్రమైనను శివునికి సమర్పించినచో జన్మరాహిత్యము, ముక్తి కలుగునని శివభక్తుల నమ్మకము. ఆ పర్వదినమునందు
శివలింగము జ్యోతిర్లింగముగా వెలుగొందుతుంది. మన భారత దేశములోని కాశ్మీరు
ప్రాంతములో ఈ శివరాత్రి ఉత్సవములను 15 రోజులు
నిర్వహిస్తారు.
కార్తీకమాసములో మొదలైన చలి
శివరాత్రి తో శివ శివ అంటూ ముగుస్తుందని పెద్దల మాట. ప్రతి శివాలయములోను ఆలయ
పండితులు రుద్ర నమకం, చమకం పఠిస్తారు. శివునకు
ప్రీతికరమైన అభిషేకములు, పంచామృతాభిషేకముల నిర్వహిస్తారు. ఈ పర్వదినమున
ప్రత్యేకించి మహాన్యాసము మొదలైన శివుని శక్తివంతమైన పూజలు నిర్వహిస్తారు. అనేక
శివాలయములలో స్పటిక లింగములు కూడా వున్నవి. శ్రీ పరమేశ్వరునకు ప్రీతి పాత్రమైన
బిల్వ దళ ములను ఆయుర్వేద వైద్యమునందు ఉపయోగించెదరు.మెదడ, జీర్ణావయవాలు, మూత్రావయవాలకు
సంబందించిన వ్యాధులు ఈ బిల్వ పత్రాల ద్వారా నయము చేయవచ్చునని వైద్య శాస్త్రజ్ఞుల
అభిప్రాయము. ఈ పత్రముల ద్వారా ఇంకా అనేక రకములైన శారీరక బాధలను కూడా నయము చేయ
వచ్చునని విజ్ఞాన శాస్త్రజ్ఞుల అభిప్రాయము.
శివరాత్రినాడు ఎక్కడ,ఎవరి నోటవిన్నా నమఃశివాయ వినిపిస్తుంది. శివరాత్రి నాడు మహావ్యాసపూర్వకంగ నమక చమకాలతో అభిషేకిస్తే
ఆయన హృదయం ఉప్పొంగిపోతుంది. ఈ సృష్టిలో రెండు మహత్తర శక్తులున్నాయి. వాటివల్ల
ఉత్పత్తి, నాశనం సంభవిస్తాయి.
ఉత్పత్తికి కారణం కామమైతే, వినాశనానికి హేతువు కాలం.
కామానికి కారణ మైన మన్మధుణ్ణి, కాలానికి అధిపతి అయిన
యముణ్ణి జయించిన వాడు పరమశివుడు. అందుకే ఆయన మృత్యుంజయుడైనాడు. ఈ మంత్రాన్ని
జపించి మార్కండేయుడు చిరంజీవి అయ్యాడు.
శివరాత్రి మహత్యమును తెలుపు
కథలు స్కంథ పురాణమునందును లింగపురాణము నందును పెక్కు కలవు. ఈ కథ లింగపురాణము
లోనిది.
ఒకనాడు పార్వతీ పరమేశ్వరులు
కబుర్లాడుకొంటున్ారు. "దేవదేవేశ! పాపం భూలోకములోని మానవులు ప్రారబ్ద కర్మలతో
పెక్కు బాధలను అనుభవిస్తున్నారు. ఇటువంటివారికి కఠినమయిన నియమనిష్ఠలు లేకుండా
యఙ్ఞయాగాదులు జపతపఫలములు లేని సులభతరమైన ఒక వ్రతమును తెలిపి వారికి ముక్తిని
కలుగునట్లు చేయుము" అని పార్వతి అన్నది.
అప్పుడు శివుడు పార్వతితో
యిలా అన్నాడు."దేవి! శివరాత్రివ్రతము అనునది ఒకటి ఉంది. సర్వయఙ్ఞములకు
సమానమయినది. ఉత్తమోత్తమయినది. ముక్తి ప్రదమైనది. దాని కథ చెబుతాను.
