న మే భక్తః ప్రణశ్యతి (నాభక్తుడు నశించడు) - భగవద్గీత
ఇది భగవద్గీతలో భగవానుడు
పలికిన అభయవాక్యం. పరమాత్మ కన్నా ఆప్తులెవరుంటారు? అందుకే ఈ అభయవాక్యాన్నే ఆప్తవాక్యంగా గ్రహించి ఆశ్వాసన
పొందాలి. భగవానుడు అర్జునునకు గురుగుగా జ్ఞానాన్ని ప్రసాదించడమే కాక, ఒక ఆప్తునిగా, దైవంగా ధైర్యాన్నీ,
స్వాంతనాన్నీ, అభయాన్నీ అందించారు.
"మా శుచః" (దుఃఖించకు)
అనే ఓదార్పు ప్రసాదించిన శ్రీకృష్ణుడు, ’యోగక్షేమం వహామ్యహం’
అని హామీనిచ్చాడు. "భక్తుడు" అంటే
సర్వత్మనా ఆశ్రయించినవాడు అని అర్థం. కర్మపట్ల అహంకారం, పలాఫేక్ష విడచి ఆచరించే యోగి. నిస్సంగిత ఒక విధానం. అలాకాక
హృదయాన్ని భగవత్పరం చేసినవారికి కూడా కర్మపరమైన అహంకృతి, ఫలాభిసంధి ఉండదు. సరికదా భగవత్సంబంధం ప్రగాఢంగా ఉంటుంది
కనుక అతడి యోగక్షేమాలను వహించడం భగవంతుని బాధ్యత.
భగవదాశ్రయం పొందినవాడు తనను
నిత్యం పరమేశ్వరుడు గమనిస్తున్నాడనే స్పృహతో ఉంటాడు. అందువల్ల ఏది చేసినా
భగవత్ప్రీతిగా భగవదర్పణంగా భావించి చేస్తాడు. ధర్మస్వరూపుడైన భగవానుని ప్రీతికోసం
పనిచేసేటప్పుడు ధర్మమయమైన సత్కర్మనే ఆచరిస్తాడు. భగవత్ప్రీతి తప్ప మరో ఫలాన్ని
ఆశించని అటువంటి భక్తయోగి కర్మలోనే భగవానుడు జోక్యం చేసుకుంటాడు.
కర్మాహంకారి విషయంలో
భగవానుడు సాక్షీమాత్రుడు. అహంకార వర్జితుడైన భక్తునికి మాత్రం సదా రక్షకుడు.
భక్తుడు తాు రక్షింపబడాలని కూడా భావించనంతగా పరమాత్మతో తన్మయుడి ఉంటాడు. అటువంటి
స్థితిలో అతడి సర్వ బాధ్యతలు పరమాత్మ వహించక తప్పదు.
అనన్యాశ్చింతయన్తో మాం యే
జనాః పర్యుపాసతే!
తేషాం నిత్యాభియుక్తానాం
యోగక్షేమం వహామ్యహమ్!!
"ఇతర చింతనలు విడచి, ఎవరు పర్యుపాసన చేస్తారో (ఎడతెగని భగవత్సాన్నిధ్య భావన
కలిగినవారు) అటువంటి నిత్య యోగుల యోగక్షేమాలను నేనే వహిస్తాను" అని
స్వామిమాట.
అంతేగానీ - ఏదో కావాలని
భగవంతుని ప్రార్థించే వారు ఈతరగతికి రారు. వారికి కావల్సిన దానిపైనే చింత ఉంటుంది.
కానీ భగవంతునిపై ఉండదు. కనుక దానిని ’అనన్యచింతన"
అనరాదు. వారి ఆధ్యాత్మిక సాధన పూర్తి భౌతికబంధంతో కూడినది కనుక ’పర్యుపాసన’ అనలేం. భగవానునితో
నిత్యానుబంధాన్ని అనుభవించే తాదాత్మ్య స్థితి లేదు కనుక, ’నిత్యాభియుక్తులు’ కూడా కారు.
అటువంటివారే - "ఇంత కొలుచుకుంటున్నా దేవుడు నాకోరిక నెరవేర్చలేదేం?"
అని బేరసారాలకు దిగుతారు. వారిని ’వ్యాపారులు’ అని కటువుగానే పేర్కొన్నది
భాగవతం.
"నీవాడను - నువ్వే గతి"
అని శరణు వేడిన వానికి భగవానుడు అభయాన్ని పలుకుతాడు.
శ్రీకృష్ణావతారంలోనే కాదు -
రామావతారంలో కూడా "నీవాడను" అని ఒక్కసారి (మనసునీ, మాటనీ, క్రియనీ ఒక్కటిగా చేసి)
శరణు వేడితే, అతడిని అన్నివిధములా
కాపాడుతానని అభయదానం చేసేశాడు.
ఈఆప్తవాక్యాన్ని గ్రహిస్తే,
మనసుకి కలిగే నిబ్బరం నిరంతర భగవత్ స్పృహని
ఏర్పరచి, జీవితాన్ని అభయంగా
మలచుతుంది.
నమ్మి చెడినవారు లేరు’
అని రామదాసు పలికిన మాట యథార్థం. తాను నమ్మిన
దైవం తనకు యోగక్షేమకారకుడని భావించే భక్తుడు, ప్రతి అనుభవాన్నీ భగవత్ప్రసాదంానే భావిస్తాడు కనుక అతడు
ఎన్నటికీ చెడడు.
"ఏపురాణముల ఎంత వెదికినా శ్రీపతిదాసులు చెడరెన్నడును" అని అన్నమయ్య పలుకు.
"ఏపురాణముల ఎంత వెదికినా శ్రీపతిదాసులు చెడరెన్నడును" అని అన్నమయ్య పలుకు.