పూర్వము ఒక పర్వత ప్రాంతమున
’వ్యాథు’ డనే వేటగాడు
ఉండేవాడు. అతను ప్రతి ఉదయము అడవికి వేటకు వెళ్ళి సాయంకాలానికి ఏదో ఒక ’మృగము’ ను చంపి ఇంటికి తెచ్చేవాడు.
దానితో అతని కుటుంబము పొట్టనింపుకుంటూ ఉండేది.
ఒకరోజు అతను ఎప్పటిలా
అడవికి వెళ్ళాడు. అడవి అంతా తిరిగినా అతనికి ఒక్క ’మృగము’ కంటపడలేదు. వట్టి చేతులతో
యింటికి వెళ్ళటానికి మనసొప్ప లేదు. అయినా చేసేది లేక యింటికి బయలు దేరాడు. దారిలో
అతనికి ఒక తటాకము కనబడింది. "ఏ మృగమైన నీరు త్రాగటానికి ఈ తటాకము దగ్గరకు
రాకపోతుందా" అనే ఆశతో ఒక చెట్టుపైకి ఎక్కికూర్చున్నాడ. తటాకము వైపు చూస్తూ,
అడ్డుగా ఉన్న కొమ్మలను విరిచి, ఆకులను దూసి క్రింద పడవేసి, చలికి ’శివ-శివ’ అనుకుంటూ తటాకము వైపు చూస్తూ కూర్చున్నాడు.
మొదటి జామునకు ఒక పెంటిలేడి
నీరు త్రాగటానికి ఆ తటాకము దగ్గరకు వచ్చింది. వేటగాడు ఆనందముతో బాణము
విడువబోయినాడు. "వ్యాథుడా! నన్ను చంపకు " అని మానవ గొంతుతో ఆ లేడి యిలా
అన్నది. "నేను గర్భిణిని. నీకు అవథ్యను. నా వలన నీ కుటుంబానికి సరిపడు భోజనము
లభించదు. కాబట్టి నన్ను వదులు.యింకొక "పెంటిజింక" కాసేపటిలో ఇక్కడకు
వస్తుంది. దాన్ని చంపు. లేకపోతే నేను వెళ్ళి బిడ్డను కని దాన్ని బంధువులకి
అప్పగించి వస్తాను " అంది. "సరే" అన్నాడు వేటగాడు.
రెండవ జామునకు పెంటిజింక
కనిపించింది. మొదటి జింకే అనుకున్నవేటగాడు బాణము వేయబోగా ఆ జింక భయపడుతూ మానవ
కంఠంతో "ఓ ధనుర్దారుడా! ముందు నా మాట విను. తరువాత నన్ను చంపవచ్చు.నేను
విరహముతో కృశించిపోయి ఉన్నాను. నాలో మేదోమాంసములు లేవు.నన్ను చంపినా నీకు నీ
కుటుంబానికి సరిపోను. కాసేపటికి బాగాబలిసిన "మగజింక" ఇక్కడకు వస్తుంది.
దానిని చంపు. అలా కాకపోతే నేనే తిరిగి వస్తాను " అన్నది. సరేనన్నాడు.
మూడవజాము అయింది. వేటగాడు
ఆకలితో జింక కోసము ఆతృతగా చూస్తున్నాడు.బలిసన మగజింక రానేవచ్చింది. వేటగాడు దాన్ని
చూసిన వెంటనే అల్లెత్రాడు లాగి బాణము విడువబోవునంతలో మృగము వేటగాడిని చూసి,
తన ప్రియురాలినికూడా వాడే చంపి ఉంటాడని
తలచింది.అయినా అడిగితే సందేహము తీరి పోతుందని " ఓ మహాసత్త్వుడా రెండు
పెంకిజింకలు ఇక్కడకు వచ్చినవా!? అవి ఎటు పోయినవీ? వానిని నీవు చంపితివా" అని ప్రశ్నించెను. వేటగాడు దాని
మాటలకు మునుపటి వలనే ఆశ్చర్యపడిరెండు "తిరిగి వస్తానని ప్రతిఙ చేసి
వెళ్ళాయి.నిన్ను నాకు ఆహారంగా పంపాయి" అన్నాడు. "సరే అయితే! నేను ఉదయం
నీ యింటికి వస్తాను.నా భార్య ఋతుమతి. ఆమెతో గడిపి, బంధుమిత్రులతో అనుమతి పొంది నేను మళ్ళీ వస్తాను" అని
అనేక ప్రమాణాలు చేసి వెళ్ళింది.
యింతలో యింకొక హరిణి (జింక)
తన పిల్లలతో వచ్చింది. "వ్యాధుడా! నేను పిల్లతో వచ్చాను. దీన్ని యింటి దగ్గర
వుంచి త్వరగా వస్తాను అంది.
ఈ విధంగా నాలుగు జాములు
గదిచిపోయాయి. సూర్యోదయమయింది. వ్యాదుడు జింక కొరకు ఎదురుచూస్తూ దిక్కులు
వెతకసాగడు. కొంతసేపటికి నాలుగు జింకలు వచ్చాయి. "’ నేను సిద్దంగా ఉన్నాను నన్ను చంపు’ అంటే ’నన్ను చంపు’ అని నాలుగు జింకలు వ్యాదుని ఎదుట మోకరిల్లాయి.
మృగముల సత్యనిష్ఠకు
వ్యాధుడు ఆశ్చర్య పడ్డాడు. వాటిని చంపుటకు అతని మనసు అంగీకరించలేదు. తన
హింసావృత్తి మీద తనకే అసహ్యమేసింది. "ఓ మృగములారా ! మీరు మీ నివాసములకు
వెళ్ళిపొండి. నాకు మీ మాంసము అక్కర్లేదు. కానున్నది కాకమానదు. ఈ విధంగా మృగాలను
వేటాడి బందించి చంపి నాకుటుంబాన్ని పోషించుకోవటం పరమ నికృష్టంగా తోస్తోంది. చేసిన
పాపము చేశాను. ఇక తిరిగి ఈ పాపము చేయను.ధర్మములకు దయ మూలము. దయ చూపుటకూడ సత్యఫలమే"
అన్నాడు.
వ్యాధుని మాటలకు ఆకాశంలో
దేవ దుందుభులు మ్రోగాయి.పూలవాన కురిసింది. దేవదూతలు మనోహరమయిన విమానములో వచ్చి
"ఓ మహాసత్త్వుడా! ఉపవాసము , జాగరణ, శివరాత్రి ప్రభావమున నీ పాపము నశించినది. నీవెక్కి
కూర్చున్నది బిల్వ వృక్షము. నీకు తెలియకుండానే జాము జామునకు బిల్వదళాలను త్రుంచి
క్రింద ఉన్న ’స్వయంభూలింగము’న పూజించావు." అంటూ వారందరిని సశరీరంగా స్వర్గానికి
తీసుకెళ్ళారు.
ఈ కథను పరమేశ్వరుడు
పార్వతిదేవికి చెప్పి ’దేవి! ఆ మృగకుటుంబమే
ఆకాశమున కనిపించు మృగశిర నక్షత్రము. కనిపించు మిగిలిన మూడు నక్షత్రములలో
ముందున్నవి జింక పిల్లల్లు వెనుకకున్నది మృగి. ఈ మూడింటిని మృగశీర్షమంటారు. వాటి
వెనుక ఉజ్జ్వలంగా ఉన్నది వేటగాని నక్షత్రము. శివరాత్రితో సమానమయిన మరియొక వ్రతము
లేదు’ అని తెలిపెను.
వాసనగల వివిధ పుష్పాలతో
శివలింగం తయారు చేసి పూజ చేస్తే శివసన్నిధి లబిస్తుంది. పార్థివలింగాన్ని పూజిస్తే
కోరికలు నెరవేరతాయి. భస్మం నాలుగు పాళ్ళు, కస్తూరి నాలుగు
పాళ్ళు కలిపి శివలింగాన్ని చేసి పూజచేస్తే శివసాయిజ్యం లభిస్తుంది. అందుకే
రెండక్షరాల శివ నామం చింతల్ని తొలగించే ఆయుధం